Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దారికి అడ్డంగా పడుకుని నిద్దర పోతున్న ఏనుగులాంటి కొండ. బండ మీద బండ పేర్చుకుని నిలబడ్డ కొండకింద అన్ని దిక్కులనీ విస్తరించిన కొమ్మల చేతుల్తో సూర్యుడి కిరణాల్ని అడ్డుకుంటున్న మహావృక్షాలు. వాటి నీడన ఎదగలేక ఓ మాదిరి ఎత్తుకి ఎదిగి ఆగిపోయిన చిన్నచెట్లు. వాటి మధ్య ట్రిమ్మింగ్ చేయకపోవడం వల్ల అడ్డదిడ్డంగా పెరిగిన గడ్డంలాంటి గడ్డిపొదలు. ఎప్పుడో తప్ప వెలుతురు జబ్బ విరుచుకుని కనపడని ఆ చోట గులకరాళ్ళ మీద తమకు వచ్చిన పాటల్ని 'హమ్' చేస్తున్న వివిధ పాయల నీళ్ళు. నీళ్ళన్నీ ఒక చోట పోగుపడిన కుంట దగ్గర ఒక సామ్రాజ్యం.
అది మండూక సామ్రాజ్యమనగా కప్పల బెకబెకల లోకం. ఏ సమయంలో వెళ్ళినా సరే, బెకబెకలాడే కప్పలు బెకబెకమంటూనే వుంటాయి. కప్పలకా ప్రదేశం ఒక కంట్రీయే మరి.
ఒకే రకం కప్పలన్నీ ఒకచోట చేరాయేమో అనుకోవడం పొరపాటే అవుతుంది. నీలం రంగు కప్పలు నాచురంగు కప్పలు, నల్లరంగు కప్పలు, కాషాయం రంగు కప్పలు ఇవి కాక రెండు రంగుల కప్పలూ వున్నాయి. రంగు సంగతి వదిలేస్తే ఆకారాన్ని బట్టి చూస్తే లావుగా మోటుగా వుండే గోదుమ కప్పలు, చిన్నగా సున్నితంగా అరచేతి సైజులో వుండే చిన్న కప్పలు వున్నాయి. ఇక ప్రత్యేకతల విషయానికి వస్తే మూడడుగులూ ఆరగుడులూ కూడా ఎగిరే కప్పలు లేకపోలేదు.
ఈ కప్పల సామ్రాజ్యానికి రాజంటూ ఏ కప్పా లేదు. ఇక్కడ రాచరికం వంశపారంపర్యం కాదు. ఎక్కువ సంఖ్యలో కప్పలు ఏ కప్పని ఎన్నుకుంటే ఆ కప్ప ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మెజారిటీ రూల్ అన్నమాట. సంఖ్య మాత్రమే పాలక సమూహాన్ని నిర్ణయిస్తుందన్న మాట. రకరకాల కప్పలు ఉన్నట్టుగానే వివిధ రకాల కప్పల గ్రూపులు వున్నాయి. వివిధ గ్రూపుల కప్పలకు వేరువేరు అజెండాలూ, జెండాలూ వున్నాయి. సిద్ధాంతాల విషయంలో అన్ని బెకబెకలూ తలలు పండి పోయినవే. అన్ని కప్పల ఆశయం ఒక్కటే. తమ ముఠా కప్పలే కిరీటం పెట్టుకుని ఎగరాలని.
ఎప్పటిలాగానే కప్పల సామ్రాజ్యంలో ఎన్నికలు అట్టహాసంగా జరిగేయి. కుంటలో నిత్యం బెకబెకలాడే అనేక కప్పలు ఓట్లు వేసి ముందరి కాలి మొదటి వేలు మీద ఇంకు గుర్తు పెట్టించుకున్నాయి. అయితే ఏ ఒక్క కప్పల గుంపుకూ పూర్తి మెజారిటీ రాలేదు. ఎన్నికలకు ముందు కాషాయం కప్పలూ, కాషాయం మీద బాణం గుర్తు వున్న కప్పలూ మేమంటే మేమని బెకరణ బెకగొణ ధ్వని చేశాయి. నువ్వా నేనా అని గాలిలో గంతులు వేసేయి. గిరికీలు కొట్టేయి. పొట్టలు ఉబ్బించేయి. ఆ తర్వాత తమ కూటమికి, సిద్ధాంతాలకు నువ్వులూ నీళ్ళూ వదిలేసేయి. పదవి కోసం సిగ్గూలజ్జా అన్న వాటితో పనిలేదని డిసైడైపోయేయి.
పిట్టపోరు పిట్టపోరు తీర్చడానికి నీలం రంగు కప్పల్లో పెద్దవయసు, మూతి వంకరా వున్న కప్ప ముందుకు వచ్చింది. వంకర్లు పోతున్న మూతిని తిప్పుతూ వీపు మీద బాణం గుర్తు వున్న కప్పలకు మాటల గాలం వేసింది. రంగూ రూపూ వేరైనా, సిద్ధాంతాల మధ్య ఆమడల దూరం వున్నా, పదవి కోసం అవి ఒకటయ్యాయి.
సమస్య తీరిపోయింది అనుకున్నవి అన్ని కప్పలు. వీపు మీద బాణం గుర్తున్న కప్పే రాజని అనుకున్నవి.
అన్ని కప్పలూ కల్సి ఓ త్రాసు పట్టుకుని విషయం తేల్చేయడానికి సిద్ధంగా వున్న మధ్యవర్తి కప్ప దగ్గరికి వెళ్ళాయి. మధ్యవర్తి కప్ప త్రాసులో ఓ వేపు బాణం గుర్తు కప్పల్నీ నీలం రంగు కప్పల్నీ వుంచి, రెండు రంగు కప్పల్నీ మరో వైపు కాషాయం రంగు కప్పల్ని కూచోబెట్టి తూకం వేసింది. మూడు ముఠాల కప్పల వేపే త్రాసు మొగ్గు చూపుతున్నదని తేల్చేసి త్రాసుని కిందపెట్టబోతుంటే నీలం రంగు కప్పలు కొన్ని గబగబా మరో వైపుకి బెకబెకమంటూ గెంతేయి. ఇటు వైపు రెండున్నర ముఠాల కప్పలయి అటువైపు ఒకటిన్నర ముఠా కప్పలవడంతో ఆ వైపే బరువెక్కువ అని మధ్యవర్తి ప్రకటించేసింది. ఇంకేం వుంది, ఫలానా కప్పే కప్పల్రాజు అని అన్ని కప్పలూ బెకబెకమన్నాయి. మధ్యవర్తి త్రాసు కింద పెట్టి చేయి దులుపుకుందామనుకుంటుంటే ఇటువైపు నుంచి అటు వైపు దూకిన నీలం కప్పలు మళ్ళీ ప్లేటు తిప్పేసి ఎక్కడ్నించి వచ్చాయో అక్కడికి దూకేసేయి. ఇప్పుడు మళ్ళీ మరొక కప్ప కప్పల్రాజయింది.
కప్పలు కదా గెంతకుండా ఒకచోట కుదురుగా వుండలేవు. ఇటునుంచి అటు అటునుంచి ఇటు గెంతుతూనే వుంటాయి. పదవి విషయంలో మనుషులు కూడా కప్పలే అని వేరే చెప్పాలా??
- చింతపట్ల సుదర్శన్,
9299809212