Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యాపై వాడా నాలుగేండ్ల నిషేధం
- ఒలింపిక్స్, ప్రపంచకప్‌లకు దూరం
లసానె (స్విట్జర్లాండ్) : ఊహించినట్టుగానే రష్యాపై వాడా సంచలన నిర్ణయం తీసుకుంది. రాజ్య ప్రేరేపిత డోపింగ్ కుంభకోణం పేరిట రష్యాపై నాలుగేండ్ల నిషేధం విధించింది. 2014 సోచీ వింటర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన రష్యా, ఆ సమయంలో తమ అథ్లెట్ల డోపింగ్ శాంపిల్స్‌ను మార్చటం, రికార్డులు తారుమారు చేయటం అధికారికంగానే నిర్వహించిందని 2015లో ఊహాగానాలు గుప్పుమన్నాయి. దీనిపై అప్పట్లో డిక్ పౌండ్ సారథ్యంలో స్వతంత్య్ర దర్యాప్తు నిర్వహించారు. మాస్కోలో పర్యటించిన స్వతంత్య్ర దర్యాప్తు సంస్థ రష్యాను అంతర్జాతీయ అథ్లెటిక్స్ నుంచి నిషేధించాలని సిఫారసు చేసింది. అప్పట్నుంచి డోపింగ్ కుంభకోణం విషయంలో రష్యాపై వాడా, ఐఓసీ ఒత్తిడి కొనసాగుతోంది. తాజాగా ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయ డోపింగ్ నిరోధక ఎజెన్సీ (వరల్డ్ యాంటీ డోపింగ్ ఎజెన్సీ) కమిషన్ మాస్కోలో పర్యటించింది. వాడా బృందానికి మాస్కో క్రీడాధికారులు తమ రికార్డులను సమర్పించారు. వీటిలో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయని, అథ్లెట్ల డోపింగ్ నివేదికలు తారు మారు చేసినట్టు వాడా కమిటీ నిర్ధారణకు వచ్చింది. అధికారికంగా డోపింగ్‌కు పాల్పడిన రష్యాపై నాలుగేండ్ల అంతర్జాతీయ క్రీడా నిషేధం విధించాలని వాడా ప్యానల్ ఇటీవల సిఫారసు చేసింది. సోమవారం సమావేశమైన వాడా ఎగ్జిక్యూటివ్ కమిటీ తమ ప్యానల్ సిఫారసులను యథాతథంగా ఆమోదించింది.
నాలుగేండ్ల నిషేధంతో రష్యా రానున్న రోజుల్లో ఎటువంటి క్రీడా పోటీల్లోనూ పాల్గొనలేదు. వ్యక్తిగత ఈవెంట్లు, జట్టు టోర్నీలు సహా ఎక్కడా రష్యా పోటీపడేందుకు వీల్లేదు.2020 టోక్యో ఒలింపిక్స్, 2022 ఖతార్ ఫిఫా ప్రపంచకప్‌కు సైతం రష్యా దూరం కాకతప్పదు. ఈ మేరకు వాడా సోమవారం సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది. నిషేధ కాలంలో క్రీడా పోటీల్లో ప్రాతినిథ్య హక్కును కోల్పోవటంతో పాటు క్రీడా పోటీలను నిర్వహించే హక్కు సైతం రష్యా చేజారనుంది.