పాత ఇంటి నించి కొత్త ఇంటికి సామాన్లు మార్చే పెద్ద వ్యానుని రమేషే కుదిర్చాడు, తన డబ్బుతో. వర్కర్స్‌ని కూడా తనే కుదిర్చాడు, తన డబ్బుతో. నిజానికి తన దగ్గిర అంత డబ్బు లేదు. ఎక్కడెక్కడో అప్పులు తీసుకున్నాడు.
వదలని తమ్ముడు, మళ్ళీ చేసి, ''నిర్ణయం జరిగితే నువ్వే చెప్పాలి గానీ, ఎవరి ద్వారానో వినాలా మేము?'' అనేసి బంద్ చేశాడు.
రమేష్ ఇల్లు వదిలి బైటికి ఎప్పుడు వచ్చినా, దగ్గిర వాళ్ళకైనా చెప్పాలనుకోడు. ఆ విడిపోవడం నిజం కాదనీ, ఆమె తప్పక మారుతుందనీ, రమ్మంటుందనీ, ఆమెని బెదిరించడానికే తను ప్రయత్నిస్తున్నాననీ, తిరిగి కలిసి పోతామనీ, ఆ లోపలే అందరికీ చాటించెయ్యడం ఎందుకనీ, అనుకుంటూ, అంతా రహస్యంగా వుంచడానికే తంటాలు పడతాడు. కానీ తను దాచి పెట్టిన రహస్యం మరుక్షణంలోనే బట్టబయలై పోతూ వుంటుంది. అందరి చేతుల్లోనూ ఫోన్లేనయ్యే!
బైటికి వచ్చినప్పట్నించీ, అసహ్యంతో తెగతెంపులు చేసేసుకున్నట్టు వుండడు. ఆమె బస్‌స్టాండు పక్కన కనపడుతుందో, పిల్ల కేర్ సెంటర్ దగ్గిర కనపడుతుందో, స్కూలు సందులో కనపడుతుందో, అని వెతుకుతూనే వుంటాడు.
ఖాసిం ఒక సారి నవ్వుతూ అడిగితే, ''మాది ప్రేమే ఖాసిం! అందుకే అంత ఆరాటంగా వుంటాను'' అన్నాడు.
''ప్రేమ అంటే, ఇతనికేమీ తెలీదన్నమాట!'' అని తెల్లబోతూ ఖాసిం, ఇక రమేష్‌తో ఆ గొడవలు ఎత్తడం ఆపేశాడు.
అయినా ఒక సారి రమేష్ మళ్ళీ చెప్పుకున్నాడు ఖాసిం తోనే. ''ఆమెకి ఇష్టం లేదని నేను నా తల్లిదండ్రుల్నే వదిలేశానే! నా మీద కోపం ఎందుకు ఆమెకి?'' అన్నాడు.
ఒక సారి బస్‌స్టాండ్ దగ్గిర కనపడింది. ఇతని పక్క నించే నడుస్తూ, ''ఏమిటి, నా కోసం తెగ వెతుకున్నావు రోజూ? రావాలంటే ఇంటికి రా!'' అనేసి చక చకా వెళ్ళిపోయింది.
తను, ఇంటి నించి బైటికి వచ్చాక, ఆ నెల చిట్టి సెంటర్‌కీ, ఇంటి అద్దెకీ, తనే ఫీజులు పంపేశాడు. ''నేనే ఇస్తాను, ఆమె ఇస్తే తీసుకోకండి!'' అన్నాడు కూడా. ఆ సంగతి ఆమెకి మెసేజ్ చేసేశాడు.
ఒక సారి, రమేష్‌ని హెచ్చెమ్ అడిగాడు. ''ఎందుకు సంసారం పాడుచేసుకుంటావు?'' అని.
''నేనా పాడు చేసుకునేది? నేను కాదు సార్?'' అని వూరుకున్నాడు.
అందరికీ తెలుసు, అతని తప్పు వుండదని! అతని తప్పులు ఎంతెంత వుంటాయో మాత్రం ఎవ్వరికీ తెలీవు. అతనికి 'లజ్జ' లేదనే ఒక్క తప్పు గురించి అయినా తెలీదు.
ఒక రోజు స్కూలు పక్కన ఇతను వెళ్తోంటే, ఇతనికి అటు పోవలిసిన అవసరమే లేదు, అయినా అటు తిరుగుతోంటే, ఆమె గేటులో నించి బైటికి వస్తూ, అతని వేపు చూసి నవ్వుతూ, చెయ్యి వూపి, ''బై'' అనేసి వెళ్ళిపోయింది. వెంటనే ఆమె వెనకాల పడిపోదాం అనుకున్నాడు. అక్కడే ఖాసిం పోతూ కనపడితే, భయపడి ఆ దారి వదిలాడు.
ఆ మర్నాడే స్కూల్లో లంచ్ టైమ్! ఆమె నించి మెసేజ్! ''లంచ్ అయిందా?''
వెంటనే ఇతని జవాబు: ''ఆ, నువ్వూ చేశావా?''
విడిపోయిన దంపతుల సంభాషణ!
''నేనూ, పిల్లా, నీకు గుర్తురావడం లేదా?''
''పిల్ల ఎప్పుడూ గుర్తే!''
''పిల్లని గుర్తు పెట్టుకున్న తండ్రి, పిల్లని వదిలి నీలా తిరగడు.''
''నేను ఇల్లు ఎందుకు వదిలానో నువ్వు గ్రహించుకో! సాయంత్రం చిట్టిని పార్కుకి తీసుకొస్తావా? ఒక సారి చూడాలి.''
''ఇవ్వాళ తీసుకొస్తే, రేపు కూడా తీసుకు వెళ్ళమంటుంది. అప్పుడేం చెప్పాలి? కావాలంటే నేను వస్తాను. నన్ను చూడు!'' - జాలి పడ్డట్టు.
''నీతో మాట్లాడ్డానికి కాదు నేను వచ్చేది.''
''పాప లేకుండా నువ్వు వుండలేకపోతే, దాన్ని నువ్వే తీసుకెళ్ళు! అది లేకుండా నేనూ వుండలేను కాబట్టి, దానితో వుండడానికి నేనూ వస్తాను.''
''నీకు అంత వివేకం వుంటే ఇలాగెందుకవుతుంది సంసారం?'' - సంసారాన్ని నిలబెట్టడమే తన లక్ష్యం అయినట్టు!
''ఇవాళ నన్ను ఒకడు వెకిలిగా పలకరించాడు. ఇంట్లో మొగుడు లేనిదాన్ని అలాగే చూస్తారు.''
''నీకు కాపలా కాయడం కోసం కాదు నేను ఇంట్లో వుండేది. ఒక వాచ్‌మేన్‌ని పెట్టుకో! డబ్బున్న దానివి!''
''నా డబ్బు వల్లే నీకు అసూయ పుట్టింది.''
''అయితే సగం డబ్బు నాకు ఇచ్చెయ్యి! ఇక ఇటూ అటూ అసూయలు వుండవు.''
''నీ బాబు సంపాదించిన డబ్బా అది, నీకివ్వడానికి?''
రమేష్, సాయంత్రం శ్రీను దగ్గిరికి వెళ్ళి అంతా చెప్పి, ''భలే గట్టిగా మాట్లాడాలే'' అన్నాడు.
''అవును, తిట్టేటప్పుడు గట్టిగానే తిట్టాలి'' అన్నాడు శ్రీను. ''అసలు ఆమెతో మాటలేమిటి?'' అనలేదు.
''కొట్టేటప్పుడు బాగా బాదాలా?''
''అది పిచ్చి పని! కాస్త వాదంతో మనుషులు లొంగకపోతే బైటికి రావడమే! కొట్టడానికి నువ్వు కర్ర తీస్తే, అవతలి వాళ్ళు తుపాకీ తీస్తారు. గృహ హింస చట్టాలున్నాయి. నిజం చెప్పుకోవాలంటే, మొగవాళ్ళ దౌర్జన్యాల గురించే అవి వున్నాయనుకో! కానీ, ఆడవాళ్ళ దౌర్జన్యాలూ వుంటున్నాయని చాలా విషయాలు చూస్తున్నాం. ఏ ఇంట్లో ఎవరి దౌర్జన్యం మితిమీరి వుందో ఎవడికి తెలుస్తుంది?''
ఐదో రోజు ఉదయమే అతనికి ఆమె నించి ఫోను! ''రామూ! నువ్వు ఇంటికి వచ్చేస్తావు అంటే ఓనరు రత్తయ్య ముండా కొడుకు నమ్మడం లేదు. ఇల్లు ఖాళీ చేసెయ్యమంటున్నాడు. అయినా, ఈ ఇరుగు పొరుగు ముండలు తెగ చెప్పుకుంటున్నారు నా మీద. ఇక్కడ వుండొద్దనుకుంటున్నాను. నిన్న కొత్త ఇల్లు చూసేశాను. స్కూలుకి కొంచెం దూరమే. అయితే అయింది. ఇల్లు మారాలి. కొంచెం సాయానికి వస్తావా?''
''ఎవరికి సాయం?''
''నాకే, నేనూ పింకీ వుంటాం.''
''సాయానికైతే వస్తా. నన్ను కూడా నీతో కలిసి వుండమంటే వుండను.''
''సరే, నీ ఇష్టం! నిన్ను వుండమని నేనెందుకంటాను? నీతో నేను వుంటానా?''
రమేష్ నీరసంగా ఫోను మూసేస్తోంటే, కాంతమ్మ ఫోను! ఖాళీ చేసిన ఇంటి ఓనరు భార్య! ఆవిడా ఓనరే. కానీ, ఓనరుగా వుండదు.
''రమేష్ బాబే కదా?''
''నేనేనండీ! ఎందుకు చేశారు కాంతమ్మ గారూ?''
''బాబూ! మీ ఆవిడ ఒక సారెప్పుడో ఆర్నెల్లయింది, ఐదు వేలు చేతి బదులుగా తీసుకుంది. ఇల్లు ఖాళీ చేసేసి పోతున్నప్పుడైనా అప్పు తీర్చెయ్యాలి కదండీ? తర్వాతెప్పుడో ఇస్తానంటుంది. ఇంకెప్పుడిస్తుంది? చూడు బాబూ! నేను అప్పు తెచ్చి ఇచ్చిన సంగతి మా ఆయనకి తెలీదు. తెలిస్తే బాగా తిడతాడు. నేనేం చెయ్యాలి? మీకు చెపుతున్నాను, మీరు మంచివారని!''
కాంతమ్మ రమేష్‌ని 'మీరు' అంటుంది, ఒక్కో సారి 'నువ్వు' అంటుంది.
''ఆ, తప్పకుండా నేను ఇచ్చేస్తాలెండి. ఆవిడి దగ్గిర డబ్బు లేదేమో! లేకపోతే అలా ఎగ్గొట్టే రకం కాదు. అక్కడికి, వ్యాన్‌తో వస్తా కదా? అప్పుడిస్తా!''
''మా ఆయన వుండగా ఇవ్వకండి! నేను వస్తాను కిందకి.''
''సరే, అలాగే.''
ఈ డబ్బు సంగతి నిజమో కాదో శ్యాముని అడగాలా? ఆమెకి తెలియకుండా తను ఇచ్చేస్తే ఎలాగ?
తనే శ్యాముకి ఫోను! అంతా విన్నపం!
''అవునవును. ఒక సారి షేర్ల కోసం తీసుకున్నాను. అందులో లాసే అయింది. ఆమెకి వడ్డీతో సహా ఐదు వేలవుతుంది.''
''ఏం వడ్డీ? చక్రవడ్డీయేనా?''
''ఐదు నెల్లే అయింది. ఏం చక్రవడ్డీ? బారు వడ్డీతోనే లెక్కకట్టాను.''
''నీ దగ్గిర మా అక్కా వాళ్ళు తీసుకున్నప్పుడు మూడు నెలలకే ఇచ్చేశారుగా? అప్పుడు చక్రవడ్డీ ఇవ్వాలన్నావే!'' అని అడగలేదు అక్కగారి తమ్ముడు. అడగొచ్చు, అడిగితే, ''అది వేరు'' అంటుంది. ''అది లక్షకి పైన. అంత అప్పుకి బారువడ్డీయేనా'' అనొచ్చు. అదో తగువైపోతుంది.
పాత ఇంటి నించి కొత్త ఇంటికి సామాన్లు మార్చే పెద్ద వ్యానుని రమేషే కుదిర్చాడు, తన డబ్బుతో. వర్కర్స్‌ని కూడా తనే కుదిర్చాడు, తన డబ్బుతో. నిజానికి తన దగ్గిర అంత డబ్బు లేదు. ఎక్కడెక్కడో అప్పులు తీసుకున్నాడు. అతనికి అప్పులు కాస్త తొందరగానే దొరుకుతాయి. అడగగానే ఇస్తారు.
వ్యానుతో, వర్కర్స్‌తో, పాత ఇంటికి వెళ్ళగానే, జేబులో కవరుతో మేడ మీదకి వెళ్ళాడు.
వర్కర్లు చక చకా పనిలోకి దిగారు.
వ్యాను, సామాన్లతో కిక్కిరిసి పోయింది. ఇల్లు ఖాళీ!
విడిపోయి వున్న దంపతులు ఒకే బండి మీద వ్యాను వెంట!
కొత్త అద్దె ఇంట్లో సామానంతా వర్కర్లే సర్దేశారు. మంచాలు ఎక్కడ పెట్టాలో, కుర్చీలు ఎక్కడో, బీరువాలు ఎక్కడో, డైనింగ్ బల్ల ఎక్కడో, అన్నీ చెపుతోంటే వాళ్ళే చేసేశారు. పుస్తకాల బస్తాలే గోడ దగ్గిర పడి వున్నాయి. వాళ్ళు చివర్లో, గదులు కూడా వూడ్చేశారు.
వాళ్ళకి రమేష్ పదేసి రూపాయలు ఎక్కువే ఇచ్చాడు. ఆ సంగతి ఆమెకి చెప్పలేదు.
అతను కొత్త ఇంటిని చూడడం అదే మొదటి సారి. ఆ ఇంటిని ఆమే కుదుర్చుకుంది. ఓనర్లు, పై అంతస్తులో వుంటారు. గదులు కాస్త విశాలంగా బాగానే వున్నాయి. రెండు బెడ్ రూముల ఇంటికి వున్నట్టే అన్నీ వున్నాయి. విశాలంగా బాల్కనీలు కూడా వున్నాయి. బట్టలు ఆరేసుకోవచ్చు. చాపలు వేసుకుని పడుకోవచ్చు కూడా.
వ్యానూ, వర్కర్లూ, వెళ్ళిపోయారు. ఓనరమ్మ వచ్చి ఒక సారి పలకరించి వెళ్ళింది.
అందరూ వెళ్ళాక వీధి తలుపులు మూసేసి, ప్రియ భార్య, భర్తని కావిలించుకుంది. ''ఇది కొత్త ఇల్లు. మనం విడిపోయినట్టు వీళ్ళకి తెలీదు. నువ్వు ఇక్కడ వుండకపోతే ఎలాగ రామూ?''
''ఓనరు కోసం ఇక్కడే వుండి, విడిపోయి వేరు వేరు గదుల్లో వుందామా?''
''నేను నిన్ను వెళ్ళిపొమ్మన్నానా?''
''వేరే అనాలా? 'నీతో వుంటే ఆడది చెడిపోతుంది' అంటే, ఏమిటి అర్ధం? నేను ఎంత బాధపడతానో ఆలోచించావా?''
''మరి, నాకు ఆ రాత్రి అలా జరిగితే నేను బాధపడనా? డాక్టర్‌కి చూపించుకోమంటే విన్నావా?''
''తర్వాత చెప్తే వినే వాణ్ణి కాదా? దాని కోసం 'వాడితో పోతా - వీడితో పోతా'' అంటావా?''
''సరేలే, ఇప్పటికైనా వైద్యం చేయించుకున్నావా?''
''ఒంటరిగా వున్నప్పుడు నాకా వైద్యం ఎందుకు?''
మాటల మధ్యనే, స్టౌ మీద బ్రెడ్ వేగింది. చాయి తయారైంది.
ఇద్దరూ పక్క పక్కనే కూర్చుని తిన్నారు, తాగారు.
''ఈ రాత్రి ఉండిపో రామూ!''
''కాదు, వెళ్ళి హోటల్ రూమ్ ఖాళీ చేసేసి స్కూలు నించి రేపు సాయంత్రానికి వస్తా!''
''తప్పకుండా వస్తావు కదా? మళ్ళీ ఇదీ అదీ అనొద్దు!''
''మరి, నువ్వు పాత సంగతులు మళ్ళీ ఎత్తుతూ వుంటావా? అది చెప్పు ముందు!''
''ఎప్పుడైనా అవసరం ఐతే పాతవి మాత్రం మాట్లాడుకోమా? మా డాడీ చేసిన తప్పులు ఎన్ని సార్లో చెపుతుంది మా మమ్మీ ఇప్పుడు కూడా.''
''తప్పులైతే గుర్తు చేసుకోవచ్చు.''
''మీ వాళ్ళు ఏ తప్పులూ చెయ్యలేదంటావు. అదే మరి నీతో గొడవ నాకు!''
''మా వాళ్ళు ఏం తప్పులు చేశారు?'' అని అడిగితే, ఏం జవాబులు వస్తాయో తెలుసు! ''మీ అమ్మ దొంగతనం చేసింది. మీ అయ్య కంపు బియ్యం పంపాడు. మీ తమ్ముడు పార్టనర్ షిప్పు ఇవ్వనన్నాడు. మీ అక్క వడ్డీ ఎగ్గొట్టింది!'' - అవే జవాబులు వస్తాయి. అవన్నీ తెలుసు.
ఆ మనిషినే కావిలించుకోబోయే వాడికి, ఆ ప్రశ్నలు తెలిసి ఏం ప్రయోజనం?
రమేష్‌బాబు నోరెత్తకుండా లేచాడు. ''వచ్చేస్తున్నాను'' అని ఎవరికో చెప్పాడు.
''రేపు వచ్చేస్తావు కదూ?''
''నువ్వు రమ్మంటున్నావుగా? తప్పకుండా వస్తాను.'' - తన తల్లీ, తండ్రీ, తప్పులు చేసినట్టే ఒప్పుకుని వూరుకున్నాడు.
ననన
హోటల్‌కి తిరిగి వెళ్ళగానే అన్నం తినేశాడు. బట్టలన్నీ సర్దిపెట్టుకున్నాడు. ఇప్పుడు బట్టలు సర్దుకున్నది విడిపోడానికి కాదు, కలిసిపపోడానికి!
ఫోన్లు మొదలు పెట్టాడు. మొదట శ్రీనుకి ''శ్రీనూభారు! మీరందరూ చెప్పారు, కలిసి పొమ్మని. ఆ నిర్ణయానికే వచ్చా. బాగా విచారంగా మాట్లాడింది, వచ్చెయ్యమని. ఆడ మనిషిని ఇంకేం ఏడిపిస్తాను? తప్పయిందని ఒప్పుకుంటోంది. రేపు వెళ్తా అక్కడికి.''
శ్రీనుకి ఆ మాటలు వింటే నమ్మకంగా అనిపించలేదు. ''సరే మరి! ఇంకేం గొడవలు రావులే. కొంచెం కోపం వచ్చినా చప్పున బైటికి రాకు! ఉండలేవు. నువ్వు సెటిలయ్యావంటే సంతోషం!''
ఫోను ఖాసిమ్‌కి కూడా నడిచింది. ''ఖాసిమ్ భారు! కలిసి పొమ్మని చెప్పావుగా? నీ మాటే మంచిదని ఆలోచించాను. నిన్న కొత్త అద్దె ఇంటికి సామానంతా మార్చాంలే. ఈ రూమ్ ఖాళీ చేసేసి సాయంత్రం వెళ్ళిపోతాను. నీకు చెప్పాలని....''
''వెరీ గుడ్! అలాగే చెయ్యి! కాస్త గట్టిగా వుండు! బైటికి పరిగెత్తుకు రావడం కాదు. అక్కడే వుండి, నీకు కోపం వస్తే, ఆమెతో మాట్లాడకుండా నీ మంచం వేరే గదిలో పెట్టుకో! పిల్ల కోసమే కదా నువ్వు అక్కడ వుండేది? ఆ పనులే చేసుకో! నీ చాయి నువ్వే పెట్టుకో! అంతా ఒంటరిగా వున్నట్టు వుంటూ పిల్లని చూసుకో! అప్పుడిక ఏ బాధా వుండదు.''
''అలా వుంటే ఆమె ఒప్పుకుంటుందా?''
''ఆమె ఒప్పేది ఏంటయ్యా? నీ ఇష్టం నీది. నీ దగ్గిరికి వచ్చిందంటే పళ్ళు రాలగొట్టు! అది కుదరకపోతే బైటికి రా! నాకు మా బేగమ్ మీద కోపం వచ్చిందంటే, రెండేసి నెల్ల దాకా అటు చూడను. నా రూమ్ నాదే.''
''అలాగంటావా? ఇక, నాకా పరిస్తితి రాదులే. చాలా మారిపోయింది మనిషి. నువ్వయినా మరీ అంత నిర్దయగా వుండకు ఖాసిం భారు! ఆడవాళ్ళు మన కన్నా బాధపడతారు. భార్యని ప్రేమించాలి.''
''బాధ ఎవరికి వుంటే వాళ్ళే దారికొస్తారు.''
''అవున్లే! అంతే!''
రమేష్ బాబు ఖాసిం సలహా తీసుకుని ఫోన్ మూసేస్తోంటే, ఏదో నంబరు మెరిసి మాయమైంది. మళ్ళీ కనపడి తప్పిపోయింది. మూడోసారి మెరిసి ఆగింది. కాంతమ్మ గారి నంబరే.
దానికే చేశాడు. ''ఏవండీ కాంతమ్మ గారూ! లెక్క పెట్టుకున్నారా ఆ కవర్లో దాన్ని? బాగున్నారా?''
''బాగుండకేం గానీ, మీరు వెళ్ళి పోతున్నారంటే మా ఆయన చాలా బాధ పడుతున్నాడు. ఇప్పుడు ఎవరొస్తారో లెండి. ఈ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మ గార్ని కూడా చూశాం. అసలు సంగతి అది కాదు బాబూ! చెప్పాలంటే నువ్వేమనుకుంటావో అని సిగ్గుపడుతున్నా బాబూ!''
''అలా అనకండి! నేనేం అనుకోను. చెప్పెయ్యండి! మీరు మా అమ్మతో సమానం. మీరేం చెప్పినా ఓనరు గారితో అనను. ఏం ఫర్వాలేదు, చెప్పండి!''
''మా ఆయనతో భయం ఇప్పుడేం లేదు లెండి. నిన్న నేనే అంతా చెప్పేశాను. తిట్టాడు, వూరుకున్నాడు. అది కాదు గానీ, మీకే చెప్పాలి. అసలు నిజం తెలవాలి మీకు. నీ కడుపు చల్లగా, మీ అమ్మతో సమానం అన్నావు నన్ను.''
''అవునండీ. మిమ్మల్ని చూస్తే అలాగే వుంటుంది నాకు. చెప్పండి నాకు.''
''ఏం లేదు. నేను మీ ఆవిడికి ఐదు వేలు అప్పిచ్చానని చెప్పానే, అదేం నిజం కాదు. మీ ఆవిడే నాతో అలా చెప్పించింది. మీ దగ్గిర్నించి ఆ డబ్బు తీసుకుని తనకిస్తే, నాకు ఎనిమిది వందలో, వెయ్యో, ఇస్తానంది. ఏమో, ఆవిడికి డబ్బుతో అంత అవసరం వుందేమో, మొగాళ్ళు డబ్బు అందనివ్వరు కదా అని, ఆవిడ చెప్పమన్నట్టే మిమ్మల్ని డబ్బు అడిగితే, మీరు ఐదు వేలూ నా చేతిలో పెట్టారు. మీరు వ్యానులోకి సామాన్లు ఎక్కించే హడావిడిలో వుంటే, మీ ఆవిడ ఆ డబ్బు నా చేతిలోంచి తీసుకుంది. నాకు వెయ్యి రూపాయలు ఇస్తానన్న మనిషి రెండు వందలే నా చేతిలో పెట్టింది. నాకు బాగా కోపం వచ్చింది లెండి. 'ఏంటమ్మా ఇది? నాతో ఇంత అబద్దం ఆడించి నన్ను ఇంత దగా చేస్తావా' అంటే, ఇంకో వంద ఇచ్చింది. 'చాలా అవసరంలో వున్నాను, ఇంకోసారి ఇస్తాను' అంది. 'ఇవ్వకపోతే మీ ఆయనకి చెపుతా' అన్నా గానీ, ఆ మనిషి జడిసే రకమా? అప్పుడే మీతో అనేద్దామంటే మీరు సామాను గొడవలో వున్నారు. మీరు వెళ్ళిపోయాక మా ఆయనకి చెప్పేశాను. ఆయన బాగా తిట్టాడు లెండి. తిట్టి, ఈ మూడు వందలు మీకే ఇచ్చెయ్యమన్నాడు. ఇది కూడా మీకు అందితే మీ డబ్బంతా మీ దగ్గిర వున్నట్టే. మొగుడూ పెళ్ళాల్లో, ఎవరి డబ్బు ఎవరి దగ్గిర వుంటే యేంటి? నా చేతిలో డబ్బుని మీ చేతిలో పెట్టేస్తే, మీ డబ్బు మీ దగ్గిర వున్నట్టే! మధ్యాహ్నం కాస్సేపు పడుకుంటే నిద్రపట్టదే! ఎప్పుడూ బాగా నిద్రపడుతుంది నాకు. కొడుకు లాంటి వాణ్ణి దగా చేసి మూడు వందలు సంపాదిస్తే అది నీతా - జాతా అని తిట్టాడు మా ఆయన. నిజమే. మీ ఆవిడ నాకు వెయ్యి రూపాయలు ఇచ్చేస్తే, నేను గప్ చిప్‌గా అయిపోదును! మీ ఆవిడ అంతా ఇవ్వకపోవడమే, ఇలా జరిగిందే మంచిదైంది. మీరు ఇటు వచ్చినప్పుడు నా చేతిలో వున్న డబ్బు తీసేసుకోండి బాబూ! అందుకే అంతా చెప్పాను.''
''కాంతమ్మ గారూ! మీ తప్పేం లేదు. అలా బాధపడొద్దు! నన్ను మీ అబ్బాయే అనుకోండి! నేను ఆ డబ్బు తీసుకుని, నేనే మీకు మళ్ళీ ఇచ్చేశాను అనుకోండి! ఫర్వాలేదు. మీరే ఏదన్నా కొనుక్కోండి! ఒక నేత చీర వస్తుందామ్మా ఆ డబ్బుతో?''
''ఎంత మాట నాయనా! ఇంటికి సున్నం వేయిస్తాం. మళ్ళీ ఇక్కడికే వచ్చెయ్యండి! మా ఆయనకి మీరు బాగా దోస్తులయ్యారు.''
''సరే నమ్మా, సరే'' అంటూ రమేష్, ఆ ఫోను ఆపేశాడు. తర్వాత, కుర్చీలో కూలబడ్డాడు.
ఏమిటిది! మొగుడి దగ్గిర్నించి ఐదు వేలు లాగడానికి ఒక మనిషికి వెయ్యి రూపాయలు లంచం ఇస్తానని చెప్పి, దాన్ని ఎగ్గొట్టింది! అలాంటి మనిషి ఏం మనిషి? ఆమెకి, ఆమె డబ్బే చేతి నిండా వుంటుంది. ఇంకా కావాలంటే నన్నే అడగవచ్చు! నేను అప్పుల పాలవుతూ వుంటానని తనకి తెలుసు. ఐదు వేలు ఎలా లాగాలనుకుంది? దొంగ పని! అబద్దాలు! చివరికి, కాంతమ్మని నమ్మించి మోసం! ఏ నరంలోనూ నీతి లేదా ఆ మనిషికి?
ఇంతకీ నేను సాయంత్రం వెళ్ళాలా మానాలా? వెళ్ళి నిర్మొహమాటంగా అడిగితే? అడగాలంటే అక్కడి దాకా వెళ్ళాలా? ఇప్పుడే అడిగి చూద్దాం, ఏం చెపుతుందో!
ఆమెకి ఫోను!
చప్పున ఎత్తింది. ''హలో! ఏంటి ఇప్పుడు చేశావు? ఇంకా నిద్రపోలేదా? ఇది కొత్త చోటు కదా? నాకు అసలే నిద్ర రావడం లేదు. ఇప్పటి దాకా మా మమ్మీతో మాట్లాడాను.''
''సరేలే. నేనెందుకు చేశానంటే, ఇందాక కాంతమ్మ గారు చేసింది. అసలు పొద్దున్న చేస్తే, ఐదు వేలు తీసుకెళ్ళి ఇచ్చాను. ఇప్పుడు చేసి ఆ బండారం అంతా చెప్పింది. నువ్వు డబ్బులో మునిగి తేలుతున్నావు. ఐదు వేల కోసం పరాయి మనిషిని ఆశ్రయించి, అన్ని అబద్దాలాడించి....''
''చెప్పేది విను! నిజంగా అప్పుడు నాకు డబ్బు కావలసి వచ్చింది.''
''అయితే, నన్నే అడక్క పోయావా?''
''ఏమో, నువ్వు ఇస్తావా?''
''పోనీ, ఏదో టెక్నిక్‌తో తీసుకున్నావు. చివరికి ఆవిణ్ణి మోసం చెయ్యడం ఎందుకు?''
''మోసం ఏం లేదు. ఇంకా ఇవ్వాల్సింది తర్వాత ఇస్తానని చెప్పానే!''
''మోసం కాకపోతే, ఆ మాట మొదటే చెప్పాలి. 'ఇదుగో, మీకు వెయ్యి ఇస్తానన్నాను. ఇప్పుడు రెండు వందలే ఇస్తున్నాను. తర్వాత అంతా ఇచ్చేస్తాను' అని చెప్పావా?''
అలా అడిగితే శ్యాము వొణికి పోతుందా?
ధీమాగా చేస్తుంది సంభాషణ! ''రామూ! ఎక్కడున్నావు? నేను వంట మొదలు పెట్టలేదు. రేపు వచ్చి పుస్తకాలు నువ్వే సర్దుకో! అవన్నీ ఎలా సర్దాలో నీకే తెలుస్తుంది.''
''అలాగే గానీ, శ్యామూ! ఆవిడ వెయ్యి రూపాయల కోసం పోట్లాటగా అడిగితేనే తర్వాత ఇస్తానన్నావు. దాన్ని ఆవిడ నమ్మిందా? ఆయనతో చెప్పేసింది తన తప్పంతా. 'ఆ మూడు వందలు అతనికే ఇచ్చెయ్యి. వాళ్ళ డబ్బు వాళ్ళ దగ్గిరే వుంటుంది' అని ఆయన చెప్పాడు. ఆవిడ, తన చేతిలో డబ్బు నన్ను తీసేసుకోమంది. 'వొద్దమ్మా! మీరే ఒక చీర కొనుక్కోండి' అన్నాను.....''
''ఆవిడ ఇచ్చేస్తానంటే నువ్వు తీసేసుకోవలిసింది. అలా ఎందుకు వదిలేశావు? అది మన డబ్బే కదా?''
''చాల్లే, ఊరుకో! చేసిందే పెద్ద తప్పు! ఇంకా అర్ధం కాలేదా నీకు?''
''అయిందిలే అర్ధం. అయితే పట్టు చీర కొనుక్కోమని ఆవిడికి ఇంకో వెయ్యి రూపాయలియ్యి! బాగా సంతోషిస్తుంది. అది సరే గానీ, రేపు వొస్తున్నావా, ఏమన్నా అలిగావా? అడగాల్సింది అడిగేశావుగా? ఇంకా అలకెందుకూ?''
''.............''
''మాట్లాడవేం? వచ్చేసిందా కోపం? కొత్తగా నేర్చుకుంటున్నావా? మా డాడీ దగ్గిర్నించి డబ్బు తీసుకోడానికి, మా మమ్మీ ఎన్ని ఉపాయాలు చేసేదో!''
''వాళ్ళ సంగతి వేరు. నా దగ్గిర నీకెందుకు అలాంటి ఉపాయాలు?''
''అంత అవసరం వచ్చింది రామూ!''
''బాగా నిద్రొస్తోంది. పడుకుంటా'' అనేసి ఫోన్ ఆపేశాడు.
వెళ్ళడం మానేస్తే? ఏం మనిషి! ఏం మనిషి! ఏం మారింది? మరి, 'రామూ - రామూ' అనడం మానదేం?
ఫోన్‌లో మెసేజ్ చప్పుడు! తెరిచి చూశాడు.
''నిన్ను ప్రేమిస్తున్నా రామూ! నన్ను మర్చిపోకు! నిన్ను మర్చిపోలేను!''
తను కూడా గబ గబా రాశాడు: ''సైతాన్ పట్టిందంటే వదలదు, దాన్ని వదిలించుకోగలమా?''
''ఓకే! నన్ను సైతానే అనుకో! సైతాన్ కౌగిట్లోకే రా!''
నవ్వాడు. ఫోన్ మూశాడు.
నవ్వు అణిగింది.
వెళ్ళడం మానేస్తే, ఏం చెప్పాలి శ్రీనుకి? ఖాసింకి? నిజం చెప్పేస్తే? చెప్పొచ్చు గానీ, వాళ్ళసలు వెళ్ళి పొమ్మనే అంటారు. చెప్పినా, వెళ్ళమంటారు. ఎన్నాళ్ళు గడపాలి బైట, పిల్లని వదిలేసి? వెళ్ళడమే మంచిది. వెళ్ళి, 'నీ మోసాలు తెలుస్తూనే వున్నాయి' అంటే నోరు మూసుకోదా?
నిద్ర తేలిపోతోంది!
మళ్ళీ ఫోను! కన్నయ్య! ''రమేష్ బాబూ! ఉన్నావా? ఎక్కడా?''
''ఉన్నాలే, చెప్పు కన్నయ్యా!''
''నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయావని నాకు రెండు రోజుల క్రితమే తెలిసింది. మీ ఓనరే చెప్పాడు, నువ్వు ఇంట్లో కనపడడం లేదని. రాత్రుళ్ళు కూడా కనపడడం లేదని! 'రమేష్ విడిపోయాడు' అని మీ నాన్న గారికి చెప్పినా, ఆయన ఆసక్తిగా వినలేదు. 'అది నిజం కాదులే' అన్నాడు. తీరా చేస్తే ఈ పూట ఇంకో మాట తెలిసింది. మీ ఆవిడ ఇల్లు ఖాళీ చేసేసిందట! నువ్వే వ్యానుతో వచ్చావట! నాకైనా ఒక్క మాట చెప్పలేదే రమేష్ బాబూ?''
''ఏముంది చెప్పడానికి?''
''అదేమిటి, ఏమీ లేదా? నాలుగు రోజులు ఇంట్లోనే లేవు! బయ్యారం వెళ్ళలేదు. ఎక్కడున్నావు? నా దగ్గిరికి రాకపోయావా, ఇల్లు మార్చాలంటే? నేను గుర్తు రాలేదా?''
రమేష్ బాబు, చేతిలో ఫోను వేపు కోపంగా చూశాడు. ఏది దాచిపెట్టాలన్నా దాగదే! తను ఇల్లు వదిలేసిపోయినట్టు ఇద్దరికి తప్ప ఎవ్వరికీ చెప్పలేదు. మొత్తం ఊరంతా తెలిసి పోయింది! అందరి చేతుల్లోనూ ఫోన్లే! - నేలకేసి కొట్టాలనిపించింది ఫోనుని.
కొత్త ఆలోచన మరుక్షణంలోనే! కన్నయ్య ఇంటిలోనే, పైవాటాలో హాయిగా పరుపు మీద పడుకుంటే? అమ్మనీ, నాన్ననీ రమ్మంటే వస్తారు. వాళ్ళని చూడొచ్చు! అక్కతో మాట్లాడొచ్చు! అందరం కలిసి కూర్చుని అన్నాలు తింటూ మాట్లాడుకోవచ్చు! అమ్మ, చక్రపొంగలి ఎంత కమ్మగా చేస్తుంది! అవును బాగుంటుంది. వాళ్ళు కనపడని బతుకు, ఏం బతుకు?
నిజమే గానీ, జీవితాంతం వుండేది ఎవరు? భార్యా భర్తలే! నాన్న, అమ్మతో వుంటున్నాడు. కన్నయ్య, సుందరమ్మతో వుంటున్నాడు. రత్తయ్య, కాంతమ్మతో వుంటున్నాడు. ఏ ఇంట్లో చూసినా భార్యా భర్తలే కదా? వాళ్ళే పిల్లల్ని పెంచుకోవాలి. పెళ్ళిళ్ళయి పోయిన తర్వాత కూడా ఇంకా అమ్మా - నాన్నా అనుకుంటూ వాళ్ళ వెంట తిరిగితే ఎలాగ?
అన్నీ కొత్త కొత్త ఆలోచనలే. అబ్బా! ఎంత తెలివైన వాడో రమేష్ బాబు! అతడికి 'శాంతి' కావాలి. 'సత్యం' కావాలి! అవి భార్య దగ్గిరే దొరుకుతాయని నమ్మాలనుకుంటాడు. అక్కడ దొరికేవి తగువులే అని తెలుసు. అయితే, వాటిని 'సంసార సత్యాలు' అనుకుంటాడు. భార్య వల్ల తనకి అవమానాల కన్నా, ముచ్చట్లే సరసాలే అధికం అనుకుంటాడు. కన్నయ్య వాటాలో ఒంటరిగా వుంటే, అది ఎంత కాలం? ఇంకో నలభై యేళ్ళు బతికితే ఎలాగ గడిపేది?
ఒక్క సారి అక్కతో మాట్లాడాలనిపించింది. వాళ్ళు ఫోను ఎత్తరు. బావగారు అసలే ఎత్తడు. వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడవచ్చు గానీ, ఏం మాట్లాడాలి? ''ఆమె దగ్గిరికి వెళ్తున్నాను'' అని చెప్తే, అక్క ఏమంటుంది?
''వెళ్తే మళ్ళీ వస్తావు. రాకపోతే, ఆమె ఏమిటో కాదు, నువ్వు ఏమిటో తెలుస్తుంది మాకు'' అంది, ఒక సారి. ఇప్పుడు మళ్ళీ ఆ మాటలు వినడానికే వెళ్ళాలి.
పెళ్ళం దగ్గిరికి మళ్ళీ వెళ్ళి, మళ్ళీ వచ్చి, ...... ఇటూ, అటూ తిరుగుతూ వుంటే, వినే వాళ్ళు గడ్డి పెడతారు! వెళ్తే, మళ్ళీ రాకుండా వెళ్ళాలి.
ననన
ఆ రాత్రే
మళ్ళీ ఫోను! ఎవరో!
తమ్ముడు చేశాడు, ఈ అన్నకి.
Authorization