''ప్రపంచ ఆరోగ్యసంస్థ యాంటీ బయాటిక్స్‌ను విచ్చలవిడిగా వాడడం తగ్గించాలని నిర్ణయించింది. మే 2015న 68 వ ప్రపంచ ఆరోగ్య మహాసభ సందర్భంగా యాంటీ బయాటిక్స్ దుర్వినియోగం వల్ల కలుగుతున్న దుష్పరిణామాలపై సమాచారం ఇవ్వడం, శిక్షణ ఇవ్వడం, యాంటీ బయాటిక్స్ నిరోధకత సంబందించిన విద్యను అందించడమే ముఖ్య ఉద్దేశంగా నిర్ణయించింది .''
''ఔషధ, ఆరోగ్య శాస్త్రవేత్తలు , ఫార్మకాలజిస్ట్ లు, క్లీనికల్ ఫార్మసిస్ట్ లు, వైద్యులు యాంటిబయాటిక్ రెసిస్టెన్స్ ప్రమాదం గురించి తెలుపుతూ, యాంటీబయాటిక్స్ వ్యాప్తిని తగ్గించేలా ప్రజల్లో అవగాహన పెంచడం, యాంటీ బయాటిక్స్‌ను సక్రమంగా వినియోగించుకునేలా ప్రచారం నిర్వహించాలని తెలిపింది.''
1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్‌ను కనుక్కున్న తరువాత క్రమంగా యాంటిబయాటిక్స్ అభివృద్ధి పెరిగింది. రకరకాల బాక్టీరియాను మట్టుబెట్టడం సులువైంది.
''ప్రపంచ ఆరోగ్య వ్యవస్థకు ఇప్పుడు పెద్ద సవాలుగా నిలిచిన సమస్య యాంటి బయాటిక్ రెసిస్టెన్స్.''
యాంటిబయాటిక్స్‌ని కనుక్కోవడం ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతం. అవి లేని రోజుల్లో చిన్నపాటి జబ్బులు కూడా ప్రాణాంతకంగా మారేవి కానీ అవే యాంటిబయాటిక్స్‌ని ఇప్పుడు విచ్చలవిడిగా వాడటం ఆందోళన కలిగించే విషయం. అలాంటి వాడకం వల్ల శరీరంలో నానా రకాల సైడ్ ఎఫెక్ట్స్ రావడం మాట అటుంచితే, అవసరమైనప్పుడు అసలు ఏ మందులు పనిచేయని పరిస్థితి వస్తుంది. దీనినే ''యాంటిబయాటిక్స్ రెసిస్టెన్స్'' అని అంటారు.
యాంటిబయాటిక్స్ రెసిస్టెన్స్ - ఒక సామాజిక విషాదం :
తుమ్మితే.. యాంటిబయాటిక్....
దగ్గితే.. యాంటిబయాటిక్....
నీరసానికీ యాంటిబయాటిక్....
ఆయాసానికీ యాంటిబయాటిక్....
ఒళ్ళు నొప్పులకు యాంటిబయాటిక్...
వైరల్ జ్వరానికీ యాంటిబయాటిక్ ఇలా అనారోగ్య సమస్య చిన్నదైనా, పెద్దదైనా యాంటిబయాటిక్ తప్పక వాడుతున్నారు. దాంతో అప్పుడే పుట్టిన పిల్లల్లో సైతం యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ లక్షణాలు ఉంటాయి.
సాధారణ సిజేరియన్ ఆపరేషన్ సమయంలో కూడా ఇన్‌ఫెక్షన్ ప్రబలి, చికిత్సకు లొంగని మొండి వ్యాధిగా పరిణమించవచ్చు.
యాంటిబయాటిక్స్ - దుష్ప్రభావాలు :
ఈ యాంటిబయాటిక్స్ హానికర అలర్జీలు, విరేచనాలు, గుండె జబ్బులు, కండరాల సమస్యలు వంటి దుష్ప్రభావాలు కలుగజేస్తాయి. శరీరంలోని కాలేయం వంటి అవయవాల మీద ఈ యాంటి బయాటిక్స్ ప్రభావం పడి, అది జాండిస్ వంటి వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది. ఉదాహారణకు కొన్ని యాంటిబయాటిక్స్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్..
- సల్ఫోనామైడ్స్ - మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడేలా చేస్తుంది
- సెఫలాస్పోరిన్స్ - రక్తం గడ్డ కట్టే శక్తి కోల్పోవడం
- టెట్రా సైక్లిన్స్ - సూర్యరశ్మి పడకపోవడం.
యాంటీ బయాటిక్స్ - డయేరియా
స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాల యానికి చెందిన స్కూల్ ఆఫ్ మెడిసిన్ వారు చేసిన పరిశోధనల ప్రకారం యాంటీ బయాటిక్స్ ట్రీట్ మెంట్ వల్ల శరీరంలో షుగర్ శాతం పెరుగుతుంది. అలాగే డయేరియా కు యాంటీబయాటిక్స్ ట్రీట్ మెంట్ చేయడం వల్ల హానికారక బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. హానికారక బ్యాక్టీరియా శరీరంలో చక్కెరను అభివృ ద్ధి చేస్తుందని పేర్కొన్నారు.
యాంటిబయాటిక్‌కు కూడా లొంగని సూపర్‌బగ్‌లు : యాంటీ బయాటిక్స్ మందులను ఎక్కువగా వాడే దేశాల్లో మనదేశం ప్రపంచంలో నాలుగో స్థానం. వీటి వాడకం 2,633 టన్నుల నుంచి 2030నాటికి 88 శాతం మేర పెరుగుతుందన్నది 'సైన్స్' పత్రిక అంచనా. 78 శాతం మంది గత 10 నెలలుగా యాంటి బయాటిక్స్ వాడుతున్నామని చెబుతున్నారు. మన రాజధాని ఢిల్లీ నగరానికి సూపర్ బగ్ అని పేరు పెట్టారు. మెటల్లో బీటా లాక్టామెస్-1 (ఎన్డీఎం-1) 2010 లో ఒక స్వీడిష్ రోగి భారత్ నుంచి వచ్చి నప్పుడు వ్యాప్తిచెందిందని బ్రిటిష్ పరిశోధకులు ప్రకటించారు. ఎన్ డీఎం-1 అనేది అన్ని యాంటీ బయాటిక్స్ నిరోధించగలదని తేలింది.
కోళ్ల మాంసం ద్వారా మనుషుల్లోకి కొలిస్టిన్ : మనుషులకు కూడా వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన కొలిస్టిన్ యాంటిబయాటిక్ ను కోళ్లకు ఇస్తూ కొన్ని ఫార్మా కంపెనీలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. మనుషులకు చివరి ఆశగా ఇవ్వాల్సిన కొలిస్టిన్ ను కోళ్ల బరువు పెంచే ఔషధంగా కొన్ని వెటర్నరీ మందుల తయారీ కంపెనీలు పౌల్ట్రీలకు సరాఫరా చేస్తున్నాయి. ఆ కోళ్ల మాంసం తినడం ద్వారా కొలిస్టిన్ మనుషుల్లోకి చేరుతోంది. వివిధ వ్యాధికారక క్రిములు ఇప్పటికే ఆ యాంటిబయాటిక్ కు విరుగుడును తయారుచేసు కున్నాయి. దీంతో ఇప్పటిదాక తయారు చేసిన ఏ యాంటిబయాటిక్‌కు కూడా లొంగని సూపర్‌బగ్‌లు ఇండియాలో బయటపడుతున్నాయి.
- దేశవ్యాప్తంగా యాంటి బయాటిక్స్ మందుల వాడకం ప్రమాదకర స్థాయికి చేరిందని ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది.
- ప్రకృతి సహజంగా కొన్నసార్లు అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటికి చికిత్స కూడా ప్రకృతి సిద్ధంగా ఉంటే ఆరోగ్యానికి మంచిది. అవసరమైన వాటికి మాత్రమే యాంటిబయాటిక్స్ వాడటం ఉత్తమం.
- డా. ఆకుల సంజరు రెడ్డి, ఫార్మకాలజిస్ట్,
మెంబర్, తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్
Authorization