Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డా|| వకుళాభరణం కృష్ణమోహన్ రావు
మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆధునిక భారతీయ నవయుగ వైతాళికుడు. వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన మాలికులంలో జన్మించి భారతదేశానికి మార్గదర్శనం చేసిన మహనీయులు. ఎందరో ఫూలే నుండి స్ఫూర్తి పొంది సంఘ సంస్కరణలు చేపట్టారు. సమాజంలో నిరక్షరాస్యత, మూఢ విశ్వాసాలు, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లాండు వారి వలస పాలన, బ్రాహ్మణాధిక్యత, దురాగతాలు, బాల్య వివాహాలు కొనసాగుతున్న కాలంలో జన్మించి స్వయంకృషితో దేశానికి వెలుగుదివ్వె అయ్యారు. మరాఠీలో, ఇంగ్లీషులో చదువుకొని, రెండు భాషల్లోను అనేక రచనలు చేశారు. సామాజిక ఉద్యమకారుడిగా ఫూలే స్పర్శించని అంశం లేదు. కుటుంబ వ్యవస్థలో కొనసాగుతున్న వివక్షను ప్రశ్నించారు. మనుషులందరూ సమానమేనని, దేవుడు ఒక్కడే అని, దేవుడు ముందు అందరూ సమానమేనని, దేవుడ్ని కొలవడానికి మధ్యవర్తిగా పూజారులు, బ్రాహ్మణులు అక్కరలేదని ఫూలే ప్రబోధించారు.
మనిషిని మనిషిగా గౌరవించాలని, కులాన్నిబట్టి కాదని, జీవితమంతా పోరాడారు. రాజుల కాలంనాటి దౌర్జన్యాలను ఎదిరించారు. పాశ్చాత్య దేశాల్లోని ప్రజాస్వామ్య వ్యవస్థలను, విలువలను, సంస్కృతిని, జీవన విధానాన్ని అధ్యయనం చేశారు. థామస్ పెయిన్ 1791లో రాసిన 'మానవ హక్కులు' పుస్తకం, అమెరికా అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ జీవిత చరిత్రను చదివి, ఫ్రెంచి విప్లవం గురించి అధ్యయనం చేసి ఎంతో ప్రభావితులయ్యారు. భారతదేశం అలా కులాలు లేకుండా అవిద్య నుండి బయటపడి ఎదగాలని ఆకాంక్షించారు.
అన్నిటికీ ఆధునిక విద్య ముఖ్యమని భావించారు. మూఢ నమ్మకాలను తొలగిస్తే తప్ప ప్రజలు చైతన్యవంతులు కారని, ఉద్యమించారు. ఏ కులం గొప్పది కాదు. ఏ కులం చిన్నది కాదు, అన్ని కులాలు సమానమే అని భావించిన ఫూలే బ్రాహ్మణులను కూడా కలుపుకొని అనేక సంఘసంస్కరణలను చేపట్టారు. స్త్రీవిద్యకు ప్రాధాన్యతనిచ్చారు. వితంతువుల కష్టాలను చూసి చలించిపోయారు. బాల్య వివాహాల వల్ల, 15-20 ఏళ్ళ లోపే వితంతువులై దుర్భర జీవితం జీవిస్తూ తల్లులైన వారి గర్భశోకాన్ని గమనించారు. గర్భస్రావాలవల్ల చనిపోతున్న వితంతువులను మానవతా దృక్పథంతో చేరదీసి వారు పిల్లల్ని కనాలని, ఆ పిల్లలను సాదరంగా పెంచి పోషించాలని, వారి కోసం స్కూళ్ళను, హాస్టళ్ళను ప్రారంభించారు. నిమ్నవర్గాల బాలబాలికలకు విద్య అందిస్తే రాబోయే తరం ఎంతగానో ఎదుగుతుందని భావించారు. ఫూలే కృషిని గమనించి డా. బి.ఆర్. అంబేడ్కర్ తండ్రి రామ్‌జీ ఎంతగానో ప్రభావితులయ్యారు. తన పిల్లలను బాగా చదివించాలని భావించారు. ఆనాటి సమాజంలో బాల్య వివాహాలే జరిగేవి. సావిత్రిబాయి ఫూలేతో జ్యోతిబా ఫూలే పెళ్ళి జరిగినప్పుడు ఇద్దరూ మైనారిటీ తీరనివారే. సావిత్రిబాయిని విద్యా వంతురాలిని చేసి, ఉపాధ్యాయు రాలిగా తీర్చిదిద్ది పాఠశాలను నడిపించారు. ఎంతో సంస్కారాన్ని అలవర్చుకున్న సావిత్రిబాయి ఫూలే ప్లేగువ్యాధి బాధితులకు సేవలు చేస్తూ ప్లేగు వ్యాధితోనే మరణించారు. ప్లేగు వ్యాధి అంటువ్యాధి అని తెలిసి కూడా జ్యోతిరావు ఫూలే 1890లో చనిపోయిన తర్వాత కూడా తన సేవలను కొనసాగించి ప్లేగువ్యాధితో 1897లో మరణించారు. ఇలా ఆదర్శ ఇల్లాలిగా, ఉపాధ్యాయురాలిగా, సంఘసేవకురాలిగా సావిత్రిఫూలే ఎదిగి దేశానికి తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా ప్రసిద్ధికెక్కింది. ఇలా తన చుట్టూత ఉన్న ప్రజలను, ఎందరో మిత్రుల ఎదుగుదలకు, సమాజం కోసం, సంఘ సంస్కరణల కోసం కృషి చేశారు జ్యోతిరావు ఫూలే.
జ్యోతిరావు ఫూలే కృషి దేశంలోని ఆనాటి సంఘసంస్కర్తలను, జాతీయ నాయకులను ఎంతగానో ఆకర్షించింది. తమకన్నా చిన్నవాడైనప్పటికీ ఫూలేను ఒక గురువుగా భావించి, నిమ్నవర్గాల విద్య కోసం, స్త్రీ విద్య కోసం, మూఢ నమ్మకాల నిర్మూలన కోసం, కులవివక్ష నిర్మూలన కోసం ఎందరో కృషి చేశారు. మహారాష్ట్ర, గుజరాత్, బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్య ప్రదేశ్ ప్రాంతాల్లో వందలాది పాఠశాలలు వెలిశాయి. బరోడా మహారాజు శాయాజీ గైక్వాడ్ ఫూలే నుండి స్ఫూర్తి పొంది పాఠశాలలను ప్రారంభించారు.
నేడు మనం ఇలా సమాన హక్కులతో, ఆధునిక విద్య అందుకుంటూ, ఆధునిక సైన్స్, టెక్నాలజీతో అభివృద్ధి చెందడానికి వెనుక జ్యోతిరావు ఫూలే వేసిన మార్గం ఎంతో గొప్పది. డా. బి.ఆర్. అంబేడ్కర్ వంటి ఎందరో మహనీయులు ఫూలే ఆశయాలను ముందుకు తీసుకొని నడిచారు.
ఫూలేకు సంతానం కాలేదని, రెండో పెళ్ళి చేసుకోమని తండ్రి గోవిందరావు ఫూలే శతవిధాల ప్రయత్నించినా, జ్యోతిరావు ఫూలే అందుకు నిరాకరించాడు. ఒకవేళ నాలోనే లోపం ఉంటే భార్యకు రెండో పెళ్ళి చేయడానికి సిద్ధపడతారా అని తండ్రిని ఎదురు ప్రశ్నించాడు. పిల్లలు లేకపోతే పున్నామ నరకం దాటలేమనే నమ్మకం వల్ల గోవిందరావు కొడుకును ఇంట్లోంచి వెళ్ళిపొమ్మని ఆదేశించాడు. ఇంట్లోంచి వెళ్ళిపోయి అనేక కష్టాలను ఎదుర్కొని తన లక్ష్యం వైపు సాగిపోయిన ధీరుడు జ్యోతిరావు ఫూలే.
బ్రాహ్మణులు జ్యోతిరావు ఫూలేను హత్య చేయించాలని చూశారు. హత్య చేయడానికి వచ్చినవారిని కూడా మార్చి జీవితమంతా తన అనుచరులుగా తీర్చిదిద్దిన గొప్ప మానవతావాది ఫూలే. బ్రాహ్మణులు అందరికీ విద్య నేర్పరని, బ్రాహ్మణేతరులను ఉపాధ్యాయులుగా నియమించాలని హంటర్ కమీషన్ ముందు విన్నవించి సాధించారు ఫూలే.
ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనపై దేశంలోని చిన్నా, పెద్దా రాజులు ఏకమై 1857లో పెద్ద తిరుగుబాటు లేవదీశారు. దీన్ని చాలామంది మొదటి భారత స్వాతంత్య్ర పోరాటం అని పేర్కొన్నారు. ఈ విషయంలో మహాత్మా జ్యోతిబా ఫూలే భిన్నంగా ఆలోచించారు. బ్రిటీష్‌వాళ్ళు ఆధునిక ప్రజాస్వామిక విలువలతో, ఆధునిక ప్రజాస్వామిక వ్యవస్థను, ఆధునిక విద్యను, ఆధునిక పరిశ్రమలను నెలకొల్పుతూ భారతీయ సమాజాన్ని ఈ దేశంలోని సర్వ అనర్థాలను కుల వివక్షను, అవిద్యను తొలగించడానికి సహకరించే అభ్యుదయవాదులని ఆశించారు. కాగా తిరుగుబాటు చేసిన రాజులు, సంస్థానాలు అన్నీ ప్రజలను అష్టకష్టాల పాలుచేసి బ్రాహ్మణ ఆధిపత్యాన్ని, కులవ్యవస్థ, నిమ్నవర్గాల అణచివేతను నిరంతరం కొనసాగిస్తున్న దౌర్జన్యకారులని, వారి చేతుల్లోకి తిరిగి భారతదేశం వెళ్లకూడదని ఫూలే భావించారు. చర్చించారు. ఆనాటి సంఘ సంస్కర్తలంతా ఇలాగే భావించారనే విషయం మరచిపోకూడదు. సంఘసంస్కరణలకు బ్రిటీష్ ప్రభుత్వం ఆధునిక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి బ్రాహ్మణేతరులకు కూడా ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి అంగీకరించింది. క్రమంగా ఇంగ్లీషు విద్యను, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను బ్రిటీష్ ప్రభుత్వం అందిస్తూ, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపి పరిమిత స్థాయిలో ప్రజాస్వామ్య పద్ధతులు ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రం కావాలని భారతీయులు కోరినప్పుడు అందుకు తగు విధంగా కొంతకాలం తమ నాయకత్వంలో శాసనసభలను, చట్టసభలను ఏర్పాటు చేసుకొని నడిపించాలని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. అలా ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టి బ్రిటీష్ పాలనలో ఉన్న ప్రాంతాల్లో ఎన్నికలు జరిపి ముఖ్యమంత్రులను, మంత్రులను నియమించి స్వయం పాలనకు మార్గం వేశారు. 1935లో భారత స్వాతంత్య్ర చట్టం ఏర్పాటు చేసి, దేశ వ్యాపితంగా ఎన్నికలు నిర్వహించారు. ఈ పరిణామాలన్నీ బ్రిటిష్ ప్రభుత్వం ద్వారానే సాగాయి. రాజాస్థానాలు, సంస్థానాలు ఈ విషయాల్లో చాలా వెనుకబడిపోయాయి. నైజాం రాజ్యం అందుకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. నైజాం రాజ్యంలో వెనుకబడిన సమాజం కొనసాగడానికి నైజాం పాలనకూడా ఒక కారణం. ఇలా చూసినపుడు వందేళ్ళ ముందుచూపుతో ఆనాటి సంఘసంస్కర్తలు ఆలోచించారని బ్రిటిష్ ప్రభుత్వం వల్ల జరగాల్సిన పనులు, సంస్కరణలు ఎన్నో వున్నాయని గుర్తించారని అందులో మహాత్మా జ్యోతిరావు ఫూలే ఒకరని గుర్తుచేసుకోవడం అవసరం.
బ్రిటిష్ పాలన కాలంలోనే కార్మికవర్గ సమస్యల గురించి, కూలీల గురించి ఎన్.ఎమ్. లోఖండే, రామయ్య తదితర మిత్రులతో కలిసి 1873లో 'సత్యశోధక సమాజ్' స్థాపించారు. కార్మికుల దుర్భర జీవితాలను చూసి చలించిపోయారు. 16 గంటల పని విధానానికి వ్యతిరేకంగా ఉద్యమించి 12 గంటల పని విధానాన్ని సాధించారు. ఇలా యూరప్, అమెరికా దేశాలతో సమానంగా ముంబాయి బట్టల మిల్లు కార్మికుల హక్కులు సాధించుకోవడంలో భారతీయ తొలి కార్మికవర్గ ఉద్యమాల నిర్మాణంలో లోఖండే, ఫూలే, రామయ్య తదితరులు నిర్వహించిన పాత్ర మహోన్నతమైనది.
గ్రామాల్లో వ్యవసాయదారులపై వడ్డీవ్యాపారుల, స్థానిక పెత్తందార్ల దౌర్జన్యం, అణచివేత ఎంతోకాలం సాగదని, వారికోసం ఫూలే ప్రత్యేకంగా కృషి చేశారు. ఎన్నో రచనలు చేశారు. జ్యోతిరావు ఫూలే గొప్ప గ్రంథకర్త. ఇంగ్లీషులో, మరాఠీలో రాసిన అనేక గ్రంథాలు భారతీయ భాషల్లోకి అనువదించడం అవసరం. సార్వజనీయ సభను ఏర్పాటు చేసి అందులోని సభ్యులు తమ కొడుకులను, బిడ్డలను, విద్యావంతులను చేయడానికి ప్రతిజ్ఞ చేయించేవారు.
స్త్రీ పురుషుల్లో స్త్రీలే ప్రకృతిపరంగా ఆధిపత్యం కలవారు. ఎవరైనా అందరి ఋణం తీర్చవచ్చు కానీ, జన్మనిచ్చిన తల్లి ఋణం ఎన్నటికీ తీర్చుకోలేరు. స్త్రీ లేకుండా ఏ ఇల్లు, ఏ కుటుంబం మనజాలదు. స్త్రీ స్వార్ధరహితంగా తల్లి హృదయంతో అందర్నీ సంరక్షిస్తుంది. స్త్రీ బలహీనురాలు కావడం వల్ల పురుషుడు స్వార్ధపరుడై స్త్రీలను అణచిపెడుతూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ రావడం వల్ల సమాజం ఇలా దుర్మార్ఘంగా, స్వార్ధపూరితంగా మారింది అని మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆనాడే స్త్రీల మహోన్నత కృషిని, మహనీయ సంస్కృతిని శ్లాఘించారు. ఆధునిక భారతీయ సమాజాన్ని కొన్ని విషయాల్లో సంస్కరించడానికి ఎందరో సంస్కర్తలు పుట్టారు. కానీ కుల నిర్మూలనకోసం, సమాజ పునర్నిర్మాణం కోసం మొట్టమొదట దారులు వేసిన మహనీయుడు, ఆధునిక యుగపురుషుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే. ఆనాడే ఇంత కృషి జరిగితే, స్వాతంత్య్రానంతరం ఇన్ని అవకాశాలున్న మనం, ఈ సమాజం అభివృద్ధికి మరెంత కృషి చేయాలో నేడు అందరు తమ కర్తవ్యాలను నిర్ణయించుకోవడం అవసరం.