Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అశ్విన్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్ అదుర్స్
- ఇంగ్లాండ్‌పై సిరీస్‌లో అసమాన ప్రదర్శన
- ప్రధాన బ్యాట్స్‌మెన్‌కు ధీటుగా పరుగుల వేట
భారత్, ఆస్ట్రేలియా సిడ్నీ టెస్టు. టీమ్ ఇండియాకు పరాజయం తప్పదు అనుకున్న మ్యాచ్. బ్రిస్బేన్‌లో అద్భుతం చేసినా ఆతిథ్య జట్టును జయించటం అసాధ్యం అనుకున్న సందర్భం. సిడ్నీ, గబ్బా టెస్టుల్లో భారత్ అసమాన పోరాటానికి ఇంగ్లాండ్ ఫిదా అయ్యింది. ఆసీస్‌తో సమరంలో భారత్ మురవాలని కోరుకుంది. కంగారూలను భారత కుర్రాళ్లు కొడితే.. సంబురపడింది. కానీ అదే కుర్రాళ్ల ప్రతాపానికి బలైతామని ఊహించలేదు!.
ప్రధాన బ్యాట్స్‌మెన్ దుమ్మురేపినప్పుడు.. ఆఖర్లోనూ మెరుపులు మెరిపించటమే ఇదివరకు మనకు తెలిసిన భారత తోక కథ. కానీ కుర్రాళ్లు కొత్త నిర్వచనం ఇచ్చారు. ప్రధాన బ్యాట్స్‌మెన్ విఫలమై, జట్టు కష్టాల్లో కూరుకుపోతుందనే దశలో అసమాన పోరాట ప్రదర్శనలతో జట్టును గట్టెక్కిస్తున్నారు, ప్రత్యర్థులకు పిచ్చెక్కిస్తున్నారు. భారత్, ఇంగ్లాండ్ సిరీస్‌లోనూ ఇదే జరిగింది.
నవతెలంగాణ క్రీడావిభాగం
ఇంగ్లాండ్‌పై 3-1తో భారత్ అద్భుత టెస్టు విజయాన్ని సాధించింది. వరుసగా మరో ఉత్తమ సిరీస్ విజయంతో పాటు ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల జాబితాలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. స్వదేశంలో కెప్టెన్‌గా విరాట్ కోహ్లికి ఇది వరుసగా పదో టెస్టు సిరీస్ విజయం. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఎన్నో అంశాలు విపరీత చర్చకు దారితీశాయి. ముఖ్యంగా తొలి మూడు టెస్టుల్లో పిచ్ గురించి పెద్ద రచ్చే జరిగింది. పిచ్‌పై దృష్టి ఎక్కువ నిలుపటంతో అసలు సిరీస్‌లో భారత్‌ను విజేతగా నిలిపేందుకు దోహదం చేసిన ఆసక్తికర అంశం పక్కనపడిపోయింది. స్వల్ప స్కోర్లు నమోదైన సిరీస్‌లో భారత మిడిల్, లోయర్ ఆర్డర్ నుంచి కండ్లుచెదిరే భాగస్వామ్యాలు నమోదయ్యాయి. ప్రధాన బ్యాట్స్‌మెన్‌కు ఏమాత్రం తీసిపోని ప్రదర్శనలు లోయర్ ఆర్డర్ నుంచి వచ్చాయి. పరుగులు చేయటం కష్టసాధ్యమైన పరిస్థితుల్లోనూ సహనంతో క్రీజులో నిలిచి గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌లు ఆడారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రవిచంద్రన్ అశ్విన్, నాల్గో టెస్టు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రిషబ్ పంత్ సహా ఇతర యువ క్రికెటర్లు భారత్ మెరుగైన స్కోరు చేసేందుకు తమ వంతు పాత్ర పోషించారు. చివరి టెస్టులో తోక ప్రతాపంతోనే భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు నమోదు చేసి.. ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో విజయాన్ని అందించారు. ఇంగ్లాండ్ విజయానికి స్పిన్నర్ల పాత్రను ప్రధానం చూపిస్తున్నా... అసలు సిరీస్‌లో రెండు జట్ల మధ్య వ్యత్యాసం భారత లోయర్ ఆర్డర్.
జట్టుగా ఆడే ఆటల్లో సమిష్టితత్వానికి విశేష ప్రాధాన్యం ఉంటుంది. అద్భుత ప్రదర్శనలు సైతం సహచరుల వైఫల్యంతో మరుగున పడిపోతాయి. అసలు దారుణంగా ఆడిన సందర్భాల్లో సైతం సహచరుల మెరుపులతో అసమాన విజయాలు సొంతమవుతాయి. మ్యాచ్‌లో 20 వికెట్లు పడగొట్టడంతో పాటు బ్యాటింగ్ లైనప్‌కు చేదోడుగా విలువైన పరుగులు సాధిస్తున్నారు టెయిలెండర్లు. టెయిలెండర్ల సహకారంతో నిజానికి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సిరీస్‌లలో ప్రధాన బ్యాట్స్‌మెన్ వైఫల్యం ఎవరూ పట్టించుకోవటం లేదు. ఇంగ్లాండ్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో ప్రధాన బ్యాట్స్‌మెన్ (1-5), లోయర్ ఆర్డర్, టెయిలెండర్లు (6-11) పరుగుల వేటలో ఎలా ఉన్నారో చూద్దాం.
ప్రధాన బ్యాట్స్ మెన్ ఇలా.. : భారత్, ఇంగ్లాండ్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా జో రూట్ నిలిచాడు. చెన్నై తొలి టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ 218 పరుగుల ద్వి శతకంతో కదం తొక్కటంతో అతడే పరుగుల వేటలో ముందున్నాడు. జో రూట్ మినహా ఆ జాబితాలో టాప్-7 బ్యాట్స్‌మెన్ భారత్ నుంచే ఉన్నారు. శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానెలు సంయుక్తంగా నాలుగు టెస్టుల్లో 881 పరుగులు చేశారు. భారత్ తరఫున రోహిత్ శర్మ అత్యధిక పరుగులు సాధించాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో 345 పరుగులు చేశాడు. రెండో టెస్టులో సిరీస్ గమనాన్ని శాసించిన 161 పరుగుల శతకం సహా మరో అర్థ సెంచరీ రోహిత్ ఖాతాలో ఉంది. 57.50 సగటుతో రోహిత్ శర్మ పరుగులు పిండుకున్నాడు. రోహిత్ శర్మ ఓపెనింగ్ భాగస్వామి శుభ్‌మన్ గిల్ ఏడు ఇన్నింగ్స్‌ల్లో 119 పరుగులు చేశాడు, అందులో 50 పరుగుల అర్థ సెంచరీ ఉంది. నం.3 టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ఆరు ఇన్నింగ్స్‌ల్లో 133 పరుగులు బాదాడు. సిరీస్‌లో పుజారా అత్యధిక స్కోరు 73. స్టార్ బ్యాట్స్‌మన్, కెప్టెన్ విరాట్ కోహ్లి ఆరు ఇన్నింగ్స్‌ల్లో 172 పరుగులు సాధించాడు. రెండు అర్థ సెంచరీలు చేయగా, అత్యధిక స్కోరు 72. ఆస్ట్రేలియాపై మెల్‌బోర్న్‌లో అద్వితీయ శతకం అనంతరం అజింక్య రహానె వైఫల్యం కొనసాగుతూనే ఉంది. ఇంగ్లాండ్‌పై ఆరు ఇన్నింగ్స్‌ల్లో రహానె 67 పరుగులు చేశాడు. సిరీస్‌లో రహానె బ్యాటింగ్ సగటు 18.6.
టెయిలెండర్లు ఇలా..! : ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో లోయర్ మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఏ విధంగా రాణించారో చూద్దాం. బ్యాట్స్‌మన్ 6-11 వరకు ఈ సిరీస్‌లో 741 పరుగులు చేశారు. ప్రధాన బ్యాట్స్‌మెన్ చేసిన పరుగులకు ఇది కేవలం 140 తక్కువ అంతే. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా రిషబ్ పంత్ నం.6లో అదరగొట్టాడు. వరుసగా రెండు సిరీస్‌ల్లో రిషబ్ పంత్ అద్వితీయంగా రాణిస్తున్నాడు. సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో పంత్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 54 సగటుతో 270 పరుగులు పిండుకున్నాడు. పంత్ ఓ శతకం సహా రెండు అర్థ సెంచరీలు నమోదు చేశాడు. నం.7 స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ సైతం చెన్నై టెస్టులో శతకబాదాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో అశ్విన్ 189 పరుగులు చేశాడు. సిరీస్‌లో అశ్విన్ బ్యాటింగ్ సగటు 31.50. ఎనిమిదో స్థానంలో వాషింగ్టన్ సుందర్ బ్యాట్‌తో మెరిశాడు. మూడు టెస్టుల్లో ఆడిన వాషింగ్టన్ సుందర్ 181 పరుగులు చేశాడు. చివరి టెస్టులో అజేయంగా 96 పరుగులు చేశాడు. సిరీస్‌లో వాషింగ్టన్ బ్యాటింగ్ సగటు 90.50. అరంగ్రేట సిరీస్‌లో అక్షర్ పటేల్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 55 పరుగులు చేశాడు. పదో స్థానంలో మహ్మద్ సిరాజ్ మూడు ఇన్నింగ్స్‌ల్లో 20 పరుగులు జోడించాడు. నం.11 బ్యాట్స్‌మన్‌గా ఇషాంత్ శర్మ ఆరు ఇన్నింగ్స్‌ల్లో 26 పరుగులు జత చేశాడు.
లోయర్ ఆర్డర్‌లో ప్రధానంగా రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్‌లు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు నమోదు చేశారు. ఆస్ట్రేలియాపై చారిత్రక విజయంలోనూ ఈ ముగ్గురూ కీలక భూమిక వహించారు. ఇప్పుడు స్వదేశంలో ప్రధాన బ్యాట్స్‌మెన్‌కు ధీటుగా పరుగుల వేటలో దూసుకుపోయారు. భారత్‌కు సిరీస్ విజయంతో పాటు ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో చోటు అందించారు.