Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత్-పాకిస్థాన్‌కు జరిగిన ఒప్పందాల్ని వక్రీకరిస్తూ ఈమధ్య అభూతకల్పనలు ప్రచారం చేస్తున్నారు. భారత ప్రధాని నెహ్రూ, పాకిస్థాన్ ప్రధాని లియాఖత్ ఒప్పందాన్ని కూడా వక్రీకరించారు. 1950 ఏప్రిల్ 8న ఇరు ప్రధానుల మధ్య 10అంశాలతో కుదిరిన ఆ ఒప్పందం ప్రకారం తమ తమ రాజ్యాంగంలో మార్పులు చేసుకుంటున్నట్టు ఇరువురూ ప్రకటించారు. “The Prime Minisiter of India has drawn attention to the fact that these rights are guaranteed to all minorities in India by its Constitution. The Prime Minister of Pakistan has pointed out that similar provision exists in the Objectives Resolution adopted by the Constituent Assembly of Pakistan” అని ఆ ఒప్పందంలో ఉంది. దీనినీ వక్రీకరించారు. ఒప్పందం ప్రకారం తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్, అసోం, త్రిపురలో జరిగిన మత ఘర్షణల కారణంగా చాలామంది వలసెళ్ళారు. అలా వెళ్ళినవారి స్థిర చర ఆస్తుల్ని మరొకరు ఆక్రమించకూడదని 1950 డిసెంబర్ 31లోపు వచ్చిన వారికి తిరిగి వారి ఆస్తులు అప్పగించాలని ఆ ఒప్పందంలో ఉంది. రెండు దేశాలలో మైనార్టీ కమిషన్లు ఏర్పాటు చేయాలి. ఆ మైనార్టీ కమిషన్ల అనుమతితో తిరిగొచ్చిన వారికి పునరావాసం కల్పించాలి. ఇరు దేశాల మంత్రులు చైర్మన్లుగా ఒక మెజార్టీ, ఒక మైనార్టీ వ్యక్తులను ఆ కమిషన్లలో వేయాలి. రెండు దేశాల మైనార్టీ కమిషన్లు వీలును బట్టి చర్చించుకొని వలసదారుల సమస్యలను పరిష్కరించాలి. దొంగిలించిన ఆస్తుల రికవరీకి అన్ని అవకాశాల్నీ వినియోగించాలి. వలసొచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా వారు అంగీకరించిన దేశంలో పౌరసత్వ హక్కులు కల్పించాలి.. అని ఒప్పందంలో అంగీకరించారు. దాని ప్రకారమే 1955 పౌరసత్వ చట్టం రూపొందింది. పౌరసత్వ చట్టం అమలులోకి వచ్చిన తరువాత 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్య్రం పొందిన సందర్భంగా దాదాపు 1.20కోట్ల మంది వలసలు వెళ్లారు. బంగ్లాదేశ్ విముక్తికి భారత సైన్యాలు సహకరించాయి. ఆ సందర్భంగా వలసొచ్చిన వారిని తిరిగి వారి ప్రదేశాలలోకి పంపటానికి ప్రధాని ఇందిరా, బంగ్లాదేశ్ ప్రధాని ముజఫర్ రెహ్మాన్ మధ్య 1972 మార్చి 19న ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలో 12అంశాల్ని అంగీకరిస్తూ రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలను కొనసాగించాలని నిర్ణయించారు. ఈ ఒప్పందం 25ఏండ్లు అమలులో ఉంటుందని ఆ తరువాత ఇరు దేశాల అభిప్రాయాలను బట్టి పొడిగించుకోవచ్చని అంగీకరించారు.
1971లో పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ నుంచి అసోంలోకి వలసలు రావడంతో అసోంలోని అఖిల భారత అసోం విద్యార్థి యూనియన్, విద్యార్థి గణపరిషత్ సంఘం కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. ఆ సందర్భంగా పౌరసత్వ చట్టం 1955కు సవరణ చేస్తూ 1971 మార్చి 24కు ముందు వచ్చిన వారికి పౌరసత్వం కల్పిస్తూ చట్ట సవరణ చేశారు. అంతకుముందే 1966 జనవరి 1కి ముందు అసోంలోకి వచ్చిన వారికి ఆటోమేటిగ్గా పౌరసత్వం లభిస్తుంది. ఈ పౌరసత్వాన్ని రుజువు చేసుకోవడానికి అసోం ప్రజలకు ఎన్‌ఆర్‌సీ (నేషనల్ రిజిష్టర్ సర్టిఫికేట్) సర్వే చేశారు. ఆ సందర్భంగా ''ఇల్లీగల్ మైగ్రైంట్స్ డిటర్మినేషన్ బై ట్రిబ్యునల్ యాక్ట్'' చట్టం చేశారు. సుప్రీంకోర్టు 2005లో తీర్పునిస్తూ పౌరసత్వ ప్రక్రియ రిజిస్టర్‌ను దేశవ్యాప్తంగా చేపట్టవద్దని అసోం ప్రాంతానికే (ఈశాన్య రాష్ట్రాలకే) పరిమితం చేయాలని స్పష్టంగా ఆదేశించింది. కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం భారతదేశానికి వర్తింపచేస్తూ తీసుకున్న నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉంది. సరిహద్దులో ఉన్న బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారు 14 సర్టిఫికేట్లలో ఏదో ఒకదాని ఆధారంగా తమ పౌరసత్వాన్ని రుజువు చేసుకోవాలని కోరారు. వలసొచ్చిన వారిలో ముస్లింలు, హిందూవులు, క్రైస్తవులతో పాటు అనేక మతాల వారు వచ్చి స్థిరపడ్డారు. 2004లో పౌరసత్వాన్ని చట్ట సవరణ జరిగిన దానిని సుప్రీంకోర్టు రద్దు చేయలేదు. 1983లో తెచ్చిన ఐఎండీటీ (ఇల్లీగల్ మైగ్రైంట్స్ డిటర్మినేషన్ బై ట్రిబ్యునల్ యాక్ట్) చట్టం చెల్లదని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది చారిత్రక వాస్తవం. అయితే ఒకే దేశం ఒకే జాతి, ఒకే మతం, ఒకే భాష పేరుతో బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ రాజ్యాంగ సవరణలకు పూనుకున్నది. ఇందులో భాగంగా రాజ్యాంగం ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కాశ్మీర్‌కు ఇచ్చిన రిజర్వేషన్లను త్రోసిపుచ్చి కాశ్మీర్, లడక్ రాష్ట్రాలుగా విభజించింది. 35ఎ చట్టాన్ని కూడా రద్దు చేసింది. 11ఏండ్లుగా వలస ఉన్న వారిని 6ఏండ్లకు కుదిస్తూ బీజేపీ ప్రభుత్వం సవరణ చేసింది. 18సెక్షన్లతో ఉన్న పౌరసత్వ చట్టం 1955 డిసెంబర్ 30న రూపొందింది. దానికి సవరణలు చేస్తూనే అసోంతో ముడిపడిన సమస్యను భారతదేశానికి వర్తింపజేసి 2021 జనాభా లెక్కలలో ''జాతీయ ప్రజా రిజిష్టర్‌ను'' రూపొందించటానికి ఆదేశించారు. మొత్తం భారతదేశంలోని ప్రజలందరు హిందువులేనంటూ ఈ మధ్య హైదరాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ ప్రకటించారు. కానీ భారత దేశంలో 14 ప్రధాన జాతులు, 300పైగా చిన్న జాతులు కలిసి ఉంటున్న వాస్తవాన్ని బీజేపీ గుర్తించడం లేదు. జాతుల కలయికతో ఏర్పడిన భారత ఫెడరేషన్ రాష్ట్రాల సమాఖ్యగా రాజ్యాంగం రూపొందించుకొని 1950 జనవరి 26 నుంచి అమలు జరుపుతున్నది.
ఆ రాజ్యాంగం ప్రకారం భారతదేశంలోని వారంతా సమాన హక్కు పొందాలని అంగీకరించారు. కానీ బీజేపీ ప్రభుత్వం హిందూ మతం వారు మాత్రమే ఉండాలని, ఇతర మతాలలోని వారు ''ఘర్ వాపసి'' నినాదంతో హిందూ మతంలోకి రావాలని నిర్బంధం ప్రచారం చేస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న భారతదేశ లౌకిక విధానానికి భంగం కలిగే విధంగా రాజ్యాంగ సవరణలకు బీజేపీ ప్రభుత్వం పూనుకున్నది. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను క్రమంగా రద్దు చేస్తూ అర్టికల్ 371ని కూడా రద్దు చేసే అవకాశం కనబడుతున్నది. 371ఏ నుంచి జె వరకు నాగాలాండ్, అసోం, మణిపూర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా రాష్ట్రాలకు రక్షణ కల్పించారు. 370 రద్దుతో కాశ్మీర్‌లో నేటికి 5 వేలమంది జైళ్లలోనో, గృహ నిర్బంధంలోనో కొనసాగుతున్నారు. దేశ సమగ్రతను కాపాడాలని ఆందోళనలు చేస్తున్న ప్రజలపై పెద్ద ఎత్తున దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. యూనివర్సిటీలలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై భౌతిక దాడులు చేస్తూ గాయపడిన వారిపైనే కేసులు పెడుతున్నారు. జామియా మిలియా యూనివర్సిటీ, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, బెనారస్ ముస్లిం యూనివర్సిటీలతో పాటు ఇతర యూనివర్సిటీలను ఆర్‌ఎస్‌ఎస్ వారు తమ లక్ష్యాలుగా పెట్టుకున్నారు.
పౌరసత్వ చట్టానికి చేసిన సవరణలో మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యా ముస్లింకు, శ్రీలంక తమిళులకు , నేపాల్, భూటాన్ నుంచి వలసొచ్చిన వారికి మాత్రం పౌరసత్వం వర్తింపచేయలేదు. అప్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ, క్రైస్తవ, సిక్కు, భౌద్ద్ద, జైన్, పార్సీకులకు మాత్రమే పౌరసత్వం కల్పించటానికి సవరణ చట్టం తీసుకొంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 16, 58, 66, 124, 217 ప్రకారం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 16 ప్రకారం పౌరసత్వం ఇవ్వవచ్చు. కానీ ఇందుకు విరుద్ధంగా బీజేపీ కొన్ని అంశాలకే చట్ట సవరణ చేసింది. పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని అమలు చేయబోమని 12రాష్ట్రాలు ప్రకటించడాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీర్ణించుకోలేక పోతున్నది. పార్లమెంట్‌లో మెజార్టీ ఉన్నదని చట్టాలు చేసినంత మాత్రాన భారతదేశంలోని లౌకికతత్వాన్ని, భిన్నత్వంలోని ఏకత్వాన్ని మార్పు చేయడం సాధ్యం కాదు.
సమైక్యతగా ఉన్న జాతుల మధ్య వైరుధ్యాలు సృష్టించి దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. దేశంలో కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం వల్ల నిరుద్యోగం, ఆకలి, దారిద్య్రం పెరిగిపోతున్నది. ప్రజలు తమ ఆర్థిక సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలను తప్పుదారి పట్టించడానికి పౌరసత్వాన్ని ఏజెండాపైకి తెచ్చింది. మత సమస్యలను కేంద్రంగా చేసుకొంటూ వచ్చే నాలుగేండ్ల పాలనా కాలాన్ని గడపవచ్చని బీజేపీ ప్రభుత్వ పన్నాగం. తాను ప్రకటించిన 5ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ 2025నాటికి సాధించలేమన్న వాస్తవాన్ని గుర్తించి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. వ్యవసాయ రంగం 2.1వృద్ధిరేటుతో ఉండగా మొత్తం జీడీపీ 4.5 శాతం వృద్ధి రేటు ఉన్నట్టు ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆర్థిక నిపుణులు అరవింద్ సుబ్రమ0ణ్యం ప్రభుత్వం చెప్పే వృద్ధిరేటు వాస్తవం కాదని సోదాహరణంగా ప్రకటించారు. ఆర్థికవేత్తలందరూ ప్రభుత్వ ఆర్థిక విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్న నేపథ్యంలో మత సమస్యను కేంద్ర బిందువుగా చేసి ప్రజల కోర్కెలను వక్రమార్గం పట్టిస్తున్నారు. అనేక అనుభవాలు ఉన్న భారత ప్రజానీకం ఈ తాత్కాలిక మళ్లింపులకు లొంగదన్న వాస్తవాన్ని బీజేపీ పాలకులు గుర్తించడం మంచిది.
- సారంపల్లి మల్లారెడ్డి
సెల్: 9490098666