''రవీ! నువ్వు చెప్పిన లాయర్ నారాయణ గారు విడాకుల కేసులు చెయ్యడటగా? ఆ కేసులు తీసుకోడం లేదని ఆయనే చెప్పారు. భార్యాభర్తల్ని విడదీస్తే పాపం తగులుతుందని కొందరు భయపడతారటగా? నిజంగానా?''
''భయాలేం కాదు గానీ, విడాకుల కేసుల్తో పెద్ద గొడవ! 'ఆస్తి' కేసనుకో, ఆ లెక్కలన్నీ కాయితాల మీద వుంటాయి. ఏ ఆస్తి ఎవరిదో, ఎవరికో, కొంచెం ఆలోచించి చెయ్యగలం. విడాకుల కేసైతే పెద్ద పీకులాట! ఆ మొగుడూ పెళ్ళాల్లో ఎవరూ నిజం చెప్పరు. నిజం చెప్పినా కోర్టు వినదు. విడాకులు అడిగే వాళ్ళల్లో ఒకళ్ళు చెప్పే అబద్దాలకి ఇంకొకళ్ళు రెట్టింపుగా చేరుస్తారు. నిజా నిజాలు లాయర్‌కి తెలియవు. తన ఫీజూ, ఎంత కాలం పడుతుందీ, అవే లాయరు చూసుకుంటాడు. ఇప్పుడైతే ఆటగాళ్ళు, లంచాలు తీసుకుని ఓడిపోడానికి నిర్ణయించుకుని, 'ఆటలో గెలవాలి' అనుకోడం మానేసినట్టు, లాయర్లు 'ఈ కేసుని గెలిపించాలి' అనుకోడం మానేశారు. విడాకుల కేసుని గెలిపించడం లాయరు చేతిలో అస్సలు వుండదు. ఆ కేసులో పది అబద్దాలు మొగుడూ, పెళ్ళం ఇరవై అబద్దాలూ, వాటికి లాయరు చేర్చేవి ఇంకో పన్నెండు అబద్దాలూ - మొత్తం 42 అబద్దాలతో సాగుతుంది ఆ ఫలానా కేసు, సంవత్సరాలు సంవత్సరాల దాకా!''
''రవీ! నా దగ్గిర ఒక్క అబద్దం కూడా లేదు.''
''అని నువ్వు అనుకుంటావు. జడ్జీ అనుకోవద్దూ?''
''అసలు లాయరేం అబద్దాలు చేరుస్తాడు?''
''లాయరు, తన కోసం కాదు, కేసు నెగ్గడానికే ఏదో చేర్చమంటాడు. 'సుఖవ్యాధుల' దాకా పోతాయి ఆ అబద్దాలు! అతని వల్ల నాకా రోగం వచ్చిందని ఆమె అంటుంది, అది తనకు ఆమె వల్లే వచ్చిందని అతను అంటాడు. ఇద్దర్నీ డాక్టర్లు పరీక్షలు చేయాల్సిందే. అక్కడ సిగ్గెగ్గులు వుండవు. ఇద్దరికీ ఆ రోగాలు వుంటాయి. ఎవర్నించి ఎవరికి అంటిందో నిజం ఎలా తెలుస్తుంది లాయర్‌కైనా? తెలియకుండానే తన క్లయింటు తరుఫునే తను వాదించాలి. ఎంత ఘోరం! ఆస్తి కేసుల్లో కూడా దొంగ రాతలు తెగ వుంటాయి గానీ, వాటిని కనిపెట్టడం కొంచెం తేలికే. రమేష్! అసలు నువ్వు కోర్టుకి వెళ్ళడం ఎందుకు చెప్పు! విడిపోయావుగా? అలాగే వుండూ!''
''కాదులే. నాకు ఆమెని లీగల్‌గా కూడా వదిలించేసుకోవాలని వుంది.''
''ఓకే! ప్రయత్నించు! ఆ నారాయణ గార్నే అడుగు! ఇంకో లాయరు పేరు చెపుతారు.''
''రవీ! విడాకుల కేసు ఓడిపోవడం అంటే ఏమిటి? 'ఇద్దరూ కలిసి వుండాల్సిందే' అని చెపుతారా కోర్టులో?''
''అలా చెప్పర్లే. కాకపోతే, విడాకులు కావాలని మొదట భార్యో, భర్తో పిటీషన్ పెడతారు కదా? జడ్జీకి, పిటీషనర్ వాదాల మీద నమ్మకం కలగకపోతే, 'పిటీషన్ ఈజ్ నాట్ ఎలౌవ్డ్' అనో, 'ఇటీజ్ డిస్‌మిస్డ్' అనో, రాసేస్తాడు. అంతే. కేసు ఓడిపోయినట్టే.''
''అప్పుడు మరి ఆ మొగుడూ పెళ్ళాలు ఏమవుతారు?''
''వాళ్ళిష్టం. కలిస్తే కలుస్తారు. లేకపోతే, కలవకుండానే బతికేస్తూ వుంటారు. అక్కడితో కూడా ఆగాలనుకోకపోతే, విడిపోడానికి ఇష్టపడని ఆవిడో, ఆయనో, 'ఎదటి మనిషి నాతో సంసారం చేసేలాగ తీర్పు ఇవ్వండి' అని మళ్ళీ కాంజుగల్ రైట్స్ పిటీషన్ పెట్టుకుంటారు. అది నెగ్గుతుందనుకో! రెండో మనిషి కాపరానికి వెళ్ళడానికి నిరాకరిస్తారనుకో! అప్పుడు ఆ మనిషికి వున్న ఆస్తి అంతా ఆ పిటీషన్ పెట్టిన మనిషికి ఇచ్చెయ్యాలని చట్టం అయితే చెపుతుంది.''
''అమ్మో, బతికాను. నాకు ఏ ఆస్తీ లేదు.''
''అయితే ఒక పని చెయ్యి! ఆమె కాపరానికి రావాలని నువ్వే పిటీషన్ పెట్టు! ఆమె రానంటుంది. ఆమె ఆస్తి అంతా నీకే వస్తుంది.''
''చీ ఛీ! హాస్యాలు చెయ్యకు!''
''నువ్వు కోర్టుకి వెళ్ళడం హాస్యం కాదూ? విడిపోయావు, వదిలేశావు, అయిపోయింది! అది చాలదూ? 'ఆమెని వదిలెయ్యి!' అనే మాట కోర్టు వాళ్ళు చెప్పాలా? ఆ నిర్ణయం వాళ్ళదా?''
''నాకు ఇంకో పెళ్ళి ధ్యాస లేదు గానీ, అలా ఇంకో పెళ్ళి చేసుకోవాలనుకునే వాళ్ళకి కోర్టు ద్వారా విడాకులు జరగక్కర లేదూ?''
''నీకు రెండో పెళ్ళి గోల లేనప్పుడు, ఎవరి సంగతో నీకెందుకు? వాళ్ళు వెళ్తే వెళ్తారు.''
''రవీ! మొన్న నీకు చెప్పలేదు. ఆమె, తన డబ్బుని ఇంటి ఖర్చుకి ఇవ్వనంటుంది....''
''చెప్పావు బాబూ, చెప్పావు. ఆ పెంట సంగతులు మళ్ళీ చెప్పకు! ఆపేస్తున్నా!'' - ఫోను ఆగింది.
ఆ కబుర్లన్నీ స్పీకర్‌లో కన్నయ్య కూడా విన్నాడు.
''రమేష్ బాబూ! రవీంద్ర బాబు తెలివైన వాడు. మంచి వాడు. ఆ కోర్టు గోల ఎందుకు? మానెయ్యరాదూ?''
''మానేస్తే, నా పిల్ల మీద నా హక్కుని నిలబెట్టుకోడం ఎలాగ?''
''అది రవీంద్ర బాబునే అడుగూ!''
''మొన్న అయిందిగా? అతనేమన్నాడు? పిల్ల మీద ధ్యాస వదిలేసి, పిల్లని తల్లి దగ్గిరే వదిలెయ్యమన్నాడు. పిల్లకి, పెద్దయ్యాక చెపుదువులే అన్నాడుగా?''
''అంతే మరి!''
''అలా కాదులే కన్నయ్యా! నేనంత చేతకాని వాడిలా వుండాలా?''
కన్నయ్య నవ్వి వూరుకున్నాడు. ఆ రాత్రి కనకతో అన్నాడు. ''రమేష్ బాబు చేతకాని వాడిగా వుండడంట!''
ఆవిడా నవ్వింది. ''ఛ! పాపం, అతను అమాయకం వాడు'' అంది మళ్ళీ.
ననన
లాయర్ శివరామయ్య ముందు కూర్చున్నాడు, కొత్త క్లయింటు రమేష్ బాబు.
లాయరు బక్కగా, సన్నగా.
''ఈయనేం వాదిస్తాడు? వాదించడం అంటే కోర్టు హాలు దద్దరిల్లి అదిరిపోయే లాగ కేకలేస్తూ వాదించాలేమో!'' అనుకున్నాడు కొత్త క్లయింటు. సినిమాల్లో అలాగే చూశాడు.
తనకు విడాకులు ఎందుకు కావాలనుకుంటున్నాడో, పది నిమిషాల సేపు చెప్పాడు... ''ఆమె చాలా గర్విష్టిగా ప్రవర్తిస్తోంది. నా మీద అందరికీ అబద్దాలు బాగా చెప్పేస్తుంది. నా తల్లిదండ్రులతో నాకు సంబంధాలే వద్దంటుంది. నన్ను ఎప్పుడూ అవమానాలు చేస్తూ మాట్లాడుతుంది. నా దగ్గిర కోట్ల డబ్బు లేదని...'' అంటూ ఆ పది నిమిషాలూ!
''సరే, కాయితం మీద రాసి ఇవ్వండి!''
''ఒక్క కాయితం మీదా? అది చాలదండీ.''
''నాలుగు కాయితాలు రాయండి.''
''ఇస్తారా కాయితాలు? రాసేస్తాను.''
''ఇక్కడ కాదు. ఇంటి దగ్గిర రాసి తీసుకు రండి!''
''విడాకులు వస్తాయాండీ! ఎప్పటికి వస్తాయండీ? మూడు నెలలు పడుతుందాండీ?''
''వస్తాయి. ఎందుకు రావు? వస్తాయి. మూడు నెలలు కాదు. దాదాపు సంవత్సరం.''
''ఆఁ? సంవత్సరమా! సంవత్సరం ఎందుకండీ?''
''దిగి చూస్తేనే కదా లోతు తెలుస్తుంది? ఒడ్డు మీద నించుని చూస్తే ఏం తెలుస్తుంది?''
''బాగా అన్నారు సార్! రేపే రాసుకొస్తాను.''
మర్నాటికి 22 పేజీలు, పెద్ద పెద్ద పేజీలు, రాయల్ సైజు పేజీల నిండా రాసి తీసుకు వెళ్ళాడు. రాత ఎంత బాగుందో!
''ఇన్ని పేజీలా! వీటిలోంచి నేను కొన్ని పాయింట్లు తియ్యాలి.''
''ఇదంతా జడ్జీ గారు చదవరాండీ?''
''అబ్బే! అలా చదవలేరు. మీరే జడ్జీ అయినా చదవరు. నా ఫీజు మాట చెపుతాను. పది వేలు! కేసు ముగిసే దాకా అదే. మళ్ళీ మళ్ళీ ఇవ్వక్కర లేదు.''
''పది వేలూ ఒక్కసారే ఇవ్వలేనండీ. ఇప్పుడు మూడు వేలు తెచ్చాను. వచ్చే నెల మూడూ, ఆ పైనెల మూడూ ఇస్తానండీ'' అంటూ డబ్బు కవరు లాయరు ముందు పెట్టి, ''నన్ను మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు?'' అన్నాడు.
''వచ్చే వారం నించీ వేసవికాలం సెలవలు.''
''కోర్టుకి కూడా సెలవులుంటాయాండీ?''
''ఆఁ, ఉంటాయి. రెండు నెలల తర్వాతే మళ్ళీ. అసలు మొగవాళ్ళు అడిగితే విడాకులు రావడం అంత తేలిక కాదు.''
''అలాగంటారా? నా కేసులో చాలా బలమైన సంగతులు వున్నాయండీ.''
''బలంగా వుండాల్సినవి సంగతులు కావు. సాక్ష్యాలు బలంగా వుండాలి. నేను ఏది బడితే అది పట్టను. డబ్బు బాగా ఇచ్చినా, సాక్ష్యాలకు అవకాశాలు లేకపోతే కేసు పట్టి ప్రయోజనం వుండదు.''
లాయరు గారు చాలా నెమ్మదస్తుడు. ఏది అడిగినా విసుగు లేకుండా చెపుతాడు.
రమేష్ రాసుకొచ్చిన 22 పేజీల్నీ లాయరు, రోజుకి 3 పేజీల చొప్పున వారం రోజుల్లో చదివి, చివరి రోజు 4 పేజీలు చదివి, ఆ మూడేళ్ళ సంసారం చరిత్రని 8 పాయింట్లుగా ఒక వరసలో పెట్టాడు. ఆ పాయింట్లలో, విడాకుల్ని తేగల గొప్ప పాయింటు, ఆ భార్య, ఆ భర్తని రాత్రుళ్ళు గుమ్మం ముందే పడి వుండేలాగ తలుపు బంధించేసేది - అనేది! కానీ జడ్జీ దగ్గిర అది పని చెయ్యదని లాయర్‌కి బాగా తెలుసు. జడ్జీకి అలాంటి మంచి స్వంత అనుభవం వుండి వుండకపోవచ్చు! మిగతా పాయింట్లు అసలే పని చెయ్యనివి. ఈ క్లయింటు సంసారంలో వున్నవి అవే మరి! 'సుఖ వ్యాధుల' చక్కని తగువు లేదు! ఆమె అతన్ని కత్తితో పొడిచిన చక్కని ఘట్టమూ లేదు. కోర్టుకి అలాంటివే కావాలి! కత్తి 4 అంగుళాల లోతుకి దిగాలి! కత్తి ఊడిరాకుండా వుంటే మరీ మంచిది. అవమానాలూ, సాధింపులూ - అలాంటి వాటిని కష్టాలుగా కోర్టు వొప్పుకోదు. అసలు అవి జరిగి వుంటాయని కోర్టు నమ్మదు. లాయర్ తయారు చేసిన 8 పాయింట్లదే, పిటీషన్ పత్రం.
రమేష్ కూడా అది చదివి చాలా సంతోషించాడు. కానీ, ''సార్! ఆమె ఇంటి పేరుగా, ఆమెకి పెళ్ళికి ముందు వుండే పేరునే రాశానండీ. మీరు అది మార్చి, నా ఇంటి పేరునే ఆమెకి కూడా పెట్టారు.''
''భార్యకి, భర్త ఇంటి పేరే....''
''అది కాదండీ. పెళ్ళి తర్వాత ఆడవాళ్ళ ఇంటిపేర్లు మారక్కరలేదండీ.''
''సరే, అలా మారుస్తాలే. రేపే కోర్టుకి వెళ్తుంది ఈ పిటీషన్!''
రమేష్ నవ్వాడు. ''ఏ కోర్టు కండీ? ఫేమిలీ కోర్టుకేనాండీ?''
''కాదు, ఇది సంప్రదాయంగా జరిగిన పెళ్ళి కాదు. ఈ రకానివి, స్పెషల్ మేరేజ్ యాక్ట్ కింద, సబ్ జడ్జీ కోర్టుకే వెళ్ళాలి. అంతా నీకు తర్వాత తెలుస్తుందిలే.''
''ఎక్కడికి వెళ్ళినా, న్యాయంగానే చెపుతారు కదండీ?''
''విడాకుల కేసులో వచ్చే వాళ్ళు ఇద్దరూ 'న్యాయం' కావాలంటారు. ఆమె ఓడితే నీకు న్యాయం జరిగినట్టూ, నువ్వు ఓడితే ఆమెకి న్యాయం జరిగినట్టూ! కోర్టు ఏ కేసులో అయినా న్యాయమే చేస్తుంది మరి! ఏ కేసులో అయినా ఒకరికే న్యాయం. అది, నీకో, ఆమెకో!''
రమేష్ కొంచెం నవ్వాడు.
లాయరుగారు నచ్చాడు బాగా.
పిటీషన్ వెళ్ళింది కోరుyకి.
ఆ మర్నాటి నించే కోర్టుకి సెలవులు! రెండు నెలలు!
ననన
రమేష్ పట్టుదలగా పెట్టిన ఆ పిటీషన్ పత్రం, లకీëదేవికి వెళ్ళనే లేదు, ఆ రెండు నెలలూ.
మళ్ళీ కోర్టు తెరుచుకున్న తర్వాత, ఒక ఫోన్ కాల్‌లో ఒక కోర్టు మనిషి అడిగాడు రమేష్‌ని, ''ఆమె అడ్రస్ ఎక్కడండీ?'' అని.
''అదేవిటి? ఆ పిటీషన్‌లో వుందిగా?''
''ఈ అడ్రస్ సరిపోదండీ.''
''మీరు ఇక్కడికి వస్తే, నేను ఆ హోమ్‌ని చూపిస్తాను.''
ఆ కోర్టు మనిషి రాగానే అతని వెంట తన బండి మీద వెళ్తూ ఈ హోమ్ చూపించాడు.
కోర్టు మనిషి, లోపలికి వెళ్ళి వెంటనే బైటికి వచ్చాడు. ''ఆవిడ వూళ్ళో లేదంట. స్కూలు పని మీద హైదరాబాదు వెళ్ళిందంట. నాలుగు రోజులకు గాని రాదంట!''
''అలాగా? అయితే తర్వాత వచ్చి ఇస్తారుగా?'' అంటూ తన జేబులోంచి ఒక నోటు తీసి అతని జేబులోకి మార్చాడు.
నాలుగు రోజుల తర్వాత, కోర్టు మనిషికి ఫోన్ చేస్తే, ''ఆమెకి పిటీషన్ అందిందండీ. సంతకం పెట్టి తీసుకుంది'' అని జవాబు వచ్చింది.
హమ్మయ్య! మొదలైంది!
వారం రోజుల్లో లాయర్ నించి కాల్! ఫలానా రోజు జిల్లా కోర్టుకి రమ్మని!
''కోర్టుకి అంటే నేను ఎక్కడికి రావాలండీ?''
''ముందు హాలులోకి ప్రవేశించి, తర్వాత కుడి వేపు తిరిగి, తూర్పు హాలులో వెళ్ళి, మళ్ళీ కుడి వేపు తిరిగి, అప్పుడు ఎడం వేపు మళ్ళీ....''
''సార్! మీరు వుండరా కోర్టులో? మీ వెనకాలే నడుస్తానండీ.''
''నేను వేరే కోర్టులో వుంటాను. అక్కడ అయిపోగానే వస్తాను. మీకేం భయం లేదు. 'ప్రిన్సిపల్ జడ్జి కోర్టు' అని అడిగి వెళ్ళండి! అక్కడ కూర్చుంటే మీ పేరు పిలుస్తారు. అంతా మీకే తెలుస్తుంది. కోర్టు సముద్రంలోకి దిగి చూడండి మరి! కోర్టుకి రావడం అంటే సాహసమే కదా?''
రమేష్ బాబు ఇంటర్ చదివే కాలం నించీ 'డిస్ట్రిక్టు కోర్టు'' అనే బోర్డుని చూస్తూ ఆ కోర్టు ముందు నించి సైకిల్ మీద వెళ్ళేవాడు. ఇప్పుడు, ఆ కోర్టు లోపలికి వెళ్ళాల్సి వస్తోంది. లాయర్ చెప్పిన దిక్కుల ప్రకారం పోతే ఆ కోర్టు దొరకలేదు. లాయర్, తప్పే చెప్పాడు దిక్కుల్ని. అక్కడ ఎవరెవర్నో అడిగితే, ఒక ప్యూన్ ఎవరో తిన్నగా ఆ కోర్టు గది చూపించాడు. ఆ గది ముందు వరండాలో చాలా మంది కుర్చీల్లో కూర్చుని పేపర్లు తిరగేస్తూన్నారు. ఎవ్వడైనా లేవకపోతాడా, అక్కడ కుర్చుందామని చూశాడు రమేష్. చాలా మంది అదే చూస్తున్నారు. తను కూర్చున్నా, తనని కూడా 'లేపకపోతాడా' అని చూడరా మిగతా వాళ్ళు? ఇక ఆ ఆశ వదులుకున్నాడు.
పక్కన నించున్న పెద్ద వయసు ఆయన, ''ఏం కేసు మీది?'' అన్నాడు.
సిగ్గేసింది రమేష్‌కి. పెళ్ళంతో కేసు - అని ఎలా చెప్పాలి? - చాలా సిగ్గేసింది, అతనికి సిగ్గు లేదంటారు గానీ.
జవాబు చెప్పడానికి, ఆ ఆలశ్యం, కళ్ళు దించడం, ఆ మొహం చూస్తే, తెలిసి పోయింది, ఆ పెద్దాయనకి. ''విడాకుల కేసా?''
''అవునండీ'' అన్నట్టు తల వూపాడు మౌనంగా.
''ఇవ్వాళే మొదలా?''
మళ్ళీ ''అవును'' అన్నట్టు తల రెండో సారి వూపి, చప్పున నోరు విప్పాడు. ''ఎన్నాళ్ళు పడుతుందండీ?''
''రెండేళ్ళో, మూడేళ్ళో!''
''ఆఁ? ఆఁ? మా లాయరు గారు యేడాది లోపే అన్నారండీ.''
''యాడాది లోపా? ఇక్కడ డిస్‌మిస్సై హైకోర్టుకి పోతే, అక్కడ పదేళ్ళూ! లాయర్లు మాత్రం ఏం చెప్పగలరు? ఒక్కొక్కళ్ళ కేసు ఒక్కో రకం! మరి, దిగాక అంతే!
''మీ కేసు ఏంటండీ?''
''చిన్న ఆస్తి తగాదా నాయనా! అదంతా పెద్ద సోది! మా మేనత్త పొలం అది. నాలుగేళ్ళ నించీ తిరుగుతున్నాను.''
రమేష్‌కి చాలా జాలి అనిపించింది.
ననన
కోర్టు గది పెద్దగా, సినిమాల్లో లాగే వుంది. జడ్జీ బల్ల ముందు పొడుగు టేబులూ దానికి మూడు పక్కలా లాయర్లూ, కుర్చీలూ! బోను లేదు మరి అక్కడ. ఒక విడి కుర్చీ వుంది. అదే బోను కావచ్చు.
ఆ గది, నల్ల కోటు లాయర్లతో నిండి పోతోంది. చేతుల్ని సంకెళ్ళలోకి బిగించిన వాళ్ళని పోలీసులు తీసుకొస్తున్నారు. ఏం నేరాలో వాళ్ళవి!
విడాకుల కేసుల వాళ్ళు ఇంకా వున్నారు. దాదాపు అందరూ మధ్య వయసుల వాళ్ళే. రమేష్ లాగా చిన్న వయసు వాళ్ళు కారు. అన్నాళ్ళు కలిసి వున్నందుకు పశ్చాత్తాపాలేమో!
పదిన్నర అయ్యేప్పటికి ''లెగండి! లెగండి'' అని కేకలు వినిపించి జడుసుకున్నాడు రమేష్.
అంతలో, ఒక యూనిఫారం వ్యక్తి పరుగు పరుగున వస్తోంటే అందరూ ఇటూ అటూ ఒకళ్ళొకళ్ళని గెంటుకుంటూ తప్పుకుంటున్నారు. ''జడ్జీ - జడ్జీ వస్తున్నాడు'' అంటూ నెమ్మదిగా.
''ఇదేంటి? వస్తేయేం? ఆఫీసులోకి ఎవరి పనిలోకి వాళ్ళు వస్తారు. స్కూల్లోకి టీచర్లందరూ ఎవరి మట్టుకు వాళ్ళు చక చకా నిశ్శబ్దంగా వచ్చేస్తారు. ఇక్కడ ఈ ఆర్బాటం ఏంటి?'' అన్నాడు రమేష్, పక్కన వున్న పెద్దాయనతో.
''జడ్జీ అంటే అంత 'గొప్ప' కనపడితేనే, అతను ఇచ్చే తీర్పులికి విలువ వుంటుంది. ఆ మాత్రం తెలీదా మీకు?'' అన్నాడాయన.
రమేష్‌కి ఆశ్చర్యం వేసింది. ''నిజమేనండీ! నిజమే. జడ్జీని 'రాజు!' లాగ చూపిస్తున్నారు! భలే చెప్పారు మీరు.''
''మంచి కుర్రాడిలా వున్నావు. నీకు విడాకుల కేసేమిటి? మంచి కుర్రాడిలా వుండబట్టేనా?''
''నేను చెప్పకుండా గ్రహించేశారు మీరు.''
జడ్జీ వస్తున్నాడని అరుస్తూ వచ్చే మనిషి ఏదో మాట అంటున్నాడు. అర్ధం కావడం లేదు ఆ మాట రమేష్‌కి. ''ఏవిటండీ ఆ మాట?''
''ఏం లేదు. 'సైలెన్స్! సైలెన్స్!' అంటాడు. లేకపోతే, 'ఖామోష్! ఖామోష్!' అంటాడు. అంతే.''
''సైలెన్స్ అంటూ తనే అరుస్తాడేం?''
దారిలో వాళ్ళూ, గదిలో వాళ్ళూ, అందరూ లేచి నిలబడి జడ్జీకి నమస్కారాలు, నమస్కారాలు!
రమేష్ నమస్కారం చెయ్యలా. భారీ జడ్జీ, నిదానమైన నడకతో తల ఎటూ తిప్పుకుండా తిన్నగా కోర్టు హాలు వెనక వున్న గదిలో జొరబడి, తన సీటులోకి వెళ్ళి కూర్చున్నాడు.
లేచి నిలబడ్డ లాయర్లందరూ కూర్చున్నారు తర్వాత.
జడ్జీకి చెరో పక్కా, చెరో ఉద్యోగీ చేరారు. ఒక ఉద్యోగి, పిటీషన్లన్నిటినీ జడ్జీకి వినిపిస్తూ ఆ పేర్లన్నీ చదివాడు.
ఆ హాలు గుమ్మం దగ్గిర వున్న యూనిఫారం మనిషి, నాలుగడుగులు గుమ్మం బైటికి వేసి, ఒక్కొక్క పేరూ పెద్ద అరుపులతో పిలుస్తున్నాడు.
తన పేరు వినపడగానే, ఆ మనిషి కోర్టు గదిలోకి పరిగెత్తి జడ్జీకి దణ్ణాలు పెట్టి నించుంటున్నారు. కాస్సేపటికి బైటికి వస్తున్నారు.
పిలవగానే ఆ మనిషి వస్తే, ప్రెజెంట్! రాకపోతే, ఆబ్సెంట్! ఆ అరుపులు కూడా!
రమేష్ బాబుకి తన పేరు ఒక గంట సేపటికి వినపడింది. చక చకా చెప్పులు వదిలేసి వెళ్ళాడు కోర్టు గదిలోకి. కొందరు అలా చేస్తున్నారు.
ఇతడు వెళ్ళగానే కుడి చెయ్యి ఎత్తి జడ్జీ వేపు వూపి చేతిని దించాడు. లాయరు వచ్చే వున్నాడు, అటు వేపు కుర్చీలో. ఆయన ఎప్పుడు వచ్చాడో రమేష్ చూడనే లేదు, పక్కన వున్న పెద్దాయనతో మాటల్లో.
జడ్జీ పక్కన వున్న రెండో వేపు వుద్యోగి, ఒక తారీకుని అరిచాడు. ఆ తారీకు నాటికి వాయిదా పడిపోయింది, రమేష్ కేసు! నెల తర్వాతకి!
గుమ్మం దగ్గిర వున్న అరిచే వుద్యోగి రమేష్‌తో ''ఇక వెళ్ళండి!'' అన్నాడు.
లాయరు కూడా లేచి వచ్చాడు బైటికి.
రమేష్ విస్తుపోయాడు. అయిపోయిందా కోర్టులో! లాయర్ దగ్గిరికి పరిగెత్తాడు.
లాయర్ నవ్వుతూ ''జడ్జీకి నమస్కారం అలాగా చెయ్యడం? రెండు చేతులూ జోడించి చెయ్యాలి. ఒక్క చెయ్యి ఆయన మొహం మీదకి విసిరి వూరుకున్నావు'' అన్నాడు.
''నాకు తెలీదు సార్! మా స్కూల్లో అందరికీ అలాగే చేస్తాం సార్!''
''అందరూ వేరు, జడ్జీ వేరు! రేపు నీకు తీర్పు ఇచ్చేది ఈయనే.''
''అయితే? నమస్కారాన్ని బట్టి ఇస్తాడా తీర్పు?'' అనలేదు రమేష్.
''అవున్సార్! ఈ సారి జాగ్రత్తగా వుంటాను సార్! అప్పుడే వాయిదా ఏంటి సార్? జడ్జీ గారు కేసు విననే లేదు. ఆమె రాలేదేంటి సార్? ఆమెకి పిటీషన్ అందిందని తెలిసింది. అయినా రాలేదు. కోర్టులో ఏమీ జరగనే లేదేం సార్?''
''జరిగిందిగా? వాయిదా పడడం జరిగింది. కోర్టు, పని చేసినట్టే. ఎదటి పక్షం వాళ్ళు, తమ కౌంటర్ ఇవ్వడానికి 90 రోజులు టైము తీసుకోవచ్చు. కొందరు జవాబు తొందరగా ఇచ్చి, తొందరగా వస్తారు. కొందరు చివరి రోజు దాకా ఇవ్వరు. ఈ విడాకుల్లో అప్పటికే కొందరు కలిసిపోతారు. లేకపోతే, ఆ చివరి రోజు జవాబు ఇచ్చిన తర్వాతే ఎదటి పక్షం వాళ్ళు కూడా రావాలి.''
''అంటే, ఆమె ఇంకా జవాబు ఇవ్వలేదా? అందుకే రాలేదా? కాదు సార్, కాదు. ఆమె జవాబు ఇవ్వదు. కోర్టుకి రాదు! సంతకాలు పెట్టేస్తుంది. నేను విడాకుల పత్రం తెస్తే, వెంటనే సంతకాలు పెట్టేస్తానంది. ఆమె, నాతో విడిపోవాలనే అనుకుంటోంది. కోర్టుకి రాదు సార్! రాకపోతే, విడాకులై పోయినట్టే కదండీ?''
''రాకపోతే అయిపోయి నట్టేగానీ, వస్తుందో రాదో అప్పుడే చెప్పలేం. ఆమెకి విడిపోవడం అంగీకారమే అయినా, ఇంకేమైనా డిమాండ్స్ వున్నాయేమో! వాటి కోసం వస్తుందిగా?''
''డిమాండ్స్ అంటే సార్?''
''అదే, పిల్లకి పోషణా అదీ.''
''కోర్టు చెప్పే దాని కన్నా ఎక్కువే ఇస్తాను సార్! దాని కోసం కోర్టుకి రావాలా?''
''వస్తుందో రాదో, తొంభై రోజులకు గానీ తెలీదు. చివరి రోజునే రావచ్చు.''
''కౌంటర్ రాకపోతే, అప్పటి దాకా నేను రావడం ఎందుకు సార్? అది ఎప్పుడు వస్తే అప్పుడే పిటీషనర్‌కి కాల్ చేస్తే, అప్పుడు వస్తాను సార్!''
''అలా జరిగితే బాగుంటుంది. కానీ, అలా జరగదు ఇక్కడ. పిటీషన్ పెట్టిన మనిషి, కౌంటర్ రాకపోయినా ప్రతీ వాయిదాకీ రావలిసిందే.''
''ఇదేంటి సార్! ఎదటి పక్షానికి మూడు నెలలు టైమ్ ఇచ్చి, పిటీషనర్‌ని ప్రతీ నెలా రమ్మంటే, సెలవులు పెట్టుకుని రావాలి, ఇక్కడ అవసరం లేకుండా!''
''పిటీషనర్‌ని అలా ఇబ్బంది పెడితే, ఆ మనిషి, కేసుని వదులుకోవచ్చని భావిస్తుందేమో ప్రభుత్వం! చట్టం అలాగే వుంటుంది.''
''అదేం చట్టం సార్? ఎదర పక్షానికి మూడు నెలలే కాదు, పన్నెండు నెలలు ఇస్తే మాత్రం నేను కేసుని వదులుకుంటానా?''
''వచ్చే నెల వాయిదాకి రావాలి సుమా! నా క్లయింట్స్‌కి అలాగే చెపుతాను. పిటీషనరు ఆబ్సెంట్ కాకూడదు ఎప్పుడూ. ఆబ్సెంట్ అయితే, 'కేసు పెట్టాడు గానీ అతనికి దాని మీద శ్రద్ధ లేదు' అనుకుంటాడు జడ్జీ.''
''తప్పకుండా వస్తా సార్!'' అనేసి కుడి చెయ్యి ఎత్తి దించి, గబ గబా బైల్దేరాడు పిటీషనర్.
కోర్టుకి వెళ్ళడం అయింది, రావడం అయింది! కేసు జాయిన్ అయింది వాయిదా పడింది, మొదటి సారి!
ననన
రెండో సారీ ఆమె రాలేదు. కౌంటర్ పడలేదు. మళ్ళీ వాయిదా, ఇంకో నెలకి!
''ప్రతీ సారీ నేను సెలవు పెట్టి రావాలి సార్!''
''అందుకే, కోర్టుకి రాకూడదయ్యా!''
మూడో వాయిదా నాటికి కౌంటర్ పడిందని తెలిసింది. ఆ వాయిదా నాటికి ఎదటి పక్షం కూడా వుంటుంది కాబట్టి, విచారణ ప్రారంభమై పోతుందని ఉత్సాహంగా వెళ్ళాడు పిటీషనర్.
కోర్టు గది బైట వరండాలో ఒక కుర్చీ దొరికింది. మోకాళ్ళ మీద మోచేతులు ఆన్చి, అరి చేతుల్లో మొహం పెట్టుకుని, ఆలోచనలో పడిపోయాడు. ఇప్పటికి 5 నెలలు! అయితే అయిందిలే!
ఏదో పరిమళం, తనకి అలవాటైన పరిమళం, ముక్కుకి తాకింది. మొహం కొంచెం అటు తిప్పాడు.
ఆమె, చేతిలో సెల్ నొక్కుకుంటూ హుషారుగా అతని ముందు నించీ చీమ నడకతో వెళ్తోంది. ఆమె కళ్ళబడగానే ఇతను తల తిప్పేసుకోవద్దూ? తెల్లబోతూ అటే చూస్తూ వుండిపోయాడు.
తళ తళలాడే చీర కట్టింది! ఆమె చీరకి ఫాల్ కుట్టించాలంటే తనే వెళ్ళి టైలర్ కిచ్చి, మళ్ళీ తనే వెళ్ళి అది తెచ్చేవాడు. ఫాల్ తను కుట్టుకోవచ్చు. కుట్టుకునేది కాదు. జాకెట్ల కోసం కూడా తను తిరగవలసిందే! అవన్నీ జ్ఞాపకాలు! ఆమెని చూసి ఆరు నెలలు దాటిపోయింది! చూడగానే ఆశ్చర్యం వేసింది గానీ, కోపం లాంటిది లేదు, అది ఎప్పుడూ లేదు. రెండో పెళ్ళి ప్రయత్నాలు చేస్తోన్న మనిషి ఆమె!
అతని ముందు నించి నడుస్తూ, ''ఏం రామూ, తపస్సు చేస్తున్నావా శ్యాము కోసం?'' అంటూ నవ్వుతూ వెళ్ళింది.
ఉలిక్కిపడ్డాడు. తను అటు చూడకుండా వుండవల్సింది కదా?
ఆ రాత్రి, ఆ సంగతి రవీంద్రతో చెప్తే, అతను మండిపడిపోయాడు. ''రమేష్! నిన్ను కుక్కతో పోలిస్తే, కుక్కకి అవమానం!'' అనేసి ఫోన్ ఆపేశాడు.
ఆ మాటలు కన్నయ్యకి చెప్తే, అతను శాంతంగా ''అది కాదు గానీ, నువ్వు ఆమె వేపు మొహం తిప్పకుండా వుండవలిసింది రమేష్ బాబూ!'' అన్నాడు.
''అసలు ఆమెని నేను అలా వెళ్తోందని తెలిసి చూడలేదు కన్నయ్యా! ఆమె రాసుకునే సెంటు వాసన వచ్చిందని తెలీకుండా అలా తల తిప్పానంతే!''
ఆ మాటలు విన్న సుందరమ్మ కొంచెం నవ్వి, తర్వాత రుస రుస లాడుతూ, ''విడాకుల కేసు కోసం కోర్టుకి వస్తూ, సెంటు రాసుకుని వచ్చిందా?'' అంది.
అప్పుడూ తెల్లబోయాడు రమేష్. ''అవును కదా? అలా వచ్చింది వదినా స్టయిల్‌గా!'' అన్నాడు.
''వస్తే వచ్చిందిలే. ఇక ప్రతీసారీ కనపడుతుందిగా? ఆమె వేపు చూడకు!'' అన్నాడు కన్నయ్య.
''ఆమె వేపు నేనెందుకు చూస్తాను కన్నయ్యా? నేను ఎప్పుడూ, 'చిట్టి తల్లి ఏం చేస్తోందో! రాత్రుళ్ళు ఎలా నిద్రపోతోందో!' అని అలా అనుకుంటాను గానీ, ఆమె అంటే అసహ్యం నాకు. చెప్పాలంటే, ఒక్కోసారి జాలి కలుగుతుంది. ఇంత మూర్ఖురాలేమిటా అని! అంతే!''
''జాలా! జాలా!'' అని చిన్న అరుపు అరిచింది సుందరమ్మ. ఆమెకి ఒక్క సంగతి ఎప్పుడూ గుర్తుంటుంది. రాత్రి పూట మొగుణ్ణి ఇంట్లోకి రానివ్వకుండా రమేష్ పెళ్ళం తలుపులు తెరవలేదని! - అదే విచిత్రంగా వుంటుంది సుందరమ్మకి. ''ఆమె మీద జాలేవిటి బాబూ మీకు?'' అంది కొంచెం మందలింపుగా.
Authorization