Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఐటీయూ రాష్ట్ర మూడవ మహాసభలు 2019 డిశంబర్ 14-17 తేదీల్లో మేడ్చల్ జిల్లాలో జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో, దేశంలో కార్మిక ఉద్యమం గురించి సింహావలోకనం చేసుకోవడం అవసరం. సాధారణంగా మహాసభలు అంటే యూనియన్ల కార్యక్రమాలు, ఆర్థిక విషయాలు, భవిష్యత్ కర్తవ్యాల చర్చగా చూస్తారు. సాధారణ ప్రజలు కూడా ఒక సంఘం అంతర్గత వ్యవహారంగా పరిగణిస్తూ వదిలేస్తుంటారు. సాధారణ లక్ష్యంతో పనిచేసే ఏ సంస్థ విషయంలోనైనా అది కరెక్ట్. కానీ భారత కార్మికోద్యమ చరిత్రలో సీఐటీయూకు ఒక విశిష్టత ఉంది. ఈ దేశంలోని కార్మికుల, కర్షకుల, సాధారణ ప్రజల మూలుగులు పీల్చి లాభాలు గడించే పెట్టుబడిదారీ వ్యవస్థను అంతం చేసి దాని స్థానంలో శ్రామిక రాజ్యం స్థాపించడమే లక్ష్యంగా కలిగి ఉండటం దాని ప్రత్యేకత. 1970 మే 30న సీఐటీయూ ఆవిర్భావం రోజే ఆనాటి అగ్రశ్రేణి కార్మికోద్యమనేతలు జ్యోతిబాసు, బి.టి.రణదివే, పి.రాంమూర్తి లాంటి మహామహులు రానున్న కాలంలో భారత కార్మికవర్గమంతా ఐక్యంగా పోరాడుతుందని జోస్యం చెప్పారు. అందులో సీఐటీయూ కీలక పాత్ర పోషిస్తుందని ప్రకటించారు. సీఐటీయూ ఏర్పడి 50 సంవత్సరాల స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నది. దేశంలో మొదటి అఖిల భారత కార్మిక సంఘం ఏఐటీయూసీ 1920లో బొంబాయిలో ఏర్పడింది. భారత సంఘటిత కార్మికోద్యమం 100ఏండ్ల ఉత్సవాలు జరుపుకుంటున్నది. ఈ కాలంలో కార్మిక సంఘాలన్నీ ఏకమై 15 దేశవ్యాప్త సమ్మెలు చేశాయి. ఈ ఏడాది 2019 జనవరి 8, 9 తేదీల్లో 2 రోజుల పాటు 20కోట్ల మంది సమ్మె చేయడం అపూర్వ ఘట్టం. ఈ సమ్మె పెట్టుబడికి బలమైన ప్రతిఘటన ఇచ్చింది. మోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగంలో రూ.1.5లక్షల కోట్ల వాటాల విక్రయాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నది. మొట్టమొదటి ప్రయివేటు రైలు 'తేజస్'ను లక్నో నుంచి ఢిల్లీకి ప్రారంభించింది. రైళ్ళు, స్టేషన్లు, ఉత్పత్తి కేంద్రాలను ప్రయివేటుకు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వరంగ విమానయాన సంస్థలు, బీఎస్‌ఎన్‌ఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల ప్రయివేటీకరణకు ప్రయత్నాలు చేస్తున్నది. బ్యాంకుల విలీనం, కోల్‌మైన్స్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లతో పాటు అన్ని ప్రభుత్వరంగ సంస్థలను రానున్న కాలంలో ప్రయివేటీకరణకు సిద్ధం చేసింది. కార్మికుల హక్కులను, బేరసారాల శక్తిని నీరుగార్చడానికి పూనుకుంటూ 44 కార్మిక చట్టాలను 4 కోడ్‌లుగా మార్చుతున్నది. కనీస వేతనం రోజుకు రూ.178 ప్రకటించింది. 8గంటల పని దినం బదులు, 9గంటలు పనిదినం చేసింది. 300లోపు కార్మికులున్న పరిశ్రమలను మూసివేయడానికి యజమానులకు ప్రభుత్వం అనుమతి లేకుండా చేసింది. హైర్ & ఫైర్ పద్ధతిని తీసుకువచ్చింది. నిరుద్యోగం పెరిగింది. ధరలు మండిపోతున్నాయి (ఉల్లిగడ్డ కిలో రూ.200 చేరింది). ఈ నేపథ్యంలో 2020 జనవరి 8న భారత కార్మికవర్గం మరోసారి దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో బీజేపీ విధానాలకు వంతపాడే బి.ఎమ్.ఎస్, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ కార్మిక వ్యతిరేక విధానాలకు వంతపాడే టీఆర్‌ఎస్‌కెవి దూరంగా ఉంటూ పెట్టుబడిదారుల ముద్దు బిడ్డలుగా ఉండదలచుకున్నాయి. ప్రజల సంపదైన ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం, కార్మిక హక్కుల పరిరక్షణ గురించి సమాజానికి నొక్కి చెప్పడం ఈ మహాసభల ప్రధాన ఉద్దేశ్యం.
నేడు మన తెలంగాణ రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగులు అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం కేసీఆర్ వ్యవహార శైలి, కార్యాచరణ చూస్తే రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగుల సంఘాలు లేకుండా చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ధర్నాలు, నిరసనలు, సమ్మెలు చేస్తే ప్రభుత్వం వినదు, అడుక్కుంటే జీహుజూర్ అంటేనే కరుణిస్తుందనే భూస్వామ్య, పెత్తందారీ స్వభావంతో పని చేస్తున్నారు. సంఘాల నుంచి నాయకులను, నాయకుల నుంచి కార్మికులను దూరం చేయాలని, సంఘాలను చీల్చాలనే కుట్రలు నిరంతరం చేస్తున్నారు. భారత పార్లమెంటు ద్వారా సంక్రమించిన హక్కులను గుర్తించ నిరాకరిస్తూ ఏక వ్యక్తి నియంతృత్వపాలన సాగిస్తున్నారు. ఎంతటి నిరంకుశ పాలకులైనా అంతిమంగా ప్రజల ప్రతిఘటనకు తలవంచకతప్పదనేది చారిత్రక సత్యం. మన ముఖ్యమంత్రి ఏది చేసినా నేను చేయాలనే అప్రజాస్వామిక తలబిరుసుతనంతో ఉన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో సీఐటీయూ ఆధ్వర్యంలో వేలమంది కార్మికులు చేసిన సమ్మెలకు అంతిమంగా దిగిరాకతప్పలేదు. 106రోజుల ఆశాల సమ్మె తరువాత ప్రగతిభవన్‌కు పిలిపించుకొని భోజనం పెట్టి పారితోషికం పెంచారు. అంగన్‌వాడీల దశల వారీ పోరాటానికి దిగివచ్చి భోజనం పెట్టి రూ.10,500 జీతం నిర్ణయించారు. వీఆర్‌ఏలను ఆహ్వానించి రూ.10,500 జీతం పెంచారు. 10రోజుల పాటు డిపెండెంట్ ఉద్యోగాలకై సమ్మె చేసిన సింగరేణి కార్మికులను (తన యూనియన్ గెలుపుకోసం) ప్రగతిభవన్‌లో బుజ్జగించి అనేక హామీలు ఇచ్చారు. పీఆర్‌సీ కోసం పోరాడకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను మభ్యపెడుతున్నారు. అంతకుముందు 47రోజులు 2వ ఎఎన్‌ఎంలు సమ్మె చేస్తే ఆ తరువాత రూ.21,000కు జీతం పెంచారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు పోరాడితే జీఓ 14 ద్వారా జీతాలు పెంచారు. 108 ఉద్యోగులు పోరాటం వల్లనే జీతాలు పెంచు కున్నారు. 33రోజులు గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె చేస్తే చివరికి రూ.8,500కు అంగీకరించారు. ఎలక్ట్రిసిటీ ఆర్టిజన్ ఉద్యోగులు 23 వేలమంది 10రోజులు సమ్మె చేస్తేనే జీతాలు పెంచారు.
ఇక 48వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు 55రోజులు సమ్మె చేశారు. సమ్మెను ఉక్కుపాదంతో అణిచివేయడానికి విశ్వప్రయత్నం చేశారు. 32మంది బలిదానం, వేలమంది అరెస్టులు, ఆంక్షలు పెట్టి, మూడుసార్లు డెడ్‌లైన్ పెట్టాక కూడా బెదరకుండా అత్యంత సమరశీలంగా పోరాడారు. ఆర్టీసీ ఉండదు, ఆర్టీసీ కార్మికుల సంఘాలు ఉండవు, ప్రయివేటీకరణ ఆగదు అని ఘీంకరించినా చివరకు దిగిరాక తప్పలేదు. ప్రగతిభవన్‌కు పిలిపించుకుని భోజనం పెట్టి అడిగినవి, అడగనివి వరాలు ఇచ్చారు. ఈ పోరాటాలన్నింటా సీఐటీయూ ముందు పీఠిన నిలిచింది. రాజీపడకుండా పాలకులకు దాసోహం కాకుండా ఎత్తిన జెండా దించకుండా చివరికంటా పోరాడుతూనే ఉంది.
సామాజిక బాధ్యత - సీఐటీయూ
తెలంగాణ రాష్ట్రంలో సీఐటీయూ ఆర్థిక అంశాలకే పరిమితం కాలేదు. సామాజిక, సాంస్కృతిక అంశాలపై పోరాడుతున్నది. సామాజిక ఉద్యమాలకు అండగా నిలిచింది. 2016 అక్టోబర్ 16 నుంచి 2017 మార్చి 19 వరకు సామాజిక న్యాయం కోసం జరిగిన 4122 కిలో మీటర్ల మహాజన పాదయాత్రలో సీఐటీయూ నాయకులు నడిచారు. బహిరంగ సభకు 50వేల మందిని సమీకరించింది. దళిత, గిరిజన, బలహీన వర్గాలు, కార్మిక, కర్షక పేదలతో భుజం భుజం కలిపి పోరాడింది. ఈ కాలంలో జరిగిన 32కుల దురహంకార హత్యలకు వ్యతిరేకంగా పోరాడింది. కరువు వ్యతిరేక పోరాటాలు చేసింది. గ్రామీణ ప్రాంతాలలో పేదలకు అంబలి కేంద్రాలు పెట్టింది. మెదక్ జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న 50మంది రైతులకు ఆర్థిక సహాయం చేసింది. మల్లన్న సాగర్ భూనిర్వాసితుల పోరాటానికి సీఐటీయూ అండగా నిలిచింది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలకు ఏ ఆపద వచ్చినా తన సంఘీభావం తెల్పుతూనే ఉన్నది. ఎందుకంటే ప్రాంతీయ దురభిమానాలకు దూరంగా 'ప్రపంచ కార్మికులారా ఏకంకండి' అనే నినాదం తన విధానంగా కలిగి ఉన్నది. అంతిమంగా కార్మిక రాజ్యానికై కట్టుబడి ఉన్నది. అందుకు కులం, మతం, ప్రాంతం, భాషాబేధాలు లేకుండా కార్మికు లంతా ఒకే గొడుగు క్రింద ఉండాలని భావిస్తున్నది.
ఈ నేపథ్యంలో సీఐటీయూ రాష్ట్ర మూడవ మహాసభల్లో 50కి పైగా కీలక తీర్మానాలు చేయబో తున్నది. కార్మిక ఉద్యమాలపై రాష్ట్ర ప్రభుత్వం అణిచివేత చర్యలను ప్రతిఘటిస్తున్నది. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ జనవరి 8న అఖిల భారత సమ్మె, తెలంగాణ రాష్ట్రంలో 73రంగాల్లో కనీస వేతనాల జీఓలు ఇవ్వాలని, రూ.21,000 కనీస వేతనం ప్రకటించాలని, ప్రభుత్వం ఉద్యోగులకు పే రివిజన్ ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలనీ, సింగరేణి, ఆర్టీసీ పరిరక్షణ, సీపీఎస్ రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తున్నది. స్కీమ్ వర్కర్లు, హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు, ప్రయివేట్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్లు, గ్రామ పంచాయతీ, మున్సిపల్ తదితర కార్మికుల సమస్యలపై పోరాటాల ఉధృతానికి సిద్ధమవు తున్నది. అందుకే ఈ మహాసభలను జయప్రదం చేయడం రాష్ట్రంలోని అణగారిన వర్గాల ప్రజల, శ్రామికులందరి బాధ్యత.
- భూపాల్
సెల్: 9490098034