ఒక సారి శ్రీను అడిగాడు. ''నీ పిల్లని, ఏ విషయంలో నీ ఆలోచన ప్రకారం పెంచుతున్నావు?'' అన్నాడు.
''ఫర్వాలేదు. పిల్లలు అన్నీ చూడాలి'' అన్నాడు ఈ తండ్రి.
ఈ రకం తండీ, ఆ రకం తల్లీ, పెంచుతున్నారు చిట్టిని!
ిిి
ఆ మర్నాటి సాయంత్రం రమేష్ బాబు ఇంటికొచ్చేటప్పటికి, ఈ కొత్త ఇంటి ఓనరమ్మ కూడా శ్యాముతో నిర్మొహమాటంగా అంటోంది. ''మీ కన్నా నేను నాలుగేళ్ళే పెద్ద దాన్ని. నన్ను 'ఆంటీ - ఆంటీ' అంటారేమిటి మీరు? మొన్న చెప్పానుగా?'' అంది కోపంగా.
''అలా అలవాటైపోయింది ఆంటీ!'' అంది మళ్ళీ ఈవిడ.
''మీతో కుదరదమ్మా! ఈ నెల తర్వాత ఇల్లు ఖాళీ చేసెయ్యండి!'' అంటూ ఆవిడ వాళ్ళ ఇంటి వేపు వెళ్ళిపోయింది.
బైట నిలబడి అంతా విన్న తర్వాతే రమేష్ బాబు లోపలికి వెళ్ళాడు. తను విన్న సంగతి ఇక ఎత్తలేదు! ''నీ వయసే వున్న ఆవిణ్ణి 'ఆంటీ' అనడం ఎందుకు?'' అని అడగలేదు. అదేదో ఆవిడే అడిగిందిగా? అని వూరుకున్నాడు. తనని ఇంటి బైట పెట్టేసి తలుపులు బిగించేసినప్పుడే ప్రశ్నించని మనిషి, ఎవర్ని గురించో ఏదో అడుగుతాడనీ, అడగలేదనీ, సందేహాలా?
''రామూ! అప్పుడు నువ్వు వారం రోజులు బైట వున్నావు కదా? అప్పుడు ఎంత ఖర్చు పెట్టావు?''
''ఏదో పెట్టాలే. ఆ రూము రెంటూ, టిఫెన్లూ, భోజనాలూ, అవన్నీ వుంటాయిగా? ఇంట్లో వుంటే అంత ఖర్చు అవదు.''
''మాట మాట్లాడితే బైటికి పరిగెత్తుతావు, డబ్బు నాశనం చేస్తావు. మనం డబ్బు బాగా పొదుపు చేసుకోవాలి రామూ! అన్నట్టు ఒక మాట! మీ తమ్ముడు రెండు మూడు లక్షలు సర్దగలడా నీకు?''
''ఎందుకూ? నా కెందుకూ?''
''ఏం, మనం ఇల్లు కొనుక్కోడం లేదూ? డబ్బు సర్దితే నీ కోసం చేస్తాడు గానీ, నా కోసం చేస్తాడా? అందుకే 'నీకు సర్దుతాడా?' అన్నాను.''
'''సర్దడం' అంటే? ఊరికే ఇవ్వాలనా?''
''ఏం? అన్నదమ్ములు ఊరికే ఇచ్చుకుంటే యేం?''
రమేష్ తెల్లబోతూ చూశాడు. ''నీ చిన్నక్కకి ఇరవై వేలిచ్చి వెంటనే వెనక్కి తీసేసుకున్నావే!'' అనెయ్యాలనిపించింది గానీ, 'అబ్బ, ఎంత తగువు అవుతుందో! గోల గోల అవుతుంది' అని ఆ మాట అణుచుకున్నాడు. ఇంకో సంగతి గుర్తొచ్చింది. అన్న బండిని తమ్ముడు వాడితే, దానికి డబ్బిచ్చెయ్యాలంది. ఇప్పుడు, తమ్ముణ్ణి అన్న రెండు లక్షలు ఇవ్వమని అడగాలా! ''అసలు, మా వాళ్ళతో సంబంధాలు నీకు నచ్చవుగా? నచ్చని వాళ్ళ దగ్గిర ఊరికే ఎలా తీసుకుంటావు?'' అన్నాడు.
''ఊరికే ఇమ్మన్నానా? 'సర్దడం' అంటే, అప్పు ఇచ్చినా అదీ సర్దడమే.''
''అయితే నువ్వే అడుగు మనోహర్‌ని. అప్పంతా చక్రవడ్డీతో తీర్చేస్తాను - అని చెప్పు!''
''భలే వాడివే. తమ్ముడికి చక్రవడ్డీ ఇప్పించాలనా? అప్ప దగ్గిర్నించి ఆ వడ్డీ లాగలేకపోయావు గానీ, తమ్ముడికైతే అంత వడ్డీ ఇప్పిస్తావా? అమ్మో, 'నల్లి'వి నువ్వు! కనపడకుండా కుడతావు!''
''మా అక్కా వాళ్ళు ఒక లక్ష అయినా ఇస్తారేమో! అదీ అడుగు!''
''నేనే అడగాలా? నువ్వే అడుగు! వీళ్ళకైతే అసలు వడ్డీయే ఇచ్చేది వుండదు. అప్పుడు అన్నీ తప్పు లెక్కలు చూపించి సగం వడ్డీ ఎగ్గొట్టారు.''
''అయితే, ఎవ్వర్నీ అడగొద్దులే.''
''మా మమ్మీ ఏమంటోందంటే, మా చిన్న అన్నని కొంత అడగమంటోంది. ఇస్తాడంటోంది.''
''...........''
తల్లిని పొడవడానికి చాకు అందించిన వాణ్ణి అడగమని, ఆ తల్లే అంటోందా!
''ఏం, మాట్లాడవేం?''
''ఏమో, అతని సంగతి నాకు తెలీదు కదా?''
''ఫ్రెండ్స్ - ఫ్రెండ్స్ అంటావు. నీకు చాలా మంది ఫ్రెండ్స్ వుంటారు. ఎవర్నన్నా అడగరాదూ?''
''వొద్దులే. కుటుంబ సభ్యులయితే వేరు గానీ....''
''ఏం, ఫ్రెండ్సు, కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ కాదా?''
''ఎక్కువో - తక్కువో. అంతంత లక్షలు వున్న వాళ్ళెవరూ లేరు నా ఫ్రెండ్స్‌లో.''
ఇల్లు కొనే ప్రయత్నం మొదలై బిల్డర్‌కి రెండు లక్షలు శ్యాము ఎక్కౌంటులో నించి ఇచ్చెయ్యడం కూడా జరిగిపోయింది.
శ్యాముకి డబ్బు పొదుపులూ, ఆలోచనలూ, చుట్టుముడుతున్నాయి.
శ్యాము, ఆ రోజు ఇంట్లో వున్న ఖాళీ డబ్బాలూ సీసాలూ పెద్ద సంచి నిండా కుక్కి, ముందు వాకిట్లో గేటు పక్కన పెట్టింది, వాటిని కొనే షాపులో అమ్మెయ్యడానికి.
ఆ సాయంత్రం ఆ సంచిని చూస్తే, రెండు పెద్ద సీసాలు లేనట్టు కనపడింది. ''రామూ! పెద్ద సీసాలు వుండాలే. ఎవరో తీసేశారు. ఎవరు తీసేశారు?'' అని రాముని కోపంగా అడిగింది.
''నేను చూడలేదే! ఎవరు తీస్తారు? పోనీలే, తీస్తే తీశారు. వాళ్ళు వాడుకుంటారేమో!'' అన్నాడు రాము.
''అదే మరి. నీకు చిల్లిగవ్వ సంపాదించడం రాదు గానీ, సంపాదించి పోస్తోంటే, దుబారా చెయ్యడం బాగా వచ్చు. అంకుల్‌ని అడుగుతా'' అంటూ గబ గబా ఓనర్ గారి గుమ్మం వేపు వెళ్ళింది.
''శ్యామూ! శ్యామూ!'' అని వెనకాల రాము కంగారుగా పిలుస్తూ కొయ్యబారినట్టు దూరంగా వుండిపోయాడు. నాలుగు రోజుల కిందటే, ఆవిడితో పోట్లాడిన మనిషి, మళ్ళీ వాళ్ళ గుమ్మంలోకి ఎలా వెళ్ళింది? పైగా, పాత సీసాల గురించి అడుగడానికా! తెల్లబోతూనే వున్నాడు.
అవతల, గుమ్మం దగ్గిర ఓనరు బైటికి వచ్చాడు. ''ఏంటమ్మా?'' అన్నాడు.
''అంకుల్! సీసాల సంచి అక్కడ పెట్టానండీ. షాపులో ఇచ్చెయ్యాలని పెట్టాను. మంచి మంచి సీసాలు పెద్దవి నాలుగైదు కనపడడం లేదండీ.'' కనపడనివి, రెండల్లా నాలుగయ్యాయి!
''అక్కడెందుకు పెట్టారు? పొద్దున్న మునిసిపాలిటీ వర్కర్స్ రోడ్లు వూడ్చడానికి తిరుగుతారు. మంచి నీళ్ళకి పని కొస్తాయని ఎవరైనా తీసుకున్నారేమో!''
''మీరు ఇక్కడే కూర్చుంటారుగా అంకుల్? లేకపోతే ఆంటీ చూశారేమో! ఒక్క సారి ఆంటీ గార్ని పిలుస్తారా?''
''ఆంటీని పిల్చి అడిగితే మిమ్మల్ని పళ్ళు రాలగొడుతుంది. మీ సీసాలకి కాపలాగా కూర్చున్నామా మేమిద్దరం? అసలు మేమే తీసుకున్నట్టు మీ అనుమానం లాగుంది. మీరు ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు?'' అంటూ ఆయన దూరంగా కనపడుతోన్న రమేష్ బాబుని కూడా చూశాడు. ''రమేష్ గారూ! మీరు ఇల్లు ఖాళీ చేసెయ్యండి! మీ డబ్బు మీరు పట్టుకు పోండి! మీరు ఇల్లు ఖాళీ చేస్తే చాలు!'' అనేసి, ఓనరు లోపలికి వెళ్ళిపోయాడు.
రమేష్‌కి అయితే కొంచెం సిగ్గు మేల్కొంది. సిగ్గు, సిగ్గు పడింది.
శ్యాము రుస రుసలాడుతూ ఇవతలకి వచ్చి బండి తీసింది. సీసాల సంచిని వెనక సీటుకి కట్టి బండి ఎక్కింది. ఒక గంట సేపట్లో అమ్మకాలు చేసేసి ఇంటికొచ్చింది. ''రామూ! ఆ పెద్ద సీసాలు రెండూ కూడా వుంటే, ఇంకా కాస్త వచ్చేది'' అంది. ఎంత వచ్చిందో మాత్రం చెప్పలేదు.
రాము, శ్యాముకి చాయి అందించాడు. అది తాగుతూనే ఆమె, చాయి ఇచ్చిన వాడితో తగువు మొదలు పెట్టింది. ''ఏంటి? 'ఇల్లు ఖాళీ చెయ్యండి' అని వాగాడు! నువ్వు నోరు మూసుకుని వూరుకున్నావు. ఆడదాన్ని నేనే మాట్లాడాలా? ఆడదాని బతుకు బాగానే వుంటుంది నీలాంటి మొగుడితో.''
''సీసాల మాట వాళ్ళని అడగడం ఎందుకు చెప్పు?''
''ఏం, అడిగితే? ఎవరు తీశారో చూస్తే చూశామని చెప్పాలి. లేకపోతే చూడలేదనాలి.''
''ఎవరో పిల్లలు పట్టుకు పోయారని, పారిపోయారని, చెప్తే మాత్రం ఇప్పుడు మనం వాళ్ళని పట్టుకుంటామా?''
''లాజిక్కులు బాగా మాట్లాడతావు. పెళ్ళాన్ని వెనకేసుకు రావడం చేతకాదు. 'ఇల్లు ఖాళీ చెయ్యమని' వాడు వాగుతోంటే, చూస్తూ నించున్నావు. ఇక, నాకేం విలువ ఇస్తాడు ఎవడైనా? అసలు నాదే తప్పులే. విడిపోయిన వాళ్ళం విడిపోయినట్టు వుండకుండా మళ్ళీ కలవడం ఎందుకు, నాకు మతిలేక కాకపోతే?'' అంటూ వంటింట్లోకి చక చకా వెళ్ళింది.
ఆ మర్నాడు, శ్యాము మెడలో ఒక కొత్త గొలుసు కనపడింది. ఆ గొలుసుకి లాకెట్టు శిలువ! కాళ్ళ వేళ్ళకి ఎప్పుడూ లేని ఫేషన్ మట్టెలు!
బ్యాంకుకి, రమేష్, తన జీతంలో నించి పదిహేనేసి వేలు కట్టడం రెండు సార్లు జరిగింది. బజార్లో ఏదైనా కొనాలని వెళ్తే, వంకాయలో, బీరకాయలో, చెప్పులో, పెన్సిళ్ళో, ఏది కొనాలన్నా, ''నీకు తెలీదులే, నేను చూస్తానుండు. ఏది కొనాలన్నా ఆడవాళ్ళకే తెలుస్తుంది'' అనడమే ఆమె!
బిల్డర్‌తో ఏదైనా మాట్లాడవలసి వుంటే, ''నీకు సరిగా తెలీదు. నేను వెళ్తా!''
ఆమె ఆలస్యంగా ఇంటికి వస్తే, ''ఏం, ఇంతాలస్యం?'' అని నవ్వు మొహంతో అడిగినా, తల ఎగరేసి, ''అయిందిలే'' అని, రెండో మాట వుండదు.
ఈ తండ్రి, పిల్లకి చదువు మొదలు పెట్టి చిన్న చిన్న ఇంగ్లీషు మాటలు చెపుతోంటే, ''ఈ మాటలన్నీ నీకు ఇప్పుడే తెలుస్తున్నాయనుకుంటా. ఇంగ్లీషు మీడియమ్ కాని వాళ్ళకి బియ్యే చదివినా, వంకాయికి ఇంగ్లీషు పేరు తెలీదులే'' అంది.
పిల్లకి ఏది చెపుతోన్నా ఏదో ఒక తీసివేతే. ఒక్కోసారి పిల్ల కూడా నవ్వుతుంది ఆ మాటలకి. బండి మీద తల్లి బైల్దేరుతోంటే, పిల్ల దూరంగా నించుని చూస్తుంది గానీ కదలదు. బండిని తండ్రి తీస్తోంటే, పెద్ద నవ్వుతో వెంట పడుతుంది ''నేనూ, నేనూ'' అంటూ.
అది చూసి తల్లి సహించదు. ''పిల్లని నీ వేపు తిప్పుకోవాలని తెగ ఎత్తు లేస్తావు. అస్తమానూ ఎత్తుకు మోస్తోంటే, ఇక దానికి నేనేం పని కొస్తాను?'' అంటుంది ఈవిడ, వాళ్ళిద్దరూ ఇంటికి రాగానే.
ఆ మాటలు పట్టించుకోరు వాళ్ళిద్దరూ.
పిల్ల, ఒక్కోసారి ఇటూ, ఒక్కోసారి అటూ వుంటుంది.
ఒక రోజు రాత్రి ఎనిమిది దాటిన తర్వాత వచ్చింది. ఇతను అడగలేదు. ఆమె చెప్పలేదు. ఆమె బండి మీటర్ రీడింగులు తియ్యాలని ఇతనికి బుద్ది పుట్టింది. ఆదివారం సాయంత్రం ఆమె ఎక్కడికో బైల్దేరబోతోంది. అప్పటికే మీటర్ రీడింగ్ తీసి వుంచాడు. వెళ్ళి రెండు గంటల తర్వాత వచ్చింది. అప్పుడు మళ్ళీ చూశాడు మీటరు. ఆరు కిలోమీటర్లు పెరిగింది. వెళ్ళడానికి మూడూ, రావడానికి మూడూ. ఎక్కడికి? చెప్పదు, చెప్పకపోతే తెలీదు. ఎందుకా తుక్కు ప్రయోగం?
ఒక సారి, ఆమె చేసినట్టే తనూ చేసి, ఆమె ఫోనులోంచి కొన్ని నంబర్లు సంపాదించాడు. సిమ్‌కార్డో ఏదో అదేదో తీశాడు. ఆ నంబర్లకి చేసి, పలికిన వాళ్ళు ఎలా పలుకుతారో వినాలని ఐదారు నంబర్లకి చేశాడు. నాలుగు ఫోన్లకి జవాబులే లేవు. నంబర్లే పడలేదు. ఒక్కడు పలికాడు. పలకగానే హడిలిపోయి ఆపేశాడు.
అదంతా ఆమెకి తెలిసి పోయింది. రయ్యి రయ్యిన ఇతన్ని అడిగేసింది. ''నా నంబర్లు ఎందుకు తీశావు?'' అంది.
''నా నంబర్లు నువ్వెందుకు తీశావు?'' అనొచ్చు ఇతడు. అనడు. నవ్వేశాడు. అదొకటి నేర్చాడు. ''నీ ఫోన్‌లో ఎవరెవరున్నారో అని చూశా, అంతే'' అన్నాడు.
ఆమె ఏదో వడ్డీల హడావిడిలో వుండి వదిలేసింది.
జజజ
ఓనరు ఇంటికి అవతలి పక్క ఆయన, ఒక రోజు వచ్చాడు, ''రమేష్‌బాబు గారు వున్నారా?'' అంటూ. పూర్తిగా కొత్తవాడు.
''కూర్చోండి, కూర్చోండి'' అంటూ మర్యాద చేశాడు రమేష్.
వచ్చిన ఆయన, ''నాది రియలెస్టేట్ వ్యాపారం'' అని చెప్పాడు. ''ఎవరైనా ఇళ్ళూ, స్తలాలూ, కొనుక్కోవాలని చూస్తుంటారు కదండీ? అలాంటి వాళ్ళు మీకు తెలిస్తే, నా పేరు చెప్పి, నా నంబరిచ్చి, నాతో మాట్లాడుకోమని వాళ్ళకి మీరు చెప్తే చాలు. ఆ బేరం జరిగిందంటే, మీకు కమిషన్ వుంటుంది'' అన్నాడు.
రమేష్ బాబు తెల్లబోయాడు. ''అవన్నీ నాకు చేతకావండీ'' అన్నాడు.
శ్యాము చాయి తెచ్చి ఇచ్చింది ఆయనకి.
''అమ్మా! మీరు వినండి!'' అని అంతకు ముందు చెప్పిందే మళ్ళీ చెప్పాడు. చెప్పి, ''కొనే వాళ్ళూ, అమ్మే వాళ్ళూ తెలిస్తే, అమ్మా, మీరైనా నా నంబర్‌కి చెయ్యండి. అది సెటిలైతే, మీకు కమిషన్ వుంటుంది. నిజం చెప్పాలంటే, ఈ బిజినెస్‌లో ఆడవాళ్ళే ఎక్కువగా వున్నారమ్మా'' అన్నాడు.
శ్యాము వెంటనే తన ఫోన్‌లో ఆ నంబరు నోట్ చేసుకుంది. తన స్తలాల గురించి చెప్పింది. వాటికి 'మంచి' ధరలు వస్తే అమ్ముతానంది.
''తప్పకుండా వాటి బేరాలు నేను చూస్తానమ్మా! మీరు బిజినెస్‌కి బాగా సూటవుతారమ్మా! నిన్న మీరు కూరగాయల షాపు దగ్గిర మా ఆవిడితో మాట్లాడారంట కదమ్మా? మీ గురించే ఆవిడ చెపుతోంది. మీది కులాంతరం అని విన్నానమ్మా! ఇలాంటి కుటుంబాన్ని నేనెప్పుడూ చూడలేదు'' అన్నాడు వినయంగా.
తర్వాత, రమేష్‌తో, ''మీదే కులం సార్?'' అని అడిగేశాడు. ''మీదే వూరు?'' అని అడిగినట్టే! నిజంగా అతను, ఏది తప్పో ఏది రైటో, తెలిసిన వాడు కాడు. చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు, అంతే.
''మీదే కులం?'' అని కొత్త మనిషి అడిగిన దానికి, ''మాకు కులాలు లేవు'' అని వూరుకున్నాడు రమేష్.
''మీది పెద్ద కులం అయి వుంటుంది. ఆ కులాన్నే వుంచుకుని, అన్ని కులాల వారినీ మర్యాదగానే చూడొచ్చు కదండీ?''
'' 'నాది పెద్ద కులం' అనుకుంటే, చిన్న కులం వారిని మర్యాదగా ఎలా చూస్తామో చెప్పండి'' అన్నాడు రమేష్.
ఆ కొత్త మనిషి శ్యాముతో, ''అమ్మా! మనదే కులం?'' అన్నాడు.
''మాది ఎస్సీ అండీ. అతనిదేమో చౌదరి. పిల్లకి చౌదరి కులం పేరు పెట్టాలన్నా ఈయన ఒప్పుకోడు'' అంది. అది, తన భర్త మీద ఫిర్యాదుగా చెపుతోందో, పొగడ్తగా చెపుతోందో, కొత్త మనిషికి అర్ధం కాలేదు.
ఈమె వెంటనే, ''మరి, మీ కులం చెప్పలేదేం సార్?'' అంది ఆయనతో.
''మాది బీసీల్లోకి వస్తుందంటారమ్మా! ఆ పేరేవిటో నా కస్సలు అర్ధం కాదు'' అంటూ లేచాడు ఆయన.
రమేష్ కూడా లేచి, ఆయన వెంట గేటు దాకా వెళ్ళాడు.
ఆయన వెనక్కి తిరిగి ఇంటి లోపలి దాకా చూసి గేటు అవతల నిలబడి, ''మీరు మంచి వారు. మేడమ్ కూడా మంచివారే. కొంచెం సర్దుకుంటే బాగుంటుంది. 'సంసారం' అన్నాక సర్దుబాట్లు అందరికీ తప్పవు కదయ్యా?'' అన్నాడు.
రమేష్‌కి మొదట అర్ధం కాలేదు. వెంటనే ''వీళ్ళకెలా తెలిసింది?'' అని ఆశ్చర్యపోయాడు.
అతని స్పందనలు ఎప్పుడూ, ఆశ్చర్యపోడం, తెల్లబోడం, కొయ్యబారడం, నిర్ఘాంతబోడం, అవే, గంటకోసారి ఏదో ఒకటి!
''మీ మేడమ్ గారే నిన్న మా ఇంటికి వచ్చి తోడుకి కొంచెం మజ్జిగ చుక్క అడిగారు. అప్పుడు కాస్సేపు కూర్చుని ఏదో కడుపులో బాధ చెప్పుకున్నారు, మా ఆవిడితో'' అన్నాడు జాలిపడుతున్నట్టు.
రమేష్‌కి మతిపోయినట్టు, కొత్త స్పందన రేగింది. బజార్లో కూరగాయలు కొన్నప్పుడు పరిచయం అయిన మనిషి, పక్కింటావిడే అని తెలిసి, పాలల్లోకి తోడు కావాలనే వంకతో వాళ్ళింటికి పోయి, అన్నీ చెప్పిందా! ఏమిటిది!
''మీరు మా ఇంటికి వచ్చింది, మీ వ్యాపారం మాట చెప్పాలని కాదా?'' అన్నాడు రమేష్ ఇంకా తెల్లబోతూ.
''ఇదీ అదీ కూడా మీతో అనాలని వచ్చాలెండి. మీ ఆవిడ కళ్ళు తుడుచుకుంటూనే చెప్పారంట. మా ఆవిడ అంది.''
''ఆవిడ అలాగే చెపుతుంది అందరికీ. అది నిజం కాదు. ఆమె కొంచెం డిప్రెషన్ మనిషి. ఈ మధ్య కొంచెం ఎక్కువైనట్టుంది అదేదో.''
''అయ్యో! అయితే మరి డాక్టర్‌కి చూపించారా?''
''డాక్టర్ దగ్గిరికి వస్తుందా? రాదు.''
''కాదు, ఒక సారి చూపించండి తప్పకుండా. ఆమె చెప్పగానే నిజం అనుకున్నాం సుమండీ. అదంతా నిజం కాదని మా ఆవిడికి చెప్తా. కానీ, ఆవిడ నమ్మదేమో!'' అంటూ నెమ్మదిగా వెళ్ళిపోయాడు ఆయన. మూడో ఇల్లే వాళ్ళది.
ఆయన వెళ్ళి పోగానే రమేష్ బాబు గబ గబా లోపలికి వచ్చేశాడు. అప్పుడే చీకటి పడుతోంది. రాత్రుళ్ళు అయితే, వీధి గుమ్మం దాటి బైట కాలు పెట్టాలంటే జడిసి పోతున్నాడు. తెల్లవార్లూ బైట, దోమల్తో పీకించుకుంటూ వుండాల్సిందే! లోపలికి అడుగు పెట్టేశాడు.
''ఏవిటి, అతనితో మాటలు?''
''ఏం లేదు. వాళ్ళ బిజినెస్ సంగతులే చెపుతున్నాడు.''
''అలాంటివి నువ్వు వినవుగా?''
''నీ స్తలాల గురించి కూడా చెప్పాడు. మూడు రెట్లు ధర పెరిగితే గానీ అమ్మవొద్దని నీతో చెప్పమని చెప్పాడు.''
''మూడు రెట్లేనా? ఏడిసినట్టే వుంది. ఐదు రెట్లన్నా వస్తేగానీ అమ్మే ఆలోచనే లేదు నాకు.''
''నువ్వు బిజినెస్‌కి బాగా సూటవుతావని అన్నాడుగా?''
''అవునూ. నా టాలెంట్ నీకు తెలీదు గానీ, నీ తమ్ముడికి మాత్రం తెలిసిందా? తెలిసే వాళ్ళకి తెలీదా?''
అంతే, రమేష్ ఇంకే మాటా ఎత్తలేదు.
''రామూ! ఒక మాట! బాప్టిజం తీసుకోవాలనుకుంటున్నాను.''
''..........''
''ఏం, మాట్లాడవేం?''
''నేనేం మాట్లాడాలి? నీ నమ్మకం అది.''
''నా నమ్మకం కాకపోతే, నీ నమ్మకం వుంటుందా నాకు? అసలు బాప్టిజం అంటే తెలుసా?''
''ఆ పేరు విన్నాను. అంత కన్నా తెలీదు.''
''తెలీనప్పుడు అడగాలిగా?''
''నాకు ఎందుకూ? నాకా ఆసక్తి లేదు. అదేదో మతం ఫంక్షను. అన్ని మతాలకీ ఏవేవో వుంటాయి.''
''ఆ రోజు నువ్వు కూడా రావాలి. నా ఫొటోలు తియ్యాలి. 'బాప్టిజం' అంటే, ప్రభువుకి మరింత దగ్గిరవడం. తెల్ల దుస్తులతో నీళ్ళల్లో మునిగితే, అక్కడికి పావురాలు వస్తాయి. అది ప్రభువు ఆశీర్వాదం.''
''పావురాలెలా వస్తాయి? వాటిని ఏర్పాటు చేస్తారా?''
''ప్రభువే ఏర్పాటు చేస్తాడు అనుకోవాలి. రాకపోయినా వచ్చినట్టు ఊహించాలి. అప్పుడు నువ్వు ఫొటోలు తీస్తే....''
''నన్నెలా అడుగుతావు? మొన్న ఒకళ్ళు, వాళ్ళ పిల్లాడికి 'వడుగు' చేస్తున్నాం అని పిలిస్తే నేను వెళ్ళానా?''
''అది పరాయి వాళ్ళ సంగతి. ఇది నీ పెళ్ళం సంగతి కదా?''
''ఇది, భార్యా భర్తల ఆరోగ్యాలో, ఏదో కాదు.''
''అయితే నువ్వు రావన్న మాట! మా పాస్టర్లందరూ నవ్వుతారు.''
''నవ్వితే, నా గురించేగా? ఫర్వాలేదు.''
''నువ్వు మారతావు అనుకున్నాను. ఏం మారావు?''
''నేనూ అలాగే అనుకున్నాను, నువ్వు నాస్తికురాలివి అవుతావని. ఇద్దరిదీ తప్పే.''
''అయితే, మనం పెళ్ళి చేసుకోకుండా వుండవలసిందా? నాకు అలాగే అనిపిస్తోంది.''
''అయితే మాత్రం, ఇప్పుడేం చేస్తాం?''
''ఎందుకు చెయ్యలేం? విడిపోదాం.''
''మూడు సార్లు విడిపోయి, కలిశాం. అదీ చెయ్యలేకపోతున్నాంగా?''
''ఈ సారి గట్టిగా వుందాం!''
''.........''
''ఏం, మాట్లాడవేం?''
''చిట్టి సంగతి?''
''సరేలే, లే భోజనాలు చేద్దాం. పొట్లకాయి పెరుగు పచ్చడి. టమాటా పచ్చడి కూడా తెచ్చా ఇందాక.''
''పచ్చళ్ళూ, వేపుళ్ళూ, ఆరోగ్యానికి మంచివి కావని పేపర్లు తెగరాస్తున్నాయి.''
''వాళ్ళు అలాగే రాస్తార్లే.''
ిిి
ఆ రాత్రే ఆమె బైటికి పోయి ఎవరి తోటో చాలా సేపు మాట్లాడి వచ్చింది. మంచం మీద పడిపోయి అటు వేపు తిరిగి నిద్రలోకి పోయింది.
అరగంట దాటి వుంటుంది. రమేష్ ఫోన్‌కి మెసేజ్ శబ్దం. నెమ్మదిగా లేచి రెండో గదిలోకి వెళ్ళాడు.
ఫోన్ తెరిచి చూస్తే, ''రమేష్! ఒక సారి కాల్ చెయ్యి!'' అని శ్రీను నించి మెసేజ్!
చేశాడు.
''మీ ఇంట్లో ఏదైనా జరిగిందా?'' అని శ్రీను ప్రశ్న.
''అదేంటి? మా ఇంటి గోల ఎందుకు నీకు?''
''మీ ఆవిడ నాకు ఫోన్ చేసింది?''
''ఎప్పుడు? నిద్రపోతోందే.''
''ఇప్పుడే. అరగంటయింది.''
''సరే, చెప్పు! బాప్టిజం ఫంక్షన్‌కి రమ్మని పిలిచి వుంటుంది. నన్నూ రమ్మంది మొదట! నేను రానన్నాను. నిన్ను రమ్మందా?''
''అదేం కాదు. 'రమేష్ మీద మీ అభిప్రాయం ఏమిటండీ?' అని అడిగింది మొదట. నేను తెల్లబోయాను. నన్ను అడిగింది గానీ, నా జవాబేదీ వినలేదు. తనే చెప్పుకుంటూ పోయింది. పిల్లని నీ పక్షానికి లాక్కోవాలని చూస్తున్నావట! ఇందాక ఎవరో పక్కింటాయన మీ ఇంటికి వస్తే, ఆయన వెనకాల వెళ్ళి గేటు అవతల ఆయనకి ఏదేదో చెప్పావట! 'అసలు, రమేష్ నా గురించి మీకేం చెపుతాడు?' అని అడిగింది తర్వాత. 'మీ గురించి, మా మధ్య ఏ మాటా రాదే!' అన్నాను. అలా అంటే, తను ఆశ్చర్యపోయింది. 'నా గురించి మీ మధ్య ఏ మాటా రాదా? ఇంకో నెలలో నేను కొత్త అపార్టుమెంటులోకి మారబోతున్నాను. అది కొనేశాను. అది, సెకండ్ హాండ్ అపార్టుమెంటు కాదండీ. సరి కొత్తది! కలర్స్ ఎలా వేయించాలో తను చెప్పడు. ఇల్లు నా పేర్నే వుందని తనకి బాధలెండి. చాలా అసూయ పడతాడు. అతను కూడా కొంత డబ్బు కడుతున్నాడు గానీ, అదెంత? చిటికెడు. కొత్త ఇంటి డెకరేషన్ గురించి పట్టించుకోకపోతే, రేపు ఆ ఇంట్లో కాలు ఎలా పెడతాడండీ? ఇల్లు తను కట్టించినట్టు, నాతో పాటు వచ్చి కూర్చుంటాడా?' - రమేష్! అలాగే చాలా మాట్లాడింది. 'నేను, నేను' అనే మాటే గానీ, 'మేము' అని ఒక్క సారి కూడా రాలేదు! రమేష్! వింటున్నావా? నాకేమనిపించిందంటే, ఆ కొత్త ఇంట్లో నువ్వు కూడా తిరగడం ఆమెకి ఇష్టం లేదనిపించింది. మీ మధ్య ఏం తగువులో నాకు తెలీదు కదా? వెంటనే నీకు చెప్పాలనిపించింది.'' అంత వరకూ చెప్పాడు శ్రీను.
ఏం మాట్లాడాలో రమేష్ బాబుకి అర్ధం కాలేదు. ''శ్రీనూ! నేను మూడో సారి బైటికి పోయి, తిరిగి వచ్చి ఎన్నాళ్ళయిందనుకుంటున్నావు? రెండు నెలలే. చాలా జరుగుతున్నాయి గానీ, మళ్ళీ తెంపుకోవాలంటే, సిగ్గు పడుతున్నాను.''
''సిగ్గుపడేది, తెంపుకోవడానికి కాదు, ఇంకా అక్కడే దేకడానికి సిగ్గుపడాలి.''
''బైటి వాళ్ళకి నా మీద ఎన్నెన్నో చెప్పేస్తుంది. నాతో మామూలు గానే వుంటుంది శ్రీనూ!''
''నిన్ను బైటికి గెంటడానికి అన్ని ఇబ్బందులు పడుతోంది నీతో. అది తెలియడం లేదా నీకు?''
''అంతే అంటావా?''
''ఏమో! నేనే పొరపడుతున్నానేమో! ఇందాక జరిగిందే చెప్పాలని చేశాలే.''
''నీ తోనే కాదు, బోలెడు మందితో చెపుతోంది ఇలాగే.''
''ఎవ్వరూ నమ్మర్లే. ఆ భయం వద్దు. రేపు ఒక సారి వస్తావా?''
''అవును, నీతో పని వుంది నాకు. సోమశేఖర్ నిన్న పది వేలు కావాలని ఫోన్ చేశాడు. నమ్మకస్తుడేలే. ఆ సందేహం అక్కర్లేదు. నా దగ్గిర ఒక్క పైసా లేదు. ఎవర్నన్నా అడిగి పంపాలనే అనుకున్నాను. రేపు వస్తా. నువ్వే ఇయ్యి!''
''సరేలే, రా! నీ సంగతులు కాస్త ఆలోచించుకో!''
ఫోన్ ఆపేశాక, రమేష్ ఆ రెండో గదిలోనే పడుకోవాలని కాస్సేపు అక్కడే కూర్చున్నాడు.
అర్ధరాత్రి దాటేప్పటికి ఆలోచన మారింది. తెల్లారి ఏం గొడవ పెడుతుందో ఇక్కడ పడుకుంటే! కొన్నాళ్ళు చూద్దాం. విడిపోవాలంటే ఎంతసేపు? సూట్‌కేస్‌ని చేత్తో పట్టుకుని శ్రీను దగ్గిరికో, ఖాసిం దగ్గిరికో, పోతే చాలు! తర్వాత ఓ అద్దె ఇల్లు తీసుకోవచ్చు. కన్నయ్య వున్నాడుగాని ఆ వాటా ఖాళీగా వుందో లేదో! మరి, నెలకి పదిహేను వేలు బ్యాంకుకి పోతోంటే, ఇంటి అద్దె ఎలాగ? తిండి ఎలాగ? మాట్లాడాలి అన్నీ శ్రీనుతో.
నెమ్మదిగా లేచి, ఎప్పటి మంచం మీదే తన వేపు తను వాలాడు.
ిిి
ఆ మర్నాడు, ఆ పది వేలూ తెచ్చి అలమారులో పెట్టి, వెంటనే సోమశేఖర్‌కి ఫోన్ చేశాడు, డబ్బు తీసుకు వెళ్ళమని.
అతను, ''ఇప్పుడు నేను మా వూళ్ళో వున్నాను. రెండు మూడు రోజుల్లో గానీ రాలేను'' అన్నాడు.
శ్యాము అడిగింది, ''ఆ అలమారులో కొత్త పేకెట్టు ఏమిటి?'' అని.
''అది పది వేలు'' అని అంతా చెప్పాడు. ''సోమశేఖర్‌కి ఇవ్వాలి'' అని కూడా.
''వడ్డీ ఏ లెక్కన ఇస్తాడు?''
''నేను స్నేహితుల దగ్గిర వడ్డీలు తీసుకోను.''
మూడో రోజు, ''ఆ పేకెట్టు అక్కడ లేదేం?'' అని శ్యాము మళ్ళీ అడిగింది. ఆ అప్పు మాట విన్నప్పట్నించీ రుస రుసగానే వుంది.
కంగారు పడ్డాడు. అన్ని అరలూ వెతికాడు. ఎక్కడా లేదు.
వెంటనే సోమశేఖర్‌కి ఫోన్ చేశాడు. ''నీకు డబ్బు తప్పకుండా కావాలా?'' అని.
''ఇక్కడే దొరికిందిరా. అది ఎవరి దగ్గర తీసుకున్నావో వాళ్ళకి ఇచ్చెయ్యి!'' అన్నాడు శేఖర్.
వెంటనే శ్రీనుకి ఫోన్ చేశాడు. జరిగిందంతా చెప్పాడు. ''ఆ పేకెట్టు పోయింది. నెమ్మది మీద తప్పకుండా ఇస్తాను నీకు'' అన్నాడు.
''నువ్వు ఇవ్వకపోయినా ఫర్వాలేదు గానీ, ఎలా జరిగిందో సరిగా ఆలోచించు!'' అని ఫోన్ ఆపేశాడు శ్రీను.
''ఎలా పోయింది అంత డబ్బు?'' అంది ఆవిడ.
''ఎలా పోతుంది? ఎవరో తీసేస్తే పోతుంది.''
''ఎవరున్నారు ఇక్కడీ మనం ఇద్దరమే. మా మమ్మీ అయినా లేదు. నీ డబ్బు పోయిందంటే, నేను తీసినట్టేగా? పోలీసు కంప్లయింట్ చెయ్యి నా మీద!''.
(ఇంకా ఉంది)
Authorization