Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుస్తకాలు లేని ఇల్లు దయ్యాల కొంప వంటిదన్నాడు ప్రముఖ తత్వవేత్త సిసిరో. మరి మన ఇండ్లలో పుస్తకాలు ఉన్నాయా? ప్రతి నెల పుస్తకాలు కొంటున్నారా? నెలలో ఎన్ని పుస్తకాలు చదువుతున్నారు? అసలు పుస్తకాలు చదివి ఎన్నాళ్ళయింది? ఈ ప్రశ్నలు ఎవరికి వాళ్ళు వేసుకోడం మంచిది. ఏ రంగంలో పని చేసే వాళ్ళయినా పుస్తకాలు చదవడం వారి వ్యక్తిత్వ వికాసానికీ, జీవన శోభకు ఉపకరిస్తుంది. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగు పడటానికి తోడ్పడుతుంది. ఈ ఏడాది మరో పదిహేను రోజులలో ముగియబోతుంది. కొత్త ఏడాదిలోకి ప్రవేశించబోతున్నాం. కనుక ఏడాది కాలంగా ఎన్ని పుస్తకాలు చదివారో ఒకసారి కాగితం మీద రాయండి.
పుస్తకాలు కొనకున్నా, గ్రంథాలయాలకు వెళ్ళి చదువుకోవచ్చు. లేదా మిత్రుల దగ్గర అడిగి తీసుకొని చదివి ఇచ్చేయొచ్చు. మిత్రులను అప్పులడుగుతారు, పార్టీలు ఇవ్వాల్సిందిగా కోరుతారు. కానీ పుస్తకాలు అడిగేవారున్నారా? నిజానికి మధ్యతరగతి కొంపల్లో పుస్తకాలు, పుస్తకాల బీరువాలో, రాక్‌లో ఉన్నాయా? హాల్‌లో టేబుల్ మీద పుస్తకాలు కనిపిస్తున్నాయా? పిల్లలు పుస్తకాలు చదువుతూ కనిపించారా? ఆలోచిస్తే, వివేచిస్తే మిగిలేది ప్రశ్నలే. వీటికి ఎలాంటి జవాబులు లభిస్తాయన్నదే అసలు ప్రశ్న.
త్వరలో ఇటు హైదరాబాద్‌లోనూ, అటు విజయవాడలోనూ పుస్తకాల పండగలు ప్రారంభం బోతున్నాయి. ఇక్కడో పదిరోజులు, అక్కడో పదిరోజులు పుస్తకాల జాతర జరుగుతుంది. వేలాది పుస్తకాలు కొలువు తీరి సందర్శకుల్ని అలరించబోతున్నాయి. కవులు, రచయితలు, ప్రచురణకర్తలు కొత్త పుస్తకాలతో పుస్తకాల ప్రదర్శనలకు సమాయత్త మవుతున్నారు.
కవిత్వమయితే వెల్లువెత్తుతోంది. ఏడాదికి వందకు పైగా కవితా సంపుటాలు, సంకలనాలు వస్తున్నాయి. ఇక కథలు, నవలలు, జీవితచరిత్రలు రావడం మునుపటి కన్నా పెరిగింది. విభిన్న భాషల సాహిత్యమూ తెలుగులో వస్తున్నది. వీటిని ఎందరు చదువుతున్నారు, పుస్తకాలు చదివి ఎందరు స్ఫూర్తి పొందుతున్నారో ఒక అంచనాకు రావాలి. తెలుగునాట పుస్తకాలు చదివే అలవాటు మీద ఎవరయినా సర్వే చేస్తే ఆసక్తికరమైన అంశాలు అనేకం వెలుగు చూస్తాయి.
ముప్పయ్యేళ్ళ కిందటితో పోలిస్తే మధ్యతరగతి పెరిగింది. వారి ఆదాయాలూ పెరిగాయి. అక్షరాస్యతా పెరిగింది. కనీసం పదోతరగతి వరకయినా చదివేవారు గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ కనిపిస్తారు. ఈమాత్రపు విద్య చాలు పుస్తకాలు చదవడానికి. మరి చదువుతున్నారా? గ్రంథాలయాలు కొత్త పుస్తకాలతో వెలుగొందుతున్నాయా? ఇండ్లలో టీవీలు, మొబైల్స్ కాక పుస్తకాలు ఉన్నాయా? పుస్తకాల గురించి యోచిస్తే అన్నీ ప్రశ్నలే. మొబైల్స్ కోసం వేలు తగలేస్తున్నారు. మరి కనీసం ఏడాదికి వెయ్యి రూపాయలయినా పుస్తకాల కోసం వెచ్చిస్తున్నారా?
పుస్తకాలు మనుషులకు సంస్కారాన్ని నేర్పుతాయి. మానవీయ ముఖాన్ని అందిస్తాయి. స్త్రీ పురుష సంబంధాల్లో మర్యాద మన్ననలు పెరగడానికి దోహదం చేస్తాయి. ఆడవాళ్ళను మనుషులుగా చూసే సభ్యతా సంస్కారాలు ఎవరూ చెప్పకనే అలవడతాయి. మరి పిల్లలకు మొబైల్స్ ఇస్తేనో, టీవీల ముందు కూర్చోబెడితేనో ఈ సంస్కారం అలవడదని గుర్తించాలి. పిల్లలు మనుషులుగా పెరిగి, బుద్ధిగా నడుచుకోవాలంటే పుస్తకాలు ప్రతి ఇంటా ఉండాలి. పెద్దలూ, పిల్లలూ పుస్తకాలు చదవాలి.