Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యాయం న్యాయానికి న్యాయం చెయ్యాలని అనుకోవడం న్యాయంగా న్యాయమే. అయితే న్యాయానికి న్యాయం న్యాయం చెయ్యాలని అనుకున్నా అనేక అవాంతరాలు అడ్డంకులు అడ్డే మోకాళ్ళూ!
న్యాయాలయం కిక్కిరిసిపోయింది. వాదులూ ప్రతివాదులూ ముద్దాయిలూ నల్లకోటూ ఎటు చూసినా. బల్లలమీదా సొరుగుల్లోనూ ఫైళ్ళే ఫైళ్ళు ఎటు చూసినా. కుప్పలుగా కట్టలుగా మోపులుగా మోత బరువులుగా.
ష్షు ష్షు... అన్నారెవరో... నిశ్శబ్దం నిశ్శబ్దం అన్నారింకెవరో. జడ్జిగారు వస్తున్నారు అన్నారెవరో గుసగుసగా. కోర్డుహాలు లైబ్రరీ అయిపోయింది. నిశ్శబ్దం నిశ్శబ్దంగా కాలరెత్తుకు నిలబడింది. దాంతో పాటు అక్కడున్న అందరూ లేచినిలబడ్డారు.
జడ్జిగారు ఆసనంలో కూర్చుంటూ అలవాటు కనక సుత్తితో టేబిల్ తలమీద బాదుతూ ఆర్డర్... ఆర్డర్ అన్నారు.
కళ్ళకి పట్టీ వున్న న్యాయదేవత ఆ చప్పుడుకి ఉలిక్కి పడింది. మూసుకుందామంటే చెవుల్లేవు కదా అని తటపటాయించింది.
జాగా దొరికిన వాళ్ళు కూచున్నారు. దొరకని వాళ్ళు నించున్నారు. అడ్వకేట్లు ఫైళ్ళూ గొంతులూ సర్దేసుకున్నారు. ఉద్యోగులు కేసులూ నంబర్లూ సరి చేసుకున్నారు.
ఆ రోజు మొదటి కేసు విచారణ ఎట్టుకేలకు ఆరంభం అవనే అయింది. గొంతు చించుకోవడానికి జీతం తీసుకుంటున్నవాడు గొంతు చించేసుకున్నాడు. బోనులో నిలబడాల్సినవాడు ఒగరుస్తూ పరుగెత్తుకు వచ్చి బోనులో నిలబడ్డాడు అమాయకంగా ముఖంపెట్టి.
కేసేమిటి అన్నారు జడ్జిగారు ముఖం పైకెత్తి అమాయకంగా కనిపిస్తున్న వాడి వైపు అదోలా చూస్తూ.
కేసు నంబరు చెప్పి కాగితాల బొత్తి అందించాడు కార్యాలయ ఉద్యోగి. గొంతు సవరించుకున్నాడు ప్లీడరు. నల్లకోటు నేలని ఊడుస్తుంటే వచ్చి నించున్నాడు జడ్జిగారికి ఎదురుగ్గా. ఆ తర్వాత చుట్టూ చూశాడు. బోనులో ఉన్నవాడి వైపు చూశాడు. మళ్ళీ మరోసారి గొంతు సవరించుకున్నాడు.
జనం ఉత్కంఠగా చూస్తున్నారు.
బయట నుంచి 'అయిస్క్రీం' అని అరుపు కోర్టు హాలులో నిశ్శబ్దాన్ని నిలువునా చీల్చేసింది. ఆ అరుపుతో పాటు అయిస్క్రీం బండికి కట్టున్న గంట గణగణమని మోగింది.
''నువ్వు చెప్పాలనుక్నుదేమైనా ఉందా?'' అని జడ్జిగారు అడిగీ అడగడంతోటే బోనులో ఉన్నవాడు
''అయ్యా! పుల్ల ఐస్‌క్రీం! పుల్ల ఐస్‌క్రీం!'' అని అరుస్తూ బోనులోంచి బయటకు గెంతి పరుగెత్తాడు. ఖాఖీలు లాటీలు ఊపుకుంటూ వాడి వెనక పడ్డారు.
క్షణంలో సీన్ మారిపోయింది. జనం కేకలు పెట్టారు. జడ్జిగారు సుత్తితో బల్లనెత్తిమీద బాదుతూ ఆర్డర్! ఆర్డర్! అని అనేక మార్లు అన్నారు.
బోనులోంచి ఐస్‌క్రీం కోసం పరుగుతీసిన వాడిని లాక్కొచ్చారు పోలీసులు. వాడి చేతిలో పుల్ల మాత్రమే కనిపించింది.
బోనులో నించున్న వాడి వైపు కోపంగా చూశారు జడ్జిగారు.
చిన్నప్పట్నుంచీ పుల్ల అయిస్క్రీం అంటే చాలా ఇష్టం సార్. ఆగలేకపోయాను... అందుకే పరుగెత్తాను. కానీ ఈ పోలీసోళ్ళు తిననిస్తేగా. కళ్ళు మూసుకుని చప్పరిస్తుంటే లాక్కువచ్చారు. అంతా కరిగి కారిపోయింది. ఇదిగో ఈ పుల్ల మాత్రమే మిగిలింది అంటూ పుల్లని పైకెత్తి చూపాడు బోనులో నుంచున్న ముద్దాయి. ఆ పుల్లవైపు ఆసక్తిగా, ఆశగా, ఇష్టంగా చూశారు జడ్జిగారు. ఆ తర్వాత ఇక మొదలు పెట్టండి వాదనలు అన్నారు.
ముద్దాయి తరపు వకీల్లేడక్కడ. ''మిలార్డ్! మా సార్ పుల్ల అయిస్క్రీం కోసం పరుగెత్తారు. ఆయనకి అదంటే భలే ఇష్టం'' అని జూనియర్ జడ్జి గారికి సవినయంగా మనవి చేశారు. చేసేదేం లేక ఆయన సుత్తి బాదారు. తర్వాత ఐస్‌క్రీం అంతా చప్పరించేసి పుల్లని నల్ల కోటు జేబులో పెట్టుకుంటూ వచ్చిన లాయర్ 'మిలార్డ్' అని గొంతు సర్దుకుంటూ ఆయన ఉండాల్సిన వైపు చూశాడు. ఆయన అక్కడ లేనేలేడు. ఆయనక్కూడా పుల్ల అయిస్క్రీం అంటే ఎంతో ఇష్టం మరి.
తర్వాత జడ్జిగారు కూడా అయిస్క్రీం చప్పరిస్తూ తన సీట్లో కూచోడానికి రానే వచ్చారు. కానీ అప్పటికే అక్కడ మరో జడ్జీ కూచుని సుత్తితో బాత్తూ ఆర్డర్! ఆర్డర్! అంటూ కేకేస్తున్నారు. ఇదేమిట్రా అంటే... అటెండర్ ''సార్! తమరికి ట్రాన్స్‌ఫర్ అయిపోయింది'' అన్నాడు.
ఇరవైయేళ్ళు పుల్లకి ఉన్న అయిస్త్రీంలా కరిగిపోయేయి. మళ్ళీ కిక్కిరిసిన కోర్డు హాలు. జడ్జిగారు బోనులో ముద్దాయికేసి చూస్తూ ''నువ్వు... ఇరవైయేళ్ళ కిందట... పుల్ల... అయిస్క్రీం'' అనాగిపోయేరు.
''అవున్సార్ అది నేనే! ఇంకా కేసు ఫైనల్ కాలే'' అన్నాడు.
''ఇప్పటికే చాలా లేటయ్యింది. తీర్పు చెప్పేస్తా'' అన్నారు జడ్జీగారు.
మర్నాడు అదే కోర్టు ముద్దాయి అతడే కానీ జడ్జి గారు మారారు. ఈ కేసులో పూర్వాపరాలు చాలా చర్చించాలి. బెయిల్ మంజూరు చేస్తున్నానన్నారు.
ముద్దాయి పుల్ల అయిస్క్రీం చప్పరిస్తూ కోర్టులనేకం, జడ్జీలనేకం, తీర్పులనేకం వాయిదాలు అనేకానేకం అనుకుంటూ వెళ్ళిపోయేడు.
న్యాయం న్యాయానికి న్యాయం చెయ్యాలని అనుకోవడం న్యాయంగా న్యాయమే. అయితే న్యాయం న్యాయం చెయ్యాలని అనుకున్నా అనేక అవాంతరాలు అడ్డే మోకాళ్ళూ!
- చింతపట్ల సుదర్శన్, 9299809212