Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యక్తిగా కూడా ఉన్నతమైన విలువలు, ఆదర్శాలకు కట్టుబడి జీవించాడు. ఏనాడూ కుల వివక్షను పాటించని వారాయన. హెచ్చు తగ్గులు మన సంస్కారాన్ని బట్టిగాని, కులాన్ని బట్టికాదనే వారు.
తెలంగాణ సాహిత్య కళారంగాల్లో బహుముఖీన ప్రతిభతో ఒక వెలుగు వెలిగిన తొలితరం సాహిత్యకారులలో విశిష్టంగా చెప్పుకొనదగిన వారు 'చందాల కేశవదాసు' కావ్యకర్తగా, అష్టావధానిగా, హరికథా భాగవతారుగా, నాటక సినీ రచయితగా, సంఘ సంస్కర్తగా అర శతాబ్దం పాటు ఆయా రంగాలను చకచ్ఛకితం చేసిన మహనీయులాయన. అయితే చరిత్ర గతిలో ఆయన మరుగున పడిపోవడం బాధాకరం. వారి అమేయ రచనా వ్యాసంగం ధ్వంసానికి గురికావడం, ముద్రణకు నోచుకోకపోవడం, ముద్రితమైన బహుకొద్ది రచనలు కూడా సరిగ్గా లభించకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. అయితే కాలక్రమంలో సినిమా చరిత్ర రచన కూడా సాహిత్య గౌరవానికి అర్హమైన కాలం (1990ల నుండి) మొదలు కావడంతో చందాల కేశవదాసు ప్రాత:స్మరణీయులైనారు. సినిమా రంగంతో ఆయనకున్న అనుబంధం వల్లనే ఆయన సాహిత్యంలోని గొప్పతనం వెలికి వచ్చింది.
చందాల కేశవదాసు ఖమ్మం జిల్లా జక్కేపల్లిలో 1876 జూన్ 20న జననమొందారు. వారిది వంశ పారంపర్యంగా వైద్యం వృత్తిగా గల కుటుంబం. కేశవదాసు తాత చందాల శ్రీనివాసులు ఖమ్మం జిల్లా గంగిదేవిపాడుకు చెందిన వారు. ఆయన అక్కడే వైద్యవృత్తిని చేసేవారు. ఆయన ఏకైక కుమారుడు లక్ష్మీనారాయణ కూడా వైద్యవృత్తితో పాటు వ్యవసాయం కూడా చేసేవారు. ఆ తరువాత తన నివాసాన్ని జక్కేపల్లికి మార్చారాయన. అక్కడనే ఆయనకు ఇద్దరు మగ సంతానం కలిగారు. పెద్దవాడు వెంకటరామయ్య కాగా రెండవ వాడు మన కథానాయకుడు చందాల కేశవదాసు.
కేశవదాసు ప్రాథమిక విద్యను తండ్రి వద్ద నేర్చుకున్నాడు. కాగా చిన్నతనాననే ఆయన మరణించడంతో తన అన్నగారైన వెంకటరామయ్య పోషణలో పెరిగారు. వెంకటరామయ్య బ్రహ్మచర్యం పాటిస్తూ ఆధ్యాత్మిక చింతనలో గడిపేవారు. ఆయన ఉపాధ్యాయునిగా పని చేసేవారు. అన్నగారి వద్దనే ఛందస్సు, అవధానం వంటి వివిధ ప్రక్రియల్లో ప్రవేశం పొందారు. అమరకోశాన్ని కంఠస్థం చేశారు. అన్నగారి వీధి బడిని తాను నడుపుతూ అందులోని విద్యార్థులనే పృచ్ఛకులుగా నియమించుకుని సమస్యాపూరణం వంటి వివిధ రంగాలతో అష్టావధానాన్ని సాధన చేసి తనను తాను తీర్చిదిద్దుకున్నారు. సిరిపురంలో జమీందారు పిల్లలకు కొంత కాలం చదువు కూడా చెప్పారాయన.
కేశవదాసు మొదటిసారి అష్టావధాన ప్రక్రియను భద్రాచలంలో ప్రదర్శించారు. ఆ తర్వాత హుజూర్‌నగర్, జగ్గయ్యపేట, తమ్మర, తిరువూరు, కందిబండ మొదలైన చోట్ల అష్టావధానాలు చేసి పండితులతో ప్రశంసలందుకున్నారు. ఇక హరికథలు చెప్పడంలో కేశవదాసుది ఎదురులేని ప్రావీణ్యం. పొలంపల్లి, దుబ్బాకుపల్లి, ఖమ్మం, జక్కేపల్లి, కోదాడ, తమ్మర వంటి లెక్కలేనన్ని చోట్ల హరికథలు చెప్పి కీర్తి, ధనం సంపాదించారు. అష్టావధానిగా, హరిదాసుగా నాటి తెలుగు సమాజంలో కేశవదాసుది ఒక ప్రత్యేక స్థానముండేది. ఒకసారి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంలో జగ్గయ్యపేటలో లక్ష్మీకాంతయ్య ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అష్టావధానం చేశారు. అందులో ఆయన సాహితీ పాండిత్యాన్ని, భాషామార్దవాన్ని, భావసౌందర్యాన్ని, ధారాశుద్ధిని మెచ్చుకుని తమ నాటక సమాజంలో చేరి రచయితగా, నటునిగా పని చేయవలసిందిగా కోరారు లక్ష్మీకాంతయ్య.
అక్కడ్నించి వారి జీవనశైలి అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. రచయితగా, నటునిగా, దర్శకునిగా పరిణతిచెంది 'కనక్తార' (1911), 'బలిబంధనం' (1935) తదితర నాటకాలు రాశారు. ఇంకా కేశవదాసు 'రుక్మాంగద', 'పాదుకా పట్టాభిషేకం', 'సీతా కళ్యాణం', 'భక్త అంబరీష' తదితర నాటకాలను కూడా రాసినట్లు ఆంధ్ర నాటకరంగ చరిత్రలో మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి పేర్కొన్నారు. కాగా ఈ రచనలేవీ అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం.
కాగా, నాటక రంగంలో చందాల కేశవదాసు ఎదురులేని పేరు ప్రఖ్యాతులతో ఒక వెలుగు వెలిగిపోతున్న సమయంలో సినిమా రంగం ఆహ్వానం పలికింది. అప్పటి దాకా భారతదేశమంతటా మూగ సినిమాలు ఆడేవి. 1931 మార్చి 15న దేశంలో తొలిసారిగా 'ఆలం ఆరా' అనే మాటలతో కూడిన సినిమా వచ్చింది. ఇదే తొలి భారతీయ టాకీ. అదే యేడాది తెలుగులో కూడా టాకీ చిత్రం తీయాలనుకుని ''భక్త ప్రహ్లాద'' చిత్రం (1931-32)న ప్రారంభించారు. ఆ చిత్రంలో పాటలు రాయడానికి మన చందాల కేశవదాసును ఆహ్వానించడంతో ఆయన సినీ జీవితం మొదలైంది. ఈ చిత్ర దర్శకుడు హెచ్.ఎం.రెడ్డి. ఈయన కూడా హైదరాబాదుకు చెందిన వాడేనన్న వాదనలున్నవి. ఈయన హైదరాబాదు సంస్థానంలో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేశారు. హైదరాబాదులో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఆయన కుటుంబం బెంగుళూరుకు వలస వెళ్లింది. ఈ చిత్రంలో ప్రహ్లాదునిగా కృష్ణాజిరావు షిండే, హిరణ్యకశ్యపునిగా మునిపల్లె సుబ్బయ్య, లీలావతిగా సురభి కమలాబాయి నటించారు. ఈ చిత్రంలో ఈమె పాడిన ''పరితాప భారంబు భరియింప తరమా'' పాటనే చందాల కేశవదాసు సినిమాకు రాసిన తొలిపాట. ఇదేగాక ఈమెనే పాడిన ''తనయా ఇటులన్ తగుపలుకు'', మునిపల్లె సుబ్బయ్య పాడిన ''భీకరమగు నా ప్రతాపంబునకు భీతిలేక ఇటు చేసెదవా'' రెండు పాటలు కూడా చందాల వారు రాశారు. అయితే చిత్రంలో రంభ పాడిన ''వింతాయెన్ వినన్ సంతసమాయెనుగా దేవేంద్రా'' అనే పాట కూడా వొకటుంది. ఇది ధర్మవరం వారు ''భక్త ప్రహ్లాద'' నాటకం రాసినపుడే రాయగా ఈ పాటను నాటకాన్ని సినిమాగా తీసినపుడు కూడా అట్లానే ఉంచేశారు. దీంతో తొలి సినిమా పాట రచయిత కూడా ధర్మవరం వారేననే వాదన ఒకటి ప్రారంభించారు ఆ మధ్య. కనీసం ధర్మవరం వారి పాటను తొలి సినిమా పాటగా, చందాల వారిని తొలి తెలుగు సినీ కవిగా పరిగణించాలని రాశారు కూడా. కానీ కేవలం సినిమా కోసం రాసిన పాటనే సినిమా పాటగా భావించాల్సి ఉంటుంది గనుక చందాల కేశవదాసు గారే తొలి తెలుగు సినీ కవిగా చరిత్ర కెక్కారు. అందుకే ఆయన తెలుగు సినిమా వాచస్పతిగా చరిత్రకెక్కారు.
'భక్త ప్రహ్లాద' (1931-32) తరువాత కేశవదాసు గారు రచయితగా పని చేసిన సినిమా 'సతీసక్కుబాయి' (1935). భారతలక్ష్మీ ఫిలింస్ వారి ఈ చిత్రంలో 'కృష్ణా పోబోకురా', 'రాదేల కరుణా', 'ఆటలాడు కోరా', 'పాలుమీగడ పలుమార్లు భుజియించి', 'పాషాణ మెటులైతివో', 'జాగేలా కావగ రారుగా' పాటలు రాశారాయన. చిత్రంలోని శ్రీకృష్ణుని పాత్రధారి తుంగల చలపతిరావు, సక్కుబాయి పాత్రధారిణి దాసరి కోటిరత్నం ఈ పాటలు పాడారు. ఆ రోజుల్లో ప్లే బ్యాక్ పద్ధతి లేదు. నటీనటులు ఎవరి పాటలు వారే పాడుకునేవారు. 1935లోనే సి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన కాశీ ఫిలింస్ వారి ''శ్రీకృష్ణ తులాభారం'తో కేశవదాసు సినీ కవిగా ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఈ చిత్రంలో రాసినవి మూడు పాటలు. అవి ''భలే మంచి చౌకబేరము'',''మునివరా తుదికిట్లు నానున్ మోసగింతువా'', ''కొట్టు కొట్టండి బుర్ర పగలు గొట్టండి''. వీటిలో ''భలే మంచి చౌకబేరము'' పాట బహుళ జనాదరణ పొందింది. అయితే ఈ మూడు పాటలను ఆ తరువాత మరో రెండుసార్లు ''శ్రీకృష్ణ తులాభారం'' చిత్రాన్ని 1955, 1966ల్లో నిర్మించినపుడు కూడా వాడుకున్నారు. అది మన కేశవదాసు గారి కవితా వైభవానికి నిదర్శనం. 1966లో డి.రామానాయుడు తీసిన చిత్రంలో దాసుగారి పాటలు వాడుకుని వారి పేరును సినిమాలో గాని, పాటల పుస్తకంలో గాని వేయలేదు. ఇది గమనించిన వారి కుటుంబ సభ్యులు 1970లో ఖమ్మం కోర్టులో కేసు వేయగా దిగివచ్చిన నిర్మాతలు సినిమా టైటిల్స్‌లో ఆయన పేరు వేశారు.
కేశవదాసు గారు 1935లో మూడు సినిమాలకు రచయితగా పని చేశారు. ఆ మూడో సినిమా ''సతీ అనసూయ'' ఈ సినిమాకు స్క్రిప్టుతో సహా మాటలు, పాటలు రాశారాయన. అలా కేశవదాసు పూర్తి స్థాయిలో రచయితగా పని చేసిన చిత్రం ఇది. ఈ సినిమా పాటల పుస్తకంలో ''అనసూయ'' స్క్రిప్టు పట్టుకుని ఉన్న దాసుగారి ఫొటోను ప్రచురించడం విశేషం. అలాంటి సందర్భం సినీ చరిత్రలో 'నభూతో న భవిష్యతి'గా చెప్పుకోవచ్చు. ''దేవుని దయ ఉంది ఐలెసో'', ''ప్రహ్లాదుగావ స్తంభమునందు నృహరివై'', ''మాత''యని మాట విని, ''కురుతే గంగా సాగర గమనం'' వంటి పాటలు సతీ అనసూయలో దాసుగారు రాసినవే.
ఆ తరువాత దాసుగారికి సినిమా అవకాశాలు వరుస కట్టినవి. 1936లో ''లంకా దహనం'' చిత్రానికి పని చేశారు. వాస్తవానికి రంగ స్థలంపై ఆయనకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ''కనక్తార' నాటకం విజయం వల్లనే చందాల వారికి సినిమా అవకాశాలు వెదుక్కుంటూ వచ్చినవి. ''ద్రౌపదీ వస్త్రాపహరణం'' తీసిన సరస్వతీ టాకీస్ వారు కనక్తార సినిమాను హెచ్.వి.బాబు దర్శకత్వంలో నిర్మించారు. దొమ్మేటి సూర్యనారాయణ, కన్నాంబ, ఆరణి సత్యనారాయణ, కడారు నాగభూషణం, గంగారత్నం ప్రధాన పాత్రధారులు. రంగస్థలంపై 'కనక్తార'గా చెలామణి అయినా నాటకం వెండి తెర మీదికి వచ్చేసరికి ''కనకతార'' అయింది. ''దప్పిచే నాలుక తడిపొడి లేక'' పద్యం, ''ఎంత బాగుండది సక్కని గుంటారాయే నా'', ''యేంటి అబ్బో నా వొల్లు మంటెత్తుతాది'' పాటలు బహుళ జనాదరణ పొందినవి. ఇదే సినిమాను 1956లో మరోసారి తీసినపుడు కూడా దాసుగారి పాటలను యధాతథంగా వాడుకున్నారు. ఆ తరువాత 'రాధాకృష్ణ' (1939)లో గతంలో దాసుగారు రాసిన 'రాధాకృష్ణ' నాటకంలోని కొన్ని పాటలు వాడుకున్నారు. ఇంకా 'లంకా దహనం' (1936), బాలరాజు (1948) చిత్రాలకు పాటలు రాశారాయన.
సినిమాలకు దూరమైన తరువాత కలకత్తా నుండి తిరిగివచ్చి జక్కేపల్లిలో హరికథలు చెప్పనారంభించారు. కాని సినిమా రంగంలోకి వెళ్లి రావడం వల్ల అవకాశాలు ఎక్కువగా రాలేదు. ఇంతలో తెలంగాణ ప్రాంతంలో నిజాం వ్యతిరేక ఉద్యమం తీవ్ర రూపు దాల్చుకున్నది. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం రావడంతో హైదరాబాదు సంస్థానాన్ని కూడా ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయాలనే డిమాండ్ వచ్చింది. నిజాం పాలనలో దోపిడీపీడనలకు వ్యతిరేకంఆ ఉద్యమాలు ఉధృతమయ్యాయి. ఈ పోరాటాల్ని అణచి వేయడానికి రజాకార్లతో ప్రజలపై దాడులు చేయించాడు నిజాం నవాబు. ఆ రజాకార్లు జక్కేపల్లిలో కేశవదాసు ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఆ దాడిలో ఆయన ఆస్తిపాస్తులు, ధనమే గాక అంతకన్న విలువైన ఆయన సాహిత్య సంపద కూడా నాశనమైనది. ఆ తరువాత జక్కేపల్లి నుండి ఖమ్మంకి తన మకాంను మార్చారాయన. ఇది జరిగింది 1948 చివరి నాటికి. అటు నుండి కొడుకు కృష్ణమూర్తి వైద్య వృత్తి నిమిత్తం వారి కాపురం 1950లో నాయకన్‌గూడెంకు మారింది. కేశవదాసు గారు చివరి రోజులను నాయకన్ గూడెంలోనే గడుపుతూ అక్కడే 1956 మే 14న చివరి శ్వాస విడిచారు.
కేశవదాసు గారి రచనలో ప్రామాణికతలు సార్వకాలీనతలను చాటుతాయి. తొలి చిత్రం '' భక్త ప్రహ్లాద'' (1931-32)కు రాసిన పాటలు, 1942లో తీసిన ''భక్త ప్రహ్లాద''లోనూ వాడుకున్నారు. ''శ్రీకృష్ణ తులాభారం'' (1935)లో రాసిన పాటలు ఆ తరువాత 1956, 1966లోనూ, ''కనకతారకు'' రాసిన కథ, పాటలు 1937, 1956లోనూ యధాతథంగా వినియోగించుకోవడం కేశవదాసు గారి రచన విశిష్టతకు నిదర్శనం.
వ్యక్తిగా కూడా ఉన్నతమైన విలువలు, ఆదర్శాలకు కట్టుబడి జీవించాడు. ఏనాడూ కుల వివక్షను పాటించని వారాయన. హెచ్చు తగ్గులు మన సంస్కారాన్ని బట్టిగాని, కులాన్ని బట్టికాదనే వారు. ఎవరైనా దీనిని వ్యతిరేకిస్తే వాదించి మెప్పించేవారు. జక్కేపల్లికి దగ్గరలో ఉన్న రాజపేటకు చెందిన వెంకయ్య అనే దళితుడు దాసుగారి హరికథలు విని మురిసి పోయేవారు. ఆయన వీరాభిమాని. ఇదంతా గమనించిన దాసుగారు ఒకనాడు అతని బీదరికాన్ని చూసి తరచూ తన ఇంటిలో భోజనం పెట్టించి పక్కనే కూర్చుని విసనకర్రతో గాలి విసిరేవారు. ఈ వొక్క సంఘటన కేశవదాసు గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదో తేట తెల్లం చేస్తుంది. ఆయన జాతీయవాదిగా పలు దేశభక్తి రచనలు చేశారు. వాటిలో కొన్నింటిని బెంగుళూరులోని గ్రామ ఫోను కంపెనీ వారు రికార్డులుగా విడుదల చేసింది. మోతీలాల్ స్మృతిలో రాసిన పాటలు వాటిలో కొన్ని. ఇవి మాత్రమే గాదు. కేశవదాసు గారి సాహిత్య జీవితంలో శాశ్వతంగా నిలిచిపోదగినది వొకటుంది. అదే తెలుగు సమాజంలో ఏ నాటకానికైనా ప్రారంభానికి ముందు పాడే 'పరబ్రహ్మ పరమేశ్వర - భళిరా హరి మహిమం బెరుగగ బ్రహ్మాదులు తరమా' అనే ప్రసిద్ధ కీర్తన. ఈ కీర్తన మన చందాల వారి కలం నుండి జాలు వారినదే. తన అర శతాబ్ద కాలంలో చేసిన సాహిత్య సేవలకు గుర్తింపుగా 'కలియుగ దశరథ', 'నటకావతంస', 'ఆంధ్రసూత' వంటి బిరుదులతో సత్కారాలు పొందారు.
బహుముఖ సాహితీ ప్రాజ్ఞుడుగా చందాల కేశవదాసు తెలంగాణ సాహితీ చరిత్రలో ఒక ధ్రువతారగా నిలిచిపోయారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో ఆయన స్మారకార్థం రాష్ట్ర ప్రభుత్వం, ప్రసిద్ధ సాహిత్య సంస్థలు విస్తృతమైన కార్యక్రమాలు చేపట్టడమేగాక ఆయన విగ్రహాన్ని రాచకొండలో నిర్మించబోయే ఫిలింసిటీలో ఏర్పాటు చేయాలి. అదే కేశవదాసు గారికి నిజమైన నివాళి కాగలదు.
- నహెచ్.రమేష్‌బాబు
9440 925 814