Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్‌తో రంజీ మ్యాచ్
నవతెలంగాణ, హైదరాబాద్ : ఈ ఏడాది రంజీ సీజన్‌ను హైదరాబాద్ పేలవంగా ఆరంభించింది. జట్టు ఎంపికలో పారదర్శకత లేదనే ఆరోపణలు హెచ్‌సీఏ పెద్దలను ఇరకాటంలో పెట్టినా, తుది జట్టులో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఉప్పల్ స్టేడియంలో గుజరాత్‌తో పోరుతో రంజీ సీజన్‌ను మొదలెట్టిన హైదరాబాద్ తొలి రోజు తీవ్రంగా నిరాశపరిచింది. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. సొంతగడ్డపై బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 233 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్, కెప్టెన్ తన్మరు అగర్వాల్ (1), హిమాలరు అగర్వాల్ (0), శశిధర్ రెడ్డి (10), అక్షత్ రెడ్డి (22) దారుణంగా విఫలమయ్యారు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కొల్ల సుమంత్ (69, 189 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ సెంచరీతో హైదరాబాద్‌కు గౌరవప్రద స్కోరు అందించాడు. టెయిలెండర్ సివి మిలింద్ (47, 118 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. మహ్మద్ సిరాజ్ (24), హసన్ (17) ఆఖర్లో విలువైన పరుగులు జోడించారు. గుజరాత్ స్పిన్నర్ పియూశ్ చావ్లా (3/61), రూశ్ బలారియ (2/34) చింతన్ గజా (2/24), అర్జన్ నగ్వశ్‌వాలా (2/53) రాణించారు.
డిఫెండింగ్ చాంపియన్ విదర్బతో మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు సైతం తడబడింది. కెప్టెన్ హనుమ విహారి (83, 155 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించినా తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్ర 211 పరుగులకు కుప్పకూలింది. కెఎస్ భరత్ (22), నరెన్ రెడ్డి (21), గిరినాథ్ రెడ్డి (22), అయ్యప్ప (22)లు మెరుగైన ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేదు. విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 26/0తో కొనసాగుతోంది. కెప్టెన్ ఫజల్ (11), సంజరు (14) అజేయంగా ఆడుతున్నారు. విదర్భ బౌలర్లలో గుర్బాని (3/72), ఆదిత్య సార్వెటె (4/50), యశ్ ఠాకూర్ (2/44) రాణించారు. విజయవాడలోని గోకరాజు గంగరాజు మైదానంలో మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమైంది. మైదానంలో పాము కనిపించటంతో మ్యాచ్ కాస్త ఆలస్యంగా మొదలైంది. మైదాన సిబ్బంది పామును పట్టుకుని, బయటకు వదిలారు.