Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లెటూర్లలో సంక్రాంతి పెద్ద పండుగ. వ్యవసాయాధారితమైన మన దేశంలో రైతులందరూ ఇష్టంగా జరుపుకునే పండుగ ఇది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పండుగ హడావుడి ఇంతా అంతా కాదు. కొత్తబట్టలు కొనుక్కోవడం, కొత్త అల్లుళ్ళు ఇంటికి రావడం, కొత్త ధాన్యం గహాలకు చేరడం... ఇలా అంతటా కొత్తదనమే కనపడ్తుంది.
పండుగ అంటేనే సంతోషం. ఇక పంట చేతికొచ్చే పర్వదినం మరీ ఆనందాన్నిస్తుంది. పూర్వం అయితే సంక్రాంతి పండుగ ముందే రైతులకు ధాన్యం ఇంటికొచ్చేది. గాదెల్లో ధాన్యాన్ని నింపి నిలువ చేసేవారు. తెలంగాణాలో గాదెను గుమ్మి అంటారు. అవి నిండితే ఇళ్లల్లో సౌభాగ్యం, సంతోషం వెల్లివిరిసేవి. కష్టానికి తగిన ఫలితం లభించినందుకు రైతుల కళ్ళల్లో సంతప్తి కదలాడేది.
ఈ కాలంలో చలి ఎక్కువగా ఉంటుంది కనుక దానికి సంబంధించిన అనారోగ్యాలు కలుగకుండా శరీరంలో వేడి పుట్టించే నువ్వులు, బెల్లం, సజ్జలు, వాము వంటి పదార్థాలతో తయారయ్యే పిండి వంటలు ఎక్కువగా చేస్తారు. బియ్యం నానబెట్టి, వడగట్టి పిండి చేసి.. అందులో నువ్వులూ, ఉప్పూ, వామూ కలిపి చిన్న చిన్న ముద్దలుగా తీసుకుంటూ శుభ్రమైన బట్ట మీద వంకీలతో చేతి కంకణాల్లాంటి చకిలాలు (సకినాలు) చుట్టి నూనెలో వేయిస్తారు. కొందరు వంకులేవీ లేకుండా పోస్తుంటారు కూడా . అరిసెలు , పల్లీ నువ్వుల లడ్డూలువంటి తీపి పదార్థాలతో బాటు రకరకాల పిండి వంటలు ప్రతి వారూ చేస్తుంటారు. ముఖ్యంగా ఒకరి ఇంట్లో చేసినపుడు ఇరుగు పొరుగు ఇళ్ల వాళ్ళు వచ్చి సహాయం చేయడమో, రెండు మూడు ఇళ్ల వాళ్ళు కలిసి ఒకేచోట చేసుకోవడమో అలవాటు. అలా పరస్పర సహకారం వెల్లివిరుస్తుంది.
సంక్రాంతికి పది రోజుల ముందు నుండే ఊర్లల్లో సందడి మొదలవుతుంది. స్త్రీలు, కన్నెపిల్లలు తమ వాకిళ్ళను శుభ్రంగా ఊడ్చి పేడతో కళ్ళాపి చల్లి సుద్దతో గానీ, బియ్యం పిండితో గానీ రకరకాల ముగ్గులు వేస్తారు. ఇది రథసప్తమి దాకా కొనసాగుతుంది. ఇక పండుగ మూడు రోజులూ అయితే పసుపూ, కుంకుమా, బుక్కా, గులాబు రంగులతో ఈ ముగ్గులను నింపుతారు. ఆవు పేడతో పిరమిడ్ ఆకారంలో గొబ్బెమ్మలను చేసి ముగ్గు మధ్యలో వాటిని ఉంచుతారు. వీటి పైన పిండి కూర రెమ్మలూ, గరిక పోచలూ గుచ్చుతారు. ఇకగొబ్బెమ్మల చుట్టూ బియ్యం, నువ్వులూ, రేగు పళ్ళూ పెడతారు. కొన్ని ప్రాంతాల్లో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు. ఈ పిండి కూర, కొండ పిండి కూర కిడ్నీల్లో రాళ్లను అవలీలగా కరిగించడమే కాకుండా అనేక వ్యాధులకు మంచి ఔషధంగా పని చేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతారు.
మూడు రోజులు జరుపుకునే ఈ పండుగలో మొదటి రోజు భోగి. ఈ రోజు ప్రతి ఇంట్లోనూ చిన్న పిల్లల తలలపై బియ్యం, నువ్వులూ, రేగుపళ్ళూ పోసి వాళ్ళకు ఏ దిష్టీ తగలకూడదనీ, ఆరోగ్యంగా ఉండాలనీ పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తారు. భోగి పళ్ళల్లో కొన్ని ప్రాంతాలలో చెరుకు ముక్కలు కలిపితే, మరి కొన్ని చోట్ల.. ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువగా బియ్యం పిండితో చేసిన సకినాలు, పాలకాయలు కలుపుతారు.
పల్లెల్లో అధిక శాతం జనానికి వ్యవసాయమే ముఖ్య వత్తి. ఆ వ్యవసాయం బావుంటేనే దాని అనుబంధ వత్తులన్నీ బావుంటాయి. ముఖ్యంగా పాడి పశువులు! 'పాడీ పంటా' అంటారు కదా! స్వంతంగా భూములున్న వాళ్లకూ, కౌలు భూముల్లో వ్యవసాయం చేసే వాళ్లకూ పాడి పశువులుండేవి. వాటి పోషణలో కుటుంబ సభ్యులంతా పాలు పంచుకునేవారు. అలాగే మేకలు, గొర్రెలు, కోళ్లు పెంచేవారు.
ఇక అనేక వత్తుల వారికి పనీ, ఆదాయం కల్పించేది వ్యవసాయ రంగమే. నాగళ్లు, గుంటుకలు, కర్రులు, గడ్డపారలు, చేతి పారలు, గొడ్డళ్లు, కొడవళ్లు, మోట బొక్కెనలు, చేటలు, జల్లెడలు, నీటి తొట్టెలు, కుండలు వంటి పరికరాలూ, వస్తువులూ తయారు చేసే వడ్రంగి, కమ్మరి, కుమ్మరి వంటి వత్తి పనుల వారికి కూడాపంట చేతికందినప్పుడే వాళ్ళ పనికి తగ్గ ప్రతిఫలాన్ని ధాన్యం రూపంలో వ్యవసాయ దారులు అందించేవారు. అంటే, పల్లెటూళ్లలో చాలా మందికి తమ కష్టానికి తగిన వేతనం సంక్రాంతి పండుగకే లభించేది. అందుకని పల్లె వాసులంతా ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకునేవారు.
ఆంధ్రా ప్రాంతంలోలాగా ఎడ్ల పందాలు, కోళ్ల పందాలు, బళ్ల పందాలు లేకపోయినా తెలంగాణలో కూడా పల్లెటూరి వాళ్లకు సంక్రాంతి పెద్ద పండుగే. చాలా ఊర్లల్లో మూడవ రోజైన కనుమ పండుగ నాడు పశువులను కడిగి, కొమ్ములకు రంగులు వేసి, వాటి మెళ్ళో పూసల దండలూ, బంతి పూల దండలూ వేయడం, బొట్లు పెట్టి పూజించడం ఆచారం. తమకు సేద్యంలో సహాయపడే మూగ జీవాలకు ఆ రకంగా కతజ్ఞత తెలుపుకోవడం అనే సత్సాంప్రదాయాన్ని రైతులు పాటించేవారు. ఇప్పుడు ట్రాక్టర్లూ, హార్వెస్టర్లూ వంటి ఆధునిక యంత్ర పరికరాలు వచ్చాయి గానీ, పాతికేళ్ళ క్రితం వరకూ ఎద్దులు రైతుకు సహాయకులే.
ఇక తెలంగాణా అంతటా సంక్రాంతి దాటింది మొదలు వివిధ శివక్షేత్రాల్లో పండుగలూ, జాతరలు మొదలవుతాయి. వ్యవసాయానికి కొంచెం తీరిక చిక్కుతుంది గనుక అందరూ కుటుంబాలతో సహా ఎడ్లబళ్లను చక్కగా అలంకరించి, వంట సామాగ్రి, గుడారం వేసుకునేందుకు అవసరమైన వస్తువులూ తీసుకుని, బళ్లకు ప్రభలు (బట్ట జెండాలు) కట్టి విడివిడిగానూ, గుంపులుగానూ సమీపంలోని దైవ క్షేత్రానికి వెళ్లడం పరిపాటి. వర్షాలు తగ్గుముఖం పట్టి, ఇంకా ఎండా కాలం మొదలు కాకముందు గనుక.. యాత్రా దర్శనానికి కూడా ఇది అనువైన కాలం. శివసత్తులు ఊగడం, పట్నాలు వేయడం, కోడెను కట్టడం వంటి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. దైవ దర్శనం అయ్యాక అక్కడ ఏర్పాటు అయ్యే సంతలో గాజులూ, దుస్తులూ, బొమ్మలూ, ఇంటికి కావలసిన అలంకరణ వస్తువులూ కొనుక్కునేవారు. పేలాలూ, బత్తీసాలూ, పంచదార చిలకలూ, బూరుమిఠాయి వంటి కొత్త తినుబండారాలు కొనుక్కుని తిని ఆనందించేవారు. కొన్నిసార్లు ఈ జాతరల్లో విచిత్ర వేష ధారణలూ, కోతుల చేష్టలూ, తాడు మీద విన్యాసాలూ, ఇంద్రజాల ప్రదర్శనలూ వంటివి ఉండేవి. మొత్తానికి పల్లెల్లోని వారు తమ నిరంతర శ్రమ జీవితం మధ్యలో కొంత వెసులుబాటు పొంది సంతోషంగా గడిపే కాలానికి సంక్రాంతి పండుగ ఆరంభం అన్న మాట.
పాలు అమ్మితే రైతులకు అదనపు ఆదాయం లభించేది. వాటి పేడ మళ్ళీ పంటకు ఎరువుగా ఉపయోగపడేది. పేడలో వడ్ల పై పొట్టుతో వచ్చే ఊకను కలిపి గుండ్రని ముద్దలుగా చేసి గోడలకు చరిచి ఉంచేవారు. వీటిని పిడకలు అంటారు. ఈ పిడకలు ఎండాక ఒక చోట గుట్టగా పేర్చి అవసరమున్నప్పుడు తీసి వాడేవారు. దీన్ని పిడకల గుట్ట అనేవారు.
పూర్వం ఇంట్లో ఎప్పుడూ నిప్పు ఆరకూడదని కుంపటి వెలిగించి పెట్టేవారు. ఈ కుంపట్లో పిడకలు అడుగున ఉంచి పైన ఉనుక చల్లేవారు. దీని చుట్టూ కూర్చుని శీతాకాలంలో చలి కాచుకునే వారు. ప్రొద్దున్నే పొయ్యి వెలిగించాలన్నా ఈ కుంపటి నిప్పునే వాడేవారు. ఈ పిడకల బూడిద తెల్లగా, మెత్తగా ఉండేది. దీనితో పళ్ళు తోముకునేవారు. ఇప్పుడు ఆయుర్వేద వైద్యులు, ప్రకతి చికిత్స చేసేవారూ ఆవు పేడతో చేసిన పిడకల బూడిద దంతాలకు మంచిదని చెబుతున్నారు.
సంక్రాంతికి కొన్ని ప్రాంతాల్లో ఈ పిడకల మంటపైనే కొత్త కుండలో కొత్త బియ్యం పోసి పులగం కానీ పొంగలి గానీ మీటుతూ 'హరిలో రంగ హరి' అంటూ శ్రావ్యంగా శ్రీహరి నామ సంకీర్తన చేస్తూ ఇంటింటికీ తిరుగుతూ భిక్షాటన చేసే విష్ణు భక్తులు ఈ హరిదాసులు. వీరి తలపై ఉత్తరీయం లాంటిది చుట్టుకుని దానిపై గుమ్మడి కాయను గానీ, అక్షయపాత్ర అని పిలువబడే అలాంటి పాత్రను గానీ ఉంచుకుని దాతలు ఇచ్చిన బియ్యం, ఇతర వంట సామాగ్రీ అందులో పోసుకుని ఇంటికెళ్లి నిలువ చేసుకుంటారు. వీరు సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తి అవతారమనీ, వీరి తలపై ఉండే గుమ్మడికాయ భూదేవి స్వరూపమనీ భక్తుల విశ్వాసం. హరిదాసుకు బియ్యం పెట్టాక అతను అందులోంచే కొన్ని బియ్యపు గింజలు తీసి చేటలో ఉంచుతాడు. వాటిని మళ్ళీ ధాన్యం గాబులో పోస్తే సిరి సంపదలు వెల్లివిరుస్తాయని గహిణుల విశ్వాసం.
మార్గశిర మాసమంతా వైష్ణవ ఆలయాల్లో జరుపబడే ధనుర్మాస పూజలు ఈ సంక్రాంతి నాడు శ్రీరంగనాధునితో ఆండాళ్‌కు జరిగే గోదా కళ్యాణంతో ముగుస్తాయి. బియ్యం, పెసరపప్పు, మిరియాలతో చేసేపొంగలి, బెల్లం కలిపి చేసే పాయసం భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు.
ఇక 'డూ డూ బసవన్న' అంటూ గంగిరెద్దులను తోలుకు వచ్చే దాసరి వారు ఈ సంక్రాంతికి ప్రత్యేకం. ఎద్దునురంగు రంగుల బట్టలతోనూ, పూసల దండలతోనూ అలంకరించి సన్నాయి వాయిస్తూ వచ్చి భిక్షనూ, బట్టలనూ యాచిస్తూంటారు. వీరిని సాక్షాత్తూ జంగం దేవర అయిన ఆ పరమ శివునితోనూ, గంగిరెద్దును నంది స్వరూపంగానూ భావించి భిక్ష వేస్తుంటారు. అదేవిధంగా ఢమరుక వాయిస్తూ, శంఖం ఊదుతూ బుడబుక్కల వాళ్ళు కూడా యాచనకు వస్తూ ఉంటారు. వీళ్లందరితో ఊరు కళకళలాడుతూ ఉంటుంది.
మరి కొంతమంది తమ ఇళ్లల్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేసి చుట్టుపక్కల వాళ్ళని పేరంటానికి పిల్చి వాయనాలిస్తారు. ఇక పిల్లలకు గాలిపటాలు ఎగరేయడంతో, ఆటపాటలతో రోజంతా గడిచిపోతుంది. ఈ రెండు వేడుకలూ పల్లెల్లో కన్నా పట్నాల్లోనే ఎక్కువ. ఇక తెలంగాణలో ఆడపిల్లలూ, గహిణులూ గౌరీనోములు నోచుకుంటారు. వెనకటి వారైతే పెద్దవాళ్ళు పదమూడు మట్టి కుండలూ, వాటిపై మూతలూ, ఆడపిల్లలు చిన్న చిన్న గురుగులూ నోచుకుని తెల్లవారి అందర్నీ పిలిచి నువ్వులూ, బెల్లంతో చేసిన లడ్డులూ, రేగి పళ్లతో బాటు వాటిని వాయనం ఇచ్చేవారు. అవి ఇస్తూ 'నువ్వులు తిని నూరేళ్లు బ్రతుకు - తీపి తినితియ్యగా మాట్లాడు' అని చెప్పేవారు. రానురానూ ఇంట్లోకి ఉపయోగపడే ఇతర చిన్న చిన్న వస్తువులు నోచుకుని పంచడం అలవాటుగా మారింది. కొందరైతే 'వామి నోము' అని నేరుగా కుమ్మరి వామి దగ్గరికి వెళ్లి వామిలోని కుండలన్నీ కొని అక్కడికక్కడే ముత్తయిదువులకు వాయనమిచ్చేవారు. ఇంకా 'రేపల్లె వాడ నోము' అంటూ కొన్ని ప్రాంతాల్లో కడవల నిండా పాలు, పెరుగు, వెన్న ఉంచి కవ్వాలు, మురళి లాంటివి సిద్ధపర్చేవారు. చిన్న పిల్లలను కష్ణుడి లాగా, గొల్లభామల్లాగా అలంకరించి వేడుకలు జరపడం ఇప్పటికీకొన్ని చోట్ల ఉంది.
నేడు పల్లెటూళ్లలో సంక్రాంతికి ఈ వేడుకల్లో కొన్ని మాత్రమే జరుగుతున్నాయి. వ్యవసాయం చేసేవాళ్ళు రానురానూ తగ్గిపోతున్నారు. రైతుల బాధలు ఏళ్ల తరబడి అలాగే ఉన్నాయి. చేతి వత్తులూ, కులవత్తులూ అడుగంటాయి. బార్టర్ పద్ధతి పోయి ప్రతి దానికీ నగదు చెల్లింపులు పెరిగాయి. పట్నాలకు వలసలు పెరిగాయి. యంత్రాలూ, వాటి ఖర్చులూ, వ్యవసాయ కూలీలకు ఇవ్వాల్సిన కూలీ డబ్బులు పెరిగాయి. ప్రకతి వైపరీత్యాల మధ్య, నీటి కొరతల మధ్య , నకిలీ విత్తనాలు , పురుగు మందుల మధ్య , దళారీల మధ్య, సరియైన మార్కెట్ వసతుల లేమి మధ్య, మద్దతు ధరలు లేకపోవడం మధ్య, అప్పుల మధ్య రైతు నలిగి పోతున్నాడు. వ్యవసాయం అంటే ఉన్న ఇష్టం కొద్దీ పంట పండించినా అన్నీ పోను అతనికి అప్పులే మిగులుతున్నాయి. ఒకప్పుడు తను తిని నలుగురికి పెట్టిన రైతు నేడు సహాయం కొరకు దిక్కులు చూస్తున్న నేపథ్యంలో రేపటి తరానికి బువ్వ పెట్టేదెవరు అన్న ప్రశ్న తలెత్తక మానదు. ఈ బాధలు పోయి తిరిగి రైతు కళ్ళల్లో కొత్త కాంతి, రైతు ఇంటిలో సంక్రాంతి వెల్లివిరిసే రోజులు ఎప్పుడొస్తాయో!