Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్లారెడ్డి
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఎస్‌పీఎంలలో పనిచేసే కార్మికులను పట్టించుకునేవారు లేరు. ఇందులో పనిచేస్తూ వయసు అయిపోతున్నవారికి కనీసం పీఎఫ్, ఐడీ కార్డులు లేవు. వీరు కాంట్రాక్టర్ల ఆధీనంలో పనిచేస్తున్నారు. నిరంతర కరెంటు సరఫరాలో ముఖ్యభూమిక పోషించే వీరు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. అత్యవసరమై సెలవులు లేవు పైగా గార్హజరైతే జీతంలో కోతవిధిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల రిపేర్లు చేస్తున్న కార్మికులు తెలంగాణ రాష్ట్రంలోనైనా తమకు గుర్తింపు వస్తుందని ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. కరోనా అత్యవసర సమయంలోనూ పనిచేస్తున్నా ప్రభుత్వం గుర్తించలేదు.
విద్యుత్ శాఖ రైతులకు 24 గంటల కరెంట్‌ను అందిస్తుంది. ఇందులో ఈ కార్మికుల పాత్ర ఎంతో ముఖ్యమంది. ఎస్‌పీఎంలలో 25 ఏండ్లుగా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పటికీ కనీసం పీఎఫ్ లేదు. ఎస్‌పీఎంలకు సెలవులు అనేవి ఉండవు. నెలంతా పనిచేయాలి. అత్యవసరం అయి సెలవు పెడితే వేతనంలో కోత విధిస్తారు. ఇక పంటల సీజన్‌లో ట్రాన్స్‌ఫార్మర్లను వెంటనే రిపేర్లు చేయాల్సి ఉంటుంది. దీంతో రాత్రి, పగలు అనే తేడాలేకుండా వీరితో పనిచేయిస్తారు. హెచ్‌పీ, ఎల్‌వీ వైండింగ్ పనిచేసేవారు గంటల తరబడి నిలబడి పనిచేయాలి వస్తుంది. ఈపని చేసే వారికి తరుచూ అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. వచ్చే కొద్దిపాటి వేతనంలో వైద్యం కోసం ఖర్చుచేయాల్సి వస్తుంది.
పీఎఫ్‌లేదు..
విద్యుత్ శాఖలో స్పెషల్ పార్ట్స్ మెకానిజం (ఎస్‌పీఎం) విభాగాన్ని కాంట్రాక్టర్లకు టెండర్ ద్వారా అప్పగిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 8 ఎస్‌పీఎంలు ఉన్నాయి. ఒక్కో ఎస్‌పిఎంలో 7 నుంచి 8 మంది కార్మికులు పనిచేయాల్సి ఉంటుంది. కానీ సరిపడా లేరు. పైగా 25ఏండ్లుగా పనిచేస్తున్నవారికి రూ.10నుంచి 12వేల వరకు వేతనం ఇస్తున్నారు. ఈఎస్‌పీఎంలలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5000 మందికిపైగా కార్మికులు పని చేస్తున్నారు.
స్వరాష్ట్రంలోనూ నెరవేరని ఆశలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎలాగూ తమ బతుకులకు గుర్తింపు లేకపోవడంతో స్వరాష్ట్రం వచ్చిందని ఇక బంగారు తెలంగాణలో తమకు గుర్తింపు లభిస్తుందని ఆశపడ్డారు. ఏడేండ్లు కావస్తున్నా వారిని పట్టింకున్నవారు లేరు. దీంతో గతసంవత్సరం వీరు హైదరాబాద్‌వెళ్లి ట్రాన్స్ సీఎండీని కలిశారు. అయినా పట్టించుకోలేదు. లాక్‌డౌన్‌లోనూ పనులు చేస్తున్నా గుర్తింపులేదు.
కాంట్రాక్ట్ పద్ధతితో ప్రభుత్వ సొమ్ము దోపిడీ
విద్యుత్ శాఖ ద్వారా ఎస్‌పీఎంల నిర్వహణకు కాంట్రాక్టర్లకు టెండర్లను పిలిచి అప్పగిస్తున్నారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వ సొమ్ము కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కాంట్రాక్టర్లకు అప్పగించుకండా ఔట్ సోర్సింగ్ పద్ధతిన లేక కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగులను నియమిస్తే ప్రభుత్వ సొమ్ము మిగలడంతోపాటు కార్మికులు లబ్దిపొందుతారు.