Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శంకరపల్లి
శీతాకాలం వచ్చిందంటే చాలు ప్రకృతి మంచు దుప్పటి కప్పుకుని ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంటుంది. కానీ దాంతో పాటే వణికించే చలి వెన్నంటే ఉంటుంది. చలి నుంచి రక్షణ పొందేందుకు అనేక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. ఇందులో ఏ మాత్రం అజాగ్రత్తగా వహించినా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, లేదంటే అస్వస్థతకు గురికాక తప్పదు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
చలికాలంలో ఉదయం ఎండ వచ్చేవరకు చిన్నపిల్లలు, వద్ధులు, ఆస్తమా వ్యాధిగ్రస్తులు బయటకు రాకూడదు. ఉన్ని దుస్తులతో పాటు శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే దుస్తులను ధరించాలి. తలకు మప్లర్, మంకీ టోపీలను విధిగా ధరించాలి. ఇండ్లల్లో సాధ్యమైనంత వరకు ఏసీలు వాడరాదు. సాయంత్రం, రాత్రివేళల్లో ద్విచక్ర వాహనాలను నడవకపోవడమే మంచిది. దుమ్ము, ధూళి వచ్చే ప్రాంతాల్లో తిరగకూడదు. జలుబు దగ్గు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి సూచనలను సలహాలను పాటించాలి. ధూమపానం చేసేవారి పక్కన ఉండవద్దు. చల్లారిన పదార్థాలను తినకూడదు అప్పటికప్పుడు వండిన వాటినే తినాలి.
ప్రబలే వ్యాధులు ఇవే..
చిన్నారులు ఉదయం సాయంత్రం వేళల్లో బయట తిరిగితే వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది స్వైన్‌ఫ్లూ, ఉబ్బసం, ఆస్తమా, వైరస్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి. కాలుష్యం పెరగడం వల్ల శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. చలికాలంలో సాధారణంగా జలుబు ,దగ్గు, తుమ్ములు, ఎరుపెక్కిన కళ్ళతో బాధపడటం వంటివి కనిపిస్తాయి.
చర్మవ్యాధులకు అవకాశం..
చలి ప్రభావం వల్ల చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖం, మెడ, చెవులు, చేతులు వంటి భాగాల్లో చర్మం పొడిబారుతుంది. పెదవులు పగలటం వంటివి జరుగుతాయి. దుమ్ము, ధూళితో చర్మ సమస్యలు తలెత్తుతాయి. చలికాలంలో వైద్యుల సూచనల మేరకు క్రీములు వాడాలి. చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. చలికి పిల్లల్లో వచ్చే జలుబు, దగ్గును అశ్రద్ధ చేస్తే నిమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యాధి వలన పక్కటెముకలు ఎగరేయడం, ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరుతుంది. దీంతో చిన్నారులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి చనిపోయే అవకాశాలు ఉంటాయి.
మంచినీరు ఎక్కువగా తాగాలి..
మామూలు కాలాల కంటే చలి కాలంలో దాహం తక్కువ వేస్తుంది. దీంతో చాలామంది నీరు తక్కువగా తాగుతారు. కానీ ఇది చాలా పొరపాటు. శరీరంలో ఉన్న మలినాలు బయటకు పోవడం రక్త ప్రసరణ సరిగా జరిగేందుకు నీరు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం ఐదు లీటర్ల నీటిని తాగాలని డాక్టర్లు చెబుతున్నారు. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి పాల ఉత్పత్తులు కూడా ఎక్కువగా తీసుకోవాలి.
రోగనిరోధక శక్తిని పెంచే కాలీఫ్లవర్..
వాతావరణ ప్రభావం శరీర వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. చలి అధికంగా ఉంటే శరీర వ్యవస్థలో అనేక మార్పులు వస్తుంటాయి. తినే ఆహారంలో కాలిఫ్లవర్ తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. జలుబు, ఫ్లూ వంటి వాటికి కాలిఫ్లవర్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...
చలి అధికంగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. చిన్నారులు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే వ్యాధుల బారిన పడతారు. కాళ్ల నొప్పులు, ఒళ్ళు నొప్పులు, జ్వరం, జలుబు, దగ్గు వస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. చలి అధికంగా ఉన్న రోజుల్లో పిల్లలను పాఠశాలకు పంపించక పోవడమే మంచిది. చికెన్ ఫాక్స్ వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ. జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
- డాక్టర్ రేవతి