Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పసిప్రాయంలో చిన్న పిల్లలను చూసుకున్నట్లు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవాల్సిన పుత్రులు ఎక్కడైనా కనిపిస్తున్నారా? అలాంటి వారు నేడు నూటికో కోటికో ఎక్కడో ఒక్కరు కనిపిస్తారు. అవసాన దశలో ఆసరాగా ఉండాల్సిన పుత్రులు తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వేస్తున్నారు. డబ్బుకోసం కొందరు చిత్రహింసలు పెడుతుండగా మరి కొందరు రోడ్లపై ఒదిలేసి వెళుతున్నారు. కానీ తల్లిదండ్రులంటే ప్రేమ ఉన్న పుత్రులు కూడా ఉన్నారని నిరూపించే వాళ్లు ఎప్పుడో ఎక్కడో ఉండకపోరు. అలాంటి వారిని చూసినప్పుడు మాత్రం మనం గర్విస్తాం. జన్మనిచ్చి పెంచి పోషించిన తల్లిదండ్రుల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేం. వారు కళ్లముందు కనిపించే దేవతలు. అలాంటివారికి గుడికట్టి తన భక్తిని చాటుకున్నాడు ఓ కుమారుడు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గంధసిరికి చెందిన సిరిగిరి హుస్సేన్ తన తల్లిదండ్రులైన నర్సమ్మ, రామదాసులకు ఆలయాన్ని కట్టించాడు. నిండునూరేళ్లు జీవించి రెండేళ్ల క్రితం వీరు చనిపోయారు. వీరి ఏకైక కుమారుడు హుస్సేన్ ఈ యేడాది ఫిబ్రవరిలో మూడు లక్షల రూపాయలు వెచ్చించి గుడి కట్టించాడు. గంధసిరి-పెద్దమండవకు వెళ్లే దారి పక్కన కనిపించే ఈ మందిరం అమ్మానాన్న, బిడ్డల మమతలకు, ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలుస్తుంది. వారు బతికినన్నాళ్లు జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా చనిపోయిన తర్వాత కూడా ఇలా భక్తిని చాటడంతో ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇలాంటి పుత్రులు ఉంటే వృద్ధాశ్రమాలు ఎందుకు వెలుస్తాయి? - పుప్పాల