Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం కూడా పూర్తయింది. రాష్ట్రం మొత్తమ్మీద 128 మున్సిపాలిటీ లు,13 కార్పొరేషన్లకు కలిపి 141 పురపాలికలుండగా, ప్రస్తుతం 120 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగు తున్నాయి. ప్రస్తుత రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం చాలా పరిమితం. వీరి భాగస్వామ్యం పెరగడానికి ఇంకా దృష్టి సారించాల్సి ఉన్నది. కుటుంబంలోని అసమానతలు ఓవైపూ ఇల్లూ-పిల్లల్నీ చూసుకునే బాధ్యతా స్త్రీలకే అప్పచెప్పడం ఓ వైపూ, రాజకీయాల్లో పెరుగుతున్న నేర ప్రవృత్తీ డబ్బూ మహిళను రెండవ తరగతి పౌరురాలిగా చూడడం, వెరసి రాజకీయ భాగస్వామ్యం నుంచి మహిళను వెనక్కు నెడుతున్నాయి. ఈ తరుణంలో సగభాగంగా ఉన్న మహిళలకు మున్సిపాలిటీ ఎన్నికల్లో 50శాతం రిజర్వేషన్లు కేటాయించబడ్డాయి. 120 మున్సిపాలిటీ చైర్‌పర్సన్ స్థానాల్లో 61 మందికి, 13 మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాల్లో 6స్థానాలతో పాటు, వార్డులు, డివిజన్లు కూడా 50శాతం మహిళలకు కేటాయింపు జరిగింది. కీలకమైన జీహెచ్‌ఎంసీ మేయర్ స్థానం కూడా మహిళకే. తమకు పిల్లలు కావాలా? వద్దా? ఎప్పుడు కనాలి? ఎంతమందిని కనాలి? అనే విషయంలో నిర్ణయాధికారం అత్యధిక మంది మహిళల చేతుల్లో లేకపోవడం వల్ల రిజర్వేషన్ల లాభాన్ని కూడా మహిళలు పొందగలిగే స్థితి గతంలో ఉండేది కాదు. ''ఇద్దరు పిల్లలకు మించి ఉంటే పోటీకీ అనర్హులు'' అనే గత ఎన్నికల నిబంధనను ఈసారి తొలగించడం శుభపరిణామం. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం రెండు పర్యాయాలు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లే కొనసాగనున్నాయి.
మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే 73, 74 రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ జరిగినప్పుడు పోటీకి నిలపడానికి తగినంతమంది మహిళా అభ్యర్థులైనా దొరుకుతారా? అనే సందేహాలను పలువురు వ్యక్తం చేసారు. అయితే ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ దేశవ్యాపితంగా 10లక్షలకు పైబడి మహిళలు స్థానిక సంస్థల్లో ఎన్నికై ఆయా స్థాయిల్లో ప్రజాప్రతి నిధులుగా తమ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తు న్నారు. ఈ పరిణామం మహిళల స్థానం పట్ల సమాజంలో ఉన్న తిరోగామి భావాన్ని బలంగా దెబ్బకొట్టగలిగింది.
మహిళా ప్రతినిధుల పనితీరు పరిశీలించినప్పుడు చాలాచోట్ల సమర్ధవంతంగా పనిచేస్తున్నప్పటికీ కొన్నిచోట్ల బినామీల ఆధిపత్యం కనిపిస్తున్నది. ఎన్నికైన మహిళా అభ్యర్థుల అనాసక్తి, సామర్థ్యం లేమి వల్లనే వారి భర్తలు లేదా వారి బంధువులు పెత్తనం చేస్తున్నారనే అపోహ నెలకొని ఉన్నది. సమాజంలో, కుటుంబంలో యథాతథ పరిస్థితిని నిలబెట్టేటందుకే మగవారు ఈ బినామీ పెత్తనం చెలాయిస్తున్నారనేది స్పష్టం. ఎన్నికైన దళిత, గిరిజన మహిళా ప్రజాప్రతినిధులు ఏకకాలంలో కుల, లింగ వివక్ష ఎదుర్కొన్న ఘటనలు మన కండ్లముందు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి.
రిజర్వేషన్లు అమలులోకి వచ్చిన కొత్తలో రంగారెడ్డిజిల్లాలోని ఒక గ్రామంలో మహిళా సర్పంచ్ అభ్యర్థి తరపున నేను ప్రచారానికి వెళ్లిన సందర్భంలో ఇల్లే ఆమె ప్రపంచం. ప్రజా జీవితంతో సంబంధం లేని స్థితిలో.. ఎన్నికల క్రమంలో ఆమె భర్తే అన్నీ తానై వ్యవహరించాడు. గెలిచిన తర్వాత షాడో ప్రజాప్రతినిధిగా మారాడు. తదనంతరం రెండవ దఫా ఎన్నికల సందర్భంగా కూడా ప్రచారానికి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతానికి సంబంధించి ఆమె విధుల్లో భర్త జోక్యం చేసుకుంటుంటే ''ఆగవయ్యా నాకు తెలుసు, ఈ ఐదేండ్లల్లో గ్రామ సమస్యలను పూర్తిగా ఆకళింపుచేసుకున్నాను. స్వయంగా నిర్ణయం తీసుకోగలను'' అని సూటిగా చెప్పింది. పుట్టుకతో ఎవరూ నేర్పరులు కారు. సాధనతో అన్నింటినీ సాధించవచ్చనే విషయమై ఇంతకన్నా ఉదాహరణ ఏమి చెప్పగలం.
గతంలో వామపక్షపార్టీల ప్రభుత్వాల నేతృత్వంలో కొనసాగిన బెంగాల్, త్రిపురతో పాటు, ప్రస్తుతం కొనసాగుతున్న కేరళలో ప్రజా జీవితాన మహిళలు ముందడుగు వేసిన స్ఫూర్తిదాయక ఉదాహరణలు కోకొల్లలు. ముఖ్యంగా అక్కడ సామాజిక, ఆర్థిక అణచివేతలకు గురైన వర్గాల నుంచి స్త్రీలు రాజకీయాల్లో ముఖ్య భూమిక నిర్వర్తించడం కీలకమైన అంశం.
మహిళా ఉద్యమాల ద్వారా పోరాడి సాధించుకున్న రిజర్వేషన్ల వల్ల 2020 జనవరి చివరి నాటికి పెద్ద సంఖ్యలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, మేయర్లుగా మహిళలు రాబోతున్నారు. మహిళలు రాజకీయాల్లోకి రావడం ఒక్కటే కాదు, ఎటువంటి రాజకీయాల్లో పాలుపంచుకుంటున్నామన్నదీ అత్యంత ప్రాముఖ్యమైన అంశం. యథాతథ వాదానికి వ్యతిరేకంగా, సామాజిక మార్పుల్ని కోరుతూ జరుగుతున్న రాజకీయ ఉద్యమాల్లో స్త్రీలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసినప్పుడే మొత్తం సమాజానికి మేలు జరుగుతుంది. మతతత్వం, ఛాందసవాదం నేడు మహిళా ప్రగతికి తీవ్ర అవరోధంగా ఉన్నాయి. సరళీకృత ఆర్థిక విధానాల ఫలితంగా పేదరికం, నిరుద్యోగం, అధిక ధరలు, హింసా ప్రజా జీవితాలను దెబ్బతీస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు, సమాజంలోని అసమానతలను సరిచేసేందుకు స్త్రీలు పెద్ద సంఖ్యలో రాజకీయాల్లో పాలుపంచుకోవాల్సిందే. గెలిచిన మహిళా ప్రజాప్రతినిధులు స్త్రీ పరాధీనతకు గురిచేసే మూల సమస్య అయిన ఆర్థిక హక్కుల గురించి పట్టించుకోవాలి. వంటింటికి పరిమితం చేస్తున్న సాంస్కృతిక, సామాజిక భావజాలంపై పోరాడాలి. అప్పుడే ఆ పదవితో పాటు, యావత్ సమాజానికి న్యాయం జరుగుతుంది.
- టి. జ్యోతి