Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దశాబ్దాలు గడుస్తున్నా వైవిధ్యమైన రీతిలో కవిత్వం రచించడం డా|| సి.నారాయణరెడ్డి స్వభావంలోనే వుంది. వారి తాజా కవితా సంపుటి 'నా రణం మరణంపైనే' చదివితే ఈ విషయం మరింత బోధపడుతుంది. ఈ పుస్తకం చదువుతుంటే వారి భావనా పరంపర, ఊహాశాలిత అబ్బుర పరుస్తాయి. 116 కవితల సమాహారమిది. వర్తమాన సామాజిక సంవేదనలే గాక మనోలోకంలోని భావవల్లరిని సృజించడం వారి విశిష్టత. 'పాట నా అంతరంగం ఊట' అనే కవిత ఈ పుస్తకంలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. 'పాట నా ప్రాణం పాట నా ధ్యానం పాడుకోకుంటే నా అస్తిత్వమే మౌనాతిమౌనం' అని చెబుతారు. ఈవిధంగా సినారె కవితాశైలిలోని భావుకత మనల్ని ఆకర్షిస్తుంది. అందుకే సినారె కవిత్వాన్ని ఇష్టంగా చదువుతాం.
అభివ్యక్తిలో నవ్యత
వ్యక్తీకరణలో కొత్తదనం, భావచిత్రాల్లో వైవిధ్యం వస్తువును కవిత్వం చేయడంలో ఆర్ద్రతని కనబరచడం బాలసుధాకర్ మౌళి కవిత్వ ప్రత్యేకతలు. ఇటీవల విడుదలయిన 'ఆకు కదలని చోట' పుస్తకంలో ఈరకమైన వైశిష్ట్యం స్పష్టంగా చూస్తాం. చదువుతున్న పాఠకుల్ని వినూత్న పరవశానికి లోను చేసే అభివ్యక్తి వుంది. అనువాదం చేసిన కవితలూ బావున్నాయి. అయితే పాతిక కవితలకు ఫుట్‌నోట్స్ ఇచ్చిన పద్ధతి బాగోలేదు. ఫలానా సంఘటనలకు నిరసనగా, ఫలానా వ్యక్తుల కోసం రాసినవిగా చెప్పడం అవసరమా? ఆ కవితలోనే అది ఇమిడి వుండాలి. చదివితే తెలిసిపోవాలి. కల్బుర్గి, జిషా, కన్హయ్యకుమార్, మురుగన్ లాంటి వారు, వారితో ముడిపడి సంఘటనలు కవిత్వరచనకు ప్రేరణ కావచ్చుగాక, కానీ ప్రత్యేకంగా 'ఇందుకోసం, వీరికోసం' రాసానని చెప్పక్కర్లేదు. నిజానికి అలా చెప్పక్కర్లేకుండానే రాయగలిగారు మౌళి. కానీ పాఠకులకు అర్థం కాదని అనుకున్నాడేమో!
పీడితులకు బాసటగా నిలిచే కవిత్వం
తెలంగాణ ఉద్యమ చైతన్యాన్ని ప్రతిఫలించిన కవితా సంపుటి 'గెలిచి నిలిచిన గళం'. 45 కవితలున్న ఈ సంపుటికి కవి బండి చంద్రశేఖర్ రాసుకున్న ముందుమాట మరింత స్పష్టంగా ఆయన కవిత్వ నేపథ్యాన్ని చెబుతుంది. పీడితులకు బాసటగా నిలిచే కవిత్వమిది. విముక్తి కోసం తెలంగాణ నేల తండ్లాటని కవిత్వంగా చేయడంలో చంద్రశేఖర్ సఫలమయ్యారు. తెలంగాణ నేలపై కవి మమకారాన్ని, ప్రేమని తెలియజేసే భావనాపరంపర ఇమిడివున్న సంపుటి ఇది.
- కిరణ్‌కుమార్