Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళల సంక్షేమం, వారి భద్రత కోసం ఏర్పాటు చేసిన మహిళా కమిషన్‌కు రాష్ట్రంలో పాలకవర్గమే లేదు. ఉమ్మడి రాష్ట్రంలో నియమితులైన కమిషన్ చైర్‌పర్సన్, సభ్యుల కాలపరిమితి ముగిసి రెండేండ్లయింది. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం నేటికీ ఆ ఊసే ఎత్తడంలేదు. మహిళలకు సంబంధించి విధానపరమైన నిర్ణయాలపై, సంబంధిత పథకాలు, బడ్జెట్ కేటాయింపులు తదితరాలలో ప్రభుత్వం తప్పనిసరిగా మహిళా కమిషన్‌ను సంప్రదించాల్సి ఉంది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఆవశ్యకతా అవసరం కనిపించడం లేదు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2017-18లో మహిళలపై జరిగిన నేరాలు, అవమానాలు, వేధింపులలో మన రెండు తెలుగు రాష్ట్రాలే ప్రథమస్థానంలో ఉన్నాయి. హైదరాబాద్-దిశ, ఆదిలాబాద్-సమత, వరంగల్- మానస, హాజీపూర్ ఘటనలతో పాటు, కులదురహంకార హత్యలు, మహిళలపై జరుగుతున్న నేరాల పరంపరను నిరసిస్తూ మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలూ మేధావులూ చేస్తున్న రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు, ఆందోళనలన్నీ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. రాష్ట్ర మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌తో పాటు, సభ్యులను నియమించి అవసరమైన బడ్జెట్ కేటాయించి కమిషన్‌ను పునరుద్ధరించాలని ఐద్వా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో నిరాహారదీక్షలు నిర్వహించారు. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగానే ఉన్నది.
మహిళా సంఘాల దశాబ్దాల పోరాటాల అనంతరం 1990లో కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడం ద్వారా జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు ఏర్పడ్డాయి. ఈ కమిషన్ ప్రభుత్వశాఖ కాదు. స్వతంత్ర సంస్థ. కమిషన్ చైర్‌పర్సన్ మంత్రికో, స్త్రీ-శిశు సంక్షేమ శాఖకో బాధ్యురాలు కాదు. కేవలం అసెంబ్లీకే జవాబుదారి. కానీ ఇటువంటి స్వతంత్ర సంస్థను అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఆ రాజకీయ పార్టీకి చెందిన అనుచరులతో నింపివేస్తూ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చివేస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నియమితులైన కమిషన్ చైర్‌పర్సన్ మహిళల భద్రత అంశాన్ని పక్కకు పెట్టి జన్మభూమి, హరితహారం తదితర ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రచారం చేసే బాకాగా మార్చారు. ఇక కాంగ్రెస్ హయాంలోని మహిళా చైర్‌పర్సన్‌గా నియమితులైన మేరీ రవీంద్రనాథ్, సభ్యులూ ''కమీషన్ల కమిషన్''గా దీనిని మార్చివేశారు. బాధిత మహిళల నుంచి పిండుకున్న డబ్బులు ''నీకంత- నాకింత'' అని రచ్చకెక్కిన పరస్పర ఆరోపణలు పత్రికల్లో పతాక శీర్షికలుగా వచ్చాయి. ఇటువంటి వివాదాలు మహిళా కమిషన్ స్ఫూర్తిని, లక్ష్యాన్ని దెబ్బతీసాయి.
మహిళలకు కల్పించిన రాజ్యాంగపరమైన, చట్టబద్ధమైన భద్రతలను సమీక్షించి మహిళా అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసినదే మహిళా కమిషన్. అన్యాయానికి గురైన మహిళలకు చట్టపరంగా పరిహార మార్గాలను సూచించే అధికారం మహిళా కమిషన్‌కు ఉన్నది. కానీ నేడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో ఎక్కడ, ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మహిళా సంక్షేమం, భద్రతకు విశేష ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రభుత్వం ఢంకా బజాయించి చెబుతున్నది. మరి నిత్యం మహిళలపై జరుగుతున్న అకృత్యాల మాటేమిటి? వీటి మూలాల్లోకి వెళ్ళి, అధ్యయనం చేసి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ముందు నివేదిక ఉంచాల్సిన కమిషన్ రెండేండ్లుగా చేష్టలుడిగి నిస్తేజంగా ఉంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి? రాష్ట్రవ్యాప్తంగా పనిప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై ప్రత్యేకంగా వెబ్‌సైట్ ఏర్పాటుచేయాలని ఏడాదిన్నర క్రితమే ఐటీ శాఖ మహిళా కమిషన్‌కు ప్రతిపాదన పంపింది. ఇందుకు రూ.50 వేల వరకు ఖర్చవుతుందని పేర్కొంది. కానీ తమవద్ద నిధుల్లేవని మహిళా కమిషన్ ఈ ప్రతిపాదన పెండింగ్‌లో పెట్టింది.
మహిళా ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన కమిషన్ లక్ష్యం నెరవేరాలంటే చైర్‌పర్సన్‌తో పాటు, సభ్యులకు కూడా మహిళా సమస్యలు, సాధికారతపై సంపూర్ణ అవగాహన ఉండాలి. అటువంటి వారితోనే మహిళా కమిషన్ని నియమించాలి. కమిషన్‌కు చైర్‌పర్సన్, ఐదుగురు సభ్యులూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం వారిని నియమిస్తుంది. 5గురిలో ఒకరు షెడ్యూల్ కులాలు మరొకరు షెడ్యూల్ తెగలకు చెందినవారై ఉండాలి. పదవీకాలం మూడేండ్లు. కమిషన్‌కు విస్తృత అధికారాలున్నాయి.
రాజ్యాంగపరంగా, చట్టపరంగా, ప్రభుత్వపరంగా మహిళలకు కల్పించాల్సిన రక్షణ, దాని అమలును పరీక్షించి పర్యవేక్షించడం మహిళా కమిషన్ అధికారాల్లో ముఖ్యమైనది. మహిళల అభ్యున్నతికి పాటుపడే విధంగా వారికి సంబంధించిన రాజ్యాంగ రక్షణ సమర్ధవంతంగా అమలయ్యేలా సలహాలు, సూచనలు ఇవ్వడం. మహిళా సంక్షేమ సంబంధిత అంశాల్ని సమీక్షించి చేయాల్సిన సవరణలను సూచించడం. మహిళా హక్కుల ఉల్లంఘన జరిగినపుడు, వారి అభివృద్ధికి సంబంధించిన చట్టాలు అమలుకాని సందర్భాలలో, వారి సమస్యలు పరిష్కరించే ప్రయత్నంలో ఈ కమిషన్ తనకుతానుగా (సుమోటోగా) స్వీకరించి జోక్యం చేసుకోవడం. మహిళల సాంఘిక, ఆర్ధికాభివృద్ధికి చేయాల్సిన ప్రణాళికలకు సంబంధించి ప్రభుత్వానికి సలహాలివ్వడం. బాల్య వివాహాల నిరోధం, వరకట్న నిషేధచట్టం అమలు, వివాహ, ఆస్తి తగాదాల కేసుల్ని పరిష్కరించడం, సెమినార్లు, వర్క్‌షాపులు నిర్వహించి మహిళల సమస్యల పట్ల సమాజంలో చైతన్యం కల్పించడం. జైళ్ళు, ఇతర నిర్బంధ కేంద్రాలను తనిఖీ చేసి అక్కడ మహిళలకు కనీస సౌకర్యాల ఏర్పాటు కోసం అధికారులకు అవసరమైన సూచనలివ్వడం.
ఇంతటి విశేష ప్రాధాన్యతగల మహిళా కమిషన్ని రెండేండ్లుగా ప్రభుత్వం పక్కనబెట్టడం సమంజసం కాదు. దేశంలోని 27రాష్ట్రాలలో మహిళా కమిషన్లు ఉనికిలో ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ప్రాధాన్యత దృష్ట్యా మహిళా కమిషన్‌కు చైరపర్సన్, సభ్యుల్ని నియమించాలి. అవసరమైన సిబ్బందిని కేటాయించాలి. సంస్థ నడిచేందుకు అవసరమైన బడ్జెట్ కేటాయించాలి. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాష్ట్ర మహిళా కమిషన్‌కు పాలకవర్గం ఏర్పాటు చేసేలా జాతీయ మహిళా కమిషన్ జోక్యం చేసుకోవాలి.
- టి. జ్యోతి