Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ కవితా సంకలనాన్ని తన జీవన సహచరుడు ప్రసాద్‌కి అంకితం చేసారు. ప్రముఖ కవి కె.శివారెడ్డి ''ఆమె శ్వాస'' అంటూ విలువైన ముందుమాట రాసారు. అలాగే లోపలి ప్రపంచాన్ని శుభ్రపరిచే కవిత్వం అంటూ సీనియర్ జర్నలిస్ట్. పాత్రికేయ రచయిత గుడిపాటి ఈ కవితల్ని పలు కోణాల్లో విశ్వేషించారు. 63 కవితలున్న ఈ సంపుటిలోని చాలా కవితలు 'స్త్రీ' అంతరంగాన్ని ఆవిష్కరించాయి. 40 సంవత్సరాల కిందటి స్త్రీవాద ఉద్యమ కాలం నాటి కవితలు గుర్తుకొచ్చాయి. శివారెడ్డి గారు అన్నట్లుగానేwoman is different and unique.. ఇది తొలి కవితా సంపుటి అని పాఠకునికి ఏ మాత్రం అనిపించదు. పలు పోటీల్లో- వాట్సాప్‌లలో- వివిధ పత్రికల్లో పద్మావతి కలం బలం- బలమైన అభివ్యక్తి, నవ్యత్వం- సృజనాత్మకత- సూటిదనం- ధిక్కారస్వరం వి(క)నిపిస్తాయి. స్త్రీ పురుషు సంబంధాలు- వైరుధ్యాలు- పీడనం- వివక్షతలపై ఆర్థ్రమైన స్వరం వీరి లేఖినిలో కనిపిస్తుంది. కొన్ని కొన్ని కవితల్లో అస్పష్టత కూడా ఉంది.. వస్తువు ఏకీకృతం కావడం వల్ల పునరుక్తులుగా అనిపించాయి. అన్ని రకాలైన సామాజికాంశాల్ని కవిత్వీకరించాలి కదా! వీని కవితల్ని కొన్నింటిని చూద్దాం!
''నాలోని నేను'' (పేజి 37) కవితలో ఒక చోట కవయిత్రి ఇలా అంటారు..
''ఆశల చమురు పోసి ప్రాణా శ్వాసల వత్తిని ఎగదోస్తాను'' ''మనిషి తనమే మృగ్యమౌతున్న ఈ మాయదారి లోకంలో
కొంతయినా మానవత్వాన్ని తట్టిలేపడానికై తల్లకిందులవేతాపే
అందరికీ ఉపదేశించే ముందు, అద్దంలో తరచి చూసుకుంటాను!
ప్రతిదినం... నన్ను నేను దిద్దుకుంటాను''- అంటారు.
''నీలి కలలు'' (పేజి.43) కవితలో పురుషాధిక్యత భావజాలాన్ని సూటిగా ప్రశ్నిస్తారు కవయిత్రి. నీకు నా దేహమొక క్రీడాస్థలం / ఎప్పుడు పడితే అపడ్రు / నా ప్రమేయమే లేకుండానే ఆడుకుని నువ్వు మాత్రమే గెలిచి / విజయ గర్వంతో / నీ నుదుటన మెరిసే.. / చెమట చుక్కలను తుడుచుకుంటూ.. తృప్తిగా ఠీవిగా నడిచిపోతావు / ........ పచ్చి బాలింత అవయవాలను పోగు జేసుకుంటూ రహస్యంగా కన్నీళ్ళు తుడుచుకుంటాను-
''గాయాల కథ''- కవిత చివరి వాక్యాలు గాయపడ్డ హృదయాన్ని కదిలిస్తాయి. (పేజి.79)
''చుట్టుకొలతల కొలమానాలు / పొట్టపొడుగుల వైశాల్యాలు లేని గాయాలకు / అగాధమంత లోతులు మాత్రం ఉంటాయి. / గాయం తొడుక్కోని మనిషి / అసలు ఉండడేమో / అయినా గాయాల్ని రుచి చూడకపోతే / జీవితం గేయాన్నెలా పాడుతుంది!'' అంటారు.
గెలుపెరుగని బరి (పేజీ.97), సేల్స్‌గాళ్ (పేజీ.130), కొత్త జన్మ (పేజీ.143), పాపా! ఓ పసిపాపా (పేజీ.126), నాలో నాలో (పేజీ.84), బ్రతుకెండిన చేపలు (పేజీ.83), బాడీ షేమింగ్ (పేజీ.61) కవితలు అద్భుతంగా ఉన్నాయి.
(కొత్త వేకువ (కవిత్వం), రచయిత : పద్మావతి రాంభక్త, పేజీలు : 144, వెల : రూ.100/-, ప్రతులకు : పద్మావతి రాంభక్త, ఇ.నెం. 10-38-4, రాంనగర్, విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్) - 530002, సెల్ : 9966307777
- తంగిరాల చక్రవర్తి, 9393804472