Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటి యువతరం డాన్స్‌కు చాలా ప్రయారిటీ ఇస్తోంది. అద్భుతమైన డాన్సర్లుగా సత్తా చాటేందుకు శతవిధాలా కృషి చేస్తున్నారు. వీరి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయటంలో ఇప్పటికే బుల్లితెర ప్రధాన భూమిక పోషిస్తోంది. అలాగే డాన్స్ నేపథ్యంలో రూపొందిన ఎన్నో చిత్రాలు వెండితెర ప్రేక్షకుల్ని సైతం మంత్రముగ్ధుల్ని చేశాయి. ఆద్యంతం అబ్బురపరచే రీతిలో తెరకెక్కిన కొన్ని డాన్స్ బేస్డ్ చిత్రాలు ఊహించని రీతిలో వసూళ్ళని రాబట్టి చరిత్ర సృష్టించాయి. అటువంటి కొన్ని డాన్స్ ప్రధాన చిత్రాల గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
స్టెప్ అప్ సిరీస్
చెత్త డాన్స్‌తో సమస్యలు సృష్టించే ఒక స్ట్రీట్ డాన్సర్ కొరియోగ్రాఫర్‌గా ఎదిగిన తీరు నేపథ్యంలో దర్శకుడు అన్నే ఫ్లెచర్ 2006లో రూపొందించిన అమెరికన్ రొమాంటిక్ డాన్స్ చిత్రం 'స్టెప్ అప్'. టైలర్ అనే వీధి డాన్సర్ తాగి మేరీల్యాండ్ ఆర్ట్స్ స్కూల్‌లో థియేటర్‌తోపాటు పలు వస్తువులను పగలగొట్టడంతో అతనికి 200 గంటలపాటు ఆ స్కూల్‌ను శుభ్రం చేసే శిక్ష వేస్తారు. ఈ క్రమంలో టైలర్ కారు తుడుస్తూ డాన్స్ చేస్తుంటాడు. అది గమనించిన నోరా క్లర్క్ అనే డాన్సర్ అతనిలో దాగున్న గొప్ప డాన్సర్‌ను వెలికితీయాలని శిక్షణ ఇప్పిస్తుంది. అలా టైలర్ అనతి కాలంలోనే గొప్ప కొరియోగ్రాఫర్‌గా ఎదుగుతాడు. ఒకానొక క్రమంలో నోరాని వదిలేసి వెళ్తాడు. ఆ టైమ్‌లో జరిగిన ఒక సంఘటనతో తిరిగి నోరాకు దగ్గరయ్యాడా..? మళ్ళీ రెబల్ డాన్సర్‌గా మారాడా? లేదా అనే ఆసక్తికర అంశాలతో తెరకెక్కిన చిత్రమే 'స్టెప్ అప్'. టైలర్ పాత్రలో చానింగ్ టాటుమ్, నోరా పాత్రలో జెన్సా దేవన్ నటించి మెప్పించారు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొంది, 11కోట్ల డాలర్లకుపైగా వసూళ్ళతో రికార్డు సృష్టించింది. అంతేకాదు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులనూ సొంతం చేసుకుంది.
ఈ చిత్ర సిరీస్‌లో భాగంగా ఐదు సినిమాలు వచ్చాయి. విభిన్న నేపథ్యాలకు చెందిన ఇద్దరు డాన్సర్లుగా అత్యున్నత స్థాయికి ఎదిగిన నేపథ్యంతో 'స్టెప్ అప్ 2: ద స్ట్రీట్స్' అనే చిత్రం వచ్చింది. జాన్ ఎం.చు దర్శకత్వంలో 2008లో విడుదలైన ఈ చిత్రం 15కోట్ల డాలర్లకు పైగా వసూలు చేసింది. ఇందులో బ్రయానా ఎవిగన్, రాబర్ట్ హోఫ్ఫ్మన్ నటించి మెప్పించారు. 'స్టెప్ అప్' సిరీస్‌లో భాగంగా వచ్చిన మూడవ చిత్రం 'స్టెప్ అప్ 3డి'. న్యూయార్క్ నగరంలో వీధి డాన్సర్లుగా ఉన్న ఒక గ్రూపు తమలోని టాలెంట్‌కు పదును పెట్టి ప్రపంచ పాపులర్ డాన్స్ టీమ్‌కు పోటీనివ్వడమనే ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రానికి కూడా జాన్ ఎం.చునే దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రల్లో ఆడమ్ సెవని, రిక్ మలంబ్రి, శర్నీ విన్సన్, అలీసన్ స్టోన్స్ నటించారు. 2010లో విడుదలైన ఈ సినిమా దాదాపు 16 కోట్ల డాలర్లు వసూలు చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా వచ్చిన నాల్గవ చిత్రం 'స్టెప్ అప్ రివల్యూషన్'ను ప్రొఫేషనల్ డాన్సర్లుగా ఎదగాలనుకున్న తమను అడ్డుకుంటున్న వ్యాపారవేత్తపై తిరగబడి, తమ లక్ష్యం కోసం డాన్స్ టీమ్ చేసే పోరాట నేపథ్యంలో దర్శకుడు స్కాట్ స్పీర్ రూపొందించారు. 2012లో వచ్చిన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణతోపాటు సుమారు 15కోట్ల డాలర్లు వసూలు చేసింది. ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన ర్యాన్ గుజ్మన్, కాథరిన్ మెక్ కార్మిక్, మిషా గాబ్రియెల్, క్లీయోపాత్రా కోల్మన్‌ల డాన్స్ షో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. సీనియర్ డాన్సర్లు చాలా కాలం తర్వాత తిరిగి కలిసి మళ్ళీ తమ సత్తా చాటేందుకు చేసిన ప్రయత్నం నేపథ్యంలో 'స్టెప్ అప్: ఆల్ ఇన్' చిత్రం రూపొందింది. 'స్టెప్ అప్' సిరీస్‌లో వచ్చిన ఐదవ చిత్రమిది. 2014లో విడుదలైన ఈ సినిమాను దర్శకుడు ట్రిష్ సై రూపొందించారు. విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ చిత్రం సుమారు 9 కోట్ల డాలర్లు వసూలు చేసింది.
హనీ సిరీస్
ఒక అందమైన స్ట్రీట్ డాన్సర్ జాతీయ స్థాయి డాన్సర్‌గా ఎదగడమనే ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రమిది. 2003లో బిల్లి వూడ్రఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హానీ డేనియల్స్ అనే 21 ఏళ్ళ అందమైన అమ్మాయి న్యూయార్క్‌లో బార్‌టెండర్‌గా, రికార్డ్ స్టోర్ క్లర్క్‌గా పనిచేస్తూనే డాన్స్ నేర్చుకుంటుంది. ఒక రోజు క్లబ్‌లో డాన్స్ రికార్డు చేస్తున్న క్రమంలో దర్శకుడు మైఖెల్‌తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయంతో డాన్సర్ నుంచి కొరియోగ్రాఫర్‌గా మారుతుంది. జాతీయ స్థాయిలో రాణించే క్రమంలో తన మెంటర్ నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొంటుంది. అతని ఒత్తిళ్ళకు లొంగి లైంగికంగా సపోర్ట్ చేయడమా?, సినీ రంగం నుంచి వెళ్ళి పోవడమా? అనే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో తనే ప్రత్యేకంగా డాన్స్ స్కూల్‌ను ప్రారంభించే క్రమంలో ఆర్థికంగా, మానసికంగా అనేక సవాళ్ళను ఎదుర్కొని ఎలా నిలబడిందనేది చిత్ర కథాంశం. ఉర్రూతలూగించే డాన్స్‌తో ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఇందులో హానీ పాత్రలో జెస్సికా ఆల్బా తనదైన నటనతో, డాన్సింగ్ స్టెప్పులతో మైమరపిస్తూనే కష్టకాలంలో మనోస్థైర్యంతో నిలబడే అమ్మాయిగా అదరగొట్టింది. ఈ చిత్రం ఆరుకోట్ల డాలర్లకుపైగా వసూలు చేసి కలెక్షన్లలోనూ సత్తాచాటింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన 'హనీ 2' చిత్రం కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బిల్లి వూడ్రఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రంలో డాన్సర్‌గా ఎదగాలనుకునే యువతి మారియా ఇంట్లో ఆర్థిక పరిస్థితులను, బయటి వారి వేధింపులను ఎదుర్కొంటుంది. అదే సమయంలో స్టార్ డాన్సరైన ప్రత్యర్థితో గట్టి పోటీ నెలకొంటుంది. వాటన్నింటిని ఎదుర్కొని తను అనుకున్నది సాధించడానికి ఆమె చేసిన పోరాటమే ఈ చిత్ర కథాంశం. మరియా బెనెట్‌గా కాటెరినా గ్రాహం నటన అద్భుతం.
వన్ ఛాన్స్ టు డాన్స్
17 ఏండ్ల అమ్మాయి గొప్ప డాన్సర్‌గా రాణించేందుకు ఓ హై స్కూల్‌లో చేరుతుంది. ప్రొఫెషనల్ డాన్సర్‌గా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో ఇద్దరబ్బాయిలతో ప్రేమలో పడుతుంది. అనంతరం ఆ అమ్మాయి ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంది?. తను పడిన ఇబ్బందులతో లక్ష్యాన్ని చేరుకుందా, లేదా అనేది సినిమా. ఓ టీనేజ్ అమ్మాయి సంఘర్షణను కళ్లకు కట్టినట్టు చూపించిందీ చిత్రం. ఆడమ్ డెయోరు దర్శకత్వం వహించారు. 2014లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. టీనేజ్ అమ్మాయిగా టెక్సీ గియోవాగ్నోలి తనదైన నటనతో మెప్పించింది.
బ్యాటిల్ ఆఫ్ ది ఇయర్
బి-బార్సు డాన్స్ టీమ్ వరల్డ్‌లోనే ది బెస్ట్ టీమ్. కానీ 'బ్యాటిల్ ఆఫ్ ది ఇయర్ ట్రోఫీ'ని తిరిగి అమెరికాకు తీసుకురాలేకపోతారు. 15ఏండ్లుగా ఓడిపోతూనే ఉంటారు. ఈ క్రమంలో బాస్కెట్ బాల్ కోచ్ బ్లేక్‌ను తమ టీమ్‌ను గైడ్‌గా టీమ్ ప్రొడ్యూసర్ డంటా ఎంపిక చేసుకుంటాడు. కోచ్ బ్లేక్ 'డ్రీమ్ టీమ్' పేరుతో కొత్త టీమ్‌ను ఫామ్ చేసి కఠినంగా శిక్షణ ఇస్తాడు. అనేక రోజుల శ్రమ, ఎన్నో స్ట్రగుల్స్ అనంతరం వారిని ది బెస్ట్ టీమ్‌గా మారుస్తాడు. ఫైనల్‌గా ఫ్రాన్స్‌లో జరిగే ట్రోఫీలో బి-బార్సు గెలుపొందారా, లేదా? అనేది ఉత్కంఠ భరితం, ఆసక్తికరం. బెన్సల్ లీ దర్శకత్వం వహించారు. 'ప్లానెట్ బి-బారు' అనే డాక్యుమెంటరీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. జోష్ హోల్లోవే, క్రిస్ బ్రౌన్, జోష్‌పెక్, లాజ్ అలోన్సో, కైట్ లాత్జ్ ప్రధాన పాత్రల్లో నటించారు. స్ఫూర్తివంతమైన డాన్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా 2013లో విడుదలై మంచి ప్రశంసలందుకుంది.
బ్యాటిల్ ఫీల్డ్ అమెరికా
ఒక యువ వ్యాపారవేత్త కమ్యూనిటీ సర్వీస్ చేయాలని భావిస్తాడు. అందులో భాగంగా యోగ్యత లేని కుర్రాళ్ళని తీసుకుని ప్రొఫెషనల్ డాన్సర్స్‌గా తయారు చేయడమే ఈ చిత్ర కథాంశం. అండర్ గ్రౌండ్ డాన్స్ కాంపిటీషన్‌లో విజేతలుగా నిలిచేందుకు ఆ యువ వ్యాపారవేత్తతోపాటు తన టీమ్ ఫేస్ చేసిన అడ్డంకులకు ప్రతీకగా ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిస్ స్టోక్స్ రూపొందించారు. 2012లో విడుదలైన ఈ చిత్రంలో వ్యాపారవేత్తగా మాస్కస్ హూస్టన్, ఇతర పాత్రల్లో మేకియా కాక్స్, గారి ఆంటోని స్టిర్గిస్, ట్రిస్టెన్ ఎం.కార్టర్, కిదా బర్న్స్, రస్సెల్ ఫెర్గుసన్ నటించి మెప్పించారు.
డిసెర్ట్ డాన్సర్
ఇరాన్‌కు చెందిన డాన్సర్, కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ అఫ్షీన్ ఘఫారియన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన బయోగ్రాఫికల్ డాన్స్ బేస్డ్ చిత్రమిది. డాన్సర్‌గా ప్రావీణ్యం పొందిన అఫ్షీన్ డాన్స్ కంపెనీ ప్రారంభించేందుకు తన జీవితాన్నే రిస్క్‌లో పెడతాడు. కొంత మందితో కలిసి డాన్స్ టీమ్ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తుంటాడు. కానీ అస్థిరమైన ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేసేందుకు ప్రయత్నిస్తుంటుంది. దీంతో ప్రభుత్వంలో అఫ్షీన్ చేసే పోరాటమే ఈ చిత్రం. రిచర్డ్ రెయిమాండ్ దర్శకత్వంలో 2014లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను సొంతం చేసుకుంది. అఫ్షీన్ పాత్ర రీసి రిట్చీ నటన ఆకట్టుకుంటుంది.
ఫూట్‌లూజ్
సిటీకి చెందిన రాక్ డాన్సర్ రెన్ మెక్ కార్మాక్ ఓ చిన్న పట్టణానికి వెళ్తాడు. అక్కడ రాక్ అండ్ రోల్ డాన్స్ నిషేధించబడి ఉంటుంది. దాన్నొక క్రిమినల్ యాక్టివిటీగా భావిస్తుంటారు. రెన్ అక్కడ క్రమ క్రమంగా ఓ డాన్సర్స్ టీమ్‌ను తయారు చేస్తాడు. రాక్ అండ్ రోల్ డాన్స్‌తో అక్కడి యువతతోపాటు జనాన్ని ఆకర్షిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. అనంతరం చోటు చేసుకున్న ఆసక్తికర సన్నివేశాల సమాహారమే సినిమా ఇతివృత్తం. 1984లో అదే పేరుతో వచ్చిన చిత్రానికి రీమేక్. క్రెయిగ్ బ్రూవర్ దర్శకత్వంలో 2011లో విడుదలైన ఈ సినిమా 24 మిలియన్ డాలర్లతో తెరకెక్కి 64 మిలియన్ డాలర్లను రాబట్టింది. రెన్ మెక్ కార్మాక్‌గా కెన్నీ వోర్మల్డ్, గర్ల్‌ఫ్రెండ్‌గా జూలియన్నే హాఫ్ నటన ఆద్యంతం మెస్మరైజ్ చేస్తుంది.
గో ఫర్ ఇట్
కార్మెన్ తెలివైన యువతే కాదు మంచి హిప్‌హాప్ డాన్సర్ కూడా. ప్రొఫెషనల్ డాన్సర్ కావాలనేది తన కల. కానీ భయం కారణంగా డాన్స్ కాంపిటీషన్‌లో రాణించలేకపోతుంది. తనలోని భయాన్ని అధిగమించి బెస్ట్ డాన్సర్‌గా రాణించేందుకు కార్మెన్ పడిన సంఘర్షణే ఈ చిత్రం. మహిళా దర్శకురాలు కార్మెన్ మర్రోన్ తన అనుభవాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2011లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. సెక్సువల్ కంటెంట్, హింస, డ్రగ్స్ వంటి అంశాల విషయాల్లో విమర్శలెదుర్కొంది. ఇందులో కార్మెన్ పాత్రలో ఐమీ గార్సికా నటించారు.