Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాండిత్యం మెండుగా ఉండటం ఒక ఎత్తయితే దాన్ని జనరంజకంగా ప్రదర్శించడం, పామరులను సైతం మెప్పించడం మరో ఎత్తు. ఈ రెండు ప్రతిభా విశేషాలు అపారంగా కలిగిన విద్వాంసులు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తిగారు. సంగీత కళను, నాట్య కళను, నాటక కళను మేళవించి, హరికళా కళను పరివ్యాప్తం చేసిన మహానుభావుడాయన. చివరి క్షణాల దాకా త్యాగరాజస్వామి పటం పట్టుకుని జోలె పడుతూ, రెండు దశాబ్దాల పైబడి త్యాగరాయ ఆరాధనోత్సవాలను ఘనంగా నిర్వహించిన మహనీయుడాయన.
సాంబమూర్తి హరికథలు చెప్పిన కాలం, పౌరాణిక నాటకాలు ప్రదర్శించిన కాలం సంగీత సాహిత్యాలకీ, నాటక కళలకీ అనువైన అపురూపకాలం. వారు హరికథకునిగా ఎంత నిష్ణాతులో, నాటక రంగంలో నటునిగా, దర్శకునిగా సైతం అంతే నిష్ణాతులు. కేవలం కథలు చెప్పి ఊరుకోక తను చెప్పిన సారాన్ని ఆచరించి చూపిన మహోన్నత సంస్కారి సాంబయ్య. తనకెంతో ప్రాణప్రదమైన పౌరాణిక నాటకాలను తాను స్వయంగా దర్శకత్వం వహించి ప్రదర్శించడమే కాదు, ఆ నాటకాలలో తాము ప్రదర్శించిన ఔన్నత్యాన్ని ఆచరించి చూపారు.
సాంబమూర్తిగారి పట్ల వున్న ఆరాధనాభావం వల్ల ఆయన ప్రసక్తి వచ్చినప్పుడల్లా రచయిత పులకించిపోయి ప్రస్తుతించడంతోనే సరిపోయింది తప్ప, కొత్త విషయాలను తెలియజేసే శ్రమగానీ, పరిశోధన గురించిగానీ పట్టించుకోకపోవడం ఆశ్యర్యం. మొత్తానికి ఈ పుస్తకం సంస్మరణ సంచికలోని వ్యాసాలన్నింటిని ఒక దగ్గర గూర్చినట్టుగా వుంది తప్ప ఒక క్రమ పద్ధతిలో జీవిత చరిత్ర రాసినట్టుగా లేదు. అసలు సమాచారం లోపించడం వల్ల హరికథ అంటే ఏమిటి? నిర్వచనాలు - లక్షణాలు అంటూ అనవసర వివరణలతో పుస్తకం నింపేశారు. ఆదిభట్ల నారాయణదాసుతో సాంబమూర్తిగారికి పోల్చడం అనవసరం. ఏది ఏమైనప్పటికీ ప్రఖ్యాత సినీ గాయకుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం తండ్రిగా కాకుండా - తనదైన వ్యక్తిత్వం కలిగిన ఒక మహానుభావుడి గొప్పదనాన్ని తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.