Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవ సంబంధాలలో భావోద్వేగానికి చాలా ప్రాధాన్యం ఉంది. ప్రపంచం అంతా తల్లి గొప్పది అంటుంది, కానీ తండ్రి చేసే త్యాగాలు కూడా తల్లి ప్రేమకి తీసిపోవు. రెండు తరాల వెనక్కి వెళ్తే తండ్రుల ప్రేమలు కొడుకు, కూతురు జీవితాలతో పెనవేసుకున్న ప్రేమలు కనిపిస్తాయి. అయితే ఇవన్నీ నాణేనికి ఒకవైపే. తరాల మారుతున్నప్పుడు కొడుకు/ కూతుర్లలో స్వార్థం పెరిగి తండ్రులని ఎలా నడిరోడ్డుపై వదిలేస్తున్నారు? తమ కడుపున బుట్టిన వారు తల్లి తండ్రుల పట్ల ఎంత నిర్దయగా వ్యవహరిస్తున్నారు? ఇత్యాది సున్నిత విషయాలన్నీ కొత్తపల్లి ఉదయబాబు 'నాన్నకో బహుమతి' అంటూ పదహారు కథల్లో స్వార్థపు లోకం తండ్రి పట్ల చూపిన వైఖరిని తెలియజేశారు.
నాన్నకి బహుమతి కథల్లో చాలా వరకు మనిషి స్వార్థం కోసం ఏ విధంగా మారిపోతాడో అనే విషయాన్నే తెలియచేస్తుంది. ఇంకా ఇందులో 'అవిటిమనుసు, నిన్నటిదాకా శిలనైనా, కన్నంత మాత్రాన, ఆడదాని మనసు' వంటి మానవీయ కోణాలు కల కథలున్నాయి. సున్నితత్వం నిండిన కథలు ఇవి. వేటికవే ప్రత్యేకమైనవి. మారుతున్న విలువలు, స్వార్థపు ఆలోచనలు... ఇవన్నీ తండ్రులని ఎలా శాసిస్తున్నాయి? కొందరు స్వార్థంగా ఆలోచించినా మంచి మనసుతో తండ్రులని అక్కున చేర్చుకున్న కొడుకులు కూడా ఉన్న వైనాన్ని కొన్ని కథల్లో రాశారు.
- పుష్యమీ సాగర్,
9010350317