Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
వాళ్ళి‌ద్ద‌రూ అంతే.. - రంగ‌నాయ‌క‌మ్మ‌ | సీరియల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సీరియల్
  • ➲
  • స్టోరి
  • Apr 22,2017

వాళ్ళి‌ద్ద‌రూ అంతే.. - రంగ‌నాయ‌క‌మ్మ‌

వచ్చిన రమేషే పళ్ళు తీసుకు వెళ్ళి వంటింట్లో కడిగి పెట్టాడు. తన స్నానం తను చేశాడు. ''అమ్మా! ఏం కూరలు ఇవ్వాళ? అమ్మా! చిట్టి చాలా బాగుంది'' అంటూ తనే కలగజేసుకుని తల్లితో మాట్లాడి చూశాడు చాలా సేపు.
చాయి ఇచ్చినప్పుడు మాత్రమే తల్లి, ''తాగు'' అని చెప్పి వెళ్ళింది.
''అమ్మా! చాయి మధ్యాహ్నం నువ్వు పెట్టకు! నేనే పెడతా! నేనే చేస్తాను సాయంత్రం కూరలు.''
భోజనాలు మౌనంగా జరిగాయి.
సాయంత్రానికి అమ్మ గారెలు చేసింది. కొడుకు కూడా వంటింట్లోనే తిరిగాడు. పనులు చేశాడు. వంటలన్నీ వున్నాయి, మాటలే లేవు!
''అమ్మా! నాతో మాట్లాడవా?'' అన్నాడు కొడుకు నాలుగు సార్లు.
ఇక, నాలుగో సారి అమ్మ నోరు విప్పింది. ''ఏం, మాట్లాడను? మాట్లాడాలంటే, 'నీ ఇంటికి వచ్చినప్పుడు అలా ఎందుకు చేశావు?' అనాలి అదే మాట్లాడమంటావా?'' అంది.
''అమ్మా! నీ ఇష్టం! మాట్లాడు!''
'''మాట్లాడూ, మాట్లాడూ, ఏం మాట్లాడను? నిన్ను సాధిస్తే నీకేం నచ్చుతుంది? మీకు దేవుడైనా తగువులు పెట్టలేడు! నీ పెళ్ళం మాటలు నువ్వూ వింటూనే వుంటావు. ఒక్క మాటకీ పట్టించుకోవేం? 'మనకి తగువు పెట్టడానికి వచ్చిందా మా అమ్మ?' అనలేవా? పెళ్ళాం ముందు నోరు విప్పవు! అమ్మ మీద దొంగతనం కట్టినా సరే, 'అయ్యో' అనవు! 'ఈ అమ్మ ఎందుకొచ్చింది ఇక్కడికి? ఏం చేస్తోంది?' అన్న ఆలోచనే రాదు నీకు! నోటి కొచ్చినట్టు పేలుతుంది. అసలు అక్కడ నాకేం జరిగిందో అన్నీ నీకు తెలుసా? నేను చెప్పానా? వాళ్ళ మమ్మీ నేతి సరుకు కాకపోతే ముట్టుకోదని చెప్పింది కూతురు. ఆ మమ్మీ నా ముందే రోజూ ఆరు అరిసెలు 'బాగా చేశారు, బాగా చేశారు' అంటూ తినేది. 'మీ మమ్మీ తినదన్నావేం?' అని నీ పెళ్ళాన్ని అడగలేదు. అడిగితే ఒప్పుకుంటుందా? 'మీరు తెచ్చారని మర్యాద కోసం తింటోంది' అనేస్తుంది. దాని నోటి కేవన్నా శుద్ధా బుద్ధా? - పోనీలే, నా సంగతి పక్కన పెట్టు! నిన్నయినా లెక్క చేస్తోందా అసలు? 'మీ అబ్బాయికి ఏమీ తెలీదు' అని నీ అత్త కూడా వాగింది. తనని కొడుకులు పట్టుకు తన్నినా, తన కొడుకులు ఉత్తములే అనుకుంటుంది ఆ మనిషి. ఎందుకీ మాటలు? అన్నీ నీకు తెలిసినవే!'' అంటూ తల్లి ఆ నాలుగు మాటలతో ఆపేసింది.
కొడుకు మౌనం! నోరు తెరవలేదు.
''ఏం? మాట్లాడవేం?''
''అమ్మా, నువ్వన్నవన్నీ నిజాలే.''
''నిజాలైతే నిజాలని చెప్పూ! నోరు తెరవ్వా? వెళ్ళు, ఈ గారెలు నాన్నకు ఇచ్చిరా! తర్వాత నువ్వు తిను! చాయి నువ్వే పెడతానన్నావుగా? తర్వాత తినేశాక పెట్టు! రుక్మిణత్తయ్య వచ్చినట్టుంది. ఆ తెల్ల గిన్నెలో గారెలున్నాయి, తీసికెళ్ళి ఇయ్యి!'' అంటూ కొడుక్కి పనులు పురమాయిస్తే, కొడుకు తల్లి దగ్గిర్నించి బైటపడ్డాడు.
అప్పుడే గారెల ప్లేటు పట్టుకుని తండ్రి ముందుకు ఒంటరిగా వెళ్ళడం! వెళ్ళి, ఆ ప్లేటు అక్కడ పెట్టేసి, ''చాయి పెడతా'' అంటూ వంటింట్లోకి పరిగెత్తాడు.
ఆ రాత్రి భోజనాలు కూడా మౌనాల తోటే జరిగాయి. ఆ భోజనాల దగ్గిరే తండ్రి, కొడుకుతో రెండు మాటలే అన్నాడు. ''ఏమిటి, నీ పెళ్ళానికి పొగరా, శాడిజమా?''
జవాబు లేదు!
ఆ మర్నాడు పది గంటల వేళకి దిగింది కోడలు కూడా! ఆమె దర్శనం అత్తమామల్ని ఆశ్చర్యపరిచింది.
''వొచ్చావా? రామ్మా, రా!'' అని ఎవ్వరూ ఆహ్వానించలేదు.
కోడలి చేతిలో వున్న పిల్లని తాత గారు ఎత్తుకుని లోపలికి తీసుకు వెళ్ళాడు. పిల్లకి నల్లపూసంత బొట్టు తప్ప మిగతా ముస్తాబు లేవీ లేవు.
పిల్లని కుంతల కూడా ఎత్తుకుంది. ''నేను గుర్తున్నానామ్మా చిట్టీ? నాయనమ్మని! మర్చిపోయావా? ఉంటావా నా దగ్గిర?'' అంటూ పిల్లని ముచ్చటగా పలకరించింది.
కొడుకు, భార్యకి చాయి కప్పు అందించాడు. ఇద్దరూ ఒక గదిలో కూర్చున్నారు. అత్త అటు పోలేదు, కోడలు ఇటు రాలేదు. కోడలు ఎందుకొచ్చిందో అత్తకీ, మామకీ, తెలియలేదు. ఏడాది నించీ ఇటు మొహం చూపని మనిషి!
కొడుకే, ఆమెని ''ఒక్కసారి రా! మా అమ్మతో కొంత గొడవ జరిగింది కాబట్టి నువ్వు ఒక్క సారి కనపడితే అది సర్దుకుంటుంది'' అంటూ మూడు నెలలుగా బ్రతిమాలి, వస్తానని ఒప్పించుకుని, తను ముందు వచ్చి వుంటాడని, ఇంట్లో వాళ్ళు ఊహించగలరు!
అత్త, కోడలి మొహం చూడలేదు కోడలు, అత్తని పలకరించలేదు.
శకుంతలమ్మ అప్పటికే కొడుకు సాయాలతో వంటంతా మౌనంగా చేసి వుంచింది. అన్నీ భోజనాల బల్ల మీదే వున్నాయి.
తల్లి, ''రమేష్‌!'' అని ఒక్క పిలుపుతో కొడుకుని పిలిచి ''చిట్టికి అన్నం పెట్టండి! బల్ల మీద మీగడ వుంది, చూడు! తర్వాత, మీరిద్దరూ తినండి! తర్వాతే మేం తినేది'' అని చెప్పి, తమ పడక గదిలోకి వెళ్ళిపోయింది.
చిట్టి భోజనం ముగిసింది. అది, మీగడతో పప్పుచారు అన్నం తింటూనే నిద్రకి పడింది. దాన్ని నాయనమ్మకి అప్పజెప్పి వచ్చాడు పిల్ల తండ్రి.
తర్వాత, పిల్ల తల్లిదండ్రుల భోజనాలు ముగిశాయి. మీగడ గిన్నిలో మిగిలిన మీగడంతా ఇద్దరూ కూరల్లో కలుపుకున్నారు.
వాళ్ళు లేచి గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత, పెద్ద వాళ్ళిద్దరూ వచ్చి తిన్నారు. తర్వాత, శకుంతలమ్మ టేబులు సర్దేసి గదిలోకి వెళ్ళిపోయింది.
కేశవయ్య చావిట్లోనే కుర్చీలో కూర్చుని కొడుక్కి ఫోనులో మెసేజ్‌ రాశాడు!
''రమేష్‌! మీరిద్దరూ ఒక సారి రండి! నేను కొంచెం మాట్లాడాలి!''
ఆ గది తలుపులు తెరుచుకున్నాయి. ఇద్దరూ కనపడ్డారు. కేశవయ్యకి కొంచెం దూరంగా వున్న కుర్చీల్లో పక్క పక్కన అంటుకుంటూ కూర్చున్నారు.
''మీరిద్దరూ బాగుంటున్నారామ్మా?'' అంటూ కేశవయ్య కోడల్ని మర్యాదగా పలకరించాడు. మర్యాదని మించిన శాంతం! సహనం! ఆయన సిద్ధాంతం అది!
శ్రోతలు మౌనాలు!
''పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత, వాళ్ళు సుఖంగా బ్రతుకుతున్నారంటేనే పెద్ద వాళ్ళకి సంతోషంగా వుంటుంది. సులోచన సంసారం మొదట్లో కొంచెం అవక తవకలతో నడిచింది గానీ, లోచన వివేకం వల్ల అంతా బాగుపడింది. మనోహర్‌ సంసారంలో వున్నవన్నీ అవక తవకలే! వాళ్ళు సర్దుకోకపోతే అవి అలాగే సాగుతాయి! అందుకే మీ సంగతి అడిగాను. మీరు బాగున్నారు కదా?''
కొడుకు మాట్లాడలేదు.
కోడలు, ''అత్తయ్య గారు చూశారు కదా అంకుల్‌!'' అంది
''అత్తయ్య గారు చెప్పడం కాదు. మీ మట్టుకు మీరే చెప్పాలి. ఏవైనా చికాకులుంటే పెద్ద వాళ్ళకి చెప్పుకుంటే, వాళ్ళు ఇవ్వగలిగే సలహాలేవైనా ఇస్తే ఇస్తారు.''
కోడలు, మామ గారి మాటలన్నీ తెల్లబోతూ వింటోంది. అయినా నవ్వు మొహం పెట్టింది. ''మేమిద్దరం వున్నంత ఫ్రెండ్స్‌లాగ ఏ కుటుంబంలోనూ వుండరు అంకుల్‌! ఆంటీకి చెప్పాను కదండీ, 'మా మధ్య దేవుడైనా తగువు పెట్టలేడ'ని చెప్పానండి!'' అంటూ కుడి చేతిని పైకి ఇంటి కప్పు వేపు ఎత్తింది, దేవుడు అటు ఉన్నాడని!
''చూడమ్మా! నువ్వు మాతో మాట్లాడాలంటే, మా పేర్లతో అయినా పిలువు గానీ, 'అంకుల్‌, ఆంటీ' అనకు! అవి మాకు వికారపెట్టే పిలుపులు! మమ్మల్ని 'అత్త గారూ - మామ గారూ' అనమనడం లేదు నేను. అది నీకు నచ్చకపోతే, మా పేర్లు మాకు వున్నాయి. కేశవయ్యగారూ అను! శకుంతలమ్మ గారూ అను! అది సరే, 'దేవుడైనా తగువు పెట్టలేడు' అంటావు. దేవుడే లేనప్పుడు లేని వాడు ఇంకేం తగువు పెడతాడు? మీరు బాగున్నామని చెపుతున్నావు, అది చాలు నాకు! ఈ మాట మా పిల్లవాడి నోటి వెంట వినడం కన్నా, నీ నోటి వెంట వింటేనే, దాన్ని నమ్మవచ్చు. వేరు వేరు కులాల వాళ్ళం కలిశాం. బంధువులం అయ్యాం! చూసే వాళ్ళు విస్తుపోయే లాగ వుండాలి, ఈ రెండు కుటుంబాలూ! వేరు కులాలు కలవడం అంటే, అందరూ భయపడిపోతారు. అలా బ్రతకలేమనుకుంటారు. మీలాగ కులాంతరంగా బ్రతికే వాళ్ళని చూస్తేనే ఆ భయాలు పోతాయి. ఒకే కులం పెళ్ళిళ్ళల్లో అయినా, కలహాలు రావని కాదు. కానీ, అవి కలహాల్లాగ కనపడవు. వేరు కులాలైతేనే, ఎంత చిన్న గొడవ వచ్చినా, 'అదుగో, వాళ్ళు అలా చేశారు కాబట్టే అలా అయ్యారు' అనుకుంటారు అందరూ. మళ్ళీ ఆ మార్పుకి ఎవ్వరూ సిద్ధపడరు. కులాంతర వివాహం అంటే, ఆ భార్యాభర్తలు సుఖంగా వుండాలన్నది ఒక్కటే కాదు, ఆ కులాల్లో దేనికీ తప్పు మాట రాకూడదు. 'ఆ కులం అబ్బాయిని చేసుకోకుండా వుండవలసింది' అని ఆ అమ్మాయికీ అనిపించకూడదు. 'ఆ కులం అమ్మాయిని చేసుకోకుండా వుంటే బాగుండేది' అని అబ్బాయికీ అనిపించకూడదు. అంటే, కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళ మీద ఒక బాధ్యత వున్నట్టు అర్ధం కాదా? వాళ్ళని చూసే వాళ్ళందరూ కులాల్ని మరిచి పోయేలాగ వుండాలి, వాళ్ళ ప్రవర్తన!'' - ఆ రకంగా, ఆ మామ గారి బోధన కోడలికీ, కొడుక్కీ, బాగా జరిగింది అరగంట సేపు.
రమేష్‌కి తండ్రి నించి కొత్త పాఠం నేర్చుకున్నట్టుగా అనిపించింది. తను, శ్యాముతో మరింత అన్యోన్యంగా వుండాలనిపించింది. అతనికి శ్యాము మొహం మీద కూడా నవ్వు కనిపించింది.
సాయంత్రం అవుతోంటే, ''ఇక వెళ్తాను'' అని బైల్దేరింది శ్యాము.
''అప్పుడేనా! బాగుండదు కదా?'' అన్నాడు రాము.
''ఫర్వాలేదులే. నేను వెళ్ళాలి. రేపు ఆదివారం. ఆంటీకి చెప్పి వస్తాను'' అంటూ ఆ గదివేపు వెళ్ళింది.
అత్త గారు బైటికి వస్తూ కనపడింది.
''ఆంటీ! నేను వెళ్తున్నానండీ!''
''సరేనమ్మా!''
గబ గబా ఇడ్లీలూ చాయిలూ అందాయి.
రమేష్‌ కూడా సంచులు సర్ది, కూతుర్ని ఎత్తుకుని బైల్దేరాడు. ''అమ్మా! నేను కూడా వెళ్తున్నాను.''
''అలాగే!''
బస్సు తొందరగా దొరికింది. రమేష్‌కి తన ప్రయాణం చాలా సంతోషం కలిగించింది. తల్లిగాని, తండ్రిగాని, కోడల్ని ఒక్క మాట అనలేదు! తండ్రి ఎంతో బాధ్యతతో చెప్పాడు! తన తల్లిదండ్రు లెప్పుడూ మంచి మార్గాలే చూపిస్తారు. ఎంతో సంస్కారవంతులు! శ్యాము కూడా రావడం చాలా మంచి పనైంది.
బస్సులో కూర్చున్నాక ఒక స్టేషను దాటి వుంటుంది. బస్సులో జనం పల్చగానే వున్నారు అక్కడక్కడా.
ఈ దంపతులు ఒకళ్ళని ఒకళ్ళు అతుక్కుని కూర్చున్నారు. పిల్ల, తల్లి ఒడిలో వుంది.
శ్యాము, రాము తొడ మీద చిన్న దెబ్బ వేసి, అతని భుజం వేపు వొంగి చెవి దగ్గిర మాట్లాడింది. ''మీ అయ్య భలే క్లాసు పీకాడులే?''
రాము తెల్లబోయాడు! అలాగే విన్నాడు! అలాగే ఉన్నాడు! తెల్లబోతూ!
''నాకు భలే నవ్వొచ్చేసింది రామూ! ముక్కు నలుపుకుని అలాగే కూర్చున్నాను. మీ అయ్యకి ఉపన్యాసాలివ్వాలని బాగా సరదా అనుకుంటా! పాపం, ఎవ్వరూ సభలకి పిలవరేమో!''
'' ..........''
''పెద్దవాళ్ళని సలహాలడిగితే మంచి మంచి సలహాలిస్తారంట! 'డబ్బు ఇబ్బందుల్లో వున్నాం, ఒక లక్ష రూపాయలు కావాలని' అడక్క పోయావా? ఏం సలహా ఇచ్చేవాడో? అబ్బా! భలే బోర్‌ కొట్టాడు!''
అప్పుడేం చెయ్యాలి ఆ భర్త? వాడు మనిషే అయితే? వాడిలో మనిషి తనమే వుంటే, ఏం చెయ్యాలి?
బస్సు తర్వాత స్టేషన్లో ఆగగానే, లేదా అంతకు ముందే ఎక్కడ ఆగితే అక్కడ లేచిపోయి, పెద్ద పెద్ద అంగలతో బస్సు దిగిపోవాలి! దిగిపోయి, ఆ కిటికీకి బైట నిలబడి, ''పిల్లని నాకిస్తావా, నువ్వే తీసుకుంటావా? నాకిస్తే, నీ డబ్బు అక్కర లేకుండా నేనే పెంచుకుంటాను. నువ్వు తీసుకుంటే, నా డబ్బు కూడా పంపిస్తాను. పిల్లని ఎప్పుడిస్తావో కబురు పంపు! అప్పుడొచ్చి తీసుకుంటాను'' అని, వాళ్ళూ వీళ్ళూ వింటారనే పరువు భీతి లేకుండా చక చకా చెప్పేసి, తన సంచి కూడా వదిలేసి, చక చకా నడిచి పోవాలి!
కాని, మన యువకుడిలో ఆ స్పందన లేదు! ఆ వివేకం శూన్యం! దాని 'ముద్దు' దొరికితే చాలు! ఏక శయ్య మీద, తనని పక్కకి చేరనిస్తే చాలు! అదీ కాకపోతే ఎందుకా సంబంధం?
తన భుజం మీదకు వాలి చెవిలో శ్యాము, ''మీ అయ్య'' అని గుస గుసలు పోతోంటే తెల్లబోయిన వాడు చప్పున తేరుకున్నాడు. కొంచెం నవ్వాడు. ''ఊరుకో!'' అన్నాడు. తనూ ఊరుకున్నాడు!
అయ్య బోధన, ఖతమ్‌!
రమేష్‌కి, హఠాత్తుగా బట్టలు సర్దుకోడం రాదు! హఠాత్తుగా బస్సు దిగడమూ రాదు!
ననన
బస్సు ఆగుతూనూ వుంది, కదిలి పరిగెత్తుతూనూ వుంది. మన రమేషు, భార్య మాటలు ముద్దు ముద్దుగా వింటూనే వున్నాడు.
''రామూ! నిన్న నువ్వు ఇటు మీ వూరు వచ్చేశావుగా? నేను మా పెద్దక్క దగ్గిరికి వెళ్ళా. వాళ్ళిద్దరూ నా గురించి ఎప్పుడూ ప్రేమగా ఆలోచిస్తూ వుంటార్లే......''
''వాళ్ళిద్దరూ ఎవరు?''
''అదే, మా డియర్‌ మమ్మీ, డియర్‌ సిస్టరూ!''
''అదా? ఏం ఆలోచిస్తారు నీ గురించి?''
''అదే, 'నువ్వు రెండేళ్ళు పెళ్ళి చేసుకోకుండా వుండవలిసిందే' అని ఆ ముచ్చటే మళ్ళీ మొదలు పెట్టారు. 'అప్పుడు చెప్పాం, విన్నావా?' అని నా మీద సాధింపు!''
రమేష్‌ కొంచెం మౌనం అయ్యాడు.
''వాళ్ళకి ఆ బెంగే పట్టింది రామూ!''
''నువ్వేమన్నావు మరి?''
''ఏమంటాను? ఏమో, రెండేళ్ళు ఆగితే ఏం జరిగేదో ఎవరికి తెలుసు? వాళ్ళు ఆశపడుతున్నట్టే జరిగేదేమో!''
అడిగిన దానికి చెప్పదు. మాట మారుస్తుంది.
రమేష్‌ నిరుత్సాహంగా అలాగే వుండిపోయాడు!
రమేష్‌ అమ్మ, ''నేను, నా పిల్లల్ని బాగానే పెంచాను'' అంటుంది గానీ, పెంచితే, రుచుల రుచుల వంటకాలతో తిండి బాగా కూరి పెంచిందేమో గానీ, చీమూ నెత్తుర్లు పోసి పెంచి వుండదా?
రమేష్‌ నాన్న, ''నేను, నా పిల్లలకి ఎన్నెన్నో సూత్రాలు, శాస్త్రాలు, నేర్పాను'' అంటాడు గానీ, నేర్పితే, ''దేవుడు లేడు, దెయ్యం లేదు'' అని నేర్పాడేమో గానీ, ''సిగ్గు వుండాలి, లజ్జ వుండాలి'' అని నేర్పి వుండడా?
తల్లిదండ్రులు, వాళ్ళకి తెలిసిన వేవో వాళ్ళు నేర్పి వదిలేసినా, తన స్వంత తలని తను మోసుకుంటూ తిరిగే రమేష్‌, తలని మొయ్యడం సింగారం కోసం కాదనీ, అది కొంచెం ఆలోచించడానికి పనికొస్తుందనీ, ఆలోచిస్తూ వుండడా?
ఏమో మరి! ఊరు చేరే దాకా, బస్సు ఎక్కడా దిగకుండానే వుండిపోయాడు!
''రెండేళ్ళాగితే, నాకు ఒక గొప్పవాడు దొరికే వాడు. నా డబ్బుతో వాణ్ణి కొనేద్దును! తొందరపడి నిన్ను చేసుకున్నాను'' అని చెప్పేస్తోంది పెళ్ళం మణి!
అయినా, మొగుడు రత్నానికి, కోపం రావడం లేదు! ఆలోచన పెగలడం లేదు! కుంగిపోయే వేదన కలగడం లేదు! కాస్తే, పిసరంతే, ఆ కాస్సేపూ!
పైగా, కొత్త ఆలోచనని సృష్టిస్తాడు. ''నా పెళ్ళం అమాయకురాలు! పిచ్చి మేళం! తల్లి పాడు చేస్తోంది. తల్లి వల్ల! ఆ మాటలు నాతో చెప్పకూడదని తెలీనంత అమాయకురాలు! నేను తనని ఇంకా ప్రేమలో ముంచెయ్యాలి! నాన్న చెప్పాడు, అన్యోన్యంగా వుండాలని. కులాంతరం కదా?''
బస్సు దిగేప్పటికి అదీ కొత్త సృష్టి!
పెళ్ళం మీద తన బానిసత్వాన్ని, 'ప్రేమ' అనుకుంటాడు! తను భార్యని ప్రేమించే వుత్తముణ్ణి అనుకుంటాడు! అంతే గానీ, అసలు నిజం వేపు మొహం తిప్పడు. తను సిగ్గెగ్గులు లేని, చీమూ నెత్తుర్లు లేని, జంతు మానవుణ్ణి - అని తెలుసుకోడు!
ఉత్తమ తల్లిదండ్రులకు, క్రిమి కీటకాలు కూడా పుడతాయి!
ఊరు చేరుతోంటే అన్నీ మరుపులోకి పోయాయి. బస్సు దిగక ముందే కొత్త సంగతి ఒకటి వచ్చి పడింది. రమేష్‌కి, తమ్ముడి నించి ఒక మెసేజ్‌ వచ్చింది, ''డిఎస్సీ నోటిఫికేషన్‌ పడింది పేపర్లో, చూశారా?'' అని!
ఈ దంపతుల ఉద్యోగాలు కాంట్రాక్టులవే. గవర్నమెంటులోకీ, అందులోనూ పర్మనెంట్‌లోకీ, పోవాలనే ఆశలు ఎప్పుడూ వున్నాయి. డిఎస్సీ పరీక్షలు రాసి పేసైతే, ఆ ఉద్యోగాలు అందితే అందవచ్చు! ఎలాగూ వేసంకాలం సెలవులే. ఆ పరీక్షలకి కోచింగ్‌లు తీసుకోవచ్చు!
బస్సు దిగగానే రమేష్‌ గబ గబా నాలుగు పేపర్లు కొనుక్కొచ్చాడు. ఇద్దరూ అన్నిటినీ తిరగేసి చూశారు.
'''ప్రకటన', అన్నిటిలోనూ ఒక్క లాగే వుంటుంది. ఎందుకూ అనవసరంగా నాలుగు పేపర్లకి డబ్బు తగలేశావూ?'' అంది భార్య.
''పోనీలే, పేపర్లు చదువుకుందాం'' అన్నాడు భర్త.
ఇంట్లో పనులు మొదలుపెట్టారు.
రమేష్‌కి ఇంకేదో మెసేజ్‌ వచ్చింది.
కంగారుగా ఫోన్‌ తెరిచి చూశాడు.
తండ్రి నించి కబురు! ''డీఎస్సీ నోట్‌ చూడండి! ఇద్దరూ గవర్నమెంటు స్కూళ్ళకు పోవడం మంచిది. కోచింగ్‌కి వెళ్ళండి! నేను డబ్బు పంపిస్తాను.''
రమేష్‌, ఆ ఫోన్‌ని ఆమె మొహం మీద పెట్టాడు.
చదివింది. ''మీ అయ్య మనల్ని వదిలే లాగ లేడే! ఎంతిస్తాడేవిటి కోచింగ్‌కి వెళ్తే? అడుగు!''
రమేష్‌, ఆమె చేతిలోంచి ఫోన్‌ తీసుకుని ఆఫ్‌ చేసి పిల్లకి నీళ్ళు పోసే పనిలో పడ్డాడు.
రెండు రోజుల్లో కేశవయ్య, ఫోన్‌ ద్వారానే డబ్బు పంపించేశాడు.
''మా నాన్న డబ్బు పంపించేశాడు.''
''ఎంతా?''
''పదిహేను వేలు''
''ఏ మూల సరిపోతుంది హైదరాబాద్‌లో కోచింగ్‌కి వెళ్తే? మా మమ్మీ అయితే భలే నవ్వుతుంది.''
''అయితే, మా నాన్న డబ్బు వెనక్కి పంపించేస్తాను. ఎంత కావాలో అది మీ మమ్మీనే పెట్టమను!''
''అబ్బా! ఏం జోకావూ? ఆ జోకు లేవో మా మమ్మీ మీద కాదు, మీ అయ్య మీద వెయ్యి!''
''ఆయన దయతో ఇవ్వగలిగింది ఇచ్చాడు. అది నాకు సరిపోతుంది. నీకు కావలసింది నీ పద మూడు లక్షల్లోంచి తీసుకో! లేకపోతే, నీ జీతం లోంచి!''
''అదీ! నా డబ్బు మీదే నీ కళ్ళు! భార్యని అభివృద్ధి లోకి తేవాలంటే, అది భర్త బాధ్యత అని తెలీదా నీకు? సిగ్గు లేకుండా నా డబ్బు మాట ఎత్తకు ఎప్పుడూ.''
''మరి, నీ డబ్బునేం చేసుకుంటావు?''
ఆ ప్రశ్న ఎన్ని సార్లో!
''ఏదో చేసుకుంటాను, నా ఇష్టం!''
ఆ జవాబు కూడా అన్ని సార్లూ!
ఒకరి జంకు ఎన్ని సార్లో, ఒకరి పొగరు అన్ని సార్లూ! జంకుకి జవాబు పొగరే!
ఒక వారంలో రమేష్‌కి తమ్ముడి నించి కూడా పది వేలు అందింది. ఆ తమ్ముడికి ఏదో చిన్న బిజినెస్‌! అది తండ్రికి ఇష్టం లేదు గానీ, చిన్న కొడుకుది అదే దారి! అన్నకి తమ్ముడి సాయం!
ననన
కోచింగ్‌కి వెళ్ళే ఏర్పాటు జరిగి పోయింది. అక్కడ నెలన్నర ఉండాలి. సమ్మర్‌ సెలవులే కాబట్టి ఉద్యోగాలకు సెలవులు పెట్టే పని లేదు. రమేష్‌కి కాలేజీలో ప్రైవేట్‌ క్లాసులు చాలా వున్నా అవన్నీ వదులుకున్నాడు.
కోచింగ్‌కి బైల్దేరాలంటే, పిల్ల సంగతి?
''ఆశ్రమంలో పెడితే మా మమ్మీ చూస్తుంది గానీ, అక్కడ ఆరోగ్యం బాగుండదు. మీ అమ్మ గారు చూస్తారా రామూ?''
''తెలీదు నాకు. నువ్వే అడుగు! ఫోన్‌ చెయ్యి!''
''ఏం, నువ్వడగలేవా?''
''మా అమ్మ పెంపకం నచ్చవలిసింది నాకు కాదు, నీకు! నీకు నమ్మకం లేదుగా?''
''నేను అన్నానా అలాగ? అలాగైతే నేను కోచింగ్‌కి రానులే. నా ఉద్యోగం నాకు చాలు! నువ్వే వెళ్ళు!''
రాము, వాదం ఆపేశాడు. ఆ సాయంత్రం తల్లికి ఫోన్‌ చేద్దామా అనుకొని ఫోన్‌ తెరిచి కూడా మూసేశాడు.
''చిట్టిని మా వూరు తీసికెళ్ళి దింపేసి వస్తా!''
''మీ అమ్మ ఒప్పుకుందా? ఒప్పుకుంటేనే. లేకపోతే వద్దు!''
''ఒప్పుకోకుండా ఎలా తీసుకు వెళ్తాను? ఒప్పుకుందని వేరే చెప్పాలా?''
ఆ రోజే పిల్లతో బైల్దేరాడు. బస్సు దిగి ఇంటికి ధైర్యంగానే వెళ్ళాడు. ''మేం కోచింగ్‌కి వెళ్తాం రెండు రోజుల్లో. చిట్టిని ఇక్కడే ఉంచు అమ్మా!''
''అదేమిటి, నన్ను అడక్కుండా తీసుకొచ్చావు? దీని అమ్మ ఒప్పుకుందా? ఒప్పుకుంటేనే! లేకపోతే ఇక్కడ వొద్దు! నేను తిండే పెట్టలేదంటుంది.''
''ఒప్పుకుందిలే.''
'' 'లే' ఏంటి? తిన్నగా చెప్పు! ఆమెని నాకు ఫోన్‌ చేసి, నాతో చెప్పమను!''
అయిందే రమేష్‌ పని!
ప్రతీ అడుగూ రహస్యంగా వెయ్యాలనుకుంటాడు. దేనికీ చొరవ వుండదు, తెగింపు వుండదు. పెళ్ళం ఎలాంటిదో తల్లికి ఏ నాడూ చెప్పుకోలేదు. తల్లికి చెప్పడం కాదు, తనకే తెలీదు, పెళ్ళం ఎలాంటిదో! చురుకైంది, తెలివైందీ, అందమైందీ, ఆస్తిపరురాలూ కూడా! అలా తెలుసు! తన వూహలు అవి!
''ఏమిటి, మాట్లాడవు? తనే చెప్పిందా, నా దగ్గిర వుంచమని? ఆ మాట నాతో చెప్పమను!''
మళ్ళీ అయిందే రమేష్‌ పని!
పెళ్ళంతో ఫోన్‌ చేయిస్తాడా! చేయించగలడా?
ఇక, ఒక్క ముక్కన్నా తల్లికి చెప్పక తప్పలేదు.
''అమ్మా! మొదటైతే తనే అంది, 'మీ అమ్మ చూస్తుందా?' అంది. నీతో తననే మాట్లాడమన్నాను. మాట్లాడుతుందా? ఇక మొండి వాదం మొదలు పెట్టింది. తను అసలు కోచింగ్‌కి రానంది. ఇక నేనే తీసుకొచ్చాను చిట్టిని. తీసుకొస్తోంటే తను వొద్దన లేదు.''
''ఏవిటో! నువ్వు ఎప్పుడెలా వుండాలో అలా వుండవు. అయ్యో, ఇలాగైతే నీకు నిండు జీవితం ఎలా గడుస్తుంది నాన్నా? ఊళ్ళోనే తోడబుట్టిన అక్క వుంటే, ఆ సంబంధం కూడా తెంపేసుకున్నట్టు చేస్తున్నావు! అక్క దగ్గిరికి ఎందుకు వెళ్ళడం లేదు? ఏ ఇబ్బంది వచ్చినా చెప్పుకోవచ్చు కదా?''
''అది కాదమ్మా! నేను రెండు సార్లు ఫోన్‌ చేస్తే అక్క ఎత్తలేదు. మెసేజ్‌ పంపినా జవాబు ఇవ్వలేదు!''
''అవునూ, మీరు నా గురించి చాలా చెత్తగా చేశారని దానికి కోపం వచ్చింది. ఫోన్లు చేసి వూరుకున్నావు గానీ, దగ్గిరికి వెళ్ళి అంతా మాట్లాడుకోవద్దూ?''
''వెళ్తా! రేపే వెళ్తా!''
''వెళ్ళమని చెప్తేనే తెలిసిందా? లేకపోతే తెలీలేదా?''
నాయనమ్మ మనవరాల్ని ఎత్తుకుంది. నీళ్ళు పోసింది. తిండి పెట్టింది కూరలో మీగడ కలిపి.
అప్పటికి కేశవయ్య ఇంటికి వచ్చి అంతా విన్నాడు. మనవరాల్ని చూసి నవ్వాడు. ఎత్తుకున్నాడు. ''కులాతీతురాలు వచ్చిందా? కులాన్ని తన్ని పారేసిన వీర నారి వచ్చిందా!'' అంటూ మనవరాల్ని ముద్దులాడాడు. ''కుంతలా! నెలన్నర దాకా దీనితో కలసి బతకొచ్చు మనం'' అన్నాడు.
శకుంతల కొడుకుతో అంది. ''రేపు పిల్లని మళ్ళీ తీసుకు వెళ్ళిన తర్వాత, 'పిల్లకి తిండే పెట్టలేదు' అన్నా అనొచ్చు. అప్పుడేమంటావు నువ్వు?''
'''అయితే పిల్ల బరువు తగ్గిందో, పెరిగిందో, బరువు తూపించు' అంటాలే.''
శకుంతలమ్మ కుంగిపోయినట్టు చూసింది. '''బరువు కొల్చి చూడు' అంటావా? అంతకన్నా కోపం రాదా నీకు? కోపంగా అడగలేవూ?''
''అడుగుతానమ్మా! అన్నీ అడుగుతాను. బాగా వాదిస్తాను.''
''అయినా, వినదా?''
''వింటుందిలే చివరికి.''
ఆ చివరి మాటలన్నీ అబద్దం! అబద్దాలే రక్షణ మార్గాలు!
ననన
''అక్కా! మేం ఇద్దరం డిఎస్సీ కోచింగ్‌కి హైదరాబాదు వెళ్తున్నాం. చిట్టిని అమ్మ దగ్గిర దింపి వచ్చాను నిన్న.''
అక్కకి, తమ్ముడి దర్శనం!
''తెలుసు. అమ్మ చెప్పింది. ఇక్కడికి ఎందుకు వచ్చావు?''
''అలా అడుగుతావా? ఎందుకు వస్తాను? ఇంకా కోపమేనా నా మీద?''
''ఏం, ఎందుకు వుండదు కోపం? కోపం పోయేలాగ ఏమైనా చెప్పుకున్నావా?''
''అయితే, ఇప్పుడు అడుగు! చెపుతా!''
''నేనెందుకు అడగాలి? చెప్పవలిసింది వుంటే చెప్పుకో! అడగవలిసింది వుంటే అడుగుతా!''
''అది కాదక్కా! అప్పుడు అమ్మ వచ్చినప్పుడు, అమ్మని శ్యాము అంతగా ఏమీ అనలేదు. 'చిట్టే అన్నీ తినేసిందా?' అని ఆశ్చర్యపోతూ అడిగిందంతే. దాన్ని అమ్మ తప్పుగా అర్ధం చేసుకుంది. అదే కాస్త గొడవ అయింది.''
''ఇప్పటికీ నువ్వు అలాగే నమ్ముతున్నావా? 'పిల్ల అన్నీ తినేసింది' అని అమ్మ చెప్పినా, మళ్ళీ మళ్ళీ ఎందుకు అడిగింది? ఆమె అమ్మ మాట నమ్మలేదని కాదా?''
''అవును, చాదస్తంగా మళ్ళీ మళ్ళీ అడిగింది.''

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

02:48 PM

కనీస వేతనాన్ని రూ.19 వేలకు సిఫార్సు చేయడం సరికాదు..

02:38 PM

ఇంగ్లాండ్ క్రికెటర్లకు స్వాగతం పలికిన సుందర్ పిచాయ్

02:31 PM

మంత్రికి వినతిపత్రం అందజేసిన ఎస్సీ బాలుర హాస్టల్‌ విద్యార్థులు

01:56 PM

రైతులపై పెట్టిన కేసులపై ఏపీ హైకోర్టు స్టే

01:44 PM

మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ.. ఎగిసి పడుతున్న నీళ్లు..

01:42 PM

భారత్‌లో ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న టిక్‌టాక్‌

01:25 PM

భార్య కోసం టవర్ ఎక్కి భర్త హల్ చల్..

01:23 PM

ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు సజీవ దహనం

01:11 PM

దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది : జగదీశ్ రెడ్డి

01:06 PM

పాత వాహనాలపై గ్రీన్ టాక్స్‌కు ఆమోదం తెలిపిన కేంద్రం

01:06 PM

హాస్టల్ విద్యార్ధులు ఆందోళన చెందవద్దు : కొప్పుల ఈశ్వర్

01:03 PM

క‌రోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న క‌మ‌ల హ్యారిస్‌..!

12:58 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీ చేస్తాం: జ‌న‌సేన‌

12:54 PM

29న ఆచార్య టీజర్ విడుదల

12:40 PM

చెన్నై చేరిన ఇంగ్లండ్ క్రికెట్ జ‌ట్టు

12:38 PM

హెచ్4 వీసాదారులకు శుభవార్త..

12:30 PM

ఏపీ ప్రభుత్వ ప్రకటనలో తెలంగాణ లోగో

12:23 PM

బ్రిటన్​లో లక్ష మార్క్​ దాటిన కరోనా మరణాలు

12:20 PM

ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌

12:14 PM

జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించలేకపోయాం : సీఏ

12:09 PM

రైలు ఢీకొని యువ‌కుడు మృతి

12:01 PM

ఉగ్రవాదుల దాడిలో నలుగురు జవాన్లకు గాయాలు

11:46 AM

నాగార్జున సాగర్ కాలువలో ఈతకు వెళ్లిన కాంగ్రెస్ నేత గల్లంతు..

11:40 AM

నవ వధువు ఆత్మహత్య...

11:37 AM

దేశంలో కొత్తగా మరో 12వేల పాజిటివ్ కేసులు

11:34 AM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

11:33 AM

కరోనా టీకా Expiry Date.. 6నెలలు మాత్రమే..!

11:30 AM

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

11:25 AM

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

11:23 AM

గవర్నర్‌ను కలిసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.