Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పథేర్ పాంచాలి సినిమా గొప్పదనాన్ని గురించి ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు విన్నా ''ఆహా!'' అంటూ అనకుండా వుండలేము. ఒక గొప్ప కళా ఖండపు అనుభూతిని సత్యజిత్ రే ప్రపంచానికిచ్చిన ఒక అపరూప కానుకది. అందులో 80ఏళ్ల వద్ధురాలి కోసం ఎంతగానో తిరిగారట సత్యజిత్ రే! ఆమె నటించింది అనడంగానీ, జీవించింది అనడం గానీ ఇంకా ఏదో చెప్పడం గానీ అసంబద్ధం! అదొక పాత్ర అనీ దానికేదో ఆస్కార్ వస్తుందనీ గానీ, తానొక కెమెరా ముందు ఉన్నానన్న స్పహ గానీ, ఆ వద్ధురాలు అనుకుందో లేదో కూడా మనం చెప్పడం కష్టం! ఒడ్డున పడిపోయి ఊపిరాడక నోరు తెరుచుకున్న ఒక చిట్టి చేపని నీళ్లలో వొదిలాక అది ఆనందంగా వెళ్లిపోయే అనుభూతికి పేరుగనక ఉంటే అదే ఇది! అది స్వాభావికం, జీవితం, అందరికీ అర్ధం అయ్యే భావోద్వేగపు అవ్యక్తానుభూతి!
నటన ఒక కళాభినివేశంగా కాకుండా, వారసత్వంగా వెతుక్కుంటున్న దురదష్టపు దుష్ట సంప్రదాయంలో బతికే మనకి, నాభి పాట నార్వేలో, అర్ధ నగత్వం ఆస్ట్రేలియాలో, మొత్తం పాట స్విట్జర్లాండ్‌లో చూడ్డానికి మనని అలవాటు చేశాక, నటన అంటే అరుపులూ, పెడబొబ్బలూ, తొడ గొట్టడాలూ, మనుషుల్ని వంటి చేత్తో గాల్లో విసిరేయడాలూ అయిపోయాక, సినిమా అంటే ఇదే ఖబడ్దార్ సుమా అన్నట్టు అయిపోయింది మన పరిస్థితి! గుండెల్లో దడ పుట్టించే డీజే సౌండ్లు వింటూ, బిక్కుబిక్కుమంటూ భయంతో వణుకుతూ, సైన్మాలు చూట్టం తప్పనిసరి రాక్షస వినోదం మన అగత్యం అయిపోయింది. కోట్లు పెట్టి హీరోని కొనుక్కున్నాక ఆ మాత్రం చేతికీ, కాలికీ, మొహానికి పని చేయించక పోతే వామ్మో... గిట్టుబాటుకాదని చెప్పి నటన బాగా పిండేసే పనిలో దర్శక నిర్మాతలు శాయశక్తులా కషి చేయడంవల్లో ఏమో... వంద రూపాయల టిక్కెట్ మందం నటన చాలు మాకు అని చెప్పినా వినకుండా, తివిరి ఇసుమున తైలం పిండి, నటులతో కోటి రూపాయల నటన వండి, వార్చి మరీ వడ్డిస్తున్నారు. పంట పొలాల్లో పక్షుల్ని కొట్టడానికి డబ్బా కొట్టుకుంటూ చేసే చప్పుళ్లలో హఠాత్తుగా సంగీతం కనిపెట్టి హాల్లో తలుపులు మూసి మరీ గుండె దడదడ కొట్టుకునేలా చేస్తున్నారు.
కానీ, ఈ మధ్య తెలుగు సినీలోకంలో ఏదో అద్భుతం జరిగినట్టే అన్పించింది. ఆశాపాశం అంటూ ఓ పాట వేదనా భరితమైన హదయ తంత్రిని పట్టిలాగినట్టు అనిపించింది. చెవులు తుప్పు వదలించే డీజే శబ్దాలు దాటి ఇది ఎలా వచ్చిందో తెలీదు. ఆ మహా వేంకటేష్ ఎవరో పాపం గూగుల్ కూడా పట్టివ్వని వ్యక్తి కేర్ ఆఫ్ కంచర పాలెం చూపించాడు! పథేర్ పాంచాలీలోని ముసలావిడ లాంటి సజీవ చిత్రాన్ని ఎక్కడైనా వెండితెరపై చూడగలమా అనిపించింది. ఎందుకో ఈ సినిమాలో సలీమా అనే వేశ్య కళ్ళలో మళ్ళీ నమ్మకం కుదిరింది. నటన అంటే ఏమిటో తెలీని ఒక మహా అనుభూతిని ఈ మహా వెంకటేష్ ఎవరో ప్రతిభావంతంగా చూపించాడు ఆ మధ్య! తెలుగు సినిమాకి మంచి రోజులొస్తాయి అనిపించింది ఒక్కసారి.
పలాస, ఉగ్రరూపస్యలు ఇంచుమించుగా అదే నేటివిటీని మహాద్భుతంగా చిత్రించారు! సినీ మానవాళికి మంచి కాలం రహిస్తుందని ఘంటా బజాయించి చెప్పారు! కరోనా పుణ్యమా అని గది జీవితం మొదలయ్యాక, OTTలో ఆహా అనుకుంటూ వెతుక్కుంటున్న సమయంలో ఈ మెయిల్ ఏదో భలేగా వేలికి తగిలింది!
ఒక్కసారిగా ఏదో నాస్టాల్జిక్ మెమరీలేవో రీలు వెంట రైల్లా పరుగెత్తారు! ఆ పరిసరాలు ఇంటికెళ్లిపోయాలా చేశారు! పొలంగట్లు, మట్టీ, బురదా, కుక్కపిల్లా, గొర్రెల మందా, కొట్టంలో కట్టేసిన ఎడ్ల బండీ, మొహం పుల్లా, ఏదో దరువు పాటల పోటీ సెట్టింగులా కాకుండా ఎంత గొప్పగా వుంది ఆ నేటివిటీ అనిపించేలా చేశారు! రోజూ చూసేవే, చేసేవే. అయితేనేం, ఏదో అనుభూతి పారవశ్యం.. వివశత్వం.. ఇరవై ఏళ్ల క్రితం తీసుకున్న వెలిసిపోయిన అపరూప ఫోటో ఆల్బమ్ పేజీలు కళ్ళు విప్పారించి వెతుక్కుంటూ పోతున్నప్పుడు... ఏదో ఒక ఆనందపు స్మతి కంటికి నీటి పొర కమ్మినట్టు ఎంతబావుంది ఇది!
ఇరవై ఏళ్ళ క్రితానికి టైమ్ మెషీన్‌లో వెళ్లినట్టు వెళ్లడం ఎలా సాధ్యమైంది? ఆ అనుభూతుల్ని అంత స్వచ్ఛంగా, అంత అచ్చుగుద్దినట్టుగా పట్టడం ఎలా సాధ్యం? అదొక సినిమా అనీ, అందులో కొందరు ఏవో పాత్రలని పోషించారనీ, హీరో అనీ, హీరోయిన్ అనీ, విలన్ అనీ, కథనీ, మలుపులు అనీ, ఇరుకుసందులో మోకాళ్ళు రాసుకుంటూ ముందుకెళ్లి, ఇంటర్వెల్‌లో 150 రూపాయల పాప్ కార్న్ నములుతూ, కాస్తా తీపినిండిన యాసిడ్ చప్పరిస్తూ, ఇంకా ఏం ఘోరాలు చూడాలో వెయ్యి రూపాయల చమురు వదిలించుకుని అనే బెంగ కూడా లేకుండా, ఒక తెరపై ఇన్ని సజీవ అనుభూతుల్ని కెమెరాలో బంధించి ఇవ్వడం సంభవమేనా?
అసంభవం మాత్రం కాదంటాడు ఈ ప్రతిభావంతుడైన దర్శకుడు ఈ చిత్రంలో!
ఇందులో హీరో ఎవరో, హీరోయిన్ ఎవరో ఆరా తీయక్కర్లేదు! కెమేరాకి చిక్కిన ప్రతీ చెట్టూ, పుట్టా, కుక్కా ఈ తెరపై కనిపించే ప్రతీ వ్యక్తీ ఉదరు చేతిలో హీరోలై పోతారు! ఇందులో నిమిషం కనబడ్డ వ్యక్తి రూపాన్ని మీ మదిలో మీకు తెలియకుండానే ముద్రించుకుంటారు.
కొట్టంలో కూచున్న తాత, చింతపండు అమ్మే కిరాణా కొట్టు వ్యక్తీ, కంప్యూటర్ రిపేర్ చేయడానికొచ్చిన కుర్రాడు మిమ్మల్ని వదలరు! వాళ్ళు ఒక నిమిషం నిడివిగల పాత్రలు... అయితేనేం... ఇరవై ఏళ్ళ క్రితం మన కంప్యూటర్‌కు పట్టిన వైరస్‌ని తొలిగించడానికొచ్చిన కుర్రాడు అతడే నూటికి నూరుపాళ్లు అంటారు!
కంప్యూటర్ సెంటర్ మొన్న గతించిపోయిన తవ్వకాల్లో భద్రంగా దొరకబుచ్చుకున్న ఒక సజీవ శకలం.
పాస్ వర్డ్ కొట్టుకోమని అటు తిరిగిన హాస్యం ఎవరికయినా గిలిగింతలు కలిగిస్తుంది. వైరస్ గురించిన మన అజ్ఞ్యానపు జ్ఞాపకం మన మొహంలో చిరునవ్వు తెప్పిస్తుంది! ఇప్పటి మీ మెయిల్ ఐడీ మహద్భాగ్యం కల్పించిన ఆ కంప్యూటర్ కుర్రాణ్ణి మళ్ళీ గుర్తు చేస్తూ మీ మోములో ఓ దరహాస వీచిక సినిమా యావత్తూ తారట్లాడుతూ వుంటుంది.
నాకు ఏ సంగీతం వినబడలేదు... అసలది వుందో లేదో కూడా తెలీదు... అంతగా కలిసిపోయింది. ఆ అమ్మాయి హీరోయిన్ అవునో కాదో తెలీదు... ఓ పదో తరగతి పాసై కాలేజ్‌లో అడుగు పెట్టిన ఇరవై ఏళ్ళ కింద ఒక సగటు ఇంటర్ చదివే అమ్మాయి సహజాతి సహజమైన ప్రేమ... ఆ అబ్బాయి హీరోనో కాదో చెప్పలేం... కాలేజీలో లైన్లో నించొని బెరుకు బెరుకుగా అచ్చం మనలాగే సిగ్గుతో ఓ అమ్మాయి వైపు నిర్మలంగా చూసినవాడు...
ఆ పదో తరగతి తప్పి ఇంట్లో కూచునే కుర్రాడిని ఇంటికొకరిని చూస్తాం... పదో తరగతి ఫస్ట్‌క్లాస్‌లో పాస్ ఐ హాస్టల్ కోసం బస్సెక్కే ఆ పేదింటి ఆణిముత్యాల్ని మన ఊరు బస్సు ఆపు స్థలంలో ఎందరినో చూసే ఉంటాం!...
అటక మీద పేరుకున్న, ఏనాడో అడుగున పడిన శిథిలాల మాటున, మనం కోల్పోయిన జ్ఞాపకాలను వెతుకుంటున్నప్పుడు, పారేసుకున్న అనుభూతులు కూర్చిన ఏ డైరీ నో, ఏ గ్రూప్ ఫోటోనో దొరికినప్పుడు
అది మిమ్మల్ని పరవశింప చేస్తుంది. అవి మరీ గొప్పవీ, మరీ ముఖ్యమైనవీ కాకపోవచ్చు! అయితేనేం
అది మీ హదయాన్ని రాగరంజితం చేస్తుంది! అది మిమ్మల్ని కొన్ని నిమిషాల పాటూ వేసవి తాపం లో వీచిన చల్లని పిల్ల వాయువులా హాయినిస్తుంది! ఒకోసారి మీ కంటి అంచున జారే కన్నీటి బిందువై కూడా ప్రతిఫలించవచ్చు! యీ చిత్రాన్ని చూశాక మీరు ఆ అనుభూతిని పొందుతారు తప్పకుండా! అందుకే తప్పక చూడండి!
- వి.విజయకుమార్,
8555802596