Authorization
Mon Jan 19, 2015 06:51 pm
In the non stop tsunami of global information, librarians provide us with floatiest and teach us to swim-Linton Weeks
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా ఛక్షురున్మిలనం యేన తస్మై శ్రీ గురవే నమః అనే ఆర్యోక్తి ప్రకారం అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి జ్ఞానమనే కాంతులను వెలిగించే వారు నిజమైన గురువులుగా భావించవచ్చు. నేటి సమాజంలో ఈ పాత్రను గ్రంథ పాలకులు సమగ్రవంతంగా పోషిస్తున్నారు అనడంలో సందేహం లేదు. ప్రస్తుత సమాజంలో మానవీయ విలువలకు ఎక్కడ తావు లేకుండా పోతుంది. ఈ పరిస్థితుల్లో భూతదయ, సహనం, కోపం లేకుండా ఉండడం, సమయస్ఫూర్తి, తక్షణ జ్ఞానం, సామాజిక స్పహ మొదలగు సుగుణాలు నింపేందుకు గ్రంథాలయాలు & వాటిని నిర్వహించే గ్రంథపాలకులు తోడ్పడతారు. నేటి యువతరంలో, విద్యార్దులలో మానవీయ కోణాలను ఆవిష్కరించే ప్రయత్నం గ్రంథాలయాలు అందులో ఉన్న జ్ఞాన సంపద & గ్రంథపాలకులు చేస్తున్నారు.
ఒకప్పుడు తాళపత్ర గ్రంథాలను మట్టి కుండల్లో (భాండాల్లో) దాచే పని చేయడం వల్ల 'గ్రంథ భాండాగారు'లనే పేరు వాడుకలోకి వచ్చింది. ఆంగ్లంలో మూడు ''బీ'' లుంటే గ్రంథాలయం అన్నారు. అవి బి= 'బుక్స్, బి= బిల్డింగ్, బి= బ్రెయిన్'. ఒక ప్రాంతంలో వందల, వేల పుస్తకాలు ఉంటే అది మాత్రమే గ్రంథాలయమైపోదు. పుస్తకాలతో (పొత్తాలతో) కూడిన బ్రహ్మండమైన భవనం ఉన్నా కూడా గ్రంథాలయం కాదు. వివిధ జ్ఞానశాఖల, శాస్త్రాల పుస్తకాలను అవసరమున్న చదువరులకు అందించే మూడో ''బీ'' అయిన బ్రెయిన్' కు అందించే గ్రంథపాలకుడు (లైబ్రేరియన్) ఉన్నప్పుడే అది గ్రంథాలయం అవుతుంది.
నిర్ణీతమైన పని వేళలుండి, కుల మత వర్గ విచక్షణ లేకుండా పౌరులందరికీ ఉపయోగపడేది పౌర గ్రంథాలయం. ప్రభుత్వ, ప్రైవేటు, విశ్వవిద్యాలయ, కళాశాల, పురపాలకసంఘం, కొన్నిచోట్ల పంచాయతీ ఇలా ఎన్నిరకాల గ్రంథాలయాలున్నా అన్నింట్లో జరిగేది జ్ఞానశాఖల ప్రగతి పంపిణీయే. వాటిని నిర్వహించేది గ్రంథ పాలకులే. గ్రంథాలయ రంగ మహనీయుల సేవాస్ఫూర్తిని ఇబ్బడి ముబ్బడిగా పొందడానికి ఉద్దేశించిందే గ్రంథపాలక దినోత్సవం.
గ్రంథాలయశాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం కీర్తిప్రతిష్ఠలను నిలిచేలాచేసిన ఘనత డా.ఎస్.ఆర్. రంగనాథన్ ది మాత్రమే. భారత దేశంలో మనసా వాచన కర్మణా గ్రంథాలయ శాస్త్ర అభివద్ధికి, గ్రంథాలయాల అభివద్ధికి నిరంతరం కషి చేసిన అసాధారణ వ్యక్తిగ పేరుపొందిన వ్యక్తి మన షియాలి రామమత రంగనాథన్ ఆగస్టు 9వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూర్ (ప్రస్తుతం నాగపట్నంలో ఉన్నది) జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. అయ్యంకి స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఏర్పడింది. తెలుగునాట పెద్ద సంఖ్యలో గ్రంథాలయాల స్థాపన వికాస వంతంగా జరిగింది. దాన్నే ప్రజా గ్రంథాల యోద్యమంగా చరిత్రకారులు పేర్కొన్నారు.
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పరిస్తితి పరిశీలిస్తే గ్రంథాలయాలను ఎన్నో సమస్యలు చుట్టుముడు తున్నాయి. 'గ్రంథాలయంలో నాకు దైవదర్శనం అవుతుంద'న్న రంగనాథన్ భావనను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు రాష్ట్రాల పాలకులు గ్రంథాలయాల అభివద్ధి, వాటి పునరుజ్జీవనం మీద దష్టి పెట్టాలి. ఇక గ్రంథపాలకులు కూడా పాఠకులకూ జ్ఞానపీఠాలైన గ్రంథాలయాలకు మధ్య వారధులుగా, సారథులుగా ఉండాలి. ఒక మహౌన్నత నాగరిక ఆధునిక ప్రగతిశీలక మానవుని రూపకల్పనలో మనం భాగస్వాముల వుతున్నామనే ఆనందం, సంతప్తీ ప్రతి గ్రంథపాలకుడికీ ఉండాలి.
నేటి సమాజంలో గ్రంథాలయాలు డ గ్రంథపాలకుల గమనం మన తెలుగు రాష్ట్రాలలో ఏవిధంగా ఉందో పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో 907 శాఖా గ్రంథాలయాలకు గాను 904 శాఖా గ్రంథాలయాలు పని చేస్తున్నాయి. వీటిలో 115 గ్రంథాలయాలకు శిథిల అవస్తలో ఉన్నాయి, 207 అద్దే భవనాలలో పని చేస్తున్నాయి. వాటిలో 1658 మంది (రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సొర్సింగ్, పార్ట్ టైం) సిబ్బంది పనిచేస్తూండగా, 887 గ్ర0థపాలకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం 1, ప్రాంతీయ గ్రంథాలయాలు 2, నగర జిల్లా కేంద్ర గ్రంధాలయాలు 10, శాఖా గ్రంథాలయాలు 562, గ్రామీణ గ్రంథాలయాలు 105, పుస్తకనిక్షిప్త కేంద్రాలు 254 మొత్తం 934 గ్రంథాలయాలు కలవు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పౌర గ్రంథాలయలలో, సంచాలక కార్యాలయంలో, ప్రభుత్వ గ్రంథాలయాలలో జిల్లా గ్రంథాలయ సంస్థలలో, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలో పనిచేసే గ్రంథపాలకుల పరిస్థితి చూసినట్లైతే. డైరెక్టరేట్ కార్యాలయం 19 గ్రంథపాలకుల పోస్టులు ప్రభుత్వం సాంక్షన్ చేయగా తొమ్మిది మంది మాత్రమే పనిచేస్తున్నారు. ప్రభుత్వ గ్రంథాలయాలలో 70 పోస్టులు, జిల్లా గ్రంథాలయ సంస్థలలో 1040 పోస్టులు సాంక్షన్ కాగా 580 పోస్టులు, మొత్తం వెయ్యి 1076 పోస్టులకుగాను, 646 గ్ర0థపాలకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిత్యం మారుతున్న పరిస్థితులకనుగుణంగా నూతన సాంకేతిక పద్దతుల ద్వారా పౌరగ్రంథాలయాలు ప్రజలకు సేవ చేయాల్సిన సందర్భంలో గ్రంథపాలకులు సంఖ్య పరిమితం ఉండటం శోచనీయం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1986-87 కాలంలో ఒకేసారి 556 గ్రంథాలయాలను మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. 1988 ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రంథపాలకుల ఉద్యోగాల నియామకంపై ప్రభుత్వం నిషేధించింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇది కొనసాగుతున్నది. తెలుగు రాష్ట్రాలలో 230 మంది పొరుగు సేవల ద్వారా హెల్పర్, రికార్డు అసిస్టెంట్, లైబ్రేరియన్‌గా సేవలందిస్తున్నారు. సంవత్సరాల తరబడి పనిచేస్తున్న వారి వేతనాలు నామమాత్రంగా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాలలో పౌర గ్రంధ పాలకులు ఎదుర్కొంటున్న సమస్యలైన ముఖ్యంగా 010 ప్రభుత్వ ఖజానా నుండి నేరుగా జీతాలు అందించాలి. ప్రభుత్వ గ్రంథాలయాలలో పనిచేస్తున్న ఒక గ్రంథ పాలకుడు ఒకరు 3 లేదా 4 గ్రంథాలయాలను నిర్వహిస్తున్న పరిస్థితి దీనికి ప్రధాన కారణం గ్రంథ పాలకులు తగినంతగా లేకపోవడం ఇది భాగా ఇబ్బంది కలిగించే విషయం. గ్ర0థపాలకులకు మూత్రశాలలు డ శోచాలయాయాలు కల్పించాలి. అదేవిధంగా సంవత్సరాల తరబడి ఉద్యోగాలు చేస్తున్నా వారికి హెల్త్ కార్డులు, బీమా సౌకర్యం లేక పొవడం దురదష్టకరం. పౌర గ్రంథాలయాలలో పనిచేస్తున్న గ్రంథ పాలకుల జీతాలు నెలనెలా వచ్చే ప్రయత్నం చేయాలి.
నూతన రాష్ట్ర ఆవిర్భావం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమస్యపై తక్షణమే స్పందించి 010 పై సమావేశం నిర్వహించి ప్రభుత్వం సుముఖంగా ఉందని చెప్పారు. కానీ సాంకేతిక ఇబ్బందుల వల్ల అది గత ఆరు సంవత్సరాలుగా నలుగుతూ ఉన్నది. మరో తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదరణ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి.
1942లో వచ్చిన డా. రాధాకష్ణన్ కమిషన్, 1962లో వచ్చిన డా.కొఠారి కమిషన్ ప్రకారం ప్రతీ విద్యాలయంలో గ్రంథాలయాలు ఉండాలి విధిగా టైం టేబులో ప్రతీరోజు ఒక గంట సమయం లైబ్రరీ అవర్ ఉండాలి. ఒక అర్హత కలిగిన గ్రంథపాలకుల నియామకం జరుగాలి. ప్రతీ సంవత్సరం గ్రంథాలయానికి నిధులు కేటాయింపులు ఉండాలి అని చెప్పింది.
దేశంలో ఓడిస్సా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో 1000 పాఠశాలలో గ్రంథాలయాలు నెలకొల్పుతున్నారు. అత్యధికంగా డిల్లీ రాష్ట్రంలోని పాఠశాలలో 62%, కేరళ రాష్ట్రంలోని పాఠశాలలో 82% కర్ణాటక రాష్ట్రంలోని పాఠశాలలో 55%, తమిళనాడు రాష్ట్రంలోని పాఠశాలలో 32% గ్రంథాలయాలు కలవు. ఉత్తరాది రాష్ట్రాలలో గ్రంథపాలకుల విద్యాలయ నియామకం ఆశాజనకంగా ఉన్నా పౌర గ్రంథాలయాలు ఆశాజనకంగా లేవు ఒక ఢిల్లీ రాష్ట్రం మినహా, ఈశాన్య రాష్ట్రాలలో మణిపూర్ మినహా గ్రంథపాలకుల నియామకం ఆశాజనకంగా ఉన్నా పౌర గ్రంథాలయాలు, వాటిలో గ్రంథపాలకుల నియమాకాలు ఆశాజనకంగా లేవు. మన రెండు తెలుగు రాష్ట్రాలలో గురుకుల పాఠశాలలో తప్పితే మిగితా పాఠశాలలో గ్రంథాలయాలు లేవు ఉన్నా ఒక్క గ్రంథపాలకున్ని నియమించిన దాఖలాలు లేవు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 300 గ్రంథపాలకుల పోస్టులు సాంక్షన్ కాగా వాటిలో దాదాపు 200 మంది మాత్రమే ప్రస్తుతం గ్రంథ పాలకులుగా సేవలందిస్తున్నారు. దాదాపు 45% ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గ్రంథపాలకులు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 404 కళాశాలలు ఉండగా 252 మంది గ్రంథ పాలకుల పోస్టులు సాంక్షన్ మాత్రమే అయ్యాయి. అందులో 174 మంది మాత్రమే ప్రస్తుతం గ్రంథపాలకులుగా సేవలందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రంథపాలకుల నియామకం అయ్యేటప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనల ప్రకారం ఒక లెక్చరర్‌కు ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయో అలాంటి నిబంధనలు గ్రంథపాలకునికి కలవు. గ్రంథాలయ శాస్త్రంలో పోస్టుగ్రాడ్యుయేషన్ చేసిన వారు అర్హులు. వీరితో పాటు సమాన హౌదా కలిగినటువంటి లెక్చరర్లకు ప్రిన్సిపల్, డిఐఇఒ, ఆర్ జెడి వంటి ఉన్నత పదవులు పొందే అవకాశం ఉన్నా సేవలలో గాని, అర్హతలో గాని ఏ మాత్రం తీసిపోనీ గ్రంథ పాలకులకు మాత్రం ఆ అవకాశం లేదు. ఉన్నత పదవులు లేక మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం మొత్తం 1,117 ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వాటిలో 992 కాలేజీలకు గ్రంథపాలకులు లేరు ఉన్నా కాగితం మీద మాత్రమే. వాటిలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కంటే ఎక్కువ డిగ్రీ కళాశాలు ఉన్నా గ్రంథపాలకుల నియామకం ఆశాజనకంగా లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ విద్యా వ్యవస్థలో 134 ప్రభుత్వ కళాశాలలు ఉండగా దాదాపు 70 గ్రంథపాలకుల పోస్టులకు ప్రభుత్వం సాంక్షన్ చేయగా దాదాపు 50 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఈ వ్యవస్థలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉపాద్యాయుడు ఏ విధంగా అయితే ఉద్యోగం పొందుతారో గ్రంథపాలకుడు కూడా అలాంటి నియమ నిభ0దనల ప్రకారం నియామాకం కాబడుతాడు. కానీ లెక్చరర్లకు ఉన్నత పదవులు పొందే అవకాశం ఉన్న గ్రంథ పాలకులకు మాత్రం అలాంటి అవకాశం లేదు. నాకు తెలిసి ఒక ఉద్యోగి గ్రంథ పాలకునికిగా ఉద్యోగం పొంది ఎలాంటి ఉన్నత అవకాశాలు లేకుండా అదే పోస్టులో పదవి విరమణ పొందే ఉద్యోగం ఇదేనేమో.
విశ్వవిద్యాలయాలు అందుకు మినహాయింపు ఏమీలేదు. ఆంధ్రప్రదేశ్‌లో 25 పైచిలుకు విశ్వ విద్యాలయాలు ఉన్న సగానికి పైగా విశ్వ విద్యాలయాలల్లో గ్రంథపాలకులు లేకపోవడం శోచనీయం దాదాపు ఉన్న అన్ని గ్రంథాలయాలు ఇన్‌చార్జిలతో నడుపుతున్నారు. తెలంగాణలో ఉన్న 19విశ్వవిద్యాలయాలు ఉండగా అందులో ఒక రెండు విశ్వవిద్యాలయాలకు (జేఎన్ టి యు డ జే.ఎన్.ఎఫ్.యు) మాత్రమే పూర్తికాలపు గ్రంథపాలకులు ఉన్నారు. ప్రఖ్యాతిగాంచిన ఉస్మానియా విశ్వావిద్యాలయంలో గత రెండు దశాబ్దాలుగా గ్రంథపాలకుడు లేకపోవడం దురదష్టకరం. నిత్యం పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు జరిగే ఉన్నత విద్యా వ్యవస్థలోనే నాణ్యమైన సమచారాన్ని అందించే గ్రంథపాలకులు లేకపోవడం ఇబ్బంది కలిగించే విషయం.
ప్రైవేట్ విద్యా సంస్థల్లో (ఇంజనిరి0గ్, మెడికల్, ఫార్మసి, పిజి, పరిశోదన కేంద్రాలు, ల్యాబ్‌లు) పనిచేస్తున్న గ్రంథ పాలకులకు చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై ఒక విధి విధానాలను రూపొందించి ప్రైవేటు కళాశాలలో పని చేస్తున్నటువంటి గ్రంథపాలకులకు ఒక పద్ధతి ప్రకారం జీతాలు చెల్లించవలెను.
రాధాకష్ణన్ కమిషన్ 1948, కొఠారి కమిషన్ 1964, సి.డి.దేశ్‌ముఖ్ కమిషన్, 1957, 1985 ఛటోపాధ్యాయ కమిటి నేషనల్ పాలసి అన్ లైబ్రరీ అండ్ ఇంఫోర్మేషన్ సైన్స్, 1985 రాంచరణ్ మహారోత్రా కమిటి కాలేజి అండ్ యూనివర్సిటీ లైబ్రరీ డెవలప్మెంట్ కమిటి, 1988 యష్పాల్ కమిటి రివ్యు కమిటి అన్ లైబ్రరీ స్టాఫ్, వి.పి జారు 1993 ఎక్స్పర్ట్ కమిటి ఆన్ కాలేజ్ లైబ్రరీస్, 1995 ఏ.పి.జే అబ్దుల్ కలాం కమిటి రంగనాథన్ కమిటి 1961, 1991లో కరిక్యులం డెవలప్‌మెంట్ కమిటి (పి.యన్ కౌలా), 2001లో కరిక్యులం డెవలప్‌మెంట్ కమిటి కర్షిదప్పా కమిటి ప్రకారం పౌర గ్రంథాలయాల, విద్యా గ్రంథాలయాలలో నిధుల కేటాయింపులు, గ్రంథపాలకులు జీతభత్యాలు, వారి హౌదా, నియామకంపై సమగ్రంగా చర్చించాయి. రాధాకష్ణన్ కమిషన్ ప్రకారం విద్యాలయాల్లో బడ్జెట్ కేటాయింపులు గ్రంథాలయాలకు 10%, విశ్వవిద్యాలయాల్లో 10 శాతం బడ్జెట్ కేటాయించాలి అవి నెరవేరుస్తున్నారా లేదా కాగితాలకే పరిమితమా అలోచించాలి.
ప్రతీ ఆగస్టు 12 వ తారీఖున (భారత గ్రంథాలయ పిత డా. యస్.అర్ రంగనాథన్ జన్మదినం సందర్భంగా) జాతీయ గ్రంథ పాలకుల దినోత్సవంగా భారతదేశ ప్రభుత్వం ప్రకటించింది కానీ తెలుగు రాష్ట్రాలలో ఎంతవరకు ప్రభుత్వాలు గ్రంథపాలకుల దినోత్సవాలు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలో గ్రంథాలయాలు విధిగా గ్రంథ పాలకుల దినోత్సవం నిర్వహించాలి. ఆ దినోత్సవం రోజున ఉత్తమ సేవలందించినటువంటి పౌర గ్రంథ పాలకులకు, విద్యావ్యవస్థలోని గ్రంథపాలకులకు అవార్డులు/ పురస్కారాలు ప్రకటించాలి. ప్రతి ఆగస్టు 15, జనవరి 26 తేదీలలో ఉత్తమ గ్రంథపాలకులకు ఆయా జిల్లా పరిధిలో గాని, రాష్ట్ర పరిధిలో గాని వారి సేవలకు గుర్తుగా ప్రతిభా పురస్కారాలు అందజేయాలి.
ఒక నాడు ఈ తెలుగు రాష్ట్రాలలో అయ్యంకి, సురవరం, పాతూరి, కోదాటి, వట్టికోట ఆళ్వార్ స్వామి, బోవేరా, వావిలాల, వెలగా ప్రభతులు ఉద్యమాభివద్ధిలో భాగంగా గ్రంథాలయాలు శాస్త్రీయంగా ఎదగాలని ఆశించారు. ఇందులో కొందరు తెలుగులో గ్రంథాలయశాస్త్ర గ్రంథాలూ రాశారు. చాలీచాలని జీతాలతో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నా... ఎందరో గ్రంథపాలకులు అంకితభావంతో సేవలు చేయడం వల్లనే ప్రైవేటు గ్రంథాలయాలు జ్ఞానరక్షణ చేయగలిగాయి. విశ్వవిద్యాలయ, కళాశాలల గ్రంథాలయాలు, కొన్ని ప్రభుత్వ గ్రంథాలయాలు శాస్త్రీయ వైజ్ఞానిక దష్టితో అభివద్ధిలో ఉన్నా, ఇలా లేనివీ ఎన్నో ఉన్నాయి.
శ్రీశ్రీ వంటివారిని సైతం ప్రభావితం చేసిన అబ్బూరి రామకష్ణారావు గ్రంథ పాలకులకే శిరోభూషణం వంటివారు. రాయలసీమ రత్నం అమళ్లదిన్నె గోపీనాథ్, అయోధ్యాపురం కష్ణారెడ్డి, ఆళ్ల రాఘవయ్య, తెలుగు విశ్వవిద్యాలయ గ్రంథ పాలకుడు ఎమ్.శంకరరెడ్డి, శ్రీశీకష్ణ దేవరాయాంధ్ర భాషానిలయ జీవితాంకితుడు ఎమ్.ఎల్. నరసింహారావు, కాళోజీ నారాయణ రావు, కడప సీపీ.బ్రౌన్ గ్రంథాలయం వ్యవస్థాపకులు జానమద్ది హనుమచ్ఛాస్త్రి, సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఆచార్య రాంరెడ్డి, ఇఫ్లు యూనివర్సిటీకి చెందిన యల్.యస్.రామయ్య, ఉస్మానియా విశ్వవిద్యాలయ గ్రంథపాలకులు, ఇనాందార్, యజ్దాని గ్రంథాలయ శాస్త్ర అచార్యులు ఆచార్య వేణు గోపాల్, ఆచార్య ఏ.ఏ.యన్.రాజు, ఆచార్య యన్.లక్ష్మణరావ్, ఆచార్య సుదర్శన్ రావు, ఆచార్య విశ్వమోహన్ అంబేద్కర్ యూనివర్సిటీకి చెందిన ఆచార్య చంద్ర శేఖర్ రావు, ఆచార్య దివాకర్, గౌతమీ గ్రంథాలయంకి చెందిన మహీధర జగన్మోహనరావు, రేటూరి గిరిధరరావు ఇలా తెలుగు రాష్ట్రాల్లో వివిధ కోణాల్లో సేవలందించిన ఆదర్శ గ్రంథపాలకులు ఎందరో ఉన్నారు. మన దేశంలో గ్రంథాలయాల నిర్వహణను పవిత్రకార్యంగా భావించే ఎంతోమంది గ్రంథపాలకులకు స్ఫూర్తి మాత్రం రంగనాథనే. కాని వారు చేసిన సేవలను నాటి ప్రభుత్వాలు వీరి సేవలను గుర్తించాయి. కాని నేటి ప్రభుత్వాలు ఆ స్థాయి గుర్తింపునివ్వడం లేదని కాదనలేని సత్యం.
కేవలం ఉపాధ్యాయుని చేతుల్లో మాత్రమే జాతి నిర్మాణం రూపుదిద్దుకుంటుందని చెప్పవచ్చు. కాని ఉపాధ్యాయుడు కూడా నిత్యం పుస్తకాలతో కుస్తీపడుతూ ఉన్న గ్రంథాలయాలు నాణ్యమైన సమాచారాన్ని అందించే గ్రంథపాలకుల పాత్రని జాతి నిర్మాణంలో మరువరాదు.
- డా. రవి కుమార్ చేగొని,
9866928327
ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రంథాలయ సంఘం, హైదరాబాదు.