Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఇద్దరు యుక్త వయస్సులో వున్న యువతీ యువకులు (మైనర్లు కాని వారు) పెళ్ళి చేసుకుంటే ఎవ్వరూ జోక్యం చేసుకోకూడదు'' అని సుప్రీం కోర్టు ఫిబ్రవరి 5న పేర్కొంది.
అంతకు ముందు సంచలనాత్మకమయిన హిదయ (కేరళ) కేసులో ఆమె ఎవర్ని చేసుకున్నా, ఏ మతం అనుసరించినా ఆమెకు ఆ హక్కు ఉందని చెప్పింది.
ప్రేమించి పెళ్ళి చేసుకున్నందుకు వారిని దారుణంగా చంపిన ఖాప్ పంచాయితీ పెద్దలు అయిదుగురికి హర్యానా కోర్టు శిక్ష విధించింది. ఖాప్ పంచాయితీలు రాజ్యాంగ వ్యతిరేకం అని చట్ట ఉల్లంఘన అనీ సుప్రీంకోర్టు పేర్కొంది. 2009లోనే ఖాప్ పంచాయితీల నిషేధ బిల్లు చిత్తు ప్రతి రూపొందించబడింది గానీ 'ఓట్ల' వేటలో దానిని పక్కన పడేశారు. బెంగాల్‌లో ఓ కుల పంచాయితీ ప్రేమించినందుకు శిక్షగా ఓ అమ్మాయిపై కుల పెద్దలందరికీ రేప్ చేసే హక్కుని ప్రసాదించారు.
యివన్నీ ఉత్తరాదికి పరిమితం కానేకాదు. గౌరవ హత్యలుగా పేర్కొనే కులమత దురహంకార హత్యలు దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా పెరిగాయి. స్వాతి, నరేష్ ఉదంతం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.
ఈ దేశంలో రాజ్యాంగ ప్రకారం మైనారిటీ తీరిన 18 సంవత్సరాలు దాటిన యువతులు, 21 సంవత్సరాలు దాటిన యువకులు వారిష్ట ప్రకారం కులం, మతం, ప్రాంతం, భాష, రంగు భేదాలతో నిమిత్తం లేకుండా పెళ్ళి చేసుకునే హక్కు వుంది. తమకు నచ్చిన ఇష్టపడిన వారితో జీవితం పంచుకోవాలనుకోవటం యువతీ యువకుల ప్రాథమిక హక్కు.
కానీ 'కుల, మత' రాజకీయాలు అధికారానికి నిచ్చెనగా మారిన మన దేశంలో మధ్య యుగాల మాదిరిగా కులాలను తిరగి స్థిరీకరిస్తున్నారు. మత కుల సమూహాలపై పట్టు నిలబెట్టుకోవడానికి కుల పంచాయితీలు, మత పెద్దలు అచారాలు సాంప్రదాయాల పేరిట చట్టాన్ని ఉల్లంఘించడానికి ఎంత మాత్రం వెనుదీయటం లేదు. ఖాప్ పంచాయితీలు ఒక భాగం అయితే ఇప్పుడు సంఘ పరివారం నాయకత్వంలో సాగుతున్న 'లవ్ జిహాద్'కు కొన్ని ప్రభుత్వాల పూర్తి అండదండలున్నాయి.
కుల మతాంతర వివాహాల సమాచారం సేకరించడం వాటిని నివారించడం లేదా ఆ పెళ్ళి జరిగిపోతే వారిపై దాడులు చేయడం, విడదీయటం, చంపేయటం యివి లవ్ జిహాదీల పరమ కర్తవ్యాలు. ముస్లింలు హిందూ యువతుల్ని పెళ్ళి చేసుకునే ఓ కుట్రలో భాగంగా లవ్ జిహాద్ (ప్రేమ యుద్ధం) చేస్తున్నారనే ప్రచారం భారీగా చేస్తున్నారు. ముస్లింలు ఇద్దరు ముగ్గురు భార్యల కోసం, మత మార్పిడి కోసం యిలా చేస్తున్నారని నమ్మిస్తున్నారు. అదే సమయంలో ముస్లిం యువతుల్ని లేవదీసుకుని వచ్చే హిందూ యువ కిశోరాలకు రక్షణ కల్పించడానికి ఏకంగా ఒక సంస్థనే ఏర్పాటు చేశారు. ఇదంతా రాజకీయం లో భాగం.
మరి సమాజం మాటేంటి?
స్వాతంత్య్రోద్యమం తాలూకు అభ్యుదయ ఛాయలు ప్రపంచీకరణతో అడుగంటాయి. అనేక రకాల భయాలు అభద్రతలతో సామూహిక అస్తిత్వాల గుర్తింపులు అవసరం అయ్యాయి. కాబట్టి కులం, మతం, జాతకాలు, కట్నాలు, భారీ వివాహాలు పుంజుకున్నాయి. అత్యాధునిక సాంకేతికత భావాల వెనుకబాటు తనం చెట్టపట్టాలేసుకుని సాగుతున్నాయి.
''అభ్యుదయ వాదులుగా ప్రకటించుకునేవారు సైతం పెద్దల్ని ఒప్పించి చేసుకోవాలి'' అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ పెద్దలు కులం, మతం, కట్నం, జాతకం ఖాతరు చేయరు కాని పిల్లల క్షేమం కోరతారు. కాబట్టి ఆ అమ్మాయి లేక అబ్బాయి ఎటువంటి వారనేది గమనించే అనుభవం వుంటుంది కాబట్టి వారు చెప్పింది వింటే వీరికి బాధ వుండదు. అంతకాలం పెంచిన వారికి పిల్లలకేం కావాలో తెలియదా? కుటుంబంలో అనుబంధాలు వదిలేసుకోవడం మంచిది కాదు. పెళ్ళి చేసుకున్న వారికి పెద్దల సహకారం లేకుంటే ఎంతకాలం నిలబడగలరు? వంటి వాదనలు బలంగా విన్పిస్తున్నారు.
పిల్లల ఆసక్తి, సామర్థ్యంతో సంబంధం లేకుండా పెద్దల కోరిక తీర్చడానికి వారు డాక్టర్లు, ఇంజనీర్లవ్వాలనే దేశం మనది. పెళ్ళి 'కుటుంబం' కోసం కూడా అనే భావన నాటడానికి సాధ్యం కాకపోవడంలో ఆశ్చర్యంలేదు. అసలు పిల్లల జీవితాల్లో పెద్దల పాత్ర ఏమిటి? పెత్తనమా? ప్రేమా!
'ప్రేమ' అయితే పిల్లలకు ఎలాంటి వారినయినా కోరుకునే లేదా వారిపట్ల ఆకర్షింపబడే అవకాశం ఉందని అంగీకరించాలి. అటువంటి ఆకర్షణలన్ని వ్యామోహాలు కనుక అవి శారీరకమైన మోజు తీరగానే పోతాయి. అప్పుడు పశ్చాత్తాప పడతారు అని దిగులు పడటం మానేయాలి. ఎంత గాఢమైన ప్రేమ అయినా ఆకర్షణతోనే ప్రారంభం అవుతుంది. స్త్రీ, పురుషుల మధ్య తీవ్రమైన శారీరక వాంఛ ప్రేమకు ఒక రకమైన పునాది. లైంగిక ఆకర్షణలను తుచ్ఛంగా చూసే ధోరణి నుండి మనం బయట పడాలి.
తల్లిదండ్రులకు పిల్లలపై ప్రేమ షరతులతో కూడి వుండకూడదు. ఇలా వుంటేనే, ఇలా చేస్తేనే, మేం చెప్పినట్టు వింటేనే ప్రేమిస్తాం, లేదంటే చంపేస్తాం అంటున్నారంటే పిల్లల్ని మనుషులుగా చూడటం లేదని అర్థం. తమ కోర్కెలు తీర్చే సాధనాలుగా చూస్తున్నారనీ అర్థం.
పిల్లల ప్రేమల్లో పొరపాట్లు, తొందరపాట్లు, వైఫల్యాలు ఉండవా? తప్పకుండా ఉండి తీరతాయి. ప్రేమతో సహా జీవితంలోని ఏ రంగంలో నయినా వుంటాయి. వాటి నుండి పాఠాలు నేర్చుకుంటారు. తమ తరువాతి అనుబంధాల విషయంలో మెరుగ్గా నిర్ణయాలు చేసుకుంటారు. 'ప్రేమానుభవం' ఎవరిది వారిదే పూర్తిగా వ్యక్తిగతం. దానిని వేరొకరి నుండి నేర్చుకోవటం సాధ్యం కాదు. ప్రతి ఒక్కరి 'ప్రేమ' వారికే సొంతమయిన ఓ అందమయిన రహస్యం.
ప్రేమలో పెళ్ళిలో వైఫల్యం జరిగి తమ నిర్ణయం పట్ల బాధ పడుతూ తమ అంచనాల గురించి అనుమానపడే పిల్లలకి ధైర్యం ఇవ్వడం పిల్లల్ని నిజంగా ప్రేమించే పెద్దల పని. ఈ వైఫల్యానికి ఒక్కరే కారణం కాదు. ఇద్దరు కూడా కాదు... అనేక భౌతిక పరిస్థితులు కూడా జత కడతాయని వివరించడంలో పెద్దల పరిణితి అక్కరకు రావాలి. ధైర్యం చెప్పి అపరాధ భావనల్ని వెనక్కి నెట్టి మరో ప్రయోగానికి ముందుకు నెట్టాలి. 'ప్రేమ' విషయానికి సూత్రాలేవీ లేవు. దగ్గర దారులూ లేవు. మనిషిగా ఎదుటివారి పట్ల స్పందించటం తప్ప దానికి దిశ లేదు.
పిల్లలకు జీవిత భాగస్వాముల్ని వెతకడం పెద్దల బాధ్యత ఎంత మాత్రం కాదు. అది పిల్లల బాధ్యతే. వారు అవసరం అనుకుంటే కావాలనుకుంటే వారే వెతుక్కోవాలి. పిల్లలు అడిగితే సలహాలు ఇవ్వొచ్చు కాని పెద్దలు తీర్పులు ఇవ్వకూడదు.
ఒక కాలేజీలో 'ఎంతమంది ప్రేమ వివాహాలు చేసుకోదల్సుకున్నారని' అడిగితే 10 చేతులు కూడా లేవలేదు. 'తల్లిదండ్రులు చెప్పిన పెళ్ళి చేసుకుంటే ఏం జరిగినా వాళ్ళే చూసుకుంటారు' అని జవాబొచ్చింది. అంటే తమ పెళ్ళికి తమ దాంపత్య జీవితానికి తాము బాధ్యత వహించాలనుకునేట్టు పిల్లల్ని మనం పెంచలేకపోతున్నాం. 'పెళ్ళిలో ఏదో జరుగుతుంది' అనే భయంతో వారు వైవాహిక జీవితం ప్రారంభిస్తారు. తల్లిదండ్రులు చేసే తప్పుడు ఎంపికలకు పిల్లలు మూల్యం చెల్లిస్తారు.
ప్రేమ వివాహాలు ఎక్కువగా వైఫల్యం చెందుతున్నాయనేది అబద్ధపు ప్రచారం. తాము కోరుకుని చేసుకున్నారు కనుక యువతీయువకులు నిలబెట్టుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు. ఏదైనా పొరపొచ్చాలు వచ్చి ఈ 'పెద్దల సలహా అడిగితే', 'ఆ ఇది నిలిచేది కాద'నే భావనతో సలహాలు చెప్పడం లేదా పనిగట్టుకుని విడదీయటం చేస్తారు. ప్రేమ వివాహాలు విడి పోవడానికి కారణం కూడా ఎక్కువ సార్లు పెద్దలే.
ఇదే పెద్దలు తాము కుదిర్చిన వివాహాలు ఎంత హింసతో సాగుతున్నా పట్టించుకోరు. అమ్మాయిని సర్దుకోమని చెబుతారు. కట్నాలు మళ్ళీ ఇస్తారు. కోర్కెలు అదనంగా తీరుస్తారు. ఆ కాపురం నిలబెట్టడానికి ఏమయినా చేస్తారు. అమ్మాయిని బలివ్వడంతో సహా. అసలు అమ్మాయిలు తమకు నచ్చిన వాడిని ఎంచుకోవడం అనేదే మనకు జీర్ణం కాదు. 'మంచి అమ్మాయిలు శీలవతులు అలా చేయరు. వారికి లైంగిక ఆకర్షణలు వుండవు. బుద్దిగా తల వంచుకుని తాళి కట్టించుకుని అణకువగా మగ పిల్లల్ని కని వంశానికి పేరు తెస్తారు'. స్త్రీలకు లైంగిక వాంఛలుండటం మన సమాజం అంగీకరించని విషయం. స్త్రీని పురుషుణ్ణి నాశనం చేసే కామినీ పిశాచి అని మతాలు చెబుతున్నాయి. కాబట్టి స్త్రీల లైంగికతను అణచి పారేసే క్రమమే పురుషాధిక్య సమాజం చెప్పే శీలం, పాతివ్రత్యం వగైరాలు. కనుకనే స్త్రీలకు 'ఎంచుకునే' స్వేచ్ఛ లేదు.
'ఈ కాలంలో అమ్మాయిలు కూడా ఎగబడుతున్నారండీ'... అందుకే ఈ అబ్బాయిలు వలలో చిక్కుకుపోతున్నారని వాపోతుంటారు... నైతిక భాష్యకారులు. ప్రకృతి సిద్ధంగా చూస్తే ఆడ ప్రాణిని ఆకర్షించుకునే ప్రాథమిక బాధ్యత మగ ప్రాణిదే. కానీ మనం మాత్రం ప్రేమ వలలు అమ్మాయిలే వేస్తారని నమ్ముతాం.
ఇరువైపులా అంగీకారం లేకుండా 'ప్రేమ' జరగదు. ఆకర్షణ నుండి మోహానికి తర్వాత ప్రేమకు దశలు మారి పెళ్ళి దాకా చేరితే... ఆ జంటకు కొంత అవగాహన కలిగించాలి. దానిలో మొదటిది ఇద్దరికీ సంపాదన / ఉపాధి ఉండి తీరాలనేది తప్పనిసరి. స్వావలంబన లేనివారు ప్రేమించుకోవద్దని చెప్పలేం కాని వారికి పెళ్ళిచేసుకునే అవకాశం తక్కువని చెప్పొచ్చు. ఒకవేళ చేసుకున్నా అది నిలబడే ఆధారం లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రేమ ప్రేమను తిని బతకదు కదా! ఆహారమే తినాలి.
రెండోది పెళ్ళికి ముందు ప్రేమ చాటు మాటుగా గంటో రెండు గంటలో తీపి ఊసుల్లో గడిచిపోతుంది. పెళ్ళి 24 గంటల సాన్నిహిత్యం. ఆ కొత్తదనపు మోజు నిలుపుకోవటం, రోజువారీతనంలో ప్రేమలోని నిగూఢత అదృశ్యం కాకుండా జాగ్రత్త పడటం ఒక కళ. ప్రేమ పెళ్ళి నిలబెట్టే ఒక అవసరంగా సాధన చేయాలి. శారీరక వాంఛను కొనసాగిస్తూనే మానసిక అనుబంధంగా పరిణితి చెందించుకోవాలి. 'ఒకరికి ఒకరు' అది దాంపత్యం అనే నమ్మకంపై, స్నేహంపై, గౌరవంపై నిలబడాలి.
'గులాంగిరి' ఎవరు చేసినా ప్రేమ నిలబడదు. రెండు భిన్నమయిన వ్యక్తిత్వాలు గల వ్యక్తులు బలమైన ఆకర్షణ శక్తితో తమతమ ప్రత్యేకతల్లో ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతుంటేనే కొనసాగుతారు. ఇద్దరూ ఆత్మాభిమానం కలిగి స్వతంత్రత పొందటం ప్రేమలో భాగం.
కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, డబ్బు వర్గాలకు అతీతంగా ఒకరి పట్ల ఒకరికుండే తీవ్రమయిన కాంక్షతోనే యువతీ యువకులు ఒకరిని ఒకరు ఎంచుకోవాలి. సహజమయిన స్త్రీ పురుషుల ప్రేరణలకు ఆటంకంగా మారిన అన్ని రకాల ఆధిపత్యాలు తొలగిపోవాలి.
ఆధిపత్యాల తొలగింపులో ప్రేమ వివాహాలు ఒక అవసరం. పిల్లలను అదుపు చేయటం, నియంత్రించడం, వారికి జీవిత భాగస్వాముల్ని నిర్దేశించడం పూర్తిగా అప్రజాస్వామికం. తమ జంటలను ఎంచుకోవటంలో పిల్లలకుండే తెలివి మన యువతకు లేదనుకోవడం అజ్ఞానం.
ప్రేమ వివాహాల్ని పెద్దలు ఆమోదించకపోవడం వల్ల పెద్దలకి బాధ కలిగితే దానికి కారణం పెద్దలే. వారి మధ్య సంబంధాలు దెబ్బతింటే దానికి కూడా పిల్లల అభీష్టాన్ని నిరాకరించిన పెద్దలదే బాధ్యత. పెళ్ళి గురించి పెద్దలు చేసే తప్పు నిర్ణయాలకి పిల్లలు మూల్యం చెల్లించడం తప్పు. యువత వారు తప్పు నిర్ణయాలు చేసుకుంటే దానికి వారు పరిహారం చెల్లించడం రైటు. నిర్ణయం తీసుకోలేని డోలాయమానంలో సలహా చెప్పాలి. వైఫల్యంలో చేయూతనివ్వాలి. శాసించకూడదు. పెద్దల పట్ల ప్రేమ, కృతజ్ఞతల వలన యువత తమ ప్రేమల్ని త్యాగం చేయాలనడం అన్యాయం. అర్థరహితం. ప్రేమ పెళ్ళిళ్ళు వర్దిల్లాలి. ప్రేమించుకునే కల్పి బతకాలి.
రచయిత సెల్ : 9848622829
- దేవి, సాంస్కృతిక కార్యకర్త