Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏటీపీ ఫైనల్స్ టైటిల్ సొంతం
- టైటిల్ పోరులో థీమ్ ఓటమి
లండన్ (ఇంగ్లాండ్) : ఒత్తిడితో కూడుకున్న మ్యాచులు, గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ సహా మెగా ఈవెంట్లలో అంతిమ పోరులో ఆరంభంలో వెనుకబడితే ఇక అంతే సంగతులు. తీవ్ర ఒత్తిడి ఉండే అటువంటి మ్యాచుల్లో పుంజుకోవటం అంత సులువు కాదు. కానీ రష్యా స్టార్ డానిల్ మెద్వదేవ్ ఆ పని చేసి చూపించాడు. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఏటీపీ ఫైనల్స్ ఫైనల్లో వరల్డ్ నం.3 డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)పై విజయం సాధించిన వరల్డ్ నం.4 రష్యన్ స్టార్ కెరీర్‌లో తొలి ఏటీపీ ఫైనల్స్ టైటిల్‌ను అందుకున్నాడు. గ్రూపు దశలో వరల్డ్ నం.1 నొవాక్ జకోవిచ్ (సెర్బియా)ను, సెమీఫైనల్లో వరల్డ్ నం.2 రఫెల్ నాదల్ (స్పెయిన్)ను ఓడించిన మెద్వదేవ్.. ఫైనల్లో వరల్డ్ నం.3 డొమినిక్ థీమ్‌ను మట్టికరిపించాడు. వారం రోజుల్లో ప్రపంచ టాప్-3 ప్లేయర్ల భరతం పట్టిన ఘనత మెద్వదేవ్ సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో తొలి సెట్‌ను 6-4తో డొమినిక్ థీమ్ సొంతం చేసుకున్నాడు. తొలి సెట్ విజయం ఉత్సాహంలో ఉన్న థీమ్ రెండో సెట్‌లోనూ జోరుగా ఆడాడు. కానీ మెద్వదేవ్ రెండో సెట్‌లో థీమ్ పని సులువు కానీయలేదు. 6-6తో స్కోర్లు సమం అయిన వేళ టైబ్రేకర్‌లో ఆస్ట్రియా ఆటగాడిని వెనక్కి నెట్టాడు. 7-2తో టైబ్రేకర్‌లో ఆధిపత్యం చెలాయించిన మెద్వదేవ్.. మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో సెట్‌కు తీసుకెళ్లాడు. మూడో సెట్‌లో మెద్వదేవ్ 6-4తో సులువుగా విజయం సాధించాడు. కెరీర్ తొలి ఏటీపీ టూర్ ఫైనల్స్ టైటిల్‌ను ముద్దాడాడు. స్విస్ యోధుడు రోజర్ ఫెడరర్ ఆరు ఏటీపీ టూర్ టైటిళ్లతో అగ్రస్థానంలో ఉండగా.. పిట్ సంప్రాస్, జకోవిచ్‌లు ఐదేసి టైటిళ్లు సాధించారు.