Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విరాట్ స్థానంలో యువ ప్రతిభకు అవకాశం
- సత్తా చాటేందుకు మంచి తరుణం
- మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యలు
ముంబయి : బాల్ టాంపరింగ్ వివాదంలో స్టార్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డెవిడ్ వార్నర్ లు ఏడాది పాటు ఆస్ట్రేలియా డ్రెస్సింగ్‌రూమ్‌కు దూరమయ్యారు. మిడిల్ ఆర్డర్‌లో స్మిత్ లేని వేళ.. లబుషేన్ అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. ఐదు రోజుల ఆటలో నయా హీరోగా ఎదిగాడు. టెస్టు సిరీస్‌లో పేసర్ల కలల వికెట్ జాబితాలో వార్నర్, స్మిత్‌తో పాటు లబుషేన్ సైతం చేరిపోయాడు. అదే తరహాలో విరాట్ కోహ్లి లేని వేళ భారత జట్టులోనూ కొత్త హీరో అవతరిస్తాడనే ఆశాభావం వ్యక్తపరిచాడు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్. ఆస్ట్రేలియా గడ్డపై, ఆసీస్ బౌలర్లపై తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన వీవీఎస్.. బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లి లేని ప్రభావం అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. జనవరిలో తొలి సంతానం కోసం ఎదురు చూస్తున్న విరాట్ కోహ్లి ఆడిలైడ్‌లో తొలి టెస్టు అనంతరం స్వదేశానికి తిరిగి రానున్న సంగతి తెలిసిందే. సిరీస్‌లో చివరి మూడు టెస్టులకు అజింక్య రహానె నాయకత్వం వహించే అవకాశం కనిపిస్తోంది. ' ఆస్ట్రేలియన్లకు విరాట్ కోహ్లి సింహస్వప్నం. ఆస్ట్రేలియా గడ్డపై అతడి రికార్డులు అమోఘం. కెప్టెన్‌గా, ప్రపంచ శ్రేణి బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లి ఎప్పుడూ ఆసీస్ బౌలర్లపై ఎదురులేని ఆధిపత్యం చూపించాడు. టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లి లేని లోటును భారత్ కచ్చితంగా చవిచూస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ విరాట్ కోహ్లి లేని సమయాన, ఆ స్థానంలో సత్తా చాటేందుకు మరొకరికి అద్భుతమైన అవకాశం చిక్కనుంది. అంతర్జాతీయ క్రికెట్ అందమే అది. జట్టులో కీలక ఆటగాడు దూరమైన వేళ, ఆ స్థానంలో బరిలోకి దిగి సత్తా చాటేందుకు మరొకరికి చక్కటి అవకాశం చిక్కుతుంది. బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లోనూ అటువంటి హీరో అవతరి స్తాడని నేను విశ్వసి స్తున్నాను' అని లక్ష్మణ్ అన్నాడు. ఆస్ట్రేలియాలో గత పర్యటనలో బ్యాటింగ్ విభాగంలో చతేశ్వర్ పుజార, విరాట్ కోహ్లిలు బాధ్యత తీసుకున్నారు. బౌలింగ్ విబాగంలో అందరూ సమష్టిగా రాణించారు. బయో సెక్యూర్ బబుల్‌లో ఉండటం ఎవరికైనా సవాలే. కానీ ఐపీఎల్‌లో మూడు నెలలు బుడగ వాతావరణంలో గడిపిన క్రికెటర్లు, ఇక్కడ మెరుగైన పరిణతి చూపిస్తారని అనుకుంటున్నాను అని వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. నవంబర్ ఆఖరు వారంలో వన్డే, టీ20 సిరీస్‌తో ఆరంభం కానున్న భారత్, ఆస్ట్రేలియా సవాల్.. డిసెంబర్ 17న ఆడిలైడ్‌లో డే నైట్ గులాబీ టెస్టుతో తారాస్థాయికి చేరుకోనుంది.