Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పలుగురాళ్ళ కుప్పలో ఒక వాక్యం మొలకెత్తింది
నమ్మకం ఎంతపనయినా చేయిస్తుంది-
అక్షరాల కవాతు చూసి ఆలోచన క్రమశిక్షణ నేర్చుకొంది
సమూహ పరాక్రమమే వేరు..!
ఆకుల వొంపు - ఆచరణల సొంపు కలగలిసిన
సెలయేరు రేపు తప్పక ప్రవహిస్తుంది
ఇసుకలో వేలాది బుర్రలు ఎపుడో కూరుకుపోయాయి
మేధావిని చూసి ఉష్ట్ర పక్షి నవ్వింది
ఒక కాగితం ఇస్తాను - ఏం రాస్తావు నువ్వు?
అయిదు చుక్కల ముగ్గు కాదు - రైతు నొసట రేఖల కళాఖండం గీస్తావా?
దట్టమైన బతుకు అరణ్యం ఎట్లా దాటాలో ముడి విప్పుతావా?
వెన్నులేని వాడికి పెన్ను ఎందుకూ?
కళ్ళల్లో కరెంటు కాదు - జీవం ప్రవహించాలి
కర్తవ్య గీతం కాకి పాడినా శ్రావ్యంగానే ఉంటుంది
ఆత్మద్రోహమేఘాలు ఆవృతమైతే దు:ఖ తుఫాను తప్పనే తప్పదు
మొఖానికి రంగు కొనొచ్చు - హృదయానికి మనమే తయారు చేసుకోవాలి
వెరసి ఈ చొక్కా బాగోలేదు - వంట రుచిగా లేదు
ఆలోచనలు పెనం మీది పేలాలయితేనే జిహ్వకు రుచి
అంతెత్తున నరాలు సంధించి ఆకాశాన్ని ఎక్కుపెడితేనే సార్థకత
మనిషి వ్యాపించాలి - ఉన్న చోటే అరంగుళమైనా విస్తరించాలి
నిలువుగా - శిఖరుగా నిదర్శనంగా...!!
చొప్పదండి సుధాకర్
9177348349