Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డివైఎఫ్‌ఐ డిమాండ్
నవతెలంగాణ, హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) జట్ల ఎంపికలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) డిమాండ్ చేసింది. విజరు హజారే టోర్నీకి ఎంపిక చేసిన హైదరాబాద్ జట్టులో చోటుచేసుకున్న అవకతవకలపై డివైఎఫ్‌ఐ నాయకులు సోమవారం ఉప్పల్ స్టేడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. 'విజరు హజారే ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో ప్రతిభావంతులు, అర్హులైన క్రికెటర్లను జట్టులోకి తీసుకోలేదు. ఈ సీజన్‌లో రాణించిన వరుణ్ గౌడ్, అభిజిత్, జునైద్ అలీ వంటి ప్రతిభావంతులను పక్కనపెట్టడం సిగ్గుచేటు. ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలోనూ స్థానిక క్రికెటర్లను సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసుకోలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ సైతం స్థానిక క్రికెటర్లపై వివక్ష చూపుతోంది. హెచ్‌సీఏ పాలకమండలి పక్షపాతంగా వ్యవహరిస్తోంది. కొంతమంది సెలక్టర్లు, పాలక సభ్యులు డబ్బులకు అమ్ముడుపోయి ప్రతిభ ఉన్నవారిని తొక్కిపెట్టి.. అశ్రిత వర్గాల వారిని ప్రతిభ లేని వారిని జట్టుకు ఎంపిక చేస్తున్నారు' అని డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి విజరు కుమార్ అన్నారు. ' భారత జట్టుకు ఒకానొకన సమయంలో హైదరాబాద్ నుంచి ఆరుగురు క్రికెటర్లు ప్రాతినిథ్యం వహించారు. ఇప్పుడు ఒక్కరు ఆడటమే గగనంగా మారింది. ఈ దుస్థితికి హెచ్‌సీఏ పాలక మండలి కారణం. ఏండ్లుగా హెచ్‌సీఏలో అవినీతి జరుగుతోంది. భారత జట్టుకు కెప్టెన్సీ వహించిన అజహరుద్దీన్ అధ్యక్షుడుగా వచ్చినా పరిస్థితిలో ఎటువంటి మార్పు లేకపోగా మరింత దిగజారుతోంది. హెచ్‌సీఏలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలి. హెచ్‌సీఏ తీరు మార్చుకుని ప్రతిభ కలిగిన క్రికెటర్లను జట్టులోకి తీసుకోవాలి. లేకపోతే డివైఎఫ్‌ఐ ఆందోళనలను చేస్తుందని ' రాష్ట్ర అధ్యక్షుడు ఎం. విప్లవ్ కుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ మేడ్చల్ మల్కాజిగిరి అధ్యక్షుడు కిరణ్, జిల్లా నాయకులు సంతోష్, శ్రీను, స్వామి, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.