Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాండూరు
రోడ్లు బాగులేక ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే రోడ్ల నిర్మాణాలు, మరమ్మత్తు పనులు చేపట్టాలని సీపీఐ(ఎం) వికారాబాద్ జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు. రోడ్ల అస్తవ్యస్తంపై పర్యటనలో భాగంగా ధరూర్, కోట్‌పల్లి , పెద్దేముల్, తాండూర్ ప్రాంతాల్లో నాయకులతో కలిసి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణలోని వికారాబాద్ నుంచి తాండూర్ వరకూ రోడ్లు ఎప్పుడు ఎక్కడ ఏమీ అవుతుందో అర్థం కానీ పరిస్థితి నెలకొందన్నారు. రోడ్ల నిర్మాణం చేపట్టడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఈ రోడ్ల వల్ల ఇద్దరు మృతిచెందారని, వారి కుటుంబాలకు ప్రభుత్వం తక్షణం రూ. 10 లక్షలు ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లాలో రైతులకు యూరియా సకాలంలో అందక రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులు ఎత్తివేయడం సరైంది కాదన్నారు. కరోనాను నియంత్రించి ప్రతి కుటుంబానికి రూ. 7500లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా మృతిచెందిన వారికి రూ. 10లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించి, కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని ప్రయివేటు, కాంట్రాక్టు పద్దతిలో కళాశాల, పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు, లెక్చరర్స్‌కు పెండింగ్ వేతనాలు ఇచ్చి, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం రూ. 21 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 20 నుంచి 26 వరకు జరిగే రాష్ట్ర సీపీఐ(ఎం) కార్యక్రమాలు, సర్వేలను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అర్. మైపాల్, కే శ్రీనివాస్, యు బుగ్గప్ప, పి.శ్రీనివాస్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.