Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్ ఉన్నఫళంగా ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపింది. జనజీవనాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు, ఇతర అన్ని వ్యవస్థలూ కూలబడ్డాయి. లాక్‌డౌన్‌లతో ప్రపంచ ప్రజాజీవనమే స్తంభించింది. అందుకే, తప్పనిసరై ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 జనవరిలోనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. దీనికంతటికీ కారణం కంటికి కనబడని ఒక నిర్జీవి. ఒక వైరస్. ఒక ప్రొటీన్ అణువు...
అడ్డూ అదుపు లేని మనిషి విచ్చలవిడి తనానికి కరోనా బుద్ధి చెప్పింది. కొన్ని కొత్త పాఠాల్ని నేర్పింది. మనుషుల్నే కాదు, అన్ని మతాల దేవుళ్ళను లాక్‌డౌన్‌లో పడేసింది. పనికిమాలిన సంప్రదాయాలను మూలకు గిరాటేసింది. చాదస్తాల్ని, మూర్ఖత్వాన్ని కడిగి పారేసింది. ప్రవచనాల్ని ధర్మబోధనల్ని మూటగట్టి పాతరేయమంది. మనిషి చేసిన తప్పిదాల్ని, మనిషి మాత్రమే సరిదిద్దుకోవాలని చెప్పింది. నూతన ఆవిష్కరణలతో జీవితాన్ని కొత్తగా ఆవిష్కరించుకోవాలంది. అగ్రకులాలు, నిమ్న కులాల వలె అగ్ర రాజ్యాలు, నిమ్న రాజ్యాలు వంటివి ఏవీ ఉండవని తేల్చింది. ఈ కరోనా రాచ కుంటుంబీకుల్ని వదలలేదు. ప్రధానుల్ని వదలలేదు. ఇక సగటు మనిషిని ఎట్లా వదులుతుందీ? అంటే- దానికి అందరూ సమానమేనన్న మాట! అందరూ ఒక్కటేనన్న మాట!! లక్షల మందిని బలితీసుకుని చెప్పినా- మనుషులందరూ ఒక్కటేనన్న నిజాన్ని ఢంకా బజాయించింది. మానవుడి వైజ్ఞానిక విజయ పరంపరలో తానొక విషమ పరీక్ష పెట్టానని అంది. దాన్ని ఎదుర్కొని అధిగమించి ముందుకు సాగాల్సింది- మనిషేనన్నది కూడా రూఢగాీ తేల్చింది. పాజిటివ్లఓ పాజిటివ్‌ను వెతుక్కోవడం ఏంట్రా పిచ్చోడా? నెగటివిటిలో పాజిటివిటినీ వెతుక్కోమంది- కరోనా. నదుల్ని, చెట్లని, పర్యావరణాన్ని, ఓజోన్ పొరని మొత్తానికి మొత్తంగా ప్రకృతినే నవనవోన్మేషంగా పునురుజ్జీవింప జేశానంది- కరోనా.
ప్రపంచ రాజకీయ నాయకుల కుళ్ళు కుతంత్రాల్ని బహిర్గతం చేసింది. చప్పట్లు, దీపాల దగ్గర కుంచించుకుపోయిన మెదళ్ళని కొంచెం విశాలం చేసుకోమంది. తనను నివారించేందుకు తమ గ్రంథాల్లో మందులు రాసి పెట్టి ఉన్నాయన్న చవటల్ని తెచ్చి చూపమంది. లేదా తప్పక తను వచ్చి వారికి సోకుతానంది. అప్పుడు తమనుతాము వారు ఆ మందులతోనే నయం చేసుకోవాలని అంది. మత పిచ్చి గాళ్ళని మట్టి కరిపించింది. ఏ రకంగానైనా సరే జనాన్ని విడదీ యాలనుకున్న వారిని ముందు కోరంటైన్‌లోకి నెట్టింది. ఆ పిచ్చి కుదరకపోతే తర్వాత చెయ్యాల్సింది చేస్తానంది. అప్పుడే అంతా అయిపోలేదు. ముందుంది మొసళ్ల పండగ అనంది. దేశాధినేతల నిర్ణయాలు ఎంత తప్పో, ఎలా తప్పో త్వరలోనే తేలుస్తానంది. తనను చంపడానికి శరీరంలోకి క్రిమిసంహార కాలు ఎక్కించుకున్నా, అల్ట్రావయెలెట్ రేస్ పంపిపించుకున్నా.. ముందు మనిషే ఛస్తాడని హెచ్చరించింది- కరోనా.
మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనిషిలో దాక్కుని ఉన్న మానవత్వాన్ని తట్ట లేపింది. దాతృత్వాన్ని విరబూయించింది. జీవిస్తూ ఇతరులను జీవించనీయమంది. తనను తాము కాపాడుకుంటూ ప్రకృతిని కాపాడమంది. కవిత్వం పేరుతో పైత్యం ఒలికించే కులగజ్జి వాడి తాట తీసింది. జీవితంలో కళలు గిళలూ అన్నీ అవసరమే కాని, కాలానుగుణంగా మారనివి, శాస్త్రీయతలో మునిగి శుభ్రపడనివి మనజాలవని చెప్పింది. హాస్యాలు, వ్యంగ్యాలు అవసరమే అయినా, విషమ ఘడియల్లో అవి హద్దు మీరకూడదన్నది. తీరికలేని మనుషులకు అతిగా తీరికనిచ్చి విశ్రాంతి అవసరాన్ని నొక్కి చెప్పింది. పిచ్చి తిరుగుళ్ళు, జల్సాలూ మాని, తాము సమాజానికి ఏమివ్వగలరో- అది ఆలోచించుకోమంది. గతాన్ని నెమరువేసుకుంటూనే.. భవిష్యత్తులోకి కొత్త దారులు వెతుక్కోమంది- కరోనా.
ఒక అశ్రద్ధ, ఒక ఏమరిపాటుతో ప్రత్యక్షంగా విజృంభించిన కరోనా పరోక్షంగా ప్రపంచమంతా స్నేహ- సౌహార్ధ్రతల్ని విరబూయించింది. మీలో మీరు యుద్ధాలు చేసుకోవదడం ఎందుకర్రా? రండి. ప్రపంచ దేశాలన్నీ కలిసి, ఐకమత్యంగా నన్నెదురుకోండి. ఇదే మీకు నా మూడో ప్రపంచ యుద్ధం- అని అంది. ఇక కరోనాకు ముందు, కరోనా తర్వాత అంటూ కాలాన్ని విభజించుకోక తప్పదంది- మొదట తన వైరస్ సంతతిని, ఇతర సూక్ష్మ జీవుల్ని కనుగొన్న శాస్త్రజ్ఞులకు, నిరంతరం మానవాళి మనుగడకు జీవితాలర్పిస్తున్న వైజ్ఞానికులకు, తక్షణం తనను ఎదురుకునేందుకు మందులు కనిపెట్టే బాధ్యతని తమ మీద వేసుకున్న మహనీయులకు జేజేలు పలకమంటోంది. జీవితాన్ని ఇంత అందంగా, ఆనందంగా తీర్చిదిద్దుతున్న వారంతా ప్రాత:స్మరణీయులేనంది. 'భాషణ్ నహీ రేషన్ చాహియే'- అనే అన్నార్తుల్ని ఆదుకోమంటుంది. దేశం ఆకలి తీర్చే రైతును పట్టించుకోమంటుంది. ప్రపంచానికి ప్రేమతో తను ఇస్తున్న సందేశం- ఇదేనంది- కరోనా.
''ఓ- మై గాడ్! హి ఈజ్ ఇన్ ఐసోలేషన్!!''.
- డాక్టర్ దేవరాజు మహారాజు