Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు సినిమాలలో అమ్మ పాత్రది ఎప్పుడూ ఆటలో అరటి పండు స్థానమే. కొంచెం మర్యాదగా చెప్పుకుంటే ''కూరలో కరివేపాకు'' ప్రాధాన్యత అమ్మది. మొట్టమొదటి సినీ అమ్మలు శాంత కుమారి, కన్నాంబ ల దగ్గర నుండీ ఇప్పటి గ్లామరస్ అమ్మలు నదియా, రమ్యకష్ణల దాకా ఆ అమ్మ పాత్రల ఎవల్యూషన్ చూస్తే కాస్త ఆశ్చర్యము, కాస్త ఆనందము, మరికొంత దుఃఖము కలుగుతాయి. నిజానికి సమాజంలో అసలుసిసలు అమ్మల పాత్రను పోలిన పాత్రలూ సష్టించడంలో మన తెలుగు రచయతలు ఏమాత్రం విజయం సాధించారు అన్న విషయాన్నీ ఎవరికీ వారు నిరపేక్షంగా అంచనా వేసుకోవలసిందే.
స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో, గొప్ప గొప్ప ఆశయాలు, అభిరుచులు రాజ్యం ఏలుతున్న కాలంలో దర్శక త్రయం పి. పుల్లయ్య, సి.ఎస్.రావు, కే. ప్రకాశరావు సష్టించిన అమ్మ సిగ్గరి, మొహమాటస్తురాలు, భర్త మాట జవదాటని పతివ్రతా శిరోమణి, పిల్లల కోసం పరితపించే అమాయకురాలు. ఆ స్వభావానికి తగ్గట్టుగానే మోచేతులు కిందకు విస్తరించిన జాకెట్, నుదుటన సూర్యబింబం లాంటి బొట్టు, ఎప్పుడూ పాదాలకు పూసిన పసుపు వీటికి విరుద్ధంగా లో గొంతుకతో మెల్ల, మెల్లగా మాట్లాడే మాటలు. కాస్త గట్టిగా భర్త ముందు మాట్లాడితే అది ఎక్కడ భర్తను అగౌరవ పరచినట్టు అవుతుందో అనే శంక. అమ్మంటే ఒక మనిషి కాదు ఒక పవిత్ర భావన. క్షమ అన్న పదానికి ప్రతిరూపం. ప్రేమించడం తప్ప ఏదీ ఆమెకు తెలియదు. అయితే ఇదే శాంతకుమారి 1955లో వచ్చిన అర్ధాంగి సినిమాలో డబ్బును దుర్వినియోగం చేసిన కొడుకును దండించే తల్లిగా కనిపించి మనసును కాసేపు ఆహ్లాద పరుస్తుంది. ఈ దశ 1960ల దాకా కొనసాగింది.
1960ల నుండీ వచ్చిన సినిమాలలో అమ్మ కొంచెం మారింది. తనను తాను యస్సెర్ట్ చేసుకోవడం నేర్చుకుంది. హేమలత వారసత్వం, పరువు -ప్రతిష్ట సినిమాలలో ఇంటి వ్యవహారాలలో తన పట్టు నిలుపుకుంటూనే సినిమా ఆసాంతం ఒక ప్రధాన పాత్రలా కనిపించడం ఒక విశేషం. 1963లో వచ్చిన లవకుశ సినిమా ద్వారా ఇంటింటా సీతమ్మగా నీరాజనాలు అందుకున్న అంజలీదేవి 1965లో వచ్చిన లక్ష్మీ నివాసం చిత్రంలో అంతవరకూ తెలుగు చిత్రసీమ ఎరుగని ఒక కొత్త అమ్మను ప్రేక్షకులకు చవి చూపింది. లక్ష్మీ నివాసంలో అంజలీ దేవి ఒక ఆత్మ విశ్వాసం కలిగిన బిజినెస్ మాన్. స్త్రీ విముక్తి సాధనా సంఘానికి ప్రసిడెంట్. అమ్మ ఇక ఎంత మాత్రమూ ఇంటిని అంటిపెట్టుకుని ఉండే పంజరంలో చిలుక కాదు. ఆమెవి చిలుక పలుకులు కాదు. సమాజంలో తన ఉనికిని వెతుక్కునే ఒక సాహసి అనే చందంగా అంజలీదేవి పాత్ర ఉంటుంది. ఇదొక గేమ్ చేంజెర్.
1971లో వచ్చిన ప్రేమ్‌నగర్‌లో కూడా శాంతకుమారి ఒక జమీందారు భార్య. హై క్లాస్ సొసైటీ లేడీ. పిల్లలను ఏ మాత్రం పట్టించుకునే సమయం లేని బిజీ బిజీ ఆధునిక మహిళ. పిల్లల పెంపకాన్ని ఇంటిలో పనివాళ్లకు వదిలివేసి తన ఎక్సట్రా కారికులర్ ఆక్టివిటీస్ చూసుకునే మహిళ. ఒక దశలో కొడుకు ఆమెను అమ్మ అని గుర్తుపట్టకపోతే పనివాళ్ళ మీద ఫైర్ అయ్యే పాత్ర ఆమెది.
1970 లో తెలుగు సమాజంలో వచ్చిన మార్పులను బలంగా పట్టుకున్న సినిమా బడిపంతులు. 1972లో వచ్చిన ఈ సినిమా వుమ్మడి కుటుంబం వద్దు న్యుక్లియర్ కుటుంబాలే ముద్దు అనుకున్న అప్పటి యువతీ యువకుల మనస్తత్వాన్ని బలంగా ప్రతిఫలించింది. పిల్లలు పెరిగి పెద్దయ్యాక తల్లి తండ్రులను పట్టించుకోకపోతే ఒంటరి అయిన వద్ధ దంపతులుగా నందమూరి తారక రామారావు, అంజలీ దేవి అనితర సాధ్యంగా నటించారు. జీవిత చరమాంకంలో ఒకరికి మరొకరు తోడుగా ఉండవలసిన సమయంలో భార్యాభర్తలు ఇద్దరూ చెరొక సంతానం దగ్గర ఉన్నప్పటికీ పిల్లల మీద ప్రేమ కోల్పోని తల్లి అందులో అంజలీదేవి.
1980లు వచ్చేసరికి తెలుగు సినిమా అమ్మ అనే ఒక పాత్ర ఉంటుంది అన్న మాట పూర్తిగా మరచి పోయింది. ఆ దశాబ్దంలో యాక్టివ్‌గా వున్న కే.విశ్వనాధ్, బాపు, దాసరి నారాయణరావు లాంటి దర్శకులు కూడా అమ్మ గురించి కన్వీనియెంట్‌గా మరచిపోయారు. నిజానికి పోస్ట్ గ్లోబలైజేషన్ ఎరా తెలుగు సినిమా భవిష్యత్తుకి ఒక ముందస్తు హెచ్చరికలా మిగిలింది.
1990లో వచ్చిన మణిరత్నం అంజలి మానసిక వికలాంగురాలైన పసిపాప తల్లిగా రేవతి నటన కూడా అనుపమానం. నటనలో న్యూనాస్ తెలిసిన నటి రేవతి. మూడవ కూతురు పట్ల ప్రేమ, ఆ ప్రేమ మిగతా యెడ పిల్లలలో కల్పించే అసూయ, దాన్ని చూస్తూ నిస్సహాయంగా నలిగిపోయే పాత్రలో రేవతి అమ్మగా అద్భుతం అనిపిస్తుంది.
మళ్ళీ 1991లో వచ్చిన అమ్మ రాజీనామా అమ్మ పాత్రల పట్ల ఒక కదలిక తీసుకుని వచ్చింది. నిత్యం ఇంటెడు చాకిరీ చేస్తూ జీవితాంతం కష్టపడే అమ్మకి మనం ఇచ్చే విలువ ఎంత. అలా కష్టపడటం అమ్మ స్వభావం, అమ్మలో ఇన్‌బిల్ట్‌గా కష్టపడే చిప్ వుంది అనుకున్నాము తప్పిస్తే ఆమె తన ప్రేమనంతా చాకిరీ రూపంలో ప్రదర్శిస్తోన్నదని దానికి మనం ప్రతిస్పందించాలి అన్నది మరచిపోయాము. ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును అన్న బసవరాజు అప్పారావు గారిని మరచి పోయాము. ప్రేమ అంటే తీసుకోవడం తప్ప మరేదీ కాదు అన్న నిశ్చయానికి వచ్చినప్పుడు, ఒక ఉద్యోగి తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్టుగానే అమ్మ కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేస్తే అన్న అంశంతో వచ్చిన అమ్మ రాజీనామా ప్రేమ దీపం వెనుక వున్న చీకటిని బలంగా చూపింది.
1993లో వచ్చిన మాతదేవోభవ అమ్మ ప్రేమకు పట్టిన హారతి. తాను త్వరలో చనిపోతానని తెలిసి తన పిల్లలు అనాథలు కాకూడదని ఒక తల్లి పడిన తపన ఈ సినిమాకు మూలం. దుఃఖం తో గుండెలని మెలిపెట్టి ప్రేక్షకుడిని ఒక దుఃఖ సముద్రం చేస్తుంది ఈ సినిమా.
1950, 60 దశకాలలో తల్లిపాత్రలు కేవలం ప్రేమ ప్రదర్శనకే పరిమితమైపోతే ప్రీ గ్లోబలైజేషన్ ఎరా వచ్చేసరికి అవి ప్రేమతో పాటు తమ వ్యక్తిత్వాన్ని కూడా నిలుపుకునేలా తయారయ్యాయి. అక్కడి నుండి మరొక్క అడుగు ముందుకు వేయవలసినవి పాత్రలు గ్లోబలైజేషన్‌లో మాత్రం తమ ఉనికిని కోల్పోయాయి. ఆధునికంగా ఉంటాయి, ఆధునిక భావాలు కలిగి ఉంటాయి, టెక్నో సావీగా ఉంటాయి కానీ పిల్లల చేత పేరుపెట్టి పిలిపించుకుంటాయి. పిల్లల అపరిపక్వ ఆలోచనలకు వంత పాడుతూ ఉంటాయి. కొడుకులను వెనుకవేసుకుని వచ్చి తండ్రులను ఎద్దేవా చేస్తూ ఉంటాయి. 2003లో వచ్చిన నిజం సినిమాలో తాళ్లూరి రామేశ్వరి మహేష్ బాబుకి తల్లిగా తన పగను తీర్చుకునే క్రమంలో కొడుకును ఒక ఆయుధంగా మలచే పాత్రలో తల్లి పాత్రలో ఒక కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది.
ఈ అపసవ్య ధోరణికి చెక్ పెట్టింది ''అమ్మా -నాన్న -ఒక తమిళ అమ్మాయి''. ఈ సినిమాలో జయసుధ తల్లి పాత్రలో అద్భుతంగా నటించి ఆధునిక తల్లికి ఒక బెంచ్ మార్క్ సష్టించింది. ఆ సినిమా అంతా జయసుధ పాత్ర చుట్టూ ఒక ఆత్మ విశ్వాసం, ఒక స్థిర నమ్మకం, ఒక హుందాతనం, ఒక గర్వం ఒక తేజోవలయం లా ఆవరించుకుని ఉంటుంది.
మళ్ళీ బాహుబలిలో రమ్యకష్ణ చేసిన శివగామి పాత్ర ఒక గేమ్ ఛేంజెర్. ఒంటరి స్త్రీ గా ఒక పక్క రాజ్యభారం వహిస్తూనే, ధర్మాధర్మ విచక్షణ కలిగి కన్న ప్రేమ, పెంచిన ప్రేమల లాంటి యుఫొరియా (సుఖ భ్రాంతి) కి ఏమాత్రం తలవొగ్గక నా మాటే శాసనం అంటూ రమ్యకష్ణ చేసిన అభినయం కూడా తెలుగు సినీ చరిత్రలో లిఖించదగినదే.
రాజా ది గ్రేట్ లో రాధిక పోషించిన మహాలక్ష్మి పాత్రకూడా తల్లి పాత్రలలో మకుటాయమానమైనదే. అంధుడైన కొడుకుకును భర్త సరిగా పట్టించుకోకపోతే భర్తనుండి విడిగా ఉండి కొడుకుకు తన వైకల్యం తెలియకుండా ఒక వారియర్ లా పెంచిన తల్లి కథ రాజా ది గ్రేట్.
ప్రేమించు అన్న సినిమాలో కూతురు అంధురాలు కావడం తో వదిలేసిన తల్లి , రాజా ది గ్రేట్ లో కొడుకు అంధుడు కావడంతో అసహ్యించుకున్న భర్తను వదిలేసి కొడుకును వారియర్‌గా చేసిన తల్లి ఈ రెండు పాత్రల మధ్య ఉన్న పరిణామ క్రమం చూస్తే మనకు ఒక విషయం అర్ధం అవుతుంది. తల్లి పాత్రలలో ఎన్ని వేరియేషన్స్ వచ్చినా, ఎంత వైవిధ్యం చూపినా ఎప్పటికీ మార్పుకి గురి కానిది మాత్రం ఆమె ప్రేమ ఒక్కటే. అమ్మ ప్రేమ మారదు. ఆ ప్రేమ అమ్మ పాత్రకి ఆత్మ. మిగతా క్యారేక్టరైజేషన్ ఎలా మారినా అదంతా పెరిఫెరల్ మాత్రమే.
- వంశీకృష్ణ, 9573427422