Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామయ్య రైతు. అతని కొడుకు రాజయ్య ఏ పనీ చెయ్యడు. కానీ బలవంతుడు. ఇతరుల్ని భయపెట్టడం, బాధపెట్టడం అతనికి సరదా. ఒక రోజు అతనికి ఎలుగుబంటి ముసుగు దొరికింది. అది మొదలు ఇతరుల్ని భయపెట్టి, వాళ్లు జారబిడుచుకున్న చేతి సంచుల వంటివి దోచుకునేవాడు.
రాజయ్య పగలంతా ఇలా దోపిడీ చేసేవాడు. రాత్రిళ్లు ఆ ముసుగు ఓ చోట దాచిపెట్టి ఇంటికి వెళ్లేవాడు. తెచ్చిన డబ్బుని కష్టపడి సంపాదించానని చెప్పి తల్లిదండ్రులకు చూపించేవాడు.
ఏ పనీ చెయ్యని కొడుకు ఇప్పుడు డబ్బెలా తెస్తున్నాడో! అన్న అనుమానం వచ్చింది రామయ్యకు!
పరీక్షించాలని ఓ రోజు రాజయ్య వెనకే వెళ్లాడు.
ఎలుగుబంటి ముసుగు వేసుకుంటున్న కొడుకుని చూసేసరికి పట్టలేని కోపం వచ్చింది రామయ్యకు. కొడుకుని ఎలాగైనా మార్చాలని ఊరందరికీ ఈ విషయం చెప్పేశాడు. కానీ.. తెలియనట్టుండి అందరినీ భయపడినట్లు నటించమన్నాడు.
ఆ పథకం ప్రకారమే మర్నాడు రాజయ్య ప్రజల్ని భయపెడుతుండగా రామయ్య మరికొందరు జంతువుల్ని పట్టేవాళ్లలా మారువేషంలో వచ్చారు. ఎలుగుబంటి ముసుగులో ఉన్న రాజయ్యని పట్టుకుని కొట్టసాగారు.
రాజయ్య ముసుగు తీసి నన్ను కొట్టకండి.. నేను తప్పుచేశాను. మరోసారిలా చెయ్యను. బుద్ధిగా మా నాన్నతో పాటు వ్యవసాయం చేసుకుంటాను. అని బతిమిలాడాడు. అప్పట్నుంచి తండ్రికి పనుల్లో సాయం చేస్తూ మంచివాడిగా పేరుతెచ్చుకున్నాడు.