Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వన్డే, టీ20 జట్లలో లేకపోవటంపై రోహిత్ శర్మ
- ముంబయి రాత్రికిరాత్రి చాంపియన్ కాలేదు
- ఐపీఎల్ విజయంపై హిట్‌మ్యాన్ ఘాటు స్పందన
బెంగళూర్ (కర్నాటక)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో గాయపడిన రోహిత్ శర్మను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవటం, హిట్‌మ్యాన్ గాయంపై బీసీసీఐ స్పష్టత ఇవ్వకపోవటంతో దీనిపై పెద్ద దుమారమే రేగింది. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం రోహిత్ శర్మ గాయం గురించి తెలుసుకునే హక్కు అభిమానులకు ఉందని గట్టి విమర్శ చేశాడు. గాయం కారణంగా రోహిత్ శర్మను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయలేదని సీనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించిన గంటల వ్యవధిలోనే రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్ నెట్స్‌లో బ్యాటింగ్ సాధన చేయటం విమర్శలకు తావిచ్చింది. ఈ విమర్శలకు ఇప్పటివరకు బీసీసీఐ నుంచి స్పందన వచ్చినా.. తొలిసారి రోహిత్ శర్మ మనసులో మాట బయటపెట్టాడు.
నొప్పితో ఎందుకు ఆడతాను? : తొడ కండరం ఇప్పుడు మెరుగ్గా స్పందిస్తోంది. కండరం గట్టిపడే ప్రక్రియ మొదలైంది. టెస్టు సిరీస్ సమయానికి అంతా సర్దుకుంటుంది. టెస్టు సిరీస్‌లో బరిలోకి దిగే సమయానికి గాయానికి సంబంధించి, ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. అందుకోసమే, ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నాను. నేను ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తానా? వెళ్లనా అని ఎవరెవరో చేసే వ్యాఖ్యానాలు పట్టించుకోను. గాయం అయిన తర్వాతి రెండు రోజుల్లోనే.. రాబోయే పది రోజుల్లో ఏం చేయాలనే ప్రణాళిక వేసుకున్నాను. ఆడగలనా? లేదా? అని ఆలోచన చేసుకున్నాను. కానీ తొడ కండరం ప్రతి రోజు భిన్నంగా స్పందించింది. వైద్యానికి స్పందించే తీరులో మార్పు కనిపించింది. దీంతో మళ్లీ ఆడగలననే నమ్మకం ఏర్పడింది. అదే విషయాన్ని బీసీసీఐ, ముంబయి ఇండియన్స్‌కు తెలియజేశాను. ప్లే ఆఫ్స్‌కు ముందే గాయం ఫర్వాలేదని చెప్పాను. ఒకవేళ లీగ్ దశ ఆఖరు మ్యాచ్‌లో గాయంతో ఇబ్బంది పడితే.. ప్లే ఆఫ్స్‌లో బరిలోకి దిగేవాడిని కాదు అని రోహిత్ అన్నాడు.
ఆ విరామం కోసమే..! : ఎడమ కాలి తొడ కండరం గాయం విషయంలో మరింత మెరుగుపడాల్సి ఉంది. అందుకే నేను ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లలేదు. వన్డే, టీ20 సిరీస్‌లు వరుసగా జరుగనున్నాయి. 11-12 రోజుల్లోనే ఆరు మ్యాచులు ఆడాల్సి వస్తుంది. అందుకే ఓ 25 రోజులు నా ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెడితే.. టెస్టు సిరీస్‌లో పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగవచ్చని అనుకున్నాను. నాకు ఇది ఎంతో సులువైన నిర్ణయం. ఇది క్లిష్టమైన నిర్ణయంగా ఇతరులకు ఎందుకు అనిపించిందో నాకు తెలియదని రోహిత్ తెలిపాడు.
రాత్రికి రాత్రి చాంపియన్స్ కాలేదు : ముంబయి ఇండియన్స్‌లో కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్య, జశ్‌ప్రీత్ బుమ్రాలు ఉన్నారు. కానీ ఎందుకీ జట్టు విజయవంతమైందని ఎవరైనా ఆలోచన చేశారా?. చాలా మంది అంటున్నారు, రోహిత్ శర్మ ఐపీఎల్ టైటిళ్లు ఇతర జట్లతో సాధించగలడా? అని అడుగుతున్నారు. ముంబయి ఇండియన్స్‌కు ఓ ఆలోచన ఉంది, ఆ దారిలో వెళ్లాలని అనుకుంటోంది. అదే దిశలో నేను కెప్టెన్, ఆటగాడిగా వెళ్లాలనుకుంటున్నాను. రాత్రికి రాత్రి ముంబయి ఇండియన్స్ మంచి జట్టుగా మారిపోలేదు. మార్పులు, చేర్పులపై ప్రాంఛైజీ విశ్వాసం పెట్టలేదు. నాతో సహా ప్రతి ఒక్క క్రికెటర్ 2011 ఆటగాళ్ల వేలంలో అందరికీ అందుబాటులో ఉన్నాం. కానీ మమ్మల్ని ముంబయి ఇండియన్స్ ఎంచుకుంది, మాపై విశ్వాసం ఉంచింది. అందుకే ఇప్పుడు జట్టుగా మేము చాంపియన్లుగా నిలిచామని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.