Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెచ్చిపోయిన హెట్మయర్, లెవిస్
- వెస్టిండీస్ భారీ స్కోరు 207/5
నవ తెలంగాణ-హైదరాబాద్
ఉప్పల్ స్టేడియంలో పరుగుల ప్రవాహం. పరుగుల వరద ఖాయమనే అంచనాలతో ఆరంభమైన భారత్, వెస్టిండీస్ తొలి టీ20 ఊహించిన విధంగానే జోరు చూపించింది. విధ్వంసక వెస్టిండీస్ తొలుత ఇక్కడ 207/5 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. యువ ఆటగాడు షిమ్రోన్ హెట్మయర్ (56, 41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్ ఎవిన్ లెవిస్ (40, 17 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ కీరన్ పొలార్డ్ (37, 19 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో కదం తొక్కారు. భారీ ఛేదనలో భారత్ 15 ఓవర్లలో 155 పరుగులు చేసింది. ఓపెనర్ కెఎల్ రాహుల్ (62), కెప్టెన్ విరాట్ కోహ్లి అర్ధ సెంచరీలు నమోదు చేశారు.
సిక్సర్ల మోత మోగించారు : టాస్ నెగ్గిన టీమ్ ఇండియా ఛేదనకు మొగ్గు చూపింది. తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన వెస్టిండీస్‌కు ఫామ్‌లో ఉన్న సీమర్ దీపక్ చాహర్ తొలి షాక్ ఇచ్చాడు. సీనియర్ ఓపెనర్ లెండ్లి సిమోన్స్ (2)ను ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే సాగనంపాడు. సిమోన్స్ నిష్క్రమణతో కరీబియన్లు ఒత్తిడిలో పడతారనే భావన నెలకొంది. మరో ఓపెనర్ ఎవిన్ లెవిస్ (40, 17 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), బ్రాండన్ కింగ్ (31, 23 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. దూకుడుగా ఆడిన ఈ జోడీ బౌండరీలపైనే కన్నేసింది. లెవిస్ మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు. సీపీఎల్ ఫామ్‌లో ఉన్న బ్రాండన్ కింగ్ సైతం మూడు ఫోర్లు, ఓ భారీ సిక్సర్ కొట్టాడు. దీంతో విండీస్ రన్‌రేట్ పదికి పైగా నమోదైంది. అర్థ సెంచరీ ముందు లెవిస్ అవుటైనా.. కరీబీయన్ల జోరు తగ్గలేదు. షిమ్రోన్ హెట్మయర్ (56, 41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) వీర విహారం చేశాడు. కింగ్‌తో కలిసి కదం తొక్కిన హెట్మయర్ వెస్టిండీస్‌ను భారీ స్కోరు దిశగా నడిపించాడు. నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదిన హెట్మయర్ అర్థ సెంచరీతో మెరిశాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో బ్రాండన్ కింగ్‌ను పంత్ స్టంపౌట్ చేశాడు. హెట్మయర్‌తో జతకలిసిన విధ్వంసకారుడు కీరన్ పొలార్డ్ (37, 19 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పొలార్డ్ నాలుగు సిక్సర్లతో వెస్టిండీస్ స్కోరు 200 దాటేలా చేశాడు. హెట్మయర్, పొలార్డ్ డగౌట్‌కు చేరుకోగా.. ఆఖర్లో జేసన్ హౌల్డర్ (24 నాటౌట్, 9 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), దినేశ్ రామ్‌దిన్ (11 నాటౌట్, 7 బంతుల్లో 1 ఫోర్) మెరుగైన ముగింపునిచ్చారు. మణికట్టు స్పిన్నర్ యుజ్వెంద్ర చాహల్ రెండు వికెట్లు తీసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, రవీంద్ర జడేజాలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
స్కోరు వివరాలు :
వెస్టిండీస్ ఇన్నింగ్స్ : లెండ్లి సిమోన్స్ (సి) రోహిత్ శర్మ (బి) దీపక్ చాహర్ 2, ఎవిన్ లెవిస్ (ఎల్బీ) వాషింగ్టన్ సుందర్ 40, బ్రాండన్ కింగ్ (స్టంప్డ్) రిషబ్ పంత్ (బి) రవీంద్ర జడేజా 31, షిమ్రోన్ హెట్మయర్ (సి) రోహిత్ శర్మ (బి) చాహల్ 56, కీరన్ పొలార్డ్ (బి) చాహల్ 37, జేసన్ హౌల్డర్ నాటౌట్ 24, దినేశ్ రామ్‌దిన్ నాటౌట్ 11, ఎక్స్‌ట్రాలు : 06, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 207.
వికెట్ల పతనం : 1-13, 2-64, 3-101, 4-172, 5-173.
బౌలింగ్ : వాషింగ్టన్ సుందర్ 3-0-34-1, దీపక్ చాహర్ 4-0-56-1, భువనేశ్వర్ కుమార్ 4-0-36-0, రవీంద్ర జడేజా 4-0-30-1, యుజ్వెంద్ర చాహల్ 4-0-36-2, శివం దూబె 1-0-13-0.
అజహర్ స్టాండ్ ఆవిష్కరణ
భారత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు, సూపర్ బ్యాట్స్‌మన్ మహ్మద్ అజహరుద్దీన్‌ను హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) సముచితంగా గౌరవించుకుంది. కళంకిత క్రికెటర్‌గా అజహరుద్దీన్‌కు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఎటువంటి గుర్తింపు దక్కలేదు. రెండో ఇన్నింగ్స్‌లో క్రికెట్ పరిపాలకుడిగా మారిన అజహరుద్దీన్ ఇటీవల హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌కు మహ్మద్ అజహరుద్దీన్ పేరు పెట్టారు. భారత్, వెస్టిండీస్ మ్యాచ్ ఆరంభానికి ముందు దిగ్గజ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ స్టాండ్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో హెచ్‌సీఏ బాస్ అజహర్ , మాజీ క్రికెటర్లు వెంకటపతి రాజు, నోయిల్ డెవిడ్ సహా యువ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ హాజరయ్యారు.