Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతని పేరు ప్రవీణ్ . వృత్తిపరంగా పోలీస్. కుల పరంగా యాదవ్. అందునా ఉత్తరప్రదేశ్ యాదవ్.' ఖాకీ పొగర్ - కులం పవర్ 'ఈ రెంటినీ రంగరించి ప్రదర్శించాడు ప్రవీణ్ . ఫలితం... ఆడ- మగతో సహా ఓ దళిత కుటుంబం బట్టలు లేకుండా నడి బజార్లో పట్టపగలు ఊరేగుతున్న దృశ్యం ప్రపంచాన్ని భయకంపితం చేసేసింది.
దేశ రాజధాని ఢిల్లీకి అతి సమీపంలోని ఉత్తరప్రదేశ్ నోయిడా జిల్లాలో దన్‌కౌర్ పోలీస్ స్టేసన్ పరిధిలో సునీల్ గౌతమ్ కుటుంబం నివశిస్తూ ఉంది. దళితులైన సునీల్ కాయకష్టం చేసి కూడబెట్టుకున్న సొమ్మును గత బుధవారం రాత్రి దొంగలు దోచుకుపోయారు. షాక్‌కు గురైన సునీల్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతూ ఆడా-మగా- పిల్లా పాపలతో సహా సమీపంలోని పోలీస్ స్టేషకు చేరుకున్నారు.స్టేషన్ ఆఫీసర్ ప్రవీణ్ యాదవ్‌ను కలిసి తమగోడు వెల్లబోసుకున్నారు. కేసునమోదు చేసి తమకు న్యాయం చేయమని వేడుకున్నారు. ప్రవీణ్ యాదవ్ నేను కేసు నమోదు చేయనని ఖరాఖండీగా చెప్పేశాడు. దీంతో, '' కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయడం మీ బాధ్యత'' అని సునీల్ కుటుంబ సభ్యులు గుర్తుచేశారు.
అంతే, అబాధ్యతగా నడుచుకునేందుకు అలవాటు పడ్డ ఈ నాలుగో సింహం తన 'పరిధి' కింది పౌరులు, అందునా ఆఫ్ట్రాల్ దళితులు తనకు బాధ్యతను గుర్తుచేసేసరికి జూలు విదిల్చేసింది. తన ఖాకీ సైన్యంతో కలిసి సునీల్ కుటుంబాన్ని కొట్టుకుంటూ నడిబజారులోకి ఈడ్చుకొచ్చింది.
సునీల్ భార్యను, మరో మహిళను వందల మంది ముందు పూర్తి వివస్త్రలను చేసి కొట్టడం ప్రారంభించారు. అడ్డుపోయిన సునీల్ కూడా వివస్త్రను చేసి చెండాడుకుంటూ పట్టపగలు నడిబజార్లో నగ భారతాన్ని ఆవిష్కరించారు.
అప్పటికీ ఆ ఖాకీకి కసితీరలేదు. సునీల్, అతని భార్య, బంధువులపై అక్రమంగా క్రిమినల్ కేసులు బనాయించి జైలుకు పంపారు.
కుల-ధన- అధికార స్వామ్యాలు ప్రజాస్వామ్యాన్ని చెరబడితే పరిస్ధితి ఇలాగే ఉంటుంది. కాదంటారా?