Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సంఘాల డిమాండ్
- డీఎస్పీకి వినతి
నవతెలంగాణ-పరిగి
దళిత ఆర్‌ఐ కిరణ్ కుమార్‌ని కులం పేరుతో దూషించిన పరిగి ఎంపీపీ అరవింద్ రావును వెంటనే అరెస్ట్ చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. శనివారం సీపీఐ(ఎం),కేవీపీఎస్, సీపీఐ, వైసీపీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో డీఎస్పీ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆర్డీఓ ఆదేశాల మేరకు ఆర్‌ఐ కిరణ్, మండల సర్వేయర్, వీఆర్వో కలిసి రంగాపురం గ్రామంలోని సర్వేనెంబర్ 18లో ఉన్న భూమిని పంచనామా చేయడానికి వెళ్లాడని అన్నారు. పంచనామా పూర్తి చేసుకొని కార్యాలయానికి వచ్చిన వెంటనే అగ్రకుల పెత్తందారీ అయిన పరిగి ఎంపీపీ అరవింద రావు తాసిల్దార్ కార్యాలయంకు వచ్చి పంచనామా పత్రాలను చించివేశారు అని అన్నారు. అంతేకాకుండా నాకు తెలియకుండా ఎలా పంచనామా చేస్తావని ఆర్‌ఐ కిరణ్ కుమార్ ని కులం పేరుతో దూషించడమే కాకుండా, నీ అంతు చూస్తాం అని బెదిరించాడని అన్నారు. ఎంపీపీ అరవిందరావుపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో.. దళిత ప్రభుత్వ ఉద్యోగి ఆర్‌ఐ పై దాడి చేసిన అధికారపార్టీ ఎంపీపీ అరవిందరావు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పరిగి మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి అన్నారు. పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉన్నత అధికారుల ఆదేశాల ప్రకారమే విధులు నిర్వహించిన ఆర్‌ఐ దాడి చేయడం దుర్మార్గం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న నరసింహులు, మణిపాల్, ఆంజనేయులు, వెంకటేష్, మోహిజ్, నరసింహారావు, అశోక్ రెడ్డి, బాబయ్య తదితరులు పాల్గొన్నారు.