Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాయం మానసిక మైనది కావచ్చు, శారీరక మైనది కావచ్చు. వ్యక్తి ద్వారా కలగవచ్చు, వ్యవస్థ ద్వారా కలగవచ్చు. మూలాలను దెబ్బ తీసే గాయం మరీ ప్రమాదకరం. ఇక్కడ కవితాసంపుటికి కవి పెట్టిన శీర్షిక ఆ కోవలోనిదే. విత్తనం గాయపడటమేమిటి అనే ప్రశ్న పాఠకుల్ని ఆశ్చర్యపరుస్తుంది. తన వైపుకు మళ్ళించుకుంటుంది. ఈ గాయం ఎలాంటిదంటే తన స్థానాన్ని బదిలీ చేయించే ఆకలి లాంటి గాయం. ఎక్కడికో మనిషిని పట్టుకెళ్ళి వలస కూలీలుగా, సెక్యూరిటీ గార్డులుగా, వాచ్‌మెన్‌లుగా మార్చబడిన పేదవాడి ఆర్తానాదాల గాయం. అటువంటి గాయాల గుర్తులను ప్రపంచానికి పరిచయం చేయాలన్న కవి అంతర్మధనమే ఈ గాయపడ్డ విత్తనం.
రాఘవేంద్ర వాక్యాలకు ఉన్న బలం ఆ వాక్యాలను పూర్తిగా కవిత్వీకరించడమే. సందర్భాను సారంగా ప్రతీకలను వాడటం. ఊహాశాలిత్వం ఉన్న కవి. మొత్తంగా పదాల మధ్య కవిత్వమై నిలబడాలన్న ఆరాటమున్న కవి.కొన్ని కవితలెప్పుడు మినహాయింపే ఎంతగొప్ప కవి విషయంలోనైనా. అలిశెట్టి గారన్నట్టు ''రాసిన ప్రతీది ఆణిముత్యం కాదు''.
వెంటాడే వాక్యాల్లోకి...
1. పగలంతా భానుడు పోసిన
వెలుతురు తాగి
రాత్రి సూరీడై నిలబడి
దారిలో కాసింత అమతం చల్లేది (స్ట్రీట్ లైట్)
మరణం లేని ఔషధాన్ని ఇస్తుందంటే కవి ఏ వస్తువును కవీత్వీకరించకుండా ఉంటాడు.సూర్యుడి తో దోస్తీ కట్టని కవి దాదాపు ఉండడు.ఈ వాక్యాల్లో వీధి స్తంభాన్ని సూర్యునితో వెలిగించటం ఈ కవి ఊహాశాలిత్వానికి ఉదాహరణ. వెలుతురును తాగడం, అమతం చల్లడం వంటి పదాల ప్రయోగం నిర్మాణపరంగా ఈ వాక్యాలకు అదనపు బలం.
2.చుక్క నీరు లేక చెరువులు
పగుళ్ళుదేలినట్లున్న ఆ దేహం
ఈ దేశం చిరు నామా (గాయపడ్డ విత్తనం)
శరీరానికి అన్ని రకాల పోషకాలను సరఫరా చేసినప్పుడే ఆరోగ్యంగా ఉంటుంది. ఏ మాత్రం పోషకాలు లోపించిన దేహం అనారోగ్యం పాలవుతుంది. దేశ పరిస్థితిని, శ్రమజీవుల బతుకు చిత్రాన్ని, ముఖ్యంగా వలస వెళ్లి పట్నాలలో గేట్ల ముందు వాచ్‌మెన్‌లుగా నిలబడి కడుపునింపుకుంటున్న వ్యక్తుల ఆర్తిని ఈ వాక్యాలలో ప్రతిబింబింప చేశాడు కవి.
3. నేను మట్టిని
అసహన గాలికి
తల చెదిరిన కంకి
జారవిడుచుకున్న గింజ మొలకెత్తినట్లు
నే పుడుతూనే వుంటా.. (నేను మీ గౌరీ లంకేష్)
మట్టికి మరణం లేదు. మనిషికి మరణం ఉంది. మట్టిలా మారిన మనిషికయితే పుట్టుకే తప్ప చావు లేదు. మట్టిలా గౌరీ లంకేశ్‌ను అభివర్ణిస్తూ ''వాక్ స్వాతంత్య్రపు'' హక్కు కూడా హరించి వేయబడ్డ ప్రస్తుత సమాజానికి ఓ ప్రశ్న రూపంలో ఈ వాక్యాలను సంధించాడు.
4. నేను వూరికెళ్ళిన ప్రతీసారి
నా రెండు కళ్ళను పుష్పాలు చేసి
సమర్పిస్తుంటా
నా మదిని జ్ఞాపకం
గునపమై తవ్వుతూనే వుంటుంది (రేడియో కట్ట)
జ్ఞాపకాలు ఎక్కువగా భావాలతో పెనవేసుకోబడతాయి. అప్పుడప్పుడు మిణుకు మిణుకుమంటూ ముఖాల్లో వెలుగుతుం టాయి. మనం తిరిగిన ప్రదేశాలు, నివసిస్తున్న ప్రదేశాల లోప లికి కొంతకాలం తర్వాతనో, వయసు మళ్ళిన తర్వాతనో చూసు కుంటే ఖచ్చితంగా మనసును తవ్వుతుం టాయి. ఇక్కడ కవి పూర్తిగా నోస్టాల్జియాలోకి ఇంకిపోయాడు. ఇలా కవిత వాక్యాల్లో చిగురించాడు.
- తండ హరీష్ గౌడ్
8978439551