- డిసెంబర్ 1 ఎయిడ్స్ నివారణ దినోత్సవం
శరీరంలోకి వివిధ కారణాలతో ప్రవేశించి నెమ్మదిగా ప్రాణాలను హరించే వైరస్ హెచ్‌ఐవి. కొన్ని దశాబ్దాలుగా ఈ వ్యాధిని తగ్గించే మందులు కనుగొనే ప్రయత్నాలు యుద్ధప్రతిపాదికన జరుగుతున్నా ఫలితాలు ఆశాజనకంగా మాత్రం లేవు. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రతిఒక్కరు అవగాహన పెంచుకోవాలి.
హెచ్.ఐ.వి (హ్యూమన్ ఇమ్మ్యునోడెఫిసియెన్సీ వైరస్) వైరస్ కారణంగా ఎయిడ్స్ వస్తుంది. ఎయిడ్స్ (AIDS) అరటే ఎక్యైర్డ్ ఇమ్యూన్ డెఫీసియన్సీ సిండ్రోం. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని హరిస్తుంది. హెచ్‌ఐవి వైరస్ ఉన్న అందరికీ ఎయిడ్స్ ఉన్నట్లు కాదు. శరీరం లోపల హెచ్‌ఐవి వైరస్ ఉన్నా కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆరోగ్యంగానే కనిపిస్తారు. వారికి ఎప్పుడయితే ఆరోగ్యం నశిస్తుందో అప్పుడు ఎయిడ్స్ సోకినట్టు భావించాలి. శరీరంలో హెచ్‌ఐవి వైరస్ ఉన్నట్లయితే వారిని హెచ్‌ఐవి పాజిటివ్ అని పిలుస్తారు.
నిర్ధారణ పరీక్షలు
హెచ్.ఐ.వి.కి చేసే పరీక్షలలో ముఖ్యమైనవి 1. ట్రైడాట్,2.వెస్ట్రన్ బ్లాట్, 3.సి.డి సెల్ కౌంట్.
ట్రైడాట్ : ఎలీసా టెస్ట్స్ లో ఇది మొదటిది. శరీరములో ప్రవేశించిన 'హెచ్‌ఐవి' క్రిములకు ప్రతిస్పందన కణాలు (Antibodies) తయారవడానికి 3-6 నెలలు పడుతుంది. అప్పుడే ఈ పరీక్ష ద్వారా ఎయిడ్స్‌ను గుర్తించవచ్చు. 'హెఐవి' ఉందా? లేదా? అని మాత్రమే తెలుస్తుంది .
వెస్ట్రన్ బ్లాట్ : హెచ్.ఐ.వి నిర్ధారణ కోసం ఉపయోగించే పరీక్ష ఇది.
సిడి4 కణాల సంఖ్య : రోగనిరోధకతకు రక్తంలో సిడి4 అనే రకం తెల్ల రక్తకణాలు ఎంతో అవసరం. అయితే హెచ్‌ఐవీ ఈ సిడి4 కణాలను చంపేస్తుంది. ఒక మైక్రోలీటరులో 200 కన్నా తక్కువ సిడి4 కణాలు ఉన్నట్లయితే అప్పుడు ఎయిడ్స్ సోకినట్టు
కారణాలు..
- రక్తం ద్వారా, హెచ్‌ఐవి పాటిజివ్ వ్యక్తుల నుంచి సేకరించిన రక్తం ఎక్కించడం
- పచ్చబొట్లు, సురక్షితంగా లేని సూదులు ఒకరి కన్నా ఎక్కువ మందికి ఉపయోగించడం
- లైంగిక సంపర్కం వలన, ఒకరి కన్నా ఎక్కువ మందితో లైంగిక సంబంధం కలిగి ఉండటం.
హెచ్ ఐ వి లక్షణాలు
హెచ్‌ఐవి వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశించినా రోగ లక్షణాలు బయటపడడానికి పదేండ్లు పడుతుంది. ఈ పదేండ్లు మనిషి ఆరోగ్యంగానే ఉంటారు. కానీ, రోగాన్ని వ్యాప్తి చేస్తారు. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొన్ని నెలల (కనీసం 3 నుండి 6 నెలల )వరకు రక్త పరీక్ష ల ద్వారా వైరస్ జాడ తెలియదు.
- ఆకలి తగ్గిపోవుట, అలసట, నోటి పూత, చర్మ వ్యాధులు, జ్వరం, నీరసం, నీళ్ళ విరేచనాలు, పది శాతం బరువుని కోల్పోవడం, గొంతు కింద గ్రంథుల వాపు ఒక్కసారి మనిషి శరీరంలొ హెచ్ ఐ వి వైరస్ ప్రవేశించాక కొందరికి పై లక్షణాలలొ కొన్ని కనబడి కొద్దిరోజుల్లో తగ్గిపోవచ్చు. కొందరిలొ అసలు ఎలాంటి లక్షణాలు కనపడకపొవచ్చు. హెచ్ ఐ వి వైరస్ చాల నెమ్మదిగా, బద్దకంగా వ్యాపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు హెచ్ ఐ వి టెస్ట్ చేసుకొని నిర్ధారించుకోవాలి.
చికిత్స..
ఒక్క సారి చికిత్స ప్రారంభించిన తర్వాత చికిత్సను నిలిపివేయడం అత్యంత ప్రమాదకరం ఒక్కసారి గనక చికిత్స ప్రారంభిస్తే జీవితాంతం మందులు వేసుకోవాలి. ప్రస్తుతానికయితే ఎయిడ్స్‌ని పూర్తిగా నిర్మూలించటానికి ఎటువంటి మందు కానీ టీకా కానీ తయారు చేయలేదు. కానీ దాని తీవ్రతని తగ్గించటానికి మందులు ఉన్నాయి. శాస్త్రజ్ఞులు ఎప్పటికప్పుడు హెచ్‌ఐవితో పోరాడటానికి కొత్త కొత్త మందులను కనిపెడుతూనే ఉన్నారు. సరియైన సమయంలో ART మందులు క్రమం తప్పకుండా వాడితే ఎక్కువ ఏండ్లు జీవించవచ్చు. జబ్బు రాకుండా నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. లైంగిక సంపర్కం సమయంలో సురక్షిత విధానాలు పాటించడం వల్ల చాలావరకు హెచ్‌ఐవి వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు.
జాగ్రత్తలు..
-డాక్టర్ సూచనల మేరకు సమయం ప్రకారం మందులు వేసుకోవాలి. జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లును మానుకోవాలి. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. డాక్టర్ సూచన మేరకు వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
శిశువులలో ..
యునిసెఫ్ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ మూడువందల మంది చిన్నారులు ఎయిడ్స్, ఎయిడ్స్ సంబంధిత జబ్బులతో మరణిస్తున్నారు. ఎయిడ్స్ సోకిన చిన్నారుల్లో సగం మందికి మాత్రమే చికిత్స అందుతుంది. సాధారణంగా హెచ్‌ఐవి సోకిన తల్లులకు పుట్టిన బిడ్డలకు హెచ్‌ఐవి సోకిందో లేదో తెలుసుకోడానికి కనీసం 18 నెలలు వ్యవధి కావాలి. సహజప్రసవం ద్వారా 30శాతం, సిజేరియన్ ద్వారా ఒకశాతం, హెచ్‌ఐవి సోకిన తల్లి పాలు తాగడంతో10-15శాతం చిన్నారులకు ఈ వైరస్ సోకుతుంది. హెచ్‌ఐవి ఉన్న మహిళలు గర్భిణిగా ఉన్నపుడు తప్పనిసరిగా 'ఎ.అర్.టి.' మందులు వాడాలి.
- డాక్టర్ లక్ష్మణ్ రావు (ఎం.బి.బిఎస్)
మల్లునరసింహా రెడ్డి స్మారక ప్రజా వైద్యశాల
ఎం.హెచ్.భవన్, అజామాబాద్, హైదరాబాద్
Authorization