Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తియ్యని కథలు అంటూ ఈ కథలపై ప్రముఖ సినీ గేయ రచయిత భువన చంద్ర విలువైన ముందుమాట రాసారు. దాదాపు 30 కథలు ఈ సంపుటిలో ఉన్నాయి. రచయిత్రిగా, కవయిత్రిగా, అనువాదకురాలిగా తెలుగు రాష్ట్రాల్లో స్వాతిశ్రీపాద ప్రసిద్ధురాలు. చాలా కథలు - మధ్య తరగతి మనుషుల చుట్టూ తిరిగాయి.
'కాస్టింగ్ కౌచ్' కథలో కళా రంగంలోంచి సంసార రంగంలోకి శంకర్ - శివానీ రావడం, వారికి శైలజ పుట్టడం, అమెరికాలో స్థిరపడిన కుటుంబంలోకి మరో స్త్రీని శంకర్ ఆహ్వానించడం, విడాకులు తీసుకుని శివానీ కుమార్తెతో ఇండియా చేరడం, శైలూను జాగ్రత్తగా బాధ్యతాయుతంగా పెంచడం కథాంశం.
'అసలు స్త్రీ జీవితమే ఆనాడు - ఈనాడూ ఇక కాస్టింగ్ కౌచ్. ఎంపిక అనేది మనిష్టం' అంటారు తల్లి పాత్రతో ముగింపులో!! శైలూ ఎంపిక ఎలాంటిదో పాఠకులకు వదిలారు. పిల్లల్ని ధైర్యంగా ఎలా పెంచాలో సన్నివేసాల బలంతో చెప్పిన మంచి కథ 'పునరపి జననం' . తల్లిగా మహతి పాత్ర అద్భుతంగా మలిచింది. పిల్లలు తేజూ, రాజేష్, రవీష్ పాత్రలు ఇంకా కాస్త పెంచి రాస్తే బాగుండేది. రాధేష్ పాత్రను కుటుంబానికి భరోసా ఇస్తూ- వార్ని క్రమశిక్షణగా మలుస్తున్నట్లు రాస్తే యింకా బాగుండేది.
అలాగే పిల్లలు లేని జంట అనంతలక్ష్మీ - రాఘవులు. వారికి వచ్చే అనారోగ్యస్థితి ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం - అనంతలక్ష్మి స్కూల్ హెచ్.ఎం. వచ్చి ఆమెకు ధైర్యం చెప్పి, జీవితాన్ని ఎలా సుఖమయం చేసుకోవాలో ప్రబోధించిన మంచి కథ 'బలహీన క్షణం'. అన్ని కథల్లో వస్తు - శిల్ప - సౌందర్యంతో పాటు ఏక బిగువున చదివించే గుణం వుంది. మరో అమ్మ, పంజరం విడిచి, రేపటి కల, తప్పు చేశామా? లాంటి కథలు.. ఈ సంపుటికే హైలెట్. ఓ మంచి కథాసంపుటి ఇది.
(రచయిత : స్వాతీశ్రీపాద, పేజీలు : 192, వెల : రూ.100/-, ప్రతులకు : స్వాతిశ్రీపాద, 16/2/701/డి/2, ఆనందనగర్ కాలనీ, మలక్‌పేట, హైద్రాబాద్ - 36)
- తంగిరాల చక్రవర్తి,
9393804472