Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంషాబాద్
పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందనీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని 560 గ్రామ పంచాయతీలకుగాను.. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో 106 ట్రాక్టర్లను శంషాబాద్‌లోని మినీ స్టేడియం మైదానంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వమూ చేయని సాహసోపేత నిర్ణయాలతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్నదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 రోజుల గ్రామ ప్రణాళికలో చేపట్టిన పనులతో గ్రామ పంచాయతీలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయని తెలిపారు. సర్పంచ్‌లు, పాలకవర్గ సభ్యులు, అధికారుల సమిష్టి కృషితో పనిచేస్తే పల్లెలు ప్రగతి పథంలో నడుస్తున్నాయన్నారు. ఈ ప్రగతిని నిరంతరం కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందుకే జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీకి పారిశుధ్యంతో పాటు ఇతర అవసరాలను తీర్చేందుకు ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ట్రాక్టర్ల పంపిణీ రెండో విడత ఈ నెల 31లోపు, మూడో విడత వచ్చే ఏడాది జనవరి 30 లోపు నిర్వహిస్తామని వెల్లడించారు. గ్రామ అభివృద్ధి పనుల్లో సర్పంచ్‌లు మరింత కీలకంగా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో గ్రామ పంచాయతీలు నిధుల కొరతను ఎదుర్కొనేవని, నేడు గ్రామాలకు అధిక నిధులిస్తూ ముందుకు తీసుకెళ్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం అండదండలు ఉండాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి, డీపీవో పద్మజారాణి, వైస్ జెడ్పీ చైర్‌పర్సన్ గణేష్, ఎమ్మెల్యేలు టీ ప్రకాష్‌గౌడ్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, అంజయ్యయాదవ్, జైపాల్‌యాదవ్, కాలె యాదయ్య, స్థానిక తహశీల్దార్ జనార్ధన్‌రావు, ఎంపీపీ దిద్యాల జయమ్మ శ్రీనివాస్, జెడ్పీటీసీ నీరటి తన్వి రాజు, కొలన్ మహేందర్‌రెడ్డి, జిల్లాలోని ఐదు మంది డీఎల్పీవోలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
శంషాబాద్ మండలానికి 1 ట్రాక్టర్..
మండల పరిధిలోని పాలమాకుల గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్‌ను సబితారెడ్డి పంపిణీ చేశారు. మిగతా 26 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు రావాల్సి ఉంది. పెద్ద గ్రామ పంచాయతీలు, చిన్న గ్రామ పంచాయతీలు కేటగిరిగా 15 హెచ్‌పీ, 35 హెచ్‌పీ సామర్థ్యంగల ట్రాక్టర్లను విభజించి ఆయా గ్రామ పంచాయతీలకు అందజేయనున్నారు.