Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశవ్యాప్తంగా జాతీయ పౌరజాబితాకు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలై నెలరోజులు దాటింది. ఎన్నార్సీ గురించి ప్రజల భయాందోళనలు తొలగించటానికి కేంద్ర ప్రభుత్వం వీసమెత్తు ప్రయత్నం చేయటం లేదు. పైగా ప్రజల భయాందోళనలు మరింత పెంచేదిగా ఉంది. దేశవ్యాప్తంగా ఓ వైపు ప్రభుత్వం నుంచి సమాధానం కోరే ప్రజలు పెరుగుతుంటే మరో వైపు కేంద్ర హౌంశాఖ జాతీయ జనాభా రిజిష్టర్ తయారీకి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తూ పోతోంది. రాష్ట్ర ప్రభుత్వాలతో సమావేశాలు జరిపి ఏప్రిల్ 1, 2020 నుంచీ జనగణనతో పాటు జాతీయ జనాభా రిజిష్టర్ తయారీకి కావల్సిన కసరత్తు కొనసాగుతూనే ఉంది. నోట్లరద్దు సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇదేవిధంగా పదేపదే భావోద్వేగాలు రెచ్చగొట్టటానికి ప్రయత్నం చేసింది. నల్లధనం గురించి స్వయంగా ప్రధాని మోడీ ఇచ్చిన వాగ్దానాలు, బీజేపీ యంత్రాంగం రంగంలోకి దిగి ప్రచారంలో పెట్టిన విషయాలు గుర్తు చేసుకుంటే ఎన్నార్సీ గురించి ప్రభుత్వం ముందుకు తెస్తున్న వాదనలు, ప్రచారం ఎటువంటి పరిణామాలకు దారితీయనున్నాయోనన్న సాధారణ ప్రజల భయాందోళనలు సమంజసమైనవేనని చెప్పవచ్చు.
మూడు లక్ష్యాలు సాధించటం కోసం పెద్ద నోట్లరద్దు చేస్తున్నట్టు స్వయంగా జాతినుద్దేశించిన ప్రసంగంలో ప్రధాని మోడీ ప్రకటించారు. మొదటిది నల్లధనాన్ని నియంత్రించటం, నల్లధనం ఇంధనంగా మార్చుకుని దేశంపై జరుగుతున్న ఉగ్రవాదదాడుల్ని అరికట్టడం, నకిలీ కరెన్సీని చలామణి నుంచి తొలగించటం. ఈ విషయమై నాటి ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కూడా అద్భుతమైన కథ అల్లారు. మోడీ తీసుకున్న నిర్ణయం తనకు కూడా తెలీదని నోరెళ్లబెట్టారు. చివరి నిమిషం వరకు నోట్లరద్దు విషయం ఎవ్వరికీ చెప్పలేదని ఇదే నిజమని, దేశం కూడా ఇదే నమ్మాలనీ జైట్లీ ఆశించారు.
కానీ వాస్తవం యిందుకు భిన్నం అని స్వయంగా రిజర్వు బ్యాంకు బోర్డు సమావేశం వెల్లడించింది. నాటి ఆర్థికశాఖ కార్యదర్శి నేటి రిజర్వుబ్యాంకు గవర్నర్ శక్తికాంత్ దాసు, నాటి రిజర్వుబ్యాంకు గవర్నర్ ఊర్జిత్ పటేల్‌తో జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రతిపాదనను రిజర్వుబ్యాంకు చర్చించి ఆమోదించింది. ఈ సమావేశంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు ఎస్‌ఎస్ ముంద్ర, ఆర్ గాంధీలతో పాటు కేంద్ర ఆర్థిక శాఖలో ద్రవ్య వ్యవహారాల కార్యదర్శి అంజులి చిబ్ దుగ్గల్ కూడా హాజరయ్యారు. ఇంతమంది ఆర్థికశాఖ అధికారులు పాల్గొన్న సమావేశం ఆర్థికమంత్రికి తెలీకుండా జరిగిందని మనం నమ్మాలని అప్పుడు జైట్లీ కోరారు. మోడీ ప్రభుత్వం తాను అనుకున్న లక్ష్యం సాధించాలంటే ప్రజల దృష్టి మళ్లించటమే మార్గమని భావించినప్పుడు ఎంతటి తీవ్రమైన అబద్ధమాడటానికి కూడా వెనకాడదని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి.
ఇక నోట్లరద్దు ఒక్కటే దేశంలోని నల్లధనాన్ని నిర్మూలించటానికి ఏకైక మార్గమని మోడీ, బీజేపీ, సంఫ్‌ుపరివారం, అంధభక్తులు పెద్దఎత్తున ప్రచారం చేశారు. మరి ఈ లక్ష్యం ఆచరణలో ఏమైంది? ఈ ప్రశ్నకు సమాధనం కూడా రిజర్వు బ్యాంకే ఇచ్చింది. నల్లధనాన్ని గోతాల్లో సంచుల్లో కుక్కి బెడ్ రూముల్లో, బాత్రూముల్లో, గోదాముల్లో దాచుకున్నారని ప్రచారం చేశారు. దీనికి భిన్నంగా ఆర్బీఐ నివేదిక ''నల్లధనం నగదు రూపంలో లేదు. ఉండదు. బంగారం రూపంలోకో భూముల రూపంలోకో మారిపోతుంది. అందువల్ల ఈ నిర్ణయం నల్లధనంపై పోరాటంలో ఏమీ ఉపయోగపడద''ని 561వ బోర్డు సమావేశం తీర్మానించింది.
నోట్ల చలామణి ఎక్కువ కావటం వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందన్నది మరో వాదన. దేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నది తన కల అని చెప్పారు మోడీ. ప్రపంచంలో శక్తివంతమైన దేశాలన్నీ నగదురహిత ఆర్థిక వ్యవస్థలేనని కూడా నమ్మించే ప్రయత్నం చేసింది మోడీ కనుసైగతో పని చేసే మీడియా సైతం. కానీ ఆచరణలో తేలింది ఏమిటి? నోట్లరద్దు చేసే 2016 నవంబరు నాటికి దేశంలో 17లక్షల 74వేల 187నోట్లు చలామణిలో ఉంటే 2019 మే 31వ తేదీ నాటికి 21లక్షల 71వేల 385కోట్ల నోట్లు చలామణిలో ఉన్నాయని స్వయంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. అంటే నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు పునాదులేస్తున్నామని మన ఖాతాల్లో ఉన్న సొమ్మంతా సక్రమార్జనా, అక్రమార్జనా మనమే నిరూపించుకోవాలని సవాలు విసిరిన ప్రభుత్వం హయాంలో ఏటా 14శాతం నగదు చలామణీ పెరిగింది.
చలామణీలో ఉన్న నగదు విలువ రీత్యా చూసినా 2017 మార్చి నాటికి 13102 బిలియన్ రూపాయలు విలువైన నగదు చలామణీలో ఉంటే 2019 మే 31వ తేదీకి 21109 బిలియన్ల విలువైన నగదు చలామణీలో ఉంది. నోట్లరద్దు సమయంలో తెలంగాణ ప్రభుత్వంతో సహా అనేక ప్రభుత్వాలు జీరో నగదు గ్రామాలుగా, కొన్ని గ్రామాలను నగదు బంధనాల నుంచి విముక్తి చేసినట్టు చెప్పుకున్నాయి. పెద్దఎత్తున ప్రచారం కలిగించాయి. కానీ ఈ కాలంలో నగదు రహిత లావాదేవీలు 112.77లక్షల కోట్ల నుంచి 188లక్షల కోట్లకు పెరిగాయి. మరోవైపున నేటికీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నగదు కొరతను ఎదుర్కొంటోంది. మరి ఈ పెరిగిన నగదు నిల్వలు ఎవరి స్వంతమయ్యాయి?
నకిలీ నోట్ల వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని, ఈ నకిలీ నోట్లన్నీ పెద్దనోట్ల రూపంలోనే ఉన్నాయని, అందువల్లనే పెద్ద నోట్లను రద్దు చేయాలని నిర్ణయించుకున్నామన్నది నోట్లరద్దు సమయంలో ముందుకు తెచ్చిన మరో వాదన. ఈ వాదనలో వాస్తవమెంత? పెద్దనోట్లే నకిలీకి మార్గం అని భావించినప్పుడు వెయ్యి రూపాయల నోటుస్థానంలో రెండు వేల రూపాయల నోట్లు తేవటం ఈ నకిలీ నోట్ల సమస్యను ఎలా పరిష్కరిస్తుందని ప్రభుత్వం భావించిందో మోడీ-షా ద్వయానికే తెలియాలి. ఆగస్టు 2019లో ఆర్బీఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం కొత్త 500నోట్లకు నకిలీ నోట్లు 2017తో పోలిస్తే 121 శాతం పెరిగితే రెండువేల రూపాయల నకిలీ నోట్లు 22శాతం పెరిగాయి.
పెద్ద నోట్ల రద్దుకు ప్రభుత్వం చెప్పిన ప్రధాన కారణం ఉగ్రవాదులకు అందుతున్న మద్దతు అందకుండా చేయటం, భారతదేశంలో చొరబాట్లను అరికట్టడం అని ప్రకటించింది. మరి ఈ విషయంలోనైనా ప్రభుత్వం నోట్లరద్దు ద్వారా తన లక్ష్యాన్ని నెరవేర్చుకోగలిగిందా అన్నది పరిశీలిద్దాం. నోట్లరద్దుకు ముందు 2015లో భద్రతా బలగాలపై రాళ్లు విసిరిన సంఘటనలు 730 నమోదైతే నోట్లరద్దు తర్వాత 2017లో 1261 సంఘటనలు నమోదయ్యాయి. నోట్లరద్దు చేసిన 2016లో సరిహద్దుల్లో 208 చొరబాటు ఘటనలు నమోదు అయితే నోట్లరద్దు తర్వాత 2017లో 342 ఘటనలు నమోదయ్యాయి. ఇప్పుడు జమ్ము కాశ్మీర్ రాష్ట్రం నేరుగా కేంద్ర హౌంశాఖ పాలనలో ఉంది కాబట్టి తాజా వివరాలు వెలుగు చూడటం అంత తేలికైన విషయం కాదు.
దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని హెచ్చరించినా నోట్లరద్దుకు పాల్పడి అదేదో బ్రహ్మాండమైన విజయంగా చెప్పుకొంటోంది బీజేపీ. నోట్లు రద్దుని సమర్ధించుకోవటం కోసం ప్రతిపాదించిన లక్ష్యాలేవీ నెరవేరలేదనీ, పైగా ఆర్థిక వ్యవస్థ దుంపనాశనమైందని ప్రభుత్వ లెక్కలు, ఆర్బీఐ నివేదికలే హెచ్చరిస్తున్నాయి. పుల్వామా రహదారిపై సైనికులను తీసుకెళ్తున్న వాహనాలపై ఉగ్రవాద దాడి జరిగినప్పుడు అక్కడ విధి నిర్వహణలో ఉన్నది తాజాగా ఉగ్రవాదులను తన స్వంత కారులో ఢిల్లీ చేరవేయటానికి ప్రయత్నం చేసి అరెస్టయిన దవేందర్ సింగేనని తేలింది. ఇదే వ్యక్తి 370 అధికరణం రద్దు తర్వాత కాశ్మీర్‌లో పర్యటించిన యూరోపియన్ పార్లమెంట్ ప్రతినిధులకు శ్రీనగర్ విమానాశ్రయంలో కావల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయటమే కాక ప్రభుత్వం గుర్తించిన ప్రాంతాల్లో వారిని తిప్పి తీసుకొచ్చాడని వార్తలు వస్తున్నాయి.
ఈ పరిణామాలు గమనిస్తే మోడీ ప్రభుత్వం ఏ విధానం ప్రకటించినా, ఏ చట్టం ఆమోదించినా కొన్ని అప్రకటిత లక్ష్యాలు ఉంటున్నాయన్నది వాస్తవమని అనేక సంఘటనల్లో రుజువైంది. నోట్లురద్దు విషయం కూడా అటువంటి సంఘటనల్లో ఒకటి. ఈ అనుభవాల వెలుగులోనే దేశ ప్రజలు ఎన్నార్సీ గురించి ప్రభుత్వం చెప్పింది నమ్మటం సాధ్యం కాదని తేల్చి చెప్తున్నారు. ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం విదేశాల్లో మతపరమైన హింసకు గురవుతున్న వారికోసమే అని చెప్పీ పార్లమెంట్ కండ్లు కప్పింది. చట్టం ఆమోదం పొందగానే హౌంమంత్రి అమిత్ షా 'చొరబాటుదారుల ఏరివేత'కు ప్రభుత్వం అనుసరించే చర్యల వరుసక్రమాన్ని అర్థం చేసుకోవాలని హితవు పలుకుతున్నారు. పార్లమెంట్ ముందు ప్రకటించిన లక్ష్యం ఈ వరుసక్రమంతో సాధించదల్చుకున్న లక్ష్యం భిన్నమైనదేనన్న అభిప్రాయం, అనుమానం ప్రజల్లో బలంగా ఉంది. ఈ అనుమానాలు తీర్చటానికి బదులు ప్రశ్నించిన వాళ్లపై తుపాకీ గుండ్లు కురిపిస్తోంది. ఢిల్లీ అంతటా జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేయాలని ఆదేశించింది. ఈ చట్టం కింద అరెస్టయితే ఏడాది పాటు లాయరునుకూడా పెట్టుకోకుండా జైళ్లలో మగ్గాలి. పౌరసత్వ సవరణకు వ్యతిరేకంగా ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ ఆందోళనలు జరుగుతున్నాయి. నోట్లరద్దు దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడితే ఎన్నార్సీ దేశాన్ని మానవ విలువ సంక్షోభంలోకి నెట్టనుందా అన్న ప్రశ్న నేడు దేశం ముందున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన ప్రభుత్వం మౌనంగా ఉంది. మౌనం అర్థాంగీకారమా? ఆలోచించాల్సిన సమయమిది.
- కొండూరి వీరయ్య
సెల్: 9871794037