Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రమలో మూడింతలు శ్రామిక మహిళలే.
మానవ సమాజానికి పునాది శ్రమే.
ఏ వ్యవస్థలోనైనా శ్రమదే కీలకపాత్ర.
శ్రమ దోపిడీయే చరిత్రసారం. అందుకే,
ప్రపంచ పురోగతి శ్రమ జీవి నెత్తుటి బొట్టులోనే
ఇమిడి ఉంది అనేది కవి వాక్యం..
మనకు తెలిసిన మన చరిత్రనే పరిశీలిద్దాం. చారిత్రక మలుపులన్నింటిలోనూ భీకరమైన పోరాటాలే జరిగాయి. ఆదికాలాల్లో సంతానానికి తల్లి ద్వారానే గుర్తింపు ఉండేది. ఇదే మాతృస్వామ్య వ్యవస్థ. ఈ వ్యవస్థ దానంతటదే రూపు మాసిపోలేదు. ఆ తర్వాత పితృస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. సొంతాస్తి క్రమంగా ప్రారంభమైంది. నాటి నుంచి నేటి వరకు సొంతాస్తి కేంద్రంగా సమాజ గమనం సాగుతోంది. ఈ చారిత్రక నేపథ్యంలో శ్రామిక మహిళలను అర్థం చేసుకోవడం సముచితం.
ప్రస్తుతం కార్మికవర్గం పుట్టెడు కష్టాలతో సతమతమవుతోంది. శ్రామిక మహిళలూ ఈ సమస్యలకు మినహాయింపు కాజాలరు. పైగా అదనపు బాధలు అనుభవిస్తున్నారు. పని ప్రదేశాల్లో వేధింపులకు గురవుతున్నారు. ఆత్మగౌరవాన్ని చంపుకోలేక అంతులేని క్షోభను అనుభవిస్తున్నారు. చాలీచాలని వేతనాలతో బతుకు బండిని లాగు తున్నారు. గౌరవం, మర్యాద, ఆర్థిక ఆలంబన కోసం నిత్యం పోరాటం చేస్తున్నారు. శ్రామిక మహిళల వేదనల్ని, బాధల్ని పట్టించుకోని పాలకుల వర్గనీతిని క్రమంగా ప్రశ్నించడం పెరుగుతోంది.
'కొత్త సీసాలో పాత సారా' లాగా పాత సర్కార్లు పోయి కొత్త సర్కార్లు కొలువుదీరు తున్నాయి. అంటే ఒక పార్టీ పోయి మరో పార్టీ అధికారంలోకి వస్తుంది. సారం చెడకుండా రూపం మారుతోందంతే. అందుకే.. శ్రామిక మహిళల సమస్యలు ఏండ్లు గడుస్తున్నా 'ఎక్కడ వేసిన గొంగలి అక్కడే' అన్నట్టుగా ఉన్నాయి.
తాత్కాలిక ప్రయోజనాలు, దీర్ఘకాలిక ప్రయోజనాలని రెండుంటాయి. ఇందులో తాత్కాలిక ప్రయోజనాలకే పాలకులు మెగ్గుచూ పుతారు. అందులో భాగంగానే ప్రభుత్వాలు పథకాలను ప్రవేశ పెడ్తున్నాయి. ఈ స్కీమ్‌ల స్వభావం రీత్యా మహిళలే ఎక్కువగా పనిచేస్తున్నారు. వీరి శ్రమ ఫలితం.. పాలకుల ప్రతిష్టను ఇనుమడింపజేస్తుంది. ఈ స్కీమ్‌ల ప్రచారానికి పెట్టిన ఖర్చుకూడా, ఇందులో పని చేస్తున్న శ్రామిక మహిళలకు వేతనాల రూపంలో ఇవ్వకపోవడం విడ్డూరం.
మేడే ఉత్సవాల సందర్భంగా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తారు. మన దేశ వనరుల అభివృద్ధికి కార్మికవర్గం అపూర్వమైన సేవలు అందిస్తున్నదని రొటీన్‌గా చెప్తారు. కానీ కార్మికులుగా గుర్తించరు. కనీస వేతనాలు చెల్లించరు. ఉద్యోగ భద్రత కల్పించరు. ఉద్యోగు లుగా ప్రకటించరు. గౌరవప్రదమైన పని పరి స్థితులు కల్పించరు. జీవన పరిస్థితులను మెరుగుపరిచేందుకు కృషి చేయరు. అందుకు తగిన నిర్ణయాలు తీసుకోరు. ఇది పాలకుల నీతి, రీతి. ఇందుకు కారణం లేకపోలేదు. పాలకులు ప్రవేశపెట్టిన నయా ఉదారవాద విధానాలు పేదల పొట్టల్ని కొట్టాయి. వారిని సకల కష్టాల్లోకి నెట్టాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆ విధానాలు చేసిన గాయాలు అనేకం. పడుతున్న బాధలు వర్ణనాతీతం. వీటినుంచి ఉపశమింప జేసేందుకే రకరకాల ప్రయత్నాలు. అందులో భాగంగానే ఈ స్కీమ్‌లు. అయితే వేతనాలకు, ఇతర ప్రయోజనాలకు సబంధించిన చట్టబద్ధ హక్కులుంటాయి. చట్టబద్ధమైన సౌకర్యాల నుంచి తప్పించేందుకే ప్రయివేటీకరణ, స్వచ్ఛంద సంస్థలు అనే దొడ్డిదారి మార్గాలను పాలకులు అన్వేషిస్తున్నారు.
ముచ్చటైన పేర్లతో...
స్కీమ్ వర్కర్లను 'సంఘ సేవకులు' వాలంటీర్లు, కార్యకర్తలు, యశోదాలు, మమతలు, అతిథులు, తదితర ముచ్చటైన పేర్లతో ముద్దుగా పిలుస్తున్నారు. కనుక ఈ తరహా పేర్లతో పనిచేసే వారికి చట్టబద్ధ సౌకర్యాలు వర్తించవు. కనీస వేతనాలు అసలు ఉండవు. వీరిలో కొంత మందికి నామమాత్రమైన 'గౌరవ వృత్తి' లేదా ప్రోత్సహక భృతి, ఏకీకృత చెల్లింపు అన్న పేరుతో చెల్లింపులు చేస్తున్నారు. కొంత మందికి ఈ మాత్రం కూడా ఉండటం లేదు. అలాంటి వారు తమను కాపాడుకోవటానికై, వినియోగ చార్జీలను వసూలు చేసుకుంటున్నారు. ఒక అంచనా ప్రకారం ఇలాంటి శ్రామికులు రాష్ట్రంలో 3లక్షల మంది ఉంటారు. దేశంలో సుమారు కోటి మందికి పైగానే ఉంటారు. వీరిలో ఎక్కువ మంది శ్రామిక మహిళలు. వీరు ఐసీడీఎస్, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం, ఎస్‌ఎస్‌ఎ, మధ్యాహ్న భోజన పథకం వంటి వాటిల్లో పని చేస్తున్నారు. వీరి శ్రమ మానవ అభివృధ్ధి సూచికలను మెరుగుపర్చటానికి ఉపయోగ పడాలి. అంటే వారికి శ్రమకు తగ్గ ఫలితం అందాలి. అయితే ఈ పథకం శ్రామికుల్లో అత్యధికులు మారుమూల పల్లెల్లోనూ, అడవుల్లో నివసించే వివిధ పేద ప్రజలుండే ప్రాంతాల్లోనూ పని చేస్తుంటారు. పని స్వభావం కారణంగా, ఈ శ్రామికులు కష్టజీవుల్లో ప్రత్యేకించి పేదలతోనూ, సామాజిక బడుగు, బలహీన వర్గాలవారితోనూ సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారు. ఇది గమనించిన పాలకులు వీరిని ఓట్లు వేయించే వాలంటీర్లుగా మాత్రమే ఉపయోగించు కుంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వశాఖల్లో సుమారు 3లక్షల 10వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మికులు ఉన్నారు. వీరిలో 60శాతం మంది మహిళలు. మున్సిపల్ ఉద్యోగుల్లో 60శాతం మంది మహిళలు. అందులో 80శాతం దళితులు. హెల్త్‌లో 4,221మంది 2వ ఏఎన్‌ఎంలు మహిళా ఉద్యోగులే. ఆర్టీసీలో 5,671 రెగ్యులర్, కాంట్రాక్ట్ మహిళా కండక్టర్లు పనిచేస్తున్నారు. వీరికి కనీస సౌకర్యాలైన మంచినీరు, మరుగు దొడ్లు లేవు. పనిచేసే చోట రక్షణ లేదు. ఉద్యోగ భద్రతలేదు. కార్మిక చట్టాలు అమలుకావడం లేదు. రాష్ట్రంలో బీడీరంగం 16 జిల్లాల్లో విస్తరించి ఉంది. సుమారు 7లక్షల మంది బీడీ కార్మికులున్నారు. వీరిలో 98శాతం మహిళలే. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బీడీలు చుడతారు. వీరికి కనీస వేతనాల జీఓ కాలపరిమితి పూర్తయినా పునరుద్ధరించే విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలుకావడం లేదు. పని, ఉపాధి, శ్రమ.. పదాలు వేరైనా, ఇవి మనిషి నుంచి విదదీయలేనివి. ఇవి సమాజ సంపద ఇనుమడింపజేస్తాయి.
పని..పని..పని.. శ్రమకు తగ్గ వేతనాలు కావాలి.. ఏ మహిళ నోట విన్నా ఇదే మాట. మాకు పని కల్పించండి. పని చేసుకునే అవకాశం ఇవ్వండి. మా కష్టాన్ని గుర్తించండి, మా శ్రమను గౌరవించండి. అవరోధాలు కల్పించకండి, దేశ పునర్ నిర్మాణంలో మా సత్తా చూపుతాం అంటోంది శ్రామిక మహిళ.
- ఎస్వీ రమ