Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవీయ కథలు
మానవీయ కథల సంపుటి విరుగుడు. ఇందులోని చాలా మటుకు కథలు కరుణరసంతో కూడి ఉన్నాయి. సాటి మనిషి కోసం త్యాగాలు చేసే అరుదైన వ్యక్తులు ఈ కథల్లో కనిపిస్తారు. ఆకులు రాలిన అడవిలా ఉన్నాడు చెంచయ్య. చెదలు పట్టిన చెట్టులాగున్నాడు ముసలాయన వంటి కవితాత్మక వాక్యాలతో ఈ సంపుటిలోని కొన్ని కథలు ప్రారంభమవుతాయి. హోటల్‌లో ఆ పనీ ఈ పనీ చేస్తూ, వాళ్లు పెట్టింది తిని కాలం వెళ్లతీస్తున్న ముసలాయిన హోటల్ కాలిపోతుంటే మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తాడు. దిగుడు బావిలోకి దిగి బిందెతో నీళ్లు తెచ్చి పోస్తుంటాడు. ఆ ప్రయత్నంలోనే కాలు జారి బావిలో మునిగి మరణిస్తాడు. ఇది బావి ఆనే కథా వస్తువు. విరుగుడు అనే కథలో గంగారాం వద్ద నకిలీ విత్తనాలు కొని మోసపోయిన రాముడికి న్యాయం దొరకదు. కానీ గుట్టుచప్పుడు కాకుండా అతని కొడుకు గంగారాంను క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపేసి ఊరికి పట్టిన పీడను వదిలిస్తాడు. ఇందులోని పది కథలూ విభిన్నఅంశాలకు చెందినవి. రచయిత శైలి సరళంగా ఉంది.
విరుగుడు, రాచమళ్ళ ఉపేందర్, వెల : 40/-
ప్రతులకు : రాచమళ్ళ ఉపేందర్, ఇ.నెం.8.3.264
యు.పి.హెచ్ కాలనీ, ఖానాపురం హవేలీ, ఖమ్మం - 507002
- తెలిదేవర భానుమూర్తి, 9959150491
ఆసక్తికరం ఆనందలోకం
నారంశెట్టి ఉమామహేశ్వరరావు బాలసాహిత్యంలో బాగా చేయి తిరిగిన రచయిత. చక్కటి బొమ్మలతో ఈ 'ఆనందలోకం' నవల రాసారు. పిల్లలకు బాగా అర్థమయ్యే భాషలోనే రాసారు. తొలి వాక్యం మొదలు పెడితే చివరి వాక్యం వరకు ఆపకుండా చదివించే శక్తి 'ఆనందలోకానికి' ఉంది. జనం ప్రయోజనాలు కాపాడటమే రాజు, రాచరిక వ్యవస్థ మనుగడకు ప్రధాన కర్తవ్యం అని చెప్పేలా రాసారు. ఓ యువరాజు దేశాటనకు సంబంధించిన కథల సమాహారం ఇది. హేళాపురి రాజ్యాన్ని విక్రమదేవుడు పాలిస్తాడు. ఆయన భార్యా మహారాణి వకుళాదేవి. వారికి చాలాకాలం తర్వాత కుమారుడు పుడతాడు. అతనికి 'విజయుడు' అని పేరు పెడతారు. యువరాజు దీర్ఘకాలం యాత్రలు చేయడం, జంతువులు వాటి విన్యాసాలు.. దుర్మార్గులను, కరువు కాటకాలను అంతంచేసే విజయుని వీర విహారయాత్రలు.. ప్రేమలు.. సందర్భోచితంగా రచయిత చొప్పించిన నీతి వాక్యాలు.. మంచి పన్లు, ప్రజల్ని ఆదుకోవడం, అద్భుతదీవి, మాంత్రికుడు, మరుగుజ్జు, గంధర్వుడు కరటమంత్రి; ఋషులు, ఇలా ఎన్నో పిల్లల్లో ఆసక్తి కల్గించేలా యీ నవలాలోకం ఆనందం కల్గిస్తుంది.
- తంగిరాల చక్రవర్తి, 9393804472
ఆనందలోకం, నారంశెట్టి ఉమామహేశ్వరావు
పేజీలు: 128, వెల:60/
ప్రతులకు : మంచి పుస్తకం
12-13-450, వీధినెం.1
తార్నాక, సికింద్రాబాద్