Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నారదుడు తంబూర దీస్కుండు. ఒక సారి టింగ్ టింగ్ మన్నడు. చిర్తలు దీస్కుండు. ఒకసారి గవ్విటిని కొట్టి జూస్కుండు. గీ సారి యాడికి బోవాలె. యాడికి బోతె బాగుంటదని జెరసేపు సోంచాయించిండు. యాడికో ఎందుకు ఎప్పటి లెక్క యాద్గిరి గుట్టకు బోతె బాగుంటది. నర్సిమ్మసామితోని ముచ్చట బెడ్తె రాస్ట్రంలనే గాకుంట దేసంల ఏమైతున్నదో ఎర్కైతదని అనుకుండు. అనుకోని నారాయన; నారాయన అనుకుంట చిర్తలు గొట్టుకుంట నారదుడు మొగులు మీదికి ఎల్లిండు.
నడిజామునాత్రి. సలి బెడుతున్నది. కుక్కలు బౌబౌమంటున్నయి. సడక్ మీద ఆడొక లారి ఈడొక మోటర్ బోతున్నది. చద్దర్లు గప్పుకోని అందరు పండుకున్నరు. కొందరు గుర్రు గొడ్తున్నరు. కొందరు కల్వరిస్తున్నరు. కొందరు కలల బజార్ల దిర్గుతున్నరు. దొంగలు దొంగతనం జేసెతందుకు మోక కోసం ఎదురు జూస్తున్నరు. జీపుల పోలీసోల్లు గస్తి దిర్గుతున్నరు. నారదుడు యాద్గిరిగుట్ట మీద దిగిండు. గుడికి తాలమున్నది. నారదుడు మాయమైండు. గుల్లెకు బోయిండు. నర్సిమ్మసామి ముంగట్కి బోయి-
''నారాయన; నారాయన'' అన్నడు
''నువ్వా నారదా! గిప్పుడొచ్చిన వేంది'' అని నర్సిమ్మసామి అడిగిండు.
''పగటీల మీతోని ముచ్చట బెట్టేతందుకు సైమం యాడ దొర్కుతది''
''ని వొద్దే అనుకో. గని నా తోని ముచ్చట బెడ్తె ఏ మొస్తది''
''రాస్ట్రంలనే గాకుంట దేసంల ఏమైతున్నదో ఎర్కైతది. ఇంతకు తెలంగానల ఏమైతున్నదో జెర జెప్పుండ్రి''
''తెలంగానల మున్సిపల్ ఎలచ్చన్లు వొచ్చినయి. షెడ్యూల్ గూడ వొచ్చింది. షెడ్యూల్ వొచ్చినంక రిజర్వేషన్లను ఎలాన్ జేసిండ్రు. ఎలచ్చన్ల షెడ్యూల్ రాంగనే కొంతమంది ప్రచారం షురువు జేసిండ్రు. మున్సిపాలిటీల; కార్పొరేషన్ల గాల్లు అనుకున్న తీర్గనే రిజర్వేషన్లు వొస్తయను కోని కొంతమంది యాడాది సందే ప్రచారం జెయ్యబట్టిండ్రు. గీ మున్సిపాలిటీ జనరల్ కేటగిరీల కొస్తె నీకు బంగారి సొమ్ములు జేపిస్తనని కొందరు ఎంకటేస్వర సామికి మొక్కిండ్రు. కొందరు యాగాలు జేసిండ్రు. గీ కార్పొరేషన్ ఆడోల్ల కేటగిరీలకు రావాలనుకుంట కొందరు ఆడోల్లు రతాలు జేసిండ్రు. ఇంకొందరు ఉల్లిగడ్డ నోములు జేసిండ్రు. గీ మున్సిపాలిటీ బిసి కేటగిరీ లకు వొస్తె మేకను గోసి సాక బోస్తం. బోనాలు దీస్తం అని కొందరు పోచమ్మకు మొక్కిండ్రు''
''లీడర్లు అనుకున్న తీర్గనే రిజర్వేషన్లు వొచ్చినయా?''
రాలే. అంత కింది మీదికైంది. దాంతోని గాల్లు మొత్తుకోబట్టిండ్రు. ఆర్మూర్ మున్సిపల్ చేర్మన్ సీటును జనరల్ కేటగిరీల రిజర్వ్ జేస్తరని కొందరు లీడర్లు అనుకుండ్రు. గట్ల అనుకున్న లీడర్లల్ల ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి గూడ ఉన్నడు. గాయిన ఆల్ల తమ్ముడు రాజేస్వర్ రెడ్డిని ఆర్మూర్ మున్సిపల్ చేర్మెన్ చేద్దామనుకున్నడు. అనుకోని ఊకోకకుంట ప్రచారం గూడ షురువు జేసిండు. గని గా సీటు బిసి ఆడామెకు రిజర్వ్ అయ్యింది. దాంతోని ఇదువరదాంక ప్రచారం కోసం జేసిన కర్సు నిప్పుల బోసిన నెయ్యి అయ్యిందని గాయిన మొత్తుకోబట్టిండు. కల చెదిరింది. కత మారింది. కన్నీరే మిగిలింది' అనుకుంట గాయిన తమ్ముడు రాజేస్వర్ రెడ్డి పాడ బట్టిండు. పల్లపల్ల ఏడ్వబట్టిండు'' అన్కుంట నర్సిమ్మసామి ఇంకేమొ జెప్పబోతుంటె నారదుడు అడ్డం దల్గి -
''ఇంక యాడాడ గిట్లయ్యింది'' అని అడిగిండు,
''అన్నిటి గురించి జెప్పెతందుకు గిప్పుడు సైమం లేదు. కొన్నిటి గురించే జెప్త. ఎట్లన్న జేసి గీ పారి నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ కుర్సి మీద గూసోవాలని ఇద్దరు బిజెపి లీడర్లు అనుకున్నరు. టికిట్ కోసం పైరవీలు షురువు జేసిండ్రు. గంతే గాకుంట ప్రచారం గూడ జెయ్యబట్టిండ్రు. కోట్ల రూపాలు కర్సు జేసెతందుకు రడీ అయ్యిండ్రు. గని నిజామాబాద్ మేయర్ సీటును బీసీ ఆడామెకు రిజర్వ్ జేసిండ్రు. గీ సంగతి ఎర్కగాంగనే గాల్ల మొకాలు వాడిన తామరపూల లెక్క అయినయి. గీ సారి ఎట్లన్న జేసి నర్సం పేట మున్సిపల్ చేర్మెన్ కుర్సిమీద గూసోవాలని నలుగురు ఓసీ టిఆర్‌ఎస్ లీడర్లు అనుకున్నరు. గాల్లు ఎమ్మెల్యేకు దగ్గరోల్లు. గాల్లు ఒకటనుకుంటె ఒకటయ్యింది. గా మున్సిపల్ చేర్మెన్ సీటు బీసీ ఆడామెకు రిజర్వ్ అయ్యింది. ఇగ దాంతోని 'అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా; ఆశా నిరాశేనా మిగిలిందీ చింతేనా' అని పాడుకుంట శీకట్ల గూసున్నరు. గిప్పుడు బొంతు రామ్మోహన్ పట్నం మేయర్ గాయిన మల్లొక పారి మేయర్ కుర్సి ఈమద గూసుండాలనుకున్నడు. ఎమ్మెల్యె టికిట్ గురించి ఒక్క తీర్గ కోషిస్ జేసినా టికిట్ దొర్కలేదు. టికిట్ దొర్కితె ఎమ్మెల్యేను అయితుంటి. నసీబు బాగుంటె మంత్రి కుర్సి మీద గూసుండెటోన్ని. మల్లొక పారి మేయర్ కుర్సి మీద గూసుందామనుకుంటె మేయర్ సీటును జనరల్ ఆడామెకు రిజర్వ్ జేసిండ్రు. అనుకున్న దొక్కటి. అయినది ఒక్కటి. ఉల్టపల్ట అయ్యెనే కీస్ కీస్ పిట్టా అనుకుంట రామ్మోహన్ నెత్తి గొట్టుకుండు''
''మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సంగతేంది?''
మున్సిపల్ ఎలచ్చన్ల గాల్లు అనుకున్న తీర్గ రిజర్వేషన్లు వొస్తయని మంత్రులు; ఎంపీలు, ఎమ్మెల్యేలు అనుకున్నరు. ఆల్ల కుటుంబంల ఎవరన్న ఒకర్ని దంగలకు దించాలని అనుకున్నరు. గని అంత ఉల్టపల్ట అయ్యింది. గాల్లు అనుకున్న తీర్గ రిజర్వేషన్లు రాలేదు. టిఆర్‌ఎస్ దిక్కుకెల్లి ఎవరు నిలబడ్డా గాల్లను గెలిపియ్యాలని మంత్రులు; ఎమ్మెల్యేలకు ముక్యమంత్రి జెప్పె తల్కె ఆల్ల పుండుమీద కారం సల్లినట్టయ్యింది. పార్టి టికిట్ ఇచ్చినోల్లే మున్సిపల్ ఎలచ్చన్ల పోటి జెయ్యాలె. రెబల్స్ మనుకుంట ఎవ్వరన్న చెంగడ బింగడ ఎగ్రితె గాల్లను ఆరేండ్లు పార్టిలకెల్లి ఎల్లగొడ్తం అని కెసిఆర్ అన్నడు. టికిట్ రాకుంటె రెబల్స్‌గ పోటి జేసి గెలిస్తిమా అంటె ముక్యమంత్రి నెత్తిమీద గూసుండ బెట్టుకుంటడని కొందరు అనుకున్నరు. టికిట్ రాని కొంతమంది టిఆర్‌ఎస్ లీడర్లు కాంగ్రెస్లకు దుంకిండ్రు''
''మున్సిపల్ ఎలచ్చన్ల కర్సు సంగతేంది''
''ఎవలెక్వ కర్సు జేసెతందుకు ముంగట్కి వొస్తె గాల్లకే టికిట్ ఇస్తున్నరు. కార్పొరేట్ టికిట్ ను హర్రాజ్ ఏస్తున్నరు. హర్రాజ్ల ఎవలెక్వ పాడ్తె గాల్లకే టికిట్ ఇస్తున్నరు. కార్పొరేట్ టికిట్ 25 లచ్చల కాడి నుంచి 50 లచ్చల రూపాల దాంక హర్రాజ్ల అమ్ముడుబోతున్నది. 4 కోట్లు అంతకన్న ఎక్వ రూపాలు ఇచ్చెటోల్లకే మేయర్ కుర్సి దొర్కెటట్లు ఉన్నది'' అని నర్సిమ్మ సామి అన్నడు.
ఇంతల తెల్లారింది. నారదుడు మాయమై మొగులు మీద్కి బోయిండు.
- తెలిదేవర భానుమూర్తి
సెల్: 9959150491