''అయ్యో! నేనసలు వడ్డీ మాట లేకుండా హెల్ప్‌గా ఇవ్వాలనుకున్నాను మనో! మీకు ఎప్పుడు కావాలన్నా అడగండి! వెంటనే పంపిస్తాను.''
''థ్యాంక్స్ వదినా! అలాగే, ఉంటాను.''
ఆ ఫోన్‌ని ఆపిన తర్వాత, ''రామూ! నువ్వు మీ బ్రదర్ని అడిగావా? నేను అడగమన్నానే అది.''
''నేనేం అడగలేదు. నువ్వే అడుగుతా నన్నావుగా?''
''విద్యతో మాట్లాడుతూ ఒక సారి అతనితో కూడా అన్నాలే. 'సారీ' అనేశాడు. నువ్వు అడిగితే తప్పకుండా ఒప్పుకునే వాడే. బిజినెస్ మహిళగా వుండడం చాలా గ్రాండ్‌గా వుంటుంది రామూ!''
''నువ్వు, స్థలాలు కొనడం, అమ్మడం, చెయ్యాలనుకుంటున్నావు. దాన్ని రియల్ ఎస్టేట్ అంటారు. అదీ బిజినెస్ లాంటిదేగా?'
''అదేముందిలే. డైలీ సేల్స్ వుండే బిజినెస్ అయితే, డైలీ వర్కర్స్ వుంటారు చేతి కింద! అది వేరులే. నువ్వు అడుగు ఒక సారి మీ బ్రదర్ని. నాకసలు ఏదైనా స్కూలు పెట్టాలని వుంది. మనం టీచర్లమే. నడుపుకోగలం. కాని, అమ్మో! స్టూడెంట్స్‌తో చావాలి. వాళ్ళు చదవకుండా ఫస్ట్ మార్కులు రావాలంటారు. పెద్ద బిల్డింగ్ కావాలి. అదంతా పడలేం గానీ, ఇదే తేలిక, మీ బ్రదర్ని అడిగి చూడు!''
''అడిగినా, నీకు చెప్పినట్టే చెపుతాడు. 'సారీ' అన్నాడుగా నీతో?''
''మా కులాన్ని దృష్టిలో పెట్టుకున్నాడేమో! చాలా స్టైల్ ఒలకబోశాడులే.''
''శ్యామూ! నువ్వు ఎలాగైనా అనుగానీ, 'కులాల' మాట ఎత్తకు! అది మాత్రం మా ఇంటా వంటా లేదు.''
''లేకపోతే ఏమిటి? వదిన గార్ని హెల్ప్‌గా వస్తానంటే, పనికి రాదంటాడా? పెళ్ళాన్ని డైరెక్టర్‌గా పెట్టాడు. నన్ను చేర్చుకొంటే, నన్నూ ఒక డైరెక్టర్‌గా పెట్టాలని భయపడ్డాడేమో! 'చిన్న కులం డైరెక్టరేంటి?' అనుకుని వుంటాడు, అంతే.''
రమేష్ ఊరుకున్నాడు. కోచింగ్ పనుల్లో నెల దాటక ముందే శ్యామల, ''నాకీ కోచింగ్ వద్దూ, పాడూ వద్దు. అవతల నా జాబ్ పోయేలా వుంది! నేను మా హెడ్మాస్టర్‌తో వెంటనే మాట్లాడాలి'' అని ప్రకటించేసి బస్ ఎక్కేసింది.
శ్యామల ఉద్యోగం ప్రైవేట్ స్కూల్లోదే. అక్కడ ఏటా ఉద్యోగాలు ఊడుతూనే వుంటాయి. రేపు సెలవలు ముగిసిన తర్వాత, శ్యామల ఉద్యోగం ఊడబోతోందనీ, ఆ ఉద్యోగంలోకి హెడ్మాస్టర్ బంధువో ఎవరో రాబోతున్నారనీ, శ్యామలకి నాగరత్నం ఫోన్ ద్వారా తెలియగానే ఆ ప్రయాణం!
''నాగరత్నంతో నువ్వు మాట్లాడవుగా?'' అన్నాడు రమేష్.
''ఎందుకు మాట్లాడను? అప్పుడేదో అయింది. ఇక అదేనా? ఆమె మా స్కూల్లో క్లర్కు కదా? అక్కడి సంగతులన్నీ ఆమెకి తెలుస్తాయి.''
''శ్యామూ! మీ హెడ్‌మాస్టర్‌తో ఫోన్‌లో మాట్లాడరాదూ? ఇక్కడ ఇంత డబ్బు పెట్టాం. ఇది వదిలేసి పోతావా?''
''ఫోన్‌లో అస్సలు కుదరదు. అంత అవసరమైతే వాడికి ఓ యాభై వేలు లంచం కూడా పారేస్తా!''
''పోనీ, రేపు మాట్లాడి, రేపు రాత్రి మళ్ళీ బైల్దేరి వచ్చెయ్యి!''
''ఇంకా అనవసరం ఇది! గవర్నమెంట్‌లో జాబ్ వచ్చేదా చచ్చేదా? దీన్ని నమ్ముకుని దాన్ని పోగొట్టుకుంటే, సరసుణ్ణి నమ్మి, పురుషుణ్ణి పోగొట్టుకున్నట్టేలే.''
''ప్రైవేటు వాడే పురుషుడన్నమాట! గవర్నమెంటు వాడు సరసుడా? ఇద్దరూ ఒకటేలే. కానీ శ్యామూ! మళ్ళీ వచ్చెయ్యి!''
''స్కూల్లోనే ట్యూషన్ క్లాసులు చాలా వుంటాయి. అవి వదిలేసి ఈ కోచింగ్‌కి వచ్చినందుకే మా హెడ్మాస్టర్‌కి కోపం వచ్చి వుంటుంది. నేనిక రాను గానీ, నువ్వెలాగా కంటిన్యూ చేస్తున్నావుగా?'' అంటూ బైల్దేరితే, ఆమెని బస్ దాకా పంపించి వచ్చాడు రమేష్.
ననన
శ్యామల ఖమ్మంలో దిగిన తర్వాత, ఆ సాయంత్రానికి ఒక సంతోష వార్తా, ఒక విషాద వార్తా, రెండూ చెప్పింది రమేష్‌కి.
హెడ్మాస్టర్ ఇంటికి గంపెడు స్వీట్స్ తోటీ, ఒక బరువు కవర్ తోటీ వెళ్ళి, దీనాతి దీనంగా మాట్లాడింది. ఆ మాటల వల్ల కాదు గానీ, ఆ కవరు బరువు వల్ల ఆ ఉద్యోగం శ్యామలకే నిలబడింది! అది సంతోష వార్త!
అప్పటికే కొని వుంచిన స్థలాల్లో ఒక స్థలానికి కోర్టు గొడవలేవో వున్నాయి. ఆ స్తలం అమ్మిన వాడు, ఆ నాడే ఆ మాట కూడా చెప్పి, స్థలాన్ని చవగ్గానే ఇచ్చాడు. ఇప్పుడు ఆ కిరి కిరి తేలుతోంది గానీ, స్థలం అమ్మిన వాడు ఇంకో లక్ష కట్టాల్సి వస్తోంది ఎవరికో. ఆ స్థలానికి అంత వరకూ శ్యామలకి రిజిస్ట్రేషన్ జరగలేదు. డబ్బు తీసుకున్న రాత కోత లైతే వున్నాయి. ఆ స్తలం మనిషి, ఇంకా 60 వేలు ఇమ్మంటున్నాడు. లేదా, ''మీ డబ్బు మీరు తీసేసుకోండి. స్తలాన్ని ఇంకా పెద్ద ధరకి అమ్ముకుంటా'' అంటున్నాడు. శ్యామల, ఆ స్తలాన్ని వదులుకోకుండా, ఇంకా డబ్బు చెల్లించడానికే ఒప్పుకుంది. ఇంకా 60 వేల ఖర్చు! - ఇది విషాద వార్త!
రమేష్‌కి రెండూ ఒక్కలాగే అనిపించాయి.
ననన
కోచింగ్ పూర్తి చేసి ఇంటికి వచ్చిన మర్నాడే బయ్యారం వెళ్ళి పిల్లని తీసుకొచ్చాడు రమేష్. అక్కడికి వెళ్ళగానే చిట్టి, ముద్దు ముద్దుగా మాట్లాడింది.
''నాన్నా! తాతయ్య కొత్తాడు.''
''ఛ! తాతయ్య కొట్టడమ్మా!'' అన్నాడు.
తాతయ్య ఒప్పేసుకున్నాడు, కొట్టానని. ''అవును, కొట్టాను. పొద్దున్న, ఏం చేసిందో విను! నేల మీద ఒక చీమ పాకుతూ వుంటే, దాన్ని చేత్తో కొట్టి చంపేసింది. 'తప్పమ్మా' అని బాగా చెప్పా. వెంటనే అటు తిరిగి మళ్ళీ ఇంకో చీమని చంపింది. అందుకే చిన్న దెబ్బ వేశా! అదే గుర్తు పెట్టుకుంది.''
చిట్టి నాయనమ్మ నవ్వుతూ, ''పెద్ద వాళ్ళం దోమల్ని చంపడం చూస్తోంది. ఈగల్ని చంపడం చూస్తోంది. చీమలు కనపడగానే, వాటిని కొట్టాలనుకుంది. అది ఆలోచిస్తున్నందుకు మనం సంతోషించాలి'' అంది.
రమేష్ నవ్వాడు. ''నిజమే అనుకో, మరి ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో, నేర్పాలి కదమ్మా?''
''దాని కోసం దెబ్బ కొట్టాలా? 'పోరాటం' వొద్దంటారుగా నాన్న?''
''అది 'పోరాటమా?' ముద్దుగా నిమిరిన దెబ్బ!'' అన్నాడు తాత.
నాయనమ్మ మళ్ళీ అంది. ''చిట్టి ఈ మాటలు తల్లి గారికి కూడా చెపుతుంది. ఇక ఆవిడితో నిజం పోరాటమే! అప్పుడు తిండే పెట్టలేదంది. ఇప్పుడు దెబ్బలు కొట్టారంటుంది!''
చిట్టి, తల్లి దగ్గరికి చేరాక తాత కొట్టిన చిన్ని దెబ్బ మాట మర్చిపోయింది. ఆ మాట లేదు.
శ్యామల, స్థలం పనుల మీద తిరుగుతోంటే, రమేష్, చిట్టిని అమ్మమ్మకి చూపించడానికి ఆశ్రమానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ అమ్మమ్మ లేదు. ఎటో వెళ్ళింది.
కాళ్ళ వంకర్ల చక్రాల కుర్చీ పెద్దమ్మ చిట్టిని దగ్గిరికి తీసుకుంది.
రమేష్, ''చిట్టి బుజ్జి గాడికి భలే మాటలు వస్తున్నాయండీ ఇప్పుడు'' అనగానే, ఆ చక్రాల కుర్చీ ఆవిడ, ''అవేం పిచ్చి తెలుగు మాటలు? స్వీటీ పింకీ, బ్యూటీఫుల్ వాడ్సు టాక్ చేస్తోంది - అనాలి గానీ'' అంది, పిల్లని దగ్గిరికి తీసుకుంటూ. కీచు కీచుమంటూ అన్నీ వచ్చీ రానీ ఇంగ్లీషు ముక్కలకి చివర్లో రెండు తెలుగు అక్షరాలు చేర్చి మాట్లాడుతుంది. ఇంగ్లీషు మాటలు దొరక్కపోతే సుబ్బరంగా తెలుగులోకి దిగుతుంది. పిల్లల్ని మాత్రం ఇంగ్లీషులో ముద్దాడాలంటుంది. ఆవిడికి, ''సారీ - థ్యాంక్యూ''లు రెండూ బాగా వచ్చు.
ఎదరగా వున్న మరిది ఎమ్మెస్సీ వాడని తెలుసు. కానీ, 'ఎమ్మెస్సీ' అంటే తెలీదు. ''మీది బయ్యారం కదా?'' అనేస్తుంది కాలక్షేపంగా ప్రతీ సారీ.
ఆ మూర్ఖురాలు ఆ రోజు రెండు కొత్త మాటలే ఎత్తింది. ''అబ్బారు! మీతో ఒక మాట చెప్పాలనుకుంటాను ఎప్పుడూ! చెప్పడానికి అవదు.''
''ఫోనులో అయినా చెప్పొచ్చు కదండీ?''
''అలా కాదులే. దగ్గిరి గానే చెప్పాలి.''
''ఇప్పుడు చెప్పండి. ఏం మాట?''
''అబ్బే! ఏం లేదు. మా లకిë మాటే. అది అసలే స్పీడు మనిషి. దడా బిడా చేసేస్తుంది. తర్వాత సారీ అంటుంది. ఎలా వుంటోంది మీతో? మీరే ఓపిగ్గా వుండాలి సుమా దానితో.''
రమేష్ నవ్వాడు ''రెండున్నరేళ్ళకి అడుగుతున్నారా? మీ దగ్గిర 'సారీ' అని అయినా అంటుందేమో, నా దగ్గిరైతే అలా అనదు. మే మిద్దరం కాస్సేపు అనుకున్నా కలిసిపోతాం లెండి. తగువులు వస్తాయి, పోతాయి. తగువు జరిగినట్టే వుండదు మాకు.''
శ్రోత, ఆశ్చర్యపోతూ వింది. ''అమ్మో, మీరు కాబట్టి దాని ఆటలు సాగుతున్నాయి. ఇంకో మొగాడైతేనా?''
''ఇంకో మొగాడైతే ఏం చేస్తాడంటారు?''
''రోజూ గొడవలే అవుతాయిగా? సంసారం వీధిన పడుతుంది.''
''నేనలా వుండనండీ. నా తప్పు ఎప్పుడూ వుండదు. నా సంసారం వీధిన పెట్టుకుంటే నాకే నష్టం!''
''మీ తప్పు ఉండదులే. దాని తప్పు ఉంటే?''
నవ్వాడు మరిది. ''శ్యాము తప్పు మాత్రం ఏం ఉంటుంది లెండి.''
పిల్లకి మందు కోసం తల్లి డబ్బు ఇవ్వకపోయినా, ''ఆ ఖర్చు మొగాడి బాధ్యత'' అని తల్లి వాగినా, ఆమె తప్పు ఉండదు! తన నెత్తినెక్కి తొక్కడం పెళ్ళం తప్పు కాదనీ, ఆ తొక్కే పెళ్ళాన్ని కిందకి జారనివ్వకుండా మొయ్యడం తన తప్పు కాదనీ నమ్మే రమేష్, ఆ గొప్పంతా ఇంకా ఇంకా చెప్పుకున్నాడు.
శ్రోత, నోరు తెరిచి విన్నది. ''మా లకిë అదృష్టవంతురాలు. దీని సంసారం ఎలా సాగుతుందో నాయనా అని నేను భయపడేదాన్నండీ నిజంగా.''
ఆ మాటలన్నీ నమ్మవచ్చునా - అన్న సందేహం తలెత్తింది మరిదికి నెమ్మదిగా. ''ఒక్క మాట అడుగుతానండీ. వింటారా?'' అన్నాడు.
''ఒక్క మాటేవిటి? వంద, హండ్రెడ్ మాటలడగండి!'' అంది.
''మీ చెల్లెలు నన్ను పెళ్ళి చేసుకోడం మీకు ఇష్టం లేదాండీ?''
''అయ్యో, అయ్యో! ఎవరన్నారామాట?''
''నన్ను పెళ్ళి చేసుకోకుండా ఆమె రెండేళ్ళు ఆగితే, ఆమెకి డాక్టరో, లాయరో దొరికేవాడని మీరిద్దరూ అంటారట కదండీ?''
''ఆు, అదా? ఆ మాట మా మమ్మీ అప్పుడప్పుడూ వాగింది లెండి. నేను బాగా తిట్టాను.''
''మీరు కూడా అనలేదా అలాగ?''
''అయ్యో! మా ప్రభువు మీద ఒట్టండీ! మీరెంత మంచి మనిషో నాకు తెల్వదా? మా మమ్మీ అయితే, మీ మీద ఏదో ఒకటి అంటే, నేను మా మమ్మీనే తిడతాను. చెప్పాలంటే, నేను కూడా ఒక్కో సారి మా మమ్మీ బుట్టలో పడతా లెండి. మీ అమ్మ గారు వచ్చినప్పుడు ఆవిడ తెచ్చిన సున్నుండలు ఎంత బాగున్నాయి! అంత మంచి బెల్లం సున్నుండలు దొరుకుతాయా అసలు? మా మమ్మీ చక్కగానే తింది గానీ, మీ మమ్మీ మీదే తప్పులు చెప్పింది. అప్పుడు బాగా కేకలేశాలెండి.''
''మీరు కూడా, మీ చెల్లెలితో 'డాక్టరే దొరికే వాడే నీకు' అంటారని మీ చెల్లెలే చెప్పింది మరి!''
''ఛీ ఛీ! నా మీద కాయించి చెప్పిందా? అయితే చేసుకోమనండి, ఏ పెళ్ళం చచ్చిన ముసిలి డాట్టరో దొరుకుతాడు'' అంది కోపంగా.
ఆ మాటలు ఈ శ్రోతకి నమ్మాలనే అనిపించింది, ఈ అక్క మీద పెట్టి, తన కోరికే చెప్పుకుందా చెల్లెలు! - అని ఆశ్చర్యం!
''కానీ, రమేష్ బాబూ! మీ మమ్మీ వచ్చినప్పుడు చాలా కిరి కిరి అయిందట! పిల్లకి పచ్చడి మెతుకులు తినిపించేసి, పాల మీగడా అదీ తనే తినేసేదట మీ మమ్మీ! అలా చెప్పారు నాకు!''
తల్లి గురించి ఆ మాటలు వినే కొడుక్కి ఏ ఆవేశమూ తలెత్తలేదు. తన గురించి ఆవేశాలూ ఉద్రేకాలూ పుట్టక పోయినా, నిప్పు కణిక వంటి తల్లి మీద నిందకైనా పిసరంత ఆవేశం తలెత్తవచ్చు. అలా జరగలేదు. ''మా అమ్మ గురించి మీ చెల్లెలి మాటలే నమ్మారా మీరు?'' అన్నాడు నిదానంగా.
''మరి చెప్పింది బాబూ అలాగ!''
''మీ మీద నాకు కూడా చెప్పింది కదండీ? మీరు ఈ హోమ్ మేనేజరంటే గజ గజ వొణుకుతారంట! అది కూడా నన్ను నమ్మమంటారా?''
''అయ్యో! దానికేం పుట్టి చచ్చింది? వాళ్ళిద్దరూ వచ్చి నా దగ్గిరే వుంటారు కదా? మేనేజర్‌కి నేను వొణకొద్దూ?''
''మీ మమ్మీ కూడా చూసేదిగా మా అమ్మని? మా అమ్మ కిరి కిరి మనిషా?''
''అవున్లెండి! అవును. వీళ్ళ తప్పే!''
ఆవిణ్ణి నమ్మాలో లేదో అర్ధం కాలేదు మన వాడికి.
ననన
మహిళా కమర్షియల్ కేపిటలిస్ట్ అవడం అతి తేలిక - అనుకున్న శ్యామల, అది జరగక, చాలా నిరుత్సాహపడింది.
రమేష్, డిఎస్సీ పరీక్షలు రాయడమూ, పేసవడమూ జరిగి, గవర్నమెంట్ స్కూల్ టీచర్‌గా, ఇంకా అప్రెంటిస్ పిరియడ్‌లో వున్నాడు.
ఇంటి ఖర్చులన్నీ అతనే పెట్టడం అప్పటి నించే కొత్త కాదు. ఎప్పుడూ జరిగేదే అది. ఇంటి అద్దే, తిండీ, కరెంటూ, నీళ్ళూ, మందులూ, సినిమాలూ, అన్నీ, అన్నీ!
శ్యాముని ఒక్క వెయ్యి రూపాయలు అడిగితే, మొదలైపోతుంది స్తోత్రం! ''సంపాదించే మొగాడివి కావు నువ్వు. నీ తమ్ముణ్ణి చూసి అయినా కళ్ళు తెరుచుకోవు. పెళ్ళం తెచ్చేదే తినాలని చూస్తావు. మా స్కూల్లో ఒక టీచరైతే, చీరల బిజినెస్సే కాదు, ఆఖరికి స్థలాల బేరాలు కూడా రహస్యంగా స్కూల్లో నడిపిస్తాడు. నాకు స్థలాల గురించి చెప్పింది ఆయనే. నీ కైతే పెళ్ళంతో వాదానికి దిగడం తప్ప, రెండోది తెలీదు. నీ తమ్ముడితో నువ్వు ఒక్క సారి మాట్లాడితే ఎంత మారేది మన సంసారం! చచ్చు టీచరు ఉద్యోగానికే మురిసి ముక్కలైపోతూ వుంటావు.'' - స్తోత్రం అదే! డబ్బు ఇవ్వకపోయినా అది నడుస్తుంది. కొంచెం ఇస్తే, దాని వేగం పెరుగుతుంది!
అక్కడ రమేష్‌ని ప్రేమించే స్నేహితుడెవడైనా వుండి, రమేష్ బట్టలు కాసిన్ని సర్దేసి, రమేష్‌ని చెయ్యి పట్టుకుని బైటికి లాక్కు రావాలని చూసినా, అతను కదలడు. రమేష్, అక్కడే నిదానంగా నించునే వుంటాడు. ''నా టీచరు పనే నాకు మురిపెం. ఏదో ఒక పని చేసుకుంటూ జీతం రాళ్ళతో బతికే వాళ్ళే మొహాలు పైకెత్తుకుని తిరగ్గలరు. సరుకులు అమ్మించే వ్యాపారాల వాళ్ళే సిగ్గులు పడాలి'' అన్నాడు. అంత నిదానం అతడికి.
''తెలుసులే. నీ ఉన్మాదం నాకు తెలుసు. నిజంగా మా వాళ్ళు చెప్పినట్టు నేను రెండేళ్ళు పెళ్ళి మాట ఎత్తకుండా వుంటే పోయేది. నా ఖర్మగాలి నేను నీ కంట్లో పడ్డాను. నువ్వు నా వెంట పడ్డావు.''
ఆ తగువు, పాత తగువుల్లాగే దాని దారిన అది పోతుందనుకున్నాడు రమేష్. అలా జరగలేదు. జరగడం లేదు.
రమేష్, ''సమానత్వం'' అనే మాట వాడతాడు గానీ, దాని అర్ధం అతనికే తెలీదు. ''సంసారం అనేది ఇద్దరిదీ'' అంటాడు గానీ, ఆ ఖర్చుల బాధ్యత ఉద్యోగం చేసే భార్యకి కూడా వుంటుందని మాత్రం అతనికి గట్టిగా అర్ధం కాదు. అతను చదివిన పుస్తకాల్లో ఎక్కడా అది తగలలేదేమో! పెళ్ళాన్ని డబ్బు అడగడానికి కొంత సిగ్గుపడతాడు. తను అడగకుండానే ఆ డబ్బు అందాలని అనుకోడు. అడగగానే ఇస్తే అదే పదివేలనుకుంటాడు.
ప్రతి నెలా తన జీతం అంతా చివరి పైసాతో సహా సంసారం కోసం మొదట ఖర్చు పెట్టేస్తాడు. తర్వాత, ఒకటి రెండు అప్పులు సంపాదిస్తాడు. ఆ తర్వాతే, ''శ్యామూ'' అంటాడు.
ఆ శ్యాము, పాము అయిపోయి బుసలు కొడుతుంది. మనిషి శరీరం సిగ్గుతో చితికిపోయే మాటలు అనేస్తుంది. పూర్వం లాగ, ''నీకో ముద్దు!'' ఫోన్లు ఎప్పుడో ఆపేసింది! ''మొగాళ్ళందరూ ఎలా సంపాదిస్తున్నారో చూడు!'' అన్న తర్వాతే, కొంత డబ్బు విసురుతుంది. విసిరి, ''ఎప్పుడైనా సరే, నా డబ్బు నాకు ఇచ్చెయ్యి!'' అంటుంది.
అప్పుడైనా అతడు బట్టలు సర్దుకోడు! ఒక్క సారి మాత్రం ఎప్పుడో అన్నాడు, ''నీకు తిండి నేనే పెడుతున్నాను'' అని!
''పెట్టక ఏం చేస్తావు? పక్కలోకి పెళ్ళం ఎలా వొస్తుందనుకున్నావు?'' అంది!
అతడు అదిరిపోలేదు. ''నిజమే'' అనుకున్నాడు. ''ఇది నిజం ఎలా అవుతుంది?'' అనుకోలేదు. ''నీ పక్కలోకి మొగుడు అక్కర లేదా?'' అనలేదు ఆమెతో.
అసలు తప్పు కేశవయ్యది!
ఆయన, ''దేవుడు లేడు, దెయ్యం లేదు'' అనే విషయాలు చక్కగానే పిల్లలకి నేర్పాడు గానీ, దాన్ని వాళ్ళు వుంచుకున్నారో లేదో, అది వేరే సంగతి గానీ ఆయన ఎన్ని కమ్యూనిస్టు పుస్తకాలు చదివినా, 'శ్రమా - దాని విలువా - దాని డబ్బూ' - వంటి విషయాలేవీ మనసులోకి జొరబడ నివ్వలేదు. అవి అర్ధం కాలేదో, లేకపోతే ఇష్టం కాలేదో, ఆ విషయాలేవీ పిల్లలతో చర్చించలేదు. ''పిల్లలు దేవుళ్ళ గుళ్ళకి వెళ్ళకపోతే చాల''నుకున్నాడు. వాళ్ళు, ''కులాన్నీ - మతాల్నీ నమ్మకపోతే చాల''నుకున్నాడు.
చిన్న కొడుకు, సరుకులు అమ్మించే వాడయ్యాడు! పెద్ద కొడుకు, సిగ్గు లజ్జలంటే తెలియని వాడయ్యాడు! సమాజ స్పర్శ లేని అజ్ఞానులకు, భూమి మీద బతికే మనుషుల సంబంధాల శాస్త్రం తెలియాలి మరి! పిల్లలు పుట్టక ముందే కేశవయ్యకి తెలిసి వుండాల్సింది అది!
ననన
''రామూ! ఒక సంగతి చెప్పడం మరిచే పోయాను. ఒక సారి ఏమైందంటే, మా పెద్ద వదిన నాకు 'మందు' పెట్టేసింది. నాకు పెళ్ళి చేసే బాధ తప్పిపోతుందని అంత ఎత్తు వేసింది.''
'''మందే'విటి? ఎలా పెడతారు 'మందు?' అదేదో పెట్టినట్టు నీకెలా తెలిసింది?''
''తెలిసింది. తల తిరిగి పోతోందిగా?''
''అలాగైతే, దాన్ని 'విషం' అనాలి. దాన్ని 'మందే'విటి?''
''కాదు, వెంటనే ఒక జోతిష్కుడి దగ్గిరికి మా మమ్మీ తీసుకు వెళ్ళింది. ఆయన వెంటనే చెప్పేశాడు. 'మందు పెట్టారమ్మా నీకు' అన్నాడు. తర్వాత, మంత్రం వేసి, తాడు కడితే, అప్పుడు తేలిగ్గా ఇంటికొచ్చాను.''
ఆ మాటలు వినే నాస్తికుడికి, ఏమీ చీదర పుట్టలేదు. ''ఈ మూర్ఖురాలితోనా నా బతుకంతా?'' అనిపించలేదు. ''పాపం, మూఢ నమ్మకం మరి!'' అనుకున్నాడు. ఆ మాటే చెప్తే ఆమె నమ్మదని అది కూడా అనకుండా ఊరుకున్నాడు.
''ఆ-, అన్నట్టు రామూ! నీ పేర్న ఒక లక్ష, బ్యాంకులో పెట్టాలి. 'నామినీ'గా నా పేరేలే'' అంది.
''నా పేరుతో లక్ష పెడతావా? నీ పేరుతోనే పెట్టుకో!''
''అలా కాదులే. నా పేర్న ఎక్కువ ఆదాయం కనపడకూడదు. ఎందుకూ అనవసరంగా పన్నుల కోసం తగల బెట్టుకోడం?''
''అసలు, ఆ 'ఆదాయం' ఎక్కడిది?'' అని అడగలేదు భర్త. - ఆమె ఏదో చేస్తూ వుంటుంది, ఎలాగో సాధిస్తూ వుంటుంది. చురుకైన మహిళ!
''ఇంటి ఖర్చుల కోసం నెలకి కొంచెం ఇమ్మంటేనే ఇష్డపడవు! నీ లక్ష తెచ్చి నా పేర్న ఎలా పెడతావు?''
''అంత 'అవసరం' కాబట్టే పెడుతున్నా'' అంటూ ఆ కాయితాలన్నీ బల్ల మీద పెట్టింది. పక్కనే నిలబడి సంతకాలన్నీ పెట్టించింది.
ఆ కాయితాల్ని ఫలానా బ్యాంకుకి తీసుకు వెళ్ళి, వాటిని ఎవరి ముందు పెట్టమని శ్యాము చెప్పిందో, ఆ ఉద్యోగి ముందే పెట్టాడు. ఆ ఉద్యోగి, ఆ కాయితాల్ని తిరగేసి చూస్తూ ''ఇదేవిటి?'' అని ఒక చోట చూపించాడు.
అక్కడ ఎర్ర ఇంకుతో ఒక వాక్యం రాసి వుంది. ''ఈ డబ్బుని తీసే హక్కు ఈ డిపాజిటర్‌కి వుండకూడదు'' అని ఇంగ్లీషులో!
''ఏమిటిది? డబ్బు పెట్టిన వ్యక్తికి, దాన్ని తీసుకునే హక్కు వుండదా? ఎవరు రాశారిది?'' అంటూ చాలా విసుగ్గా చూశాడు ఆ ఉద్యోగి.
''నా పెళ్ళం రాసి వుంటుంది'' అన లేదు రమేష్. ''తెలీదండీ. ఏదో పొరపాటు'' అని వూరుకున్నాడు.
''అయితే కొట్టేస్తా ఈ లైను.''
''అమ్మో! నా పెళ్ళాన్ని అడగాలి'' అనాలనుకున్నాడు గానీ, అదీ అనలేదు.
ఆ ఉద్యోగి ఆ లైనుని కొట్టిపారేశాడు.
ఇంటి కొచ్చిన రమేష్ ఆ సంగతేదీ ఇంట్లో చెప్పలేదు.
''అతను, ఆ కాయితాలు బాగా చూశాడా?'' అంది ఇంట్లో మహిళ నాలుగు సార్లు.
''ఆ-, చూశాడు'' అని ఒప్పుకున్నాడు.
ఒక్క నెల గడిచిందంటే, శ్యామలకి అర్జంటుగా కొత్త స్థలం రిజిస్ట్రేషన్‌కి డబ్బు కావలసి వచ్చింది. ఆ లక్షని వదిలించడం తప్పని సరైంది. అయితే, ఆ లక్ష, తను ఎంతగా వెళ్ళిందో అంతగా వెనక్కి రాలేదు. పది వేలు తగ్గి వచ్చింది! దానికి కారణం, ఆ డిపాజిట్ పెట్టిన వాడికి తెలీదు. ఆమె, బ్యాంకులో పెట్టమంటే పెట్టి వచ్చాడు. అంతే!
డబ్బు పెరగక పోగా తగ్గడం చూసి, ఆమె రయ్యిన తన బండి మీద ఆ బ్యాంకుకి వురికింది. అక్కడ అంతా తెలుసుకుని వెనక్కి తిరిగింది రుస రుసలతో.
ఇన్సూరెన్స్‌లో ఏదో షేర్ల పధకం వుంది. ఫలానా ఫలానా షేర్ల పధకం అది. ఆ పధకంతో సంబంధం వున్న డబ్బు అది! ఆ షేర్ల ధరలు ఆ నెల రోజుల్లో అలా మిడికాయి. అందుకే పెట్టినంత డబ్బు పెట్టినట్టు తిరిగిరాలేదు. బ్యాంకు ఉద్యోగి, ఆ కారణం ఏదో చెప్పాడు. అది శ్యామలకి కూడా అర్ధం కాలేదు. రమేష్‌కి అర్ధమయ్యే ప్రశ్నే లేదు.
అయినా శ్యాము చదివే స్తోత్రం ప్రారంభమైంది. ''నీ పేరు ఎత్తితే అంతా దరిద్రం! నీ పేరుతో ఏం చేసినా కలిసి రాదు. నువ్వు సంపాదించనూ లేవు, సంపాదించిన దాన్ని నిలపనూ లేవు.''
''నేనేం తప్పు చేశాను శ్యామూ? నువ్వు ఆ కాయితాలు బ్యాంకులో ఇమ్మంటే ఇచ్చి వచ్చాను, అంతే కదా?''
''అదే నేను చేసిన తప్పు. నీ చేత్తో పంపాను. నీ దరిద్రం నా నెత్తికి పట్టించుకున్నాను. మా అమ్మ మొదటి నించీ చెపుతూనే వుంది, దేవుడూ దెయ్యం లేని మందతో నీ కెందుకే అని నెత్తీ నోరూ బాదుకుంది. విన్నానా? ఎన్ని సంబంధాలు వచ్చాయో, అన్నీ వదులుకుని నీ దరిద్రాన్ని కటుy్టకున్నాను. అప్పుడు నాకు సైతాన్ పట్టింది.''
''సైతాన్ నీకు కాదు, నాకు పట్టింది. అది నన్ను వదలడం లేదు'' అనలేదు రమేషుడు!
అతన్ని ఆమె, ''దరిద్రం, దరిద్రం'' అంటుంది. ఆ మాట నిజమే. ఎంత అవసరం వచ్చినా, ఆ ఇల్లు వదిలి, ''కాలు బైటపెట్టే భాగ్యం లేని దరిద్రం'' అతనిది!
గంట కాలం ఆ స్తోత్రం అయ్యాక భోజనాలయ్యాయి. కైమా కూరే. శ్యామలకి మరీ ఇష్టం. పింకీకి, అదే ఇష్టం! అప్పటికే రాత్రి పది దాటింది. ఇద్దరికీ విశ్రాంతి. ఒకటే మంచం! ఏక శయ్య!
''ఆ డబ్బు ఎక్కడిది శ్యామూ?''
''ఆ గోల ఎందుకులే. రేపు ఒక చిట్టీ డబ్బు కూడా వస్తుంది. దాన్నేం చెయ్యాలో!''
''బాబోరు! నీ పేర్నే పెట్టుకో!''
''అది నువ్వు చెప్పాలా?'' అంటూ అతని వేపు తిరిగింది.
ననన
ఈ కోడలు, అత్త మామల్ని చూడడానికి బయ్యారం వెళ్ళడం పూర్తిగా బంద్! ఆ అత్త మామలు ఈమెని గాయపరిచిందేమీ లేదు. కానీ, తనకి పెళ్ళిచేసి, తనని గాయపరిచారనే నమ్ముతుంది.
ఒక రోజు శ్యాము, రాముతో హఠాత్తుగా అంది, వంటింట్లో గోధుం పిండి కోపంగా పిసుకుతూ! ''నలుగురు పెద్ద మనుషుల్ని పిల్చి మన సంసారం సంగతులు చెప్పుకోవాలి. నాకు మరిది సాయం చెయ్యడు. సాయం చెయ్యమని మీ పెద్ద వాళ్ళు అతనికి గడ్డి పెట్టి చెప్పరు. నువ్వు నా డబ్బు కోసం నెల నెలా పీడిస్తావు. తీసుకున్నది వెనక్కి ఇవ్వవు. కులాంతరం పెళ్ళి చేసేసుకున్నామని మీరు పెద్ద మనుషుల్లా కనపడతారు లోకానికి. మీ రంగంతా అందరికీ చూపించాలి. తప్పకుండా నీ అయ్యనీ, నీ అమ్మనీ, నీ అప్పనీ, బైటికి లాగుతాను. మా వాళ్ళు కుల సంఘాలు పెట్టి అన్ని తగువులూ తీర్చుకుంటారు.''
అన్నీ వింటూనే వున్నాడు రాము. ఎవరో చెప్పారని స్వాముల వార్ల పుస్తకాలు చదువుతున్నాడు అప్పుడప్పుడూ. శాంతంగా చూశాడు ఆమె వేపు.
తండ్రి, పిల్లలకి శాంతాలూ - సహనాలూ నేర్పిన మాట నిజమే గానీ, అవి ఈ కొడుకు నేర్చుకున్న రకం కావు. ఇలా అనుకుంటే, కేశవయ్యని చాలా తప్పుగా అర్ధం చేసుకున్నట్టే.
శ్యాము మాటలు ఆగిన తర్వాత అన్నాడు రాము. ''ఒక సారి మా ఊరు వెళ్దాం. మా తమ్ముణ్ణి కూడా రమ్మంటాను. నువ్వు అడగాలనుకునే మాటలన్నీ వాళ్ళని అడుగు!''
''దొంగలే మీరైనప్పుడు, మీతో మాట్లాడితే ఏం ప్రయోజనం?''
''నీతో పాటు నీ కిష్టమైన మనుషుల్ని కూడా తెచ్చుకో! అలా మాట్లాడుకుందాం. పరువు బజార్న వేసుకోడం ఎందుకు? పరాయి వాళ్ళతో చెప్పాలా?''
''మీ పరువు బజార్నే పడాలి.''
''నీ పరువు కూడా బజార్నపడదా?''
Authorization